
Women Scheme : దేశ రాజధాని డిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. డిల్లీ ముఖ్యమంత్రి పీఠం మరోసారి మహిళకే దక్కింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలియిన రేఖా గుప్తా ఏకంగా సీఎం హోదాలోనే హస్తిన అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇలా ఓ మహిళకు పాలనాపగ్గాలు అప్పగించడమే కాదు తమను నమ్మి గెలిపించిన మహిళలకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే అమలు చేసేందుకు సిద్దమయ్యింది బిజెపి.
అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే డిల్లీ మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయం అందిస్తామని బిజెపి హామీ ఇచ్చింది. ప్రతినెలా మహిళల ఖాతాల్లో ఈ డబ్బు జమచేస్తామని ప్రకటించారు కాషాయ నాయకులు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇదే హామీని మొదట అమలుచేసేందుకు డిల్లీ సర్కార్ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు.
మహిళా సాధికారత కోసం ప్రకటించిన ప్రతి హామీని నెరవేర్చి తీరతామని డిల్లీ సీఎం రేఖా గుప్తా స్ఫష్టం చేసారు. మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని ముందుగా ప్రారంభించనున్నామని... వచ్చే నెల మార్చిలోనే మహిళల ఖాతాల్లో రూ.2,500 వేస్తామన్నారు. మార్చి 8 నాటికి ఈ పథకానికి సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని పూర్తిచేసి డబ్బులు మహిళలకు అందేలా చూస్తామని సీఎం రేఖా గుప్తా స్పష్టం చేసారు.
డిల్లీ మహిళలకు బిజెపి ఇచ్చిన హామీలివే :
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి పోటీపడి మరీ ప్రజలకు హామీలిచ్చారు. ఒకరిని మించి ఒకరు ప్రజలకు ఉచితాలు ప్రకటించారు. అయితే ప్రజలు దశాబ్దానికి పైగా రాష్ట్రాన్ని పాలించిన ఆప్ హామీలకంటే బిజెపి వాగ్దానాలనే నమ్మినట్లున్నారు. దాదాపు 27 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ డిల్లీ ప్రజలు బిజెపి విజయం కట్టబెట్టారు.
ఇప్పుడు బిజెపి ప్రభుత్వ ఏర్పాటు కూడా పూర్తయ్యింది... ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, మంత్రులుగా మరికొందరు ప్రమాణస్వీకారం చేసారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నది బిజెపినే... కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. అందుకు తగినట్లుగానే ఇంకా పాలనాపగ్గాలు చేపట్టకముందే డిల్లీ సీఎం రేఖా హామీలపై దృష్టి పెట్టారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం హామీని వచ్చే నెలనుండే ప్రారంభించేందుకు డిల్లీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో విడుదల సమయంలోనే ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి కేబినెట్ మీటింగ్ లో మహిళా సమృద్ది యోజన పథకంపై అంటే ఈ రే.2,500 ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి జేపి నడ్డా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ పథకానికి సంబంధించిన విధివిధానలను త్వరలోనే ఖరారు చేసి అర్హులను ఎంపిక చేయనున్నారు... వారికి మార్చి 8 నుండి డబ్బులు అందించనున్నారు. అయితే గత ఆప్ ప్రభుత్వంలో మాదిరిగా మహిళల నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపికచేస్తారా లేదంటే ఇంకేదైనా విధానంలో అర్హులను ఎంపికచేస్తారా అన్నది త్వరలోనే తెలియనుంది.
గర్భిణులను రూ.21 వేలు, గ్యాస్ సిలిండర్ పై రాయితీ :
ఇక మహిళలకు బిజెపి ఇచ్చిన మరో కీలక హామీ గర్భిణులకు రూ.21.000 ఆర్థిక సాయం. డిల్లీలోని మహిళలు గర్భందాల్చితే వారి వైద్యం లేదా ఇతర ఖర్చులకోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నమాట. ఈ హామీని కూడా త్వరలోనే అమలుచేస్తామని డిల్లీ బిజెపి నాయకులు చెబుతున్నారు.
గ్యాస్ సిలిండర్ పై రూ.500 రాయితీ ఇస్తామని కూడా బిజెపి హామీ ఇచ్చింది. అలాగే హోలీ,దీపావళి పండగల సమయంలో ప్రభుత్వమే ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందిస్తుందని ప్రకటించారు. ఈ హమీ కూడా మహిళల వంటింటి భారాన్ని తగ్గించేదే. దీన్ని కూడా త్వరలోనే అమలు చేయనున్నారు.
ఇలా మహిళలకే కాకుండా డిల్లీ ప్రజానీకానికి ఉపయోగపడే ఇంకెన్నో హామీలను బిజెపి ఇచ్చింది. ఇందులో ఒకటే డిల్లీ పౌరులకు రూ.10 లక్షల ఆరోగ్య భీమా. ఇప్పటికే రూ.5 లక్షల ఆరోగ్య భీమా అమలవుతుండగా ఇందుకు మరో రూ.5 లక్షలు అదనంగా కలిపి రూ.10 లక్షల భీమాను అందిస్తామని ప్రకటించారు.
డిల్లీలో ఇక ఆకలిబాధలు లేకుండా చేస్తామని...మురికివాడల్లో రూ.5 కే పౌష్టికాహారం అందిస్తామని బిజెపి హామీ ఇచ్చింది. దీన్ని కూడా త్వరగా అమలుచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా బిజెపి హామీ ఇచ్చింది. ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేఖా గుప్తా సర్కార్ ఎప్పట్లోపు అమలుచేస్తుందో చూడాలి.