
బెంగళూరు : ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత వివాహ వాగ్దానాన్ని ఉల్లంఘించాడని ఆరోపిస్తూ ఒక మహిళ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిపై దాఖలు చేసిన రెండు క్రిమినల్ కేసులను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి ఇది ఒక క్లాసిక్ ఉదాహరణగా కోర్టు ఈ కేసును అభివర్ణించింది.
"ఒకటి, రెండు, మూడు, నాలుగు లేదా ఐదు కాదు.. మొత్తంగా ఆరేళ్లు కలిసి సహజీవనం చేశారు. ఆరేళ్ల ఏకాభిప్రాయ శారీరక/లైంగిక సంబంధం తరువాత వారిద్దరిమధ్య ఉన్న అనుబంధం తగ్గిపోయింది. ఆమె వేసిన ఫిర్యాదులో అన్ని వివరాలను వివరిస్తుంది. పిటిషనర్, ఫిర్యాదుదారు మధ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా కలుసుకున్న తర్వాత 2019 డిసెంబర్ 27 నుంచి సాన్నిహిత్యం తగ్గిపోయింది. అప్పటివరకు 6 ఏళ్లపాటు ఏకాభిప్రాయంతో ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు.
ఏకాభిప్రాయ శృంగారం తరువాత సాన్నిహిత్యం తగ్గిపోతే.. అది అత్యాచారం అని అర్థం కాదు’’ అని పేర్కొంది. వీరద్దరికీ ఎఫ్‌బీలో పరిచయం అయ్యింది. అది కాస్తా స్నేహంగా మారి ప్రేమకు దారి తీసింది. అలా వారిద్దరూ ఆరేళ్లు శారీరకసంబంధంలోకి వెళ్లారు. ‘ఈ విషయంలో వారిద్దరి మద్య మొదటి రోజు నుండి ఏకాభిప్రాయం ఉంది. అలా డిసెంబర్ 27, 2019 వరకు అలాగే ఉన్నాయి" అని జస్టిస్ ఎం నాగప్రసన్న కేసు వివరాలు చూసిన తరువాత అన్నారు.
బెంగళూరు నగరంలోని ఇందిరానగర్ పోలీసులు, దావణగెరెలోని మహిళా పోలీస్ స్టేషన్ ద్వారా 2021లో పిటిషనర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి విచారణను రద్దు చేశారు.
లైంగిక సంబంధం ఆరు సంవత్సరాల పాటు కొనసాగిందని.. ఇప్పుడు సాన్నిహిత్యం తగ్గిపోతే.. దాన్ని ఐపిసి సెక్షన్ 376 ప్రకారం శిక్షార్హమైనదిగా, అత్యాచారంగా భావించలేమని న్యాయమూర్తి అన్నారు. "తదుపరి ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడానికి అనుమతిస్తే, అది ఈ అంశంపై సుప్రీం కోర్టు వెలువరించిన అనేక తీర్పులకు విఘాతం కలిగిస్తుంది" అని ప్రమోద్ సూర్యభాన్ పవార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు తీర్పును, కొన్ని ఇతర కేసులను ఉటంకిస్తూ న్యాయమూర్తి అన్నారు.
పిటిషనర్ 2013లో ఫేస్‌బుక్ ద్వారా ఫిర్యాదుదారుతో స్నేహం చేశారు. ఆమె చెబుతున్న దాని ప్రకారం, అతను ఆమె ఇంటికి సమీపంలోనే ఉండేవాడు. దీంతో ఆమె తరచుగా అతని ఇంటికి వెళ్లేది. అతను మంచి చెఫ్.. మంచి వంటలు చేసిపెడతానని తన ఇంటికి తీసుకెళ్లేవాడు.
అలా అక్కడికి వెళ్లిన ఆమె.. రుచికరమైన ఆహారం తిని, బీరు త్రాగి, లైంగిక సంబంధంలో పాల్గొనేది. అలా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆరేళ్ల పాటు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్న పిటిషనర్ ఆ వాగ్దానాన్ని ఉల్లంఘించాడు.
దీంతో మార్చి 8, 2021 న, ఆమె మోసం, నేరపూరిత బెదిరింపులతో పాటు ఇతర విషయాలపై ఇందిరానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిమీద పిటిషనర్ బెయిల్ తీసుకున్నాడని.. ఆ తరువాత, దావణగెరెలో నివసిస్తున్నాడని తెలియడంతో, ఫిర్యాదుదారు అక్కడికి వెళ్లింది. అదే ఆరోపణలతో.. దాడి, అత్యాచారం ఫిర్యాదును అక్కడ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు.
రెండో ఫిర్యాదులో పిటిషనర్‌తోపాటు మరో మహిళ పేరు కూడా ఉంది. ఈ రెండు కేసుల్లో పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేశారు. పిటిషనర్, సహ నిందితురాలైన మహిళతో పాటు, విచారణను సవాలు చేశారు.
సంపన్నులతో స్నేహం చేయడం, డబ్బు గుంజడం, నేరాలు నమోదు చేయడం ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం ఫిర్యాదుదారైన మహిళకు అలవాటు అని ఆయన ఆరోపించారు.
వివాహ వాగ్దానాన్ని ఉల్లంఘించడం, అత్యాచారం చేయడం వంటి ఆరోపణలతో ఫిర్యాదుదారు గతంలో మరో వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉందని.. ఆ తరువాత బెంగళూరులోని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఇదే విధమైన కేసును నమోదు చేసిందని అతను ఉదహరించాడు. 2016లో మహిళ కుట్ర తెలియడంతో మహిళ పిటిషన్ కొట్టివేసి ఆ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసినట్లు కోర్టుకు తెలిపారు.