
Sitaram Yechuri Death : భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPM) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ డిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ఇవాళ పూర్తిగా విషమించింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు.
సీతారాం ఏచూరి మృతితో కమ్యూనిస్ట్ పార్టీలో విషాదం నెలకొంది. సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడి మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.
అయితే సితారం ఏచూరి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించడంలేదు. ఆయన కోరిక మేరకు మృతదేహాన్ని డిల్లీ ఎయిమ్స్ కు అప్పగించనున్నారు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ హాస్పిటల్ అధికారులు కూడా ఈ విషయాన్ని దృవీకరించారు.
కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరి గత నెల ఆగస్ట్ 19న అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరారు. 72 ఏళ్ళ ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు... ముఖ్యంగా ఆయన న్యూమోనియాతో ఇబ్బందిపడ్డారని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. ఆయనకు డాక్టర్ శ్రీనాధ్ రెడ్డి, డాక్టర్ గౌరి నేతృత్వంలోని వైద్యబృందం చికిత్స అందించింది.
25 రోజులపాటు చికిత్స అందించినా ఎలాంటి ఫలితం లేదు... ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇవాళ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మద్యాహ్నం 3.05 గంటలకు ప్రాణాలు కోల్పోయినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఆయన డెడ్ బాడీని హాస్పిటల్ కే అప్పగించడానికి కుటుంబం అంగీకరించింది... వైద్య విద్యార్థులకు టీచింగ్ అండ్ రీసెర్చ్ కోసం ఈ డెడ్ బాడీ ఉపయోగిస్తామని ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించారు.
ఏచూరి వ్యక్తిగత జీవితం :
సీతారా ఏచూరి 1952 ఆగస్ట్ 12న తమిళనాడు రాజధాని మద్రాస్ లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సర్వేశ్వర సోమయాజులు, కల్పకం ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడకు చెందినవారు. సర్వేశ్వర సోమయాజులు ఏపిఎస్ ఆర్టిసి ఉద్యోగి... తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసారు.
సీతారాం ఏచూరి ప్రాథమిక విద్యాబ్యాసం హైదరాబాద్ లో కొనసాగింది. పదో తరగతి వరకు హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ హౌస్కూల్ లో చదివారు. ఆ తర్వాత న్యూడిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్సి) హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు సీతారాం ఏచూరి.
ఏచూరి ఉన్నత విద్యాబ్యాసమంతా డిల్లీలోనే కొనసాగింది. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బిఏ చేసారు. ఆ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో ఆర్థికశాస్త్రంలో ఎంఏ చేసారు. ఇదే యూనివర్సిటీలో పిహెచ్‌డి చేయాలని భావించారు... కానీ 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో పూర్తిచేయలేకపోయారు.
రాజకీయ జీవితం :
డిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకునే సమయంలోనే కమ్యూనిస్ట్ పార్టీ వైపు సీతారాం అడుగులు పడ్డాయి. 1974లో కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలో చేరారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 1978 నాటికి ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడి స్థాయికి చేరుకున్నారు.
ఇక 1984 లో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు సీతారాం. 1992లో ఆ పార్టీ పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభ సభ్యునిగా నియమితులయ్యారు. ఇలా తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు సీతారాం ఏచూరి.
రాజకీయ పోరాటాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సిపిఐ(ఎం) లో కీలక నాయకుడిగా ఎదిగారు. దీంతో 2015 లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా వరుసగా 2018, 2022 లో కూడా ఆయన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే మొదట విశాఖపట్నంలో, ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన పార్టీ సభలో ఆయన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో సీతారాం ఏచూరి తుదిశ్వాస విడిచారు.