
Delhi Assembly Election Results 2025 : దేశ రాజధాని ప్రాంతాన్ని పాలించే అవకాశం ఎట్టకేలకు బిజెపికి దక్కింది. యావత్ దేశాన్ని పాలిస్తున్న బిజెపికి రాజధాని డిల్లీలో అధికారం చేజిక్కించుకునేందుకు 27 ఏళ్లు పట్టింది. రెండు దశాబ్దాలకు పైగా డిల్లీలో అధికారం కోసం ఎదురుచూసిన బిజెపికి ఎట్టకేలకు ప్రజలు పగ్గాలు అప్పజెప్పారు.
డిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి 48 స్థానాలు సాధించింది. పదేళ్లకుపైగా డిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు... ఆ పార్టీ కేవలం 22 సీట్లకే పరిమితం అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీ మరోసారి గుండు సున్నాకే పరిమితం అయ్యింది. ఆ పార్టీ సీట్లు కాదు సరిగ్గా ఓట్లుకూడా సాధించలేక చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాంగ్రెస్ కంటే తెలంగాణ లోకల్ పార్టీ మజ్లిస్ మంచి ప్రదర్శన కనబర్చింది.
డిల్లీలో ముస్లిం జనాభా ఎక్కువగా వుండే ప్రాంతాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల కంటే ఏఐఎంఐఎం (All India Majlis E Ittehadul Muslimeen) ఎక్కువ ఓట్లు సాధించింది. ఓ నియోజకవర్గంలో అయితే మూడోస్థానంలో నిలిచింది. ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చు... కానీ ఓల్డ్ డిల్లీలోని చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసింది.
డిల్లీ ఎన్నికల్లో మజ్లిస్ ఓటింగ్ శాతం ఎంత?
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(శనివారం) వెలువడ్డాయి. గత నెలరోజులుగా దేశ రాజధానికి కొనసాగిన ఎన్నికల హడావిడికి నేటితో తెరపడింది. ఏ పార్టీ భవితవ్యం ఏమిటి? డిల్లీ ప్రజలు ఎవరి పక్షాన నిలిచారో తేలిపోయింది. సామాన్యుడి పార్టీగా గుర్తింపుపొందిన ఆప్ ను ఈసారి డిల్లీ కామన్ మ్యాన్ నమ్మలేదు... కాషాయ పార్టీ బిజెపికి పట్టం గట్టారు.
బిజెపి అత్యధిక సీట్లను, ఓట్లను సాధించింది. బిజెపికి దాదాపు 46 శాతం ఓట్ షేర్ వచ్చింది. రెండోస్థానంలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీకి 43 శాతం వచ్చింది. దేశ రాజకీయాల్లో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు కేవలం 6.39 శాతం ఓట్ షేర్ వచ్చింది.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డిల్లీ ఎన్నికల్లో ఓట్ షేర్ పరంగా హైదరబాదీ పార్టీ నాలుగోస్థానంలో నిలిచింది. ఏఐఎంఐఎం పార్టీకి 0.79 శాతం ఓట్లు పడ్డాయి. చాలా ఉత్తరాది పార్టీల కంటే మజ్లిస్ పార్టీ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అంతెందుకు డిల్లీలో చాలాకాలం అధికారంలో వున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పోలిస్తే ఎంఐఎం గొప్పగానే పనిచేసిందని చెప్పవచ్చు.
ఇక డిల్లీ ఎన్నికల్లో పోటీచేసిన మరికొన్ని పార్టీల ఓట్ షేర్ ఇలావుంది. జెడి(యు) 0.67 శాతం, బిఎస్పి 0.57 శాతం, ఎల్జెపిఆర్వి 0.56 శాతం ఓట్ షేర్ సాధించాయి.
నోటాకు 0.56 శాతం ఓట్లు పడ్డాయి.
ఎంఐఎం రెండోస్థానంలో నిలిచిన ఆ నియోజకవర్గమేది?
డిల్లీలో ముస్లిం జనాభా ఎక్కువగా వుండే నియోజకవర్గాల్లో ఓక్లా ఒకటి. ఇక్కడ ఎంఐఎం అత్యధిక ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచింది. ఆ పార్టీ నుండి పోటీచేసిన షిఫా ఉర్ రెహ్మాన్ ఖాన్ ఏకంగా 39,405 ఓట్లు సాధించాడు. ఇక్కడ ఆప్ అభ్యర్థి అమానతుల్లా 85,056 ఓట్లు సాధించి బిజెపి అభ్యర్థి మనీష్ చౌదరిపై 26,955 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
కాంగ్రెస్ విషయానికి వస్తే 70 నియోజకవర్గాల్లో పోటీచేసి కేవలం ఒకేఒక్క చోట రెండోస్థానంలో నిలిచింది. కస్తూర్భా నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ దత్ కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఇక్కడ బిజెపి అభ్యర్థి నీరజ్ బసోయా 11,048 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మిగతా పార్టీల విషయానికి వస్తే బురారి జనతాదళ్ (యునైటెడ్) రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ జెడియు అభ్యర్థి శైలేంద్ర కుమార్ ఆప్ కు గట్టిపోటీ ఇచ్చాడు. కానీ చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ సంజీవ్ ఝా 13712 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు.
డియోలీలో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థి దీపక్ తన్వార్ రెండో స్థానంలొ నిలిచాడు. ఇక్కడ ఆమ్ ఆద్మీ అభ్యర్థి ప్రేమ్ చౌహాన్ 36,680 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.