2020 లో డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్నిసీట్లు :
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటిలాగే 2020లో జనవరిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఫిబ్రవరిలో ముగిసింది. జనవరి 6, 2020 లో నోటిఫికేషన్ వెలువడగా ఫిబ్రవరి 10, 2020లో పోలింగ్ జరింగింది. ఫిబ్రవరి 11, 2020 లో ఓట్ల లెక్కింపు జరగగా ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది.
ఆప్ పార్టీ ఊహకందని విధంగా 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 సీట్లు సాధించింది. బిజెపి కేవలం 8 స్థానాలకే పరిమితం అయ్యింది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం...సుదీర్ఘకాలం డిల్లీని పాలించిన హస్తం పార్టీ ఈ ఎన్నికల్లో చేతులెత్తేసింది. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు... ఓట్లు కూడా పెద్దగా పడలేవు.
ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి దేశంలో అధికారాన్ని చేపట్టింది బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ. ఆ తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టింది బిజెపి. ఇప్పుడు ఆ పార్టీ దృష్టి మొత్తం డిల్లీ అసెంబ్లీపై వుంది. ఎలాగయినా డిల్లీలో విజయం సాధించాలని పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది.
మరోవైపు ఆప్ కూడా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టేందుకు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది ఆప్. కానీ బిజెపి, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల వేటలో వున్నాయి.