తమిళనాడులోని కున్నూరు సమీపంలో బుధవారం హెలికాఫ్టర్ కూలిన దుర్ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఆయన భార్య మధులికా రావత్ (Madhulika Rawat) సహా 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాద సమయంలో జరిగిన విషయాలు అక్కడి ప్రత్యక్ష సాక్ష్యులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా హెలికాప్టర్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోవడం చూపిస్తున్న ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ ప్రమాదాన్ని చూసిన ఓ ప్రత్యక్ష సాక్షి.. విమానం కూలిన తర్వాత తీవ్ర గాయాలతో ఉన్న బిపిన్ రావత్‌ను తాను సజీవంగా చూశానని చెప్పారు. ఆయన తనను నీళ్లు అడిగారని తెలిపారు. ఈ మేరకు ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.
ప్రత్యక్ష సాక్షి శివ కుమార్ కాంట్రాక్టర్‌గా ఉన్నాడు. అతడు ప్రమాదం జరిగిన సమయంలో టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న తన సోదరుడి వద్దకు వెళ్తున్నాడు. ఆ సమయంలో చాపర్ మంటల చెలరేగి పడిపోవడం స్వయంగా చూసినట్టుగా శివ కుమార్ చెప్పారు. దీంతో తనతో పాటు మరికొంత మంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామని వివరించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని తెలిపారు.
అయితే తాను శిథిలాల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఓ వ్యక్తిని చూశానని(ఆయన జనరల్ బిపిన్ రావత్ అని తర్వాత తెలిసింది) అని శివ కుమార్ చెప్పారు. తాము మూడు మృతదేహాలు పడిపోవడం చూసినట్టుగా తెలిపారు.
"మేము మూడు మృతదేహాలు పడిపోవడం చూశాము... ఒక వ్యక్తి సజీవంగా ఉన్నాడు. అతను నీరు అడిగాడు. మేము అతనిని బెడ్‌షీట్‌లో బయటకు తీశాము. తర్వాత అతనిని రెస్క్యూ టీమ్స్ తీసుకువెళ్లారు" అని శివ కుమార్ ఎన్టీడీవీకి చెప్పారు.
అయితే మూడు గంటల తర్వాత తాను మాట్లాడిన వ్యక్తి జనరల్ బిపిన్ రావత్ అని ఎవరో చెప్పారని శివకుమార్ తెలిపారు. ఆయన ఫొటో కూడా చూపించారని అన్నారు. ‘నేను చూసిన వ్యక్తి దేశం కోసం ఇంత చేశాడంటే నమ్మలేకపోయాను. ఆయనకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయానని బాధపడ్డాను. రాత్రంతా నిద్రపట్టలేదు’ అని శివకుమార్ కంటతడి పెట్టారు.
ఇక, తీవ్ర గాయాలతో బయటపడిన బిపిన్ రావత్.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యతో మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ట్రై-సర్వీస్ విచారణను ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు.
ఇక, ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్‌ను ప్రత్యేక బృందాలు స్వాధీనం చేసకున్నాయి. అనంతరం దానిని విశ్లేషణ కోసం అక్కడి నుంచి తరలించారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. (ఫొటోలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్)