
గత కొంతకాలంగా దేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసకున్నాయి. ప్రస్తుతం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న కొన్ని రాష్ట్రాల్లో.. ప్రభుత్వాలకు, గవర్నర్‌లకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఆయా రాష్ట్రాల గవర్నర్లపై పలు సందర్భాల్లో తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలపై గవర్నర్ ద్వారా కేంద్రం నియంత్రణ ఎందుకని పలు రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నారు గవర్నర్లు రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు ఆయా రాష్ట్రాలు గవర్నర్‌లు కూడా.. ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలకు గవర్నర్‌లకు మధ్య దూరం పెరుగుతోంది. అధికారిక కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉండటం, ప్రోటోకాల్ వివాదం.. ఇలా పలు అంశాలు వారి మధ్య దూరాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో బహిరంగంగా విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల గవర్నర్లకు నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. అక్కడ గవర్నర్ జగదీప్ ధన్కర్‌కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపించాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో గవర్నర్ వర్సెస్ సీఎం పోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్న సందర్బాలు అనేకం ఉన్నాయి. గవర్నర్ ధన్కర్‌ను తొలగించాలని మమతా బెనర్జీ.. ప్రధానికి లేఖ కూడా రాసింది.
తమ ప్రభుత్వంలోని అధికారులపై గవర్నర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆమె తన ట్విట్టర్ ఖాతాలో గవర్నర్ ఖాతాను బ్లాక్ చేసింది. మరోవైపు గవర్నర్ కూడా బెంగాల్ ప్రభుత్వం రాజ్యంగం ప్రకారం వ్యవహరించడం లేదని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతో పాటు అనేక సమస్యలపై మమతా బెనర్జీ, గవర్నర్ దంకర్ మధ్య తలెత్తిన విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి.
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. తాజాగా నీట్ బిల్లు విషయంలో గవర్నర్ తీరును సీఎం స్టాలిన్‌తో పాటు ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్రంలో నీట్ పరీక్షకు బదులుగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సొంత ఎంట్రన్స్ నిర్వహించేందుకు వీలు కల్పించే బిల్లును ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసి రెండోసారి పంపినప్పటికీ గవర్నర్ రవి దానిని తిరస్కరించారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ ఆర్ఎన్ రవికి పలు పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ పరిణామాలు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరాన్ని మరింతగా పెంచాయి. ఇక, కొద్ది నెలల క్రితం బెంగాల్ అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్ చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్ ఖండించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరింది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంతో మొదలైన ఈ వ్యవహారం.. అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. గవర్నర్ విషయంలో తెలంగాణ సర్కార్ ప్రోటోకాల్ పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇటీవల గవర్నర్ తమిళిసై ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు మరింతగా వేడిని పెంచాయి. వీటిని టీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ఇవ్వడం.. వాటిపై తమిళిసై విరుచుకుపడటం చూస్తుంటే ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య విభేదాలు ఇప్పట్లో తొలిగేలా కనిపించడం లేదు.
మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. గతేడాది ఆయనను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మహారాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. తమ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానిక కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌ను వాడుకుంటుందని ఆరోపించింది. రాజ్యాంగాన్ని సమర్థించాలని కేంద్రం అనుకుంటే ఆయనను రీకాల్ చేయాలని పేర్కొంది. అక్కడ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య సఖ్యత లేదనే చెప్పాలి.
కేరళలో కూడా సీఎం పినరాయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం, యూనివర్సిటీల్లో నియామకాలు, ఇతర అంశాల్లో.. సీఎం, గవర్నర్ కార్యాలయాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్‌పై తరచూ ఫిర్యాదులు చేస్తూ కేంద్రం తమ ప్రభుత్వంపై లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా తన నిర్ణయాలను రుద్దుతోందని ఆరోపించారు. ఢిల్లీ సీఎంకు, ఎల్జీకి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే ప్రస్తుతం బీజేపీయేతర రాష్ట్రాల్లో నెలకొన్న గవర్నర్ వర్సెస్ సీఎం వాతావరణం.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశమనే చెప్పాలి. అయితే ఈ సమస్యలను పరిష్కరించడం కూడా కేంద్రానికి తలకు మించిన భారమనే చెప్పాలి. బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రయత్నాల్లో ఆయా రాష్ట్రాల సీఎంలు ఉన్న నేపథ్యంలో.. ఈ వివాదాలు మరింతగా ముదిరే అవకాశాలే కనిపిస్తున్నాయి.
కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో గవర్నర్‌లను వినియోగించుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంపై విమర్శలు వచ్చాయి. 1983-84 మధ్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న రామ్ లాల్ సాయంతో అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రజల మద్దతుతో జాతీయ స్థాయిలో ఉద్యమం చేయడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక, గవర్నరు వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని 1983లోనే అనేక రాష్ట్రాలు సర్కారియా కమిషన్‌ను కోరాయి.
ప్రజాస్వామ్యంలో స్వతంత్ర ప్రతిపత్తితో రాష్ట్రాలు ఉన్నప్పుడు గవర్నర్ ద్వారా కేంద్రం నియంత్రణ ఎందుకని రాష్ట్రాలు ప్రశ్నించాయి. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. అప్పుడు గవర్నర్‌గా ఉన్న Kamla Beniwalపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల్లోని మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తమ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టంపై ఆమె సంతకం చేయకపోవడం పట్ల తాను విచారం చేస్తున్నట్టుగా మోదీ పేర్కొన్నారు.
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు.. గవర్నర్ వ్యవస్థను రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. రాజ్యాంగబద్దమైన గవర్నర్ పదవిలో ఎటువంటి రాజకీయ నేపథ్యంలేని తటస్థులను నియమించాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది.