Farmer become shatabdi express train owner : రైల్వేలు భారత ప్రభుత్వానికి చెందినవి. దేశంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనవంతులైనా ఎవరూ కూడా రైలును కొనుగోలు చేయలేరు. ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్లు, ఓడలు సహా ఇతర వాహనాలను కొనుగోలు చేయవచ్చు. దేశంలోని అత్యంత ధనవంతులకు సాధ్యం కానీది ఒక రైతు అందుకున్నారు. ఒక సాధారణ రైతు దేశంలో పెద్ద రైలుకు యజమాని అయ్యాడు. ఆ రైలు మాములుది కూడా కాదు.. శతాబ్ది ఎక్స్ ప్రెస్. ఆ రైలు-ఆ రైతు కథ ఇలా ఉంది..
ఒక సాధారణ రైతు అతి పెద్ద రైలుకు యజమాని అయిన సంఘటన 2017లో జరిగింది. సాధారణ రైతు సంపూర్ణ సింగ్.. దేశరాజధాని ఢిల్లీ-అమృత్‌సర్ మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయ్యాడు. భారతీయ రైల్వేలో జరిగిన తప్పిదం కారణంగా ఇది జరిగింది. పంజాబ్‌కు చెందిన రైతు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయ్యాడు. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఏకైక సంఘటన. 2007లో లుధియానా-చండీగఢ్ మధ్య రైలు మార్గ నిర్మాణం ప్రారంభమైంది. రైల్వే శాఖ భూసేకరణ ప్రారంభించింది. లుధియానాలోని కటాన్ గ్రామానికి చెందిన సంపూర్ణ సింగ్ భూమిని కూడా సేకరించారు.
రైల్వే శాఖ సంపూర్ణ సింగ్‌కు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించింది. తర్వాత రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. కొన్ని సంవత్సరాల తర్వాత, సంపూర్ణ సింగ్‌కు ఒక విషయం తెలిసి షాక్ అయ్యాడు. తన గ్రామానికి సమీపంలోని మరొక గ్రామంలో, పట్టణం నుండి దూరంగా, తక్కువ సారవంతమైన భూమిని రైల్వే శాఖ ఎకరాకు రూ.71 లక్షలు చెల్లించి సేకరించింది.
తనకు మాత్రం ఎకరాకు అందులో సగం కూడా చెల్లించలేదని ఆగ్రహించిన సంపూర్ణ సింగ్ తనకు చాలా తక్కువగా పరిహారం ఇచ్చారనీ, ఇది న్యాయం కాదని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా రైల్వే శాఖ పరిహారాన్ని ఎకరాకు రూ.50 లక్షలకు పెంచింది. కానీ, పక్కవారి ఎంత ఇచ్చారో తనకు అంతే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కిన రైతు సంపూర్ణ సింగ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈసారి రైల్వే శాఖ పరిహారాన్ని రూ.1.47 కోట్లకు పెంచింది. 2015 లోపల పరిహారం మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
2017 వరకు రైల్వే రూ.42 లక్షలు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.1.05 కోట్లు బకాయి ఉంది. దీంతో కోర్టు లుధియానా స్టేషన్‌లో రైలును జప్తు చేయాలని ఆదేశించింది. అంతేకాదు, స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని కూడా జప్తు చేయాలని ఆదేశించింది. రైలు జప్తు, స్టేషన్ మాస్టర్ కార్యాలయం జప్తు చేశారు.
ఈ కోర్టు ఆదేశంతో, రైతు సంపూర్ణ సింగ్ అమృత్‌సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును జప్తు చేశాడు. ఈ విధంగా అతను శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. అయితే, రైల్వే అధికారులు మళ్లీ కోర్టును ఆశ్రయించి రైలును విడుదల చేయాలని ఆదేశాలు పొందారు. రైతు స్వాధీనంలో ఉన్న రైలును విడుదల చేశారు. అయితే, ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉండటం గమనార్హం.