ఆప్ ఓటమిలో కేసీఆర్ కూతురు కవిత పాత్ర :
కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంచేసిన అన్నా హజారే శిష్యుడిగా వెలుగులోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ను డిల్లీ ప్రజలు ఎంతగానో నమ్మారు. అవినీతి రహిత పాలన అందిస్తాడని విశ్వసించి వరుసగా 12 ఏళ్లు అధికారం కట్టబెట్టారు.
అయితే ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ ఆప్ ప్రభుత్వం లిక్కర్ స్కాం కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కనుసన్నల్లోనే ఈ స్కాం జరిగిందని బిజెపి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేజ్రీవాల్ తో పాటు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు ఈ లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇలా అవినీతి రహిత పోరాటంనుండి వచ్చిన కేజ్రీవాల్ స్వయంగా అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం ఈ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈ డిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వున్నాయి. లిక్కర్ స్కాంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర వుందని... సౌత్ గ్రూప్ గా ఏర్పడి వందలకోట్ల రూపాయలు డిల్లీలోని ఆప్ ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్పడంలో కవిత కీలకంగా వ్యవహరించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్దారించాయి. ఈ వ్యవహారంలో కవితను కూడా అరెస్ట్ చేసారు.
ఇలా ఆప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైన డిల్లీ మధ్యం కుంభకోణంలో కవిత కీలకంగా వ్యవహరించారు. కాబట్టి తాజాగా డిల్లీ ఎన్నికల పలితాలు ఆప్ కు వ్యతిరేకంగా రావడంలో ఆమె కూడా ఓ కారణమని చెప్పవచ్చు. బిజెపి నాయకులు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టులనే కాదు కవిత అరెస్ట్ ను కూడా డిల్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. ఆమె ఆప్ కు ఎన్నికోట్లు ఇచ్చిందో చూడండి అంటూ ఆప్ అవినీతిని హైలైట్ చేయడంలో కవిత పేరును వాడుకున్నారు. ఈ ప్రచారం బిజెపికి కలిసివచ్చింది.