Parliament
ప్రధాన మంత్రి ... వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలే కాదు బహుబాషల సమ్మేళనమైన భారతదేశాన్ని పాలించే అత్యున్నత పదవి. విదేశాల ముందు మన దేశ గౌరవాన్ని నిలబెడుతూ, ప్రతిష్టను కాపాడే బాధ్యత కూడా ప్రధానిదే. ఇలా ప్రజారంజక పాలన అందిస్తూనే మన దేశ గౌరవాన్ని పెంచిన ప్రధానులు ఎంతోమంది వున్నారు. అయితే తమ భావాలను దేశ ప్రజలకు వ్యక్తం చేసేందుకు బాష చాలా ప్రధానమైనది... కాబట్టి చాలామంది ప్రధానులు వీలైనన్ని ఎక్కువ బాషలు నేర్చుకున్నారు. ఇలా భారత ప్రధానుల్లో అత్యధికులు రెండు కంటే ఎక్కువ బాషలు మాట్లాడేవారే. కాబట్టి మన ప్రధానుల్లో ఎవరు ఎన్ని, ఏయే బాషలు మాట్లాడేవారో తెలుసుకుందాం.
PV Narasimha Rao
పివి నరసింహారావు :
కాంగ్రెస్ పార్టీ అరవయేళ్ల పాలనలో దేశ ప్రధానులంతా గాంధీ కుటుంబానికి చెందినవారే. ఒక్క పివి నరసింహారావు మినహా. తెలుగు బిడ్డ పివి అంచలంచలుగా ఎదుగుతూ కాంగ్రెస్ ను శాసించే గాంధీ కుటుంబాన్ని ఎదిరించి ప్రధాని పదవి దక్కించుకున్నారు. ఉన్నత విధ్యావంతుడైన పివి పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాత దేశ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలవల్లే ఇప్పుడు భారత్ ఈ సరిస్థితిలో వుంది. ఇలా పాలకుడిగా మంచి మార్కులు సాధించిన పివిలో మరో టాలెంట్ కూడా దాగివుంది... అదే అత్యధిక బాషలు మాట్లాడటం.
తెలుగువాడైన పివి నరసింహారావు ఏకంగా 17 బాషలను అలవోకగా మాట్లాడేవారు. 11 దేశీయ బాషలతో పాటు 6 విదేశీ బాషలను పివి మాట్లాడేవారు. మాతృ బాష తెలుగుతో పాటు జాతీయ బాష హిందీ, పొరుగు రాష్ట్రాల్లోని కన్నడ, మరాఠీ మాట్లాడేవారు. అలాగే ఒడియా, బెంగాలీ వంటి బాషల్లో కూడా పివి దిట్ట. ఇక విదేశీ బాషల విషయానికి వస్తే ఇంగ్లీష్ తో పాటు ప్రెంచ్, స్పానిష్, జర్మన్, పారసీ, అరబిక్ కూడా మాట్లాడేవారు పివి నరసింహారావు.
Indira Gandhi
ఇందిరా గాంధీ :
భారతదేశాన్ని పాలించిన ప్రధానుల్లో గాంధీ కుటుంబానికి చెందినవారే అత్యధికం. వీరిలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసారు ఇందిరా గాంధీ. మాజీ ప్రధాని కూతురు కావడంతో దేశీయంగా వివిధ ప్రాంతాల్లోనూ, విదేశాల్లోనూ చదువుకున్నారు ఇందిరా. దీంతో ఆమె చాలా బాషలపై పట్టు సాధించారు. ఇందిరా గాంధీ ఆరు బాషలు మాట్లాడేవారు... దేశీయ బాషలు హిందీ, పంజాబీ, బెంగాలీతో పాటు విదేశీ బాషలు ఇంగ్లీష్, ప్రెంచ్, జర్మన్ కూడా ఇందిరా గాంధీ మాట్లాడేవారు.
Manmohan Singh
మన్మోహన్ సింగ్ :
గాంధీ కుటుంబసభ్యులు కాకుండా కాంగ్రెస్ ప్రధానులుగా పరిచేసినవారిలో మన్మోహన్ సింగ్ ఒకరు. ప్రధానిగానే కాదు మంచి ఆర్థికవేత్తగా కూడా ఆయన దేశానికి సేవలు అందించారు. ఉన్నత విద్యావంతుడైన మన్మోహన్ హిందీ, పంజాబీ, ఉర్దూతో పాటు ఇంగ్లీష్ మాట్లాడేవారు.
Narendra Modi
నరేంద్ర మోదీ :
ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మాటలతోనే ప్రజలను మంత్రముగ్దులను చేయగలరు. ఆయన హిందీలో అనర్గళంగా ప్రసంగించలగరు. ఇక విదేశీ పర్యటనలు ఎక్కువగా చేపట్టే ఆయన ఇంగ్లీష్ కూడా చక్కగా మాట్లాడగలరు. ఇక తన మాతృబాష గుజరాతీలో కూడా మోదీ అనర్గళ ప్రసంగాలు ఇవ్వగలరు. ఇలా నరేంద్ర మోదీ మూడు బాషలు మాట్లాడగలరు.
Atal Bihari Vajpayee
అటల్ బిహారీ వాజ్ పేయి :
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కూడా మూడు బాషలు మాట్లాడేవారు. ఆయనకు హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూపై పట్టువుంది. అయితే హిందీలో కవితాత్వకంగా మాట్లాడుతూ వాజ్ పేయి చేసిన ప్రసంగాలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. వాజ్ పేయి మంచి వాగ్దాటి కలిగిన ప్రధాని.
Nehru
జవహర్ లాల్ నెహ్రూ :
స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా మూడు బాషలు మాట్లాడేవారు. జాతీయ బాష హిందితో పాటు దానిని పోలివుండే ఉర్దూలో కూడా నెహ్రూకు మంచి పట్టు వుండేది. ఇక ఇంగ్లీష్ కూడా ఆయన అనర్గళంగా మాట్లాడేవారు.
lal bahadur shastri
లాల్ బహదూర్ శాస్త్రి :
ఉర్దూ మాట్లాడగలిగే ప్రధానుల్లో లాల్ బహదూర్ శాస్త్రి ఒకరు. ఆయనకు హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూ బాషపై మంచి పట్టు వుండేది.
HD Devegowda
హెచ్డి దేవేగౌడ :
దక్షిణాది నుండి అత్యున్నత ప్రధాని పదవిని అధిరోహించినవారిలో దేవే గౌడ ఒకరు. కర్ణాటకకు చెందిన ఆయన మాతృబాష కన్నడ. ఇక జాతీయ రాజకీయాల్లో వున్నారు కాబట్టి జాతీయ బాష హిందీపై పట్టు దొరికింది. ఇక ఇంగ్లీష్ లో కూడా ఆయన చక్కగా మాట్లాడేవారు. ఇలా మూడు బాషలను ఆయన మాట్లాడేవారు.
Rajeev Gandhi
రాజీవ్ గాంధీ :
గాంధీ కుటుంబానికి చెందిన ప్రధానుల్లో రాజీవ్ గాంధీ ఒకరు. తాత, తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో వచ్చిన ఆయన అతి చిన్న వయసులోనే ప్రధాని అయ్యారు. ఆయన హిందీ, ఇంగ్లీష్ బాషలు మాట్లాడేవారు.
VP Singh
భారత మాజీ ప్రధానులు చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, విపి సింగ్, చంద్ర శేఖర్, ఐకే గుజ్రాల్ కూడా హిందీ, ఇంగ్లీష్ మాట్లాడేవారు.