Harish Rana Case: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ కు చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా కథ దేశవ్యాప్తంగా హృదయాలను కదిలిస్తోంది. 13 ఏళ్లుగా మంచానికే పరిమితమైన అతని జీవితం… చివరకు కోర్టు తీర్పుతో ఒక భావోద్వేగ ముగింపుకు చేరుకుంది.
హరీష్ రాణా ఒకప్పుడు ప్రతిభావంతమైన ఇంజనీరింగ్ విద్యార్థి. భవిష్యత్తుపై పెద్ద కలలు కట్టుకున్న యువకుడు. అన్ని సవ్యంగా సాగితే ఈపాటికి అతను సొంతిల్లు, కారు, భార్య పిల్లలతో సరాదాగా జీవితాన్ని గడపాల్సింది. కానీ 2013లో జరిగిన ఒక ప్రమాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. హాస్టల్ భవనం పై నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో మెదడుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ రోజు నుంచి అతని ప్రపంచం పూర్తిగా మారిపోయింది. మాట్లాడలేని, నడవలేని స్థితి… చుట్టూ ఏం జరుగుతుందో తెలియని జీవితం. వైద్యులు దీన్ని పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అని నిర్ధారించారు.
25
13 ఏళ్లుగా యంత్రాలపై ఆధారపడిన జీవితం
ఈ స్థితిలో హరీష్ జీవితం పూర్తిగా వైద్య పరికరాలపైనే ఆధారపడి సాగింది. శ్వాస కోసం ట్యూబ్, ఆహారం కోసం గొట్టం… ఇలా ప్రతి క్షణం సహాయం అవసరమైన పరిస్థితి. రోజులు కాదు… సంవత్సరాలు గడిచిపోయాయి. మొత్తం 13 ఏళ్ల పాటు కుటుంబం అతని కోసం పోరాడింది. అతన్ని బతికించాలనే తపన ఒకవైపు… అతను పడుతున్న నిశ్శబ్ద వేదన మరోవైపు… కుటుంబాన్ని లోపల నుంచే కుంగదీసింది.
35
కోర్టు తీర్పుతో బాధ నుంచి విముక్తి
ఈ నేపథ్యంలో హరీష్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడు ఇక సాధారణ జీవితం గడపలేడని తెలుసుకున్న తర్వాత… కనీసం ఈ బాధ నుంచి విముక్తి కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించి కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యుల రిపోర్టులు, కుటుంబ పరిస్థితులు అన్నింటిని పరిగణనలోకి తీసుకుని పాసివ్ యూథనేసియా (కారుణ్య మరణం)కి అనుమతి ఇచ్చింది. ఇది కేవలం ఒక చట్టపరమైన తీర్పు మాత్రమే కాదు… మానవీయ కోణంలో తీసుకున్న సున్నితమైన నిర్ణయం.
కోర్టు ఆదేశాల మేరకు హరీష్‌ను AIIMS ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వాహనంలో కుటుంబ సభ్యులు అతని వెంట ఉన్నారు. ఈ ప్రయాణానికి ముందు తీసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఒక మహిళ అతని తలపై చేయి పెట్టి… “మమ్మల్ని క్షమించు… ఇక ప్రశాంతంగా వెళ్లి పో” అని చెబుతుంది. పక్కనే తల్లి కన్నీళ్లతో చూస్తూ ఉండటం… హరీష్ ఏదో చెప్పాలని ప్రయత్నించినా మాటలు రాకపోవడం… ఈ క్షణం చూసిన ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తోంది.
55
కారుణ్య మరణం అంటే ఏమిటి?
హరీష్ కేసులో అమలు చేయబోయేది పాసివ్ యూథనేసియా. అంటే ప్రాణాలను కొనసాగిస్తున్న లైఫ్ సపోర్ట్ పరికరాలను తొలగించడం. డాక్టర్లు అత్యంత జాగ్రత్తగా, మానవీయంగా ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. శ్వాసకు, ఆహారానికి ఉపయోగిస్తున్న ట్యూబ్‌లు తొలగించడం ద్వారా… సహజంగా జీవితం ముగిసేలా చేస్తారు. కొన్ని సందర్భాల్లో… బతకడం కంటే బాధ నుంచి విముక్తి ఇవ్వడం కూడా ప్రేమలో భాగమే అనే సందేశాన్ని ఈ సంఘటన చాటుతోంది.