రియల్ హీరో ఈ పోలీస్.. 1100 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు, కూతురి పెళ్లి వాయిదా

First Published | May 7, 2021, 4:36 PM IST

ఢిల్లీ అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ రాకేష్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. కూతురు పెళ్లిని సైతం వాయిదా వేసి కోవిడ్ తో మరణించినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో నిమగ్నమయ్యాడు. 

కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తోంది. ఈ క్రమంలో వైరస్ తో మరణించినవారి అంత్యక్రియలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. వైరస్ భయంతో కుటుంబసభ్యులు ముందుకురాక అనాథ శవాల్లా మారుతున్న పరిస్థితి హృదయవిదారకంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ రాకేష్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. కూతురు పెళ్లిని సైతం వాయిదా వేసి కోవిడ్ తో మరణించినవారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో నిమగ్నమయ్యాడు.

56 సంవత్సరాల రాకేష్ కుమార్ గత 20 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో 1100 శవాలకు దహన సంస్కారాలను నిర్వహించడంలో సాయపడ్డారు. ఏప్రిల్ 13 నుండి ఇప్పటివరకు కుమార్ 50 కి పైగా మృతదేహాలకు స్వయంగా అంతిమసంస్కారాలు చేశాడు. కనీసం 1,100 మృతదేహాల దహన సంస్కారాలకు సహకరించారు.
రాకేష్ కుమార్ హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. మహమ్మారి నేపథ్యంలో మే 7 న జరగాల్సిన తన కుమార్తె వివాహాన్ని కూడా వాయిదా వేశారు. ఈ కష్టకాలంలో ప్రజలకు సాయంగా ఉండాలని, అందుకే తాను ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడనని చెప్పుకొచ్చారు.
రాకేష్ సేవల గురించి ఢిల్లీ పోలీస్ తమ అధికారిక ట్విటర్ అకౌంట్ లో ఇలా రాసుకొచ్చారు. "ఢిల్లీ పోలీస్ ఎఎస్ఐ రాకేశ్ (56), ముగ్గురు పిల్లలతో పిఎస్ నిజాముద్దీన్ బ్యారక్లో నివసిస్తున్నారు.
ఏప్రిల్ 13 నుండి లోధి రోడ్ శ్మశానవాటికలో విధుల్లో ఉన్నారు. తన విధుల్లో భాగంగా 1100 మందికి పైగా చివరి కర్మలకు సహాయం చేసారు స్వయంగా 50కి పైగా మృతదేహాలకు తలకొరివి పెట్టారు. దీనికోసం ఇవ్వాళ (మే7) జరగాల్సిన కూతురు వివాహాన్ని సైతం వాయిదా వేసుకున్నారు’ అని ట్విట్ చేశారు.
దీని మీద రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. "నేను దాదాపు 1,100 మందికి సహాయం చేసాను. కరోనా వ్యాక్సిన్ రెండు డోస్ లు తీసుకున్నాను. అంతేకాదు కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ మహమ్మారి సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి నా కుమార్తె వివాహం వాయిదా వేసుకున్నాను" అని చెప్పారు.
రాకేష్ కుమార్ ప్రయత్నాలను ప్రశంసించిన ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాస్తవ "కోవిడ్ సమయం కొంతమంది నిజమైన హీరోలు వెలుగులోకి వచ్చారు. ఎ.ఎస్.ఐ రాకేశ్ అత్యున్నత ప్రశంసలకు, ప్రోత్సాహానికి అర్హుడు. నిజానికి ఇప్పుడు సమాజానికి ఇలాంటి వాళ్లు చాలా అవసరం. ఇతని నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉంది @LtGovDelhi @HMOIndia @PMOIndia" అంటూ ట్వీట్ చేశారు.
దేశం ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల సంఖ్యలో బాగా పెరుగుతోంది. ప్రాణనష్టం విపరీతంగా ఉంది. ఆరోగ్యవ్యవస్త కుదేలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ రాకేష్ లాంటి వారు వీరుల్లా వైరస్ మీద యుద్ధం చేస్తున్నారు.

Latest Videos

click me!