ఉపాధి లేకపోవడంతో ఉన్న ఊరి నుండి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి దంపతులు బైక్ పై బయలుదేరారు. బెంగుళూరు నుండి రోజుల చిన్నారిని వడిలో పెట్టుకొని ఆ దంపతులు ప్రయాణం సాగిస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా కూడ ఈ తరహా ఘటనలు రోజు కన్పిస్తున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేసింది.ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అక్రం వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఇంటికి అతనే పెద్దవాడు. ఉపాధి కోసం ఆయన బెంగుళూరుకు వలస వెళ్లాడు. అక్కడే ఆయన పనిచేస్తున్నాడు.
అక్రంతో పాటు మరో ఏడుగురు తోబుట్టువులు, తల్లిదండ్రుల పోషణ బాధ్యత కూడ ఆయనపై ఉంది. దీంతో ఇద్దరు తమ్ముళ్లను కూడ ఆయన తనతో పాటు బెంగుళూరుకు తీసుకొచ్చాడు.
లాక్ డౌన్ నేపథ్యంలో వెల్డింగ్ పనులు చేయడం కూడ నిలిపివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తన స్వంత ఊరికి వెళ్లాలని అక్రం నిర్ణయం తీసుకొన్నాడు.
అయితే అదే సమయంలో అతనికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్రమ్ భార్య హర్మా ఖాతూన్ గర్భవతి. తాను నివాసం ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించాలని యజమాని చెప్పాడు. ఈ సమయంలో ఏప్రిల్ 9వ తేదీన అక్రమ్ భార్య ఖాతూన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఉన్న డబ్బుతో ఒక్కపూట భోజనం చేసి మరో పూట పస్తులున్నాడు. బెంగుళూరులో ఉంటే ఇబ్బందులు తప్పవని భావించాడు. యూపీకి వెళ్లాలని ప్లాన్ చేసుకొన్నాడు. ఈ నెల 12వ తేదీన స్కూటీపై తన భార్య ఖాతూన్ తో పాటు మరో ఇద్దరు పిల్లలను కూడ తమ వెంట తీసుకొని బయలుదేరారు.
బెంగుళూరు నుండి వస్తున్న సమయంలో కర్నూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తు చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు.
మధ్యాహ్నం సమయంలో కూడ చిన్నారులను వెంట తీసుకొని అక్రమ్ బైక్ పై ప్రయాణం సాగిస్తున్నాడు. తన వద్ద మిగిలిన రెండు వేలతో ఇంటికి చేరుకొనేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడు. బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులే అయినా కూడ ఖాతూన్ కూడ పంటిబిగువన బాధను భరిస్తూ ప్రయాణం సాగిస్తోంది.
బైక్ పై రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేందుకు బయలుదేరారు. మూడు రోజుల క్రితం బయలుదేరిన ఈ జంట తెలంగాణ రాష్ట్రం గుండా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వైపుకు ప్రయాణం చేస్తోంది.