మోదీ పాలనలోనే ముస్లింల పరిస్థితి భేష్ ... కావాలంటే ఈ లెక్కలు చూడండి

First Published | Oct 28, 2024, 2:15 PM IST

బిజెపి అంటే హిందుత్వ పార్టీ, ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్రపడిపోయింది. కానీ గత కాంగ్రెస్ హయాంలో కంటే మోదీ పాలనలోనే ముస్లింల అభ్యున్నతి జరిగిందని అధికాారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం...  

Narendra Modi

భారతీయ జనతా పార్టీకి హిందుత్వ పార్టీగా గుర్తింపు వుంది. కేవలం ఈ పార్టీ హిందువుల కోసమే పనిచేస్తుందని... ఇతర మతాలవారిని దూరం పెడుతుందనే భావన ప్రజల్లో వుంది. అందువల్లే హిందువులు కాకుండా ఇతర మతాలకు చెందిన మెజారిటీ ప్రజలు ఈ పార్టీని అంతగా ఇష్టపడరు. మరీముఖ్యంగా ముస్లిం సమాజం ఈ పార్టీని బద్ద శత్రువుగా చూస్తుంది... మతపరంగానే కాదు విద్యా,ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని అనుమానిస్తుంటారు. ఇలా బిజెపిని హిందువులు అక్కున చేర్చుకుంటే... ముస్లింలు మాత్రం ద్వేషాన్ని పెంచుకున్నారు. 

అయితే గత పదేళ్ళుగా దేశంలో బిజెపి సర్కార్ కొనసాగుతోంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో కూడా బిజెపి విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టారు. దీంతో ఈ ఐదేళ్లు కూడా తమ పరిస్థితి మారదని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. కానీ అధికారిక సమాచారం మాత్రం గత పదేళ్లలోనే ముస్లింలు అభ్యున్నతి జరిగిందనే ఆసక్తికర విషయాలు చెబుతోంది. 
 

narendra Modi

ముస్లింల సంక్షేమంలో కాంగ్రెస్ Vs బిజెపి 

బిజెపి అధికారంలోకి వచ్చాక, నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముస్లింల పరిస్థితి దయనీయంగా మారిందని కాంగ్రెస్,కమ్యూనిస్ట్ వంటి ప్రతిపక్ష పార్టీలే కాదు ప్రాంతీయ పార్టీలు కూడా ఆరోపించే విషయం తెలిసిందే. గత పదేళ్లలో ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని వాదిస్తుంటారు. పుట్టిపెరిగిన దేశంలోనే ముస్లింలు సెకండ్ క్లాస్ పౌరులుగా బ్రతకాల్సి వస్తోందని ... ఈ మతం డేంజర్ లో వుందంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటారు.

అయితే తమ రాజకీయాల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని చాలామంది ముస్లింలు నమ్ముతున్నారు. దీంతో బిజెపి అంటే ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్రపడిపోయింది. ముస్లిం సమాజమంతా బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది... ఈ విషయం ఇటీవల లోక్ సభ ఎన్నికల ఫలితాలను బట్టే అర్థమవుతోంది. ముస్లింలంతా ఏకమై బిజెపిని వ్యతిరేకించడం కూడా భారీగా సీట్లు తగ్గడానికి ఓ కారణమేది కాదనలేని నిజం. 

కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత కాంగ్రెస్ పాలనలో కంటే బిజెపి హయాంలోనే ముస్లింలకు ఎక్కువ మేలు జరుగుతుందని ... వారు అభ్యున్నతి సాధిస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరీముఖ్యంగా గత పదేళ్ల మోదీ పాలనలో ముస్లింలు విద్యాపరంగా బాగా ముందుకు వెళ్లారు. వారు దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటడమే ఇందుకు నిదర్శనం. 

యూపిఎస్సి (Union Public Service Commission) సమాచారం మేరకు... 2006 లో అంటే కాంగ్రెస్ హయాంలో చాలా తక్కువమంది ముస్లిం విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ కు అర్హత సాధించేవారు. 2016 వరకు ఇదే పరిస్థితి కొనసాగింది... కేవలం 3 శాతం ముస్లిం విద్యార్థులు మాత్రమే సివిల్స్ క్లియర్ చేసేవారు. కానీ ఇప్పుడలా కాదు... సివిల్స్ ర్యాంకులు సాధించే విద్యార్థుల సంఖ్య  గణనీయంగా పెరిగింది. 2023 లో ఏకంగా 1016 మంది ముస్లిం విద్యార్థులు యూపిఎస్సి పరీక్షలో సత్తా చాటారు. అంటే 5.2 శాతం మంది అర్హత సాధించారు. ఇలా 3 శాతం నుండి 5 శాతానికి ముస్లిం విద్యార్థుల సంఖ్య పెరిగింది. 

కేవలం  యూపిఎస్సి లోనే కాదు విద్యాపరంగా ఇతర విషయాల్లోనూ ఇటీవల ముస్లిం యువత దూకుపోతున్నారు.  2015-16 విద్యాసంవత్సరంలో 23 లక్షల మంది ముస్లిం విద్యార్థులు మాత్రమే ఉన్నత విద్యాభ్యాసం చేసారు... కానీ 2019-20 లో ఇది డబుల్ అయ్యింది. ఈ విద్యాసంవత్సరం ఏకంగా 30 లక్షలమంది ముస్లింలు ఉన్నత విద్యాభ్యాసం చేసారు. మోదీ సర్కార్ అందించే స్కాలర్ షిప్స్, ఇతర సౌకర్యాలు ముస్లింలు విద్యాపరంగా అభ్యున్నతి సాధించడానికి కారణం అవుతున్నాయి. 
 


Narendra Modi

ముస్లింల కోసం మోదీ సర్కార్ ఇంకా ఏమేం చేసిందంటే.. 

మోదీ సర్కార్ ప్రతి ఒక్కరి సొంతింటి కలను నిజం చేసేందుకు చేపడుతున్న పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ పథకం ద్వారా కూడా భారీగా ముస్లింలు లబ్ది పొందుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 15 శాతం ఇళ్లను ముస్లింలు పొందుతున్నారట... అంటే 13 లక్షల ఇళ్లు కేవలం ముస్లింలకు కేటాయించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా 2.55 లక్షల మంది ముస్లింలకు ఇళ్లు లభించాయని అధికారిక సమాచారం. 

ఇలా కేవలం సంక్షేమ, అభివృద్ది పథకాల ద్వారానే కాదు న్యాయపరంగానూ ముస్లింలకు మద్దతుగా నిలిచింది మోదీ సర్కార్. ముస్లిం సమాజంలో మహిళల స్వేచ్చను హరించేలా వున్న త్రిపుల్ తలాక్ చట్టవిరుద్దంగా ప్రకటించింది ప్రభుత్వం. ఇలా ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యను విడాకులు ఇవ్వాలని చూస్తే సదరు వ్యక్తిని శిక్షించేలా నిబంధనలు తీసుకువచ్చారు. మోదీ సర్కార్ నిర్ణయం ముస్లిం మహిళలకు ఎంతగానో మేలుచేసేలా వుంది. 

ఇక ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రలో కూడా మోదీ సర్కార్ మార్పులు తీసుకువచ్చింది. గతంలో ముస్లిం మహిళలు ఒంటరిగా హజ్ యాత్రకు వెళ్లే అవకాశం వుండేది కాదు...భర్త, కొడుకులు, సోదరులు ఇలా ఎవరైనా తోడుంటేనే హజ్ యాత్రకు అనుమతించేవారు. కానీ మోదీ ప్రభుత్వం సౌదీ సర్కార్ తో మాట్లాడి ఒంటరిగా అయినా మహిళలు హజ్ యాత్ర చేపట్టే అవకాశం కల్పించారు. అంతేకాదు హజ్ యాత్రపై 18 శాతంగా వున్న జిఎస్టిని 5 శాతానికి తగ్గించారు. దీంతో భారత్ నుండి హజ్ కు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 

ఇలా ముస్లింల కోసం ఇంత చేస్తున్నా మోదీ సర్కార్ పై వారిలో అభద్రతా భావం మాత్రం తొలగడం లేదు. రాజకీయ లబ్ది కోసమే ప్రత్యర్థి పార్టీలు ముస్లింలకు బిజెపిని భూతంగా చూపిస్తున్నారని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపించకుండా పాలన సాగిస్తుందని... పై లెక్కలనే ఇందుకు ఉదాహరణగా బిజెపి నాయకులు కూడా చెబుతున్నారు. 
 

Latest Videos

click me!