
ఏదయినా చిన్న ఉద్యోగం చేయాలంటేనే మంచి చదువు వుండాలి. అలాంటిది దేశంలోనే అతిపెద్ద వ్యాపారసంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ బాధ్యతలు చూసుకునే ముఖేష్ అంబానీ ఎంతగొప్ప చదువు చదివుండాలి. కానీ ఆయన డ్రాపవుట్ స్టూడెంట్ అని మీకు తెలుసా?
ముఖేష్ అంబానీతో పాటు ఆయన కుటుంబసభ్యుల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చాలామందికి తెలియదు. కాబట్టి అంబానీ ఫ్యామిలీ చదువుల గురించి ఆసక్తికర కథనం మీకోసం.
ముఖేష్ అంబానీ:
రిలయన్స్ వ్యాపారసంస్థల వ్యవస్థాపకులు ధీరూభాయ్ అంబానీ పెద్దకొడుకే ముఖేష్ అంబానీ. తన కొడుకును ధీరూభాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో కెమికల్ ఇంజనీరింగ్ చేయించారు. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన ఆయనను ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు పంపించారు.
యూఎస్ లోని ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబిఏ చేయాలనున్నారు ముఖేష్ అంబానీ. అడ్మిషన్ తీసుకుని కొంతకాలం ఎంబిఏ కొనసాగించారు కూడా. కానీ 1980లో వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేయడానికి స్వదేశానికి తిరిగివచ్చారు... రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కీలక బాధ్యతలు చేపట్టారు.
తండ్రి మరణం తర్వాత రిలయన్స్ సంస్థల పూర్తిస్థాయి పగ్గాలు ముఖేష్ అంబానీకి దక్కాయి. తండ్రి దగ్గర నేర్చుకున్న వ్యాపార మెళకువలతో రిలయన్స్ ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఇలా ఎంబిఏ డ్రాపవుట్ విద్యార్థి ఇప్పుడు భారతదేశంలో అత్యంత ధనవంతుడు.
నీతా అంబానీ:
ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబాని కూడా మంచి విద్యావంతురాలే. ఆమె ముంబైలోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసారు. ప్రస్తుతం వ్యాపారంలో భర్తకు చేదోడువాదోడుగా వుంటూనే రియలన్స్ ట్రస్ట్ బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ బాధ్యతలు కూడా ఆమె చూసుకుంటున్నారు.
ఇషా అంబానీ:
ముఖేష్ అంబానీ - నీతాల కూతురు ఇషా అంబానీ. ఈమె అమెరికాలోని యేల్ యూనివర్సిటీ నుండి సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు. ఆ తర్వాత అక్కడే స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబిఏ చేసారు.విద్యాభ్యాసం తర్వాత కూతురికి ప్రముఖ ఫార్మా ఇండస్ట్రీస్ ఫిరమిల్ గ్రూప్ కు చెందిన ఆనంద్ ఫిరమిల్ కు ఇచ్చి పెళ్లిచేసారు అంబానీ దంపతులు.
ఆకాష్ అంబానీ:
ముఖేష్ - నీతా దంపతుల పెద్దకుమారుడు ఆకాష్ అంబానీ. ఇతడు యూఎస్ లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తిచేసారు. అనంతరం ఇండియాకు తిరిగివచ్చి కుటుంబ వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం రిలయన్స్ జియో బాధ్యతలు ఈయన చూసుకుంటున్నారు.
అనంత్ అంబానీ:
ముఖేష్ అంబానీ చిన్నకొడుకే ఈ అనంత్ అంబానీ. ఇతడు ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నాడు. తర్వాత తండ్రి, సోదరి, సోదరుడి మాదిరిగానే యూఎస్ లో ఉన్నత విద్యాభ్యాసం చేసాడు. రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ లో చేరి వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు.
శ్లోకా అంబానీ:
ముఖేష్ అంబానీ పెద్దకొడుకు ఆకాష్ భార్యే ఈ శ్లోకా అంబానీ. ఈమె న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుండి ఆంత్రోపాలజీలో డిగ్రీని పూర్తిచేసారు. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి లా డిగ్రీని కూడా కలిగి ఉన్నారు.
రాధిక మర్చంట్:
ముఖేష్ అంబానీ చిన్నకొడుకు అనంత్ కు ఇటీవలే రాధికా మర్చంట్ తో వివాహం అయ్యింది. ఇలా అంబానీ ఇంట్లో చిన్నకోడలిగా అడుగుపెట్టారు రాధిక. ఈమె న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి పాలిటిక్స్ ఆండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ కలిగివున్నారు.
ఆనంద్ పిరామల్:
ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ భర్త ఆనంద్ పిరమల్. ఫార్మా వ్యాపారరంగానికి చెందిన ఫిరమల్ గ్రూప్ వారసుడు. ఇతడు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడు.
ఇలా నీతా అంబానీ ఒక్కరు మినహా మిగతా కుటుంబసభ్యులంతా అమెరికాలో విద్యాభ్యాసం చేసినవారే. అంబానీ కుటుంబసభ్యులంతా ఉన్నతచదువులు చదివినవారే.