బీహార్ ఎన్నికలు: తొలి విడత ఓటింగ్‌కు రంగం సిద్ధం

Published : Nov 05, 2025, 09:40 PM IST

Bihar Election 2025: బీహార్ లో 2025 అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఓటింగ్‌ గురువారం జరుగనుంది. 18 జిల్లాల్లో 3.75 కోట్ల ఓటర్లు 1,314 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఎన్నికల సంఘం ఓటింగ్ కు అంతా సిద్ధం చేసింది.

PREV
15
బీహార్ తొలి విడత ఎన్నికల ఉత్కంఠ !

దేశ రాజకీయాల్లో బీహార్ అత్యంత ముఖ్యమైన రాష్ట్రాలలో ఒకటి. లోక్‌సభలోని 543 మంది సభ్యులలో 40 మంది ఇక్కడి నుండే ఎన్నికవుతారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాజకీయాల్లో కీలకమైన రాష్ట్రంగా ఉన్న బీహార్ మరోసారి జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.

2025 అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో 121 నియోజకవర్గాల్లో గురువారం ఓటింగ్‌ జరగనుంది. ఈ దశలోనే 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించి 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాగఠ్‌బంధన్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. తొలిసారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సారథ్యంలోని జన్‌ సురాజ్‌ పార్టీ కూడా బరిలోకి దిగడం ఈ ఎన్నికలకు కొత్త మలుపు తీసుకొచ్చింది.

25
ఓటింగ్‌ ఏర్పాట్లు పూర్తి.. భారీ భద్రతా ఏర్పాట్లు

బీహార్ ఎన్నికల తొలి విడతలో 18 జిల్లాల పరిధిలో 45,341 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 8,608 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మిగతా 36,733 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి బూత్‌లో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం కల్పించగా, ఈవీఎంల రవాణా వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ కూడా తీసుకొచ్చారు. 926 పోలింగ్‌ కేంద్రాలు మహిళలచే నిర్వహించనున్నారు. అలాగే, 107 కేంద్రాలు దివ్యాంగుల ఆధ్వర్యంలో నడవనున్నాయి.

సిమ్రి బఖ్తియార్‌పూర్‌, మహిషి, ముంగర్‌, జమాల్పూర్‌, సూర్యగఢా వంటి సున్నిత ప్రాంతాల్లో ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకే ముగియనుంది. మిగతా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది.

35
పోటీలో కీలక నేతలు.. ఎవరు ఎక్కడి నుంచి బరిలో నిలిచారు?

బీహార్ రాజకీయాల్లో కీలక నేతలు తొలి విడతలోనే బరిలో నిలిచారు. ఉపముఖ్యమంత్రులు సామ్రాట్‌ చౌదరీ (తారాపుర్‌), విజయ్‌కుమార్‌ సిన్హా (లఖిసరాయ్‌) తొలి విడత పోటీలో ఉన్నారు. మహాగఠ్‌బంధన్‌ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ మూడోసారి రాఘోపుర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ మహువా నుంచి బరిలో ఉన్నారు.

ప్రసిద్ధ భోజ్‌పురి నటుడు, గాయకుడు శత్రుఘన్‌ యాదవ్‌ (చాప్రా), జానపద కళాకారిణి మైతిలీ ఠాకూర్‌ (అలీనగర్‌) వంటి సాంస్కృతిక రంగ ప్రముఖులు కూడా ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

45
పార్టీల బలాబలాలు.. వ్యూహాత్మక చర్యలు

తొలి విడతలో ఎన్డీయే కూటమిలో జేడీయూ 57 సీట్లలో, బీజేపీ 48, ఎల్‌జేపీ 14, రాష్ట్రీయ లోక్‌మోర్చా 2 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరోవైపు మహాగఠ్‌బంధన్‌ తరఫున ఆర్జేడీ 73, కాంగ్రెస్‌ 24, సిపిఐ (ఎంఎల్‌) 14 స్థానాల్లో పోటీ చేస్తోంది. జన్‌ సురాజ్‌ పార్టీ 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.

బీహార్‌ ఎన్నికల్లో కొత్త ఓటర్ల సంఖ్య 10.72 లక్షలు కాగా, 1,906 సర్వీస్‌ ఓటర్లు, 3.22 లక్షల దివ్యాంగ ఓటర్లు, 100 సంవత్సరాల పైబడిన 6,736 మంది వృద్ధ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

55
రెండో విడతపై పెరుగుతున్న ఉత్కంఠ

ఈ నెల 11న రెండో విడత ఓటింగ్‌ జరగనుంది. మొత్తం 243 స్థానాల బిహార్‌ అసెంబ్లీలో అధికారం కోసం పోరాటం తీవ్రతరమవుతోంది. గత ఎన్నికల్లో ఎన్డీయే 125 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయగా, మహాగఠ్‌బంధన్‌ 110 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.

ఈ సారి ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ ప్రవేశం, యువతలో పెరుగుతున్న రాజకీయ చైతన్యం, వర్గాల సమీకరణాలు బిహార్‌ ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత మొత్తం దృష్టి 2025 బీహార్‌ రాజకీయ దిశను నిర్దేశించే ఈ ఎన్నికల ఫలితాలపైనే కేంద్రీకృతమవుతుంది. ఈ ఎన్నికలు బీహార్‌ రాజకీయ చరిత్రలో మరో మలుపు తీసుకొస్తాయనే అంచనా మధ్య ప్రజా తీర్పు ఏ దిశగా మలుపు తిప్పుతుందో చూడాలి !

Read more Photos on
click me!

Recommended Stories