Youth Movie Review: యూత్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. క్రేజీ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?

Published : Mar 27, 2026, 08:15 AM IST

Youth Movie Review: తమిళంలో గత వారంలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న `యూత్‌`సినిమాని తెలుగులో నేడు విడుదల చేశారు. మరి ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది చూస్తే. 

PREV
17
యూత్‌ మూవీ రివ్యూ

తమిళంలో గత వారం విడుదలై డీసెంట్‌గా ఆడుతున్న `యూత్‌` మూవీ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. ఈ చిత్రం రేపు(శుక్రవారం) శ్రీరామ నవమి సందర్భంగా తెలుగులో రిలీజ్‌ కానుంది. నిజానికి గురువారమే ఈ సినిమా రిలీజ్‌ కావాల్సి ఉండగా, కొన్ని అనుకోని కారణాలతో ఒక్క రోజు గ్యాప్‌తో నేడు శుక్రవారం(మార్చి 27న)  రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో కెన్‌ కరునాస్‌, అనిష్మ అనల్‌ కుమార్‌, దేవదర్శిని చేతన్‌, సూరజ్‌ వెంజరమూడు, ప్రియాన్షి యాదవ్‌, మీనాక్షి దినేష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కెన్‌ అండ్‌ గ్యాంగ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ2సీ టాకీస్ హౌస్ పుల్ వినీత్, సందీప్ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

27
యూత్‌ మూవీ కథ

ప్రవీణ్‌ (కెన్‌ కరునాస్‌)ని అమ్మ గారాబం చేస్తుంది. నాన్న(సూరజ్‌) ప్రతిదానికి తిడుతుంటాడు. చదువుల్లో వీక్‌. అష్ట కష్టాలు పడి పదిలో పాస్‌ అవుతాడు. దీంతో ఇంటర్‌ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అమ్మాయిలు కొత్తగా కొత్తగా కనిపిస్తారు. చూసిన ప్రతి అమ్మాయికి ఫిదా అయిపోతుంటాడు. ఎవరు మాట్లాడినా ప్రేమ అనుకుంటాడు. ఈ క్రమంలో మొదట ప్రవీణ్‌కి ప్రియాన్షి(మీనాక్షి దినేష్‌) పడిపోతుంది. ఇద్దరు కొన్ని రోజులు లవ్‌ ట్రాక్‌ నడిపిస్తారు. ఆమె ఊరెళ్లడంతో సోనియా( ప్రియాన్షి యాదవ్‌) పడుతుంది. ఈ ఇద్దరు రొమాన్స్ లో పీక్‌లోకి వెళ్తారు. కానీ ఈ విషయం ప్రియాన్షికి తెలియడంతో ఇద్దరికి బ్రేకప్‌ అవుతుంది. అయితే ఇదంతా ప్రవీణ్‌, ప్రియాన్షిని విడగొట్టడానికి సోనియా ఆడిన గేమ్‌ అని తెలుస్తోంది. ఈ గొడవ ప్రవీణ్‌ నాన్న చూస్తాడు. దీంతో రోజూ ఇంట్లో టార్చర్‌ చేస్తుంటాడు. అలాంటి సమయంలోనే తన క్లాస్ లో మరో అమ్మాయి గంగా(అనిష్మ అనిల్‌ కుమార్‌)కి పడిపోతాడు ప్రవీణ్‌. గొడవ ద్వారా వీరిద్దరు క్లోజ్‌ అవుతారు. ఆ తర్వాత ఆమెని ప్రవీణ్‌ ప్రేమిస్తాడు. ప్రేమని వ్యక్తం చేస్తాడు. మరి ప్రవీణ్‌ ప్రేమని గంగా యాక్సెప్ట్ చేసిందా? ఆమె ఇచ్చిన సవాల్‌ ఏంటి? ఇంటర్‌లో పాస్‌ కావడం పెద్ద టాస్క్ గా మారిన నేపథ్యంలో ప్రవీణ్‌ పాస్‌ అయ్యాడా? తన అమ్మకి వచ్చిన సమస్య ఏంటి? ఇది ప్రవీణ్‌లో ఎలాంటి మార్పు తెచ్చింది? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.

37
యూత్‌ మూవీ విశ్లేషణ

స్టూడెంట్స్ లవ్‌ స్టోరీస్‌ నేపథ్యంలో, కాలేజీ లవ్‌ స్టోరీస్‌ ప్రధానంగా తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. హ్యాపీడేస్‌ నుంచి, కొత్త బంగారు లోకం, మొన్న వచ్చిన లిటిల్‌ హార్ట్స్ వరకు అటు, ఇటుగా అలాంటి జోనర్‌ చిత్రాలే. నేటి ట్రెండ్‌ని, జెంజీని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రారంభంలో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. కొడుకు విషయంలో అమ్మ గారాబం చేయడం, తండ్రి తిట్టడం ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రతి సినిమాలోనూ ఉంటుంది. ఇందులోనూ అదే చూపించారు. దీంతో రొటీన్‌గా స్టార్ట్ అవుతుంది. హీరో టెన్త్ పాస్‌ అవ్వడం నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. తనని ప్రతి అమ్మాయి ఛీ కొట్టడం, ఆ తర్వాత కాలేజీకి వెళ్లాక వరుసగా అమ్మాయిలు హీరో వెంటపడటం క్రేజీగా ఉంటుంది. దీనికి హీరో ఎక్స్ ప్రెషన్స్, వారి గ్యాంగ్‌ చేసే చిల్లర పనులు, క్రేజీ పనులు నవ్వులు పూయిస్తాయి. లవ్‌ ట్రాక్‌లు, అమ్మాయిలు పలకరించగానే హీరో బాడీలో వచ్చే మార్పులు కుర్రాళ్లకి నవ్వించేలా ఉంటుంది. ఆయా ఎపిసోడ్లు ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతాయి.  ఫస్టాఫ్‌ ఇంటర్వెల్‌ వరకు హిలేరియస్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌లో రెండు లవ్‌ లు బ్రేకప్‌, అదే సమయంలో తండ్రి తనని చూసే సీన్ అదిరిపోయింది. వాహ్‌ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరోలో మార్పు వస్తుంది. కొత్త అమ్మాయితో ప్రేమలో పడటం, ఆమె తనని ఆ దృష్టిలో చూడలేదని చెప్పడం, అదే సమయంలో అమ్మ అనారోగ్యానికి గురికావడం ఎమోషనల్‌గా ఉంటుంది. కాలేజీ గొడవలు ఆకట్టుకుంటాయి. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటాయి. చివర్లో ఎమోషనల్‌గా ఉంటుంది. హీరోలో వచ్చిన మార్పు ఆకట్టుకుంటుంది. గుండెని బరువెక్కిస్తుంది. నవ్విస్తూనే ఏడిపించి హార్ట్ టచ్‌ చేసి ముగించిన తీరు బాగుంది. యూత్‌ఫుల్‌ మూవీ అయినా ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్లు ఉన్నాయి. 

47
యూత్‌ మూవీలో ప్లస్‌, మైనస్‌ లు

తమిళ సినిమా అయినా తెలుగుకి తగ్గట్టుగా బాగా అనువాదం చేశారు. డైలాగ్‌లు అదిరిపోయాయి. అదే సినిమాకి పెద్ద అసెట్‌. తెలుగు సినిమా ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. సినిమాలో చాలా వరకు మన తెలుగు సినిమా ప్రేమ కథా చిత్రాల పాటలను ఉపయోగించారు. అవి హిలేరియస్‌గా ఉంటాయి. కామెడీ ట్రాక్‌ కూడా అదే రేంజ్‌లో నవ్విస్తుంది. కుర్రాళ్ల చిల్లర పనులు, తెలిసీ తెలియనితనం చేసే క్రేజీ పనులు హిలేరియస్‌గా ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ మెప్పించాయి.  మ్యూజిక్‌ అదిరిపోయింది. విజువల్స్ బాగున్నాయి. రైటింగ్‌ పరంగా సినిమా బలంగా ఉంది. అయితే తెలుగులో ఇలాంటి సినిమాలు చూసిన నేపథ్యంలో పెద్దగా కొత్తగా అనిపించదు, పైగా చాలా వరకు సీన్లు రిపీట్‌ అవుతుంటాయి. అక్కడక్కడే కథ తిరుగుతుంటుంది. హీరో లవ్‌ లో క్లారిటీ మిస్‌ అయ్యింది. లవ్‌ స్టోరీ, ఆ తర్వాత పరిణామాలు ఊహించినట్టుగానే, కొంతరొటీన్‌గా అనిపిస్తాయి. కానీ నేటి యూత్‌కి, కాలేజీ స్టూడెంట్స్ కి మాత్రం బాగా నచ్చుతుంది. చాలా వరకు తమిళ ఫ్లేవర్‌ కనిపిస్తుంది. హీరో తన మ్యానరిజం, యాక్టింగ్‌, డాన్సుల్లో దళపతి విజయ్‌, ధనుష్‌ వంటి వారిని ఫాలో అయ్యాడు. అది తెలిసిపోతుంది. ఇలాంటి కొన్ని మైనస్‌లు ఉన్నా కుర్రాళ్లకి నచ్చే మూవీ అవుతుంది. 

57
యూత్‌ మూవీ నటీనటుల పనితీరు

ప్రవీణ్‌ పాత్రలో కెన్‌ కరునాస్‌ అదరగొట్టాడు. కొత్త కుర్రాడే అయినా ఇరగదీశాడు. ఫన్‌, ఎమోషన్స్, సీరియస్‌ ఇలా అన్ని ఎమోషన్స్ ని బాగా పలికించాడు. కాకపోతే బాడీ లాంగ్వేజ్‌, డాన్సుల పరంగా ఇతర కోలీవుడ్‌ హీరోలను ఫాలో అయ్యాడనిపిస్తుంది. గంగ పాత్రలో అనిష్మ అనిల్‌ కుమార్‌ నటన ఆకట్టుకుంటుంది. చాలా సెటిల్డ్ గా చేసి మెప్పించింది. అందరి దృష్టి తనవైపు తిప్పుకుంది. ఇక మొదటి లవ్‌ ప్రయాన్షి పాత్రలో మీనాక్షి దినేష్‌ సైతం క్యూట్‌ అండ్‌ స్మైలీ లుక్‌తో మెప్పించింది. ఇన్నో సెంట్‌గా అలరించింది. మధ్యలో వచ్చిన లవర్‌ సోనియాగా ప్రియాన్షి యాదవ్‌ సైతం ఆకట్టుకుంది. ముగ్గురు అమ్మాయిలు బాగా చేశారు. ఇక హీరో అమ్మగా దేవ దర్శిని చేతన్‌ నటన సినిమాకి మరో అసెట్‌గా చెప్పొచ్చు. సెంటిమెంట్‌తో కట్టిపడేసింది. తండ్రిగా సూరజ్‌ ఇరగదీశాడు. సీరియస్‌గా కనిపిస్తూనే నవ్వులు పూయించాడు. ఆ తర్వాత భావోద్వేగానికి గురి చేశాడు. మిగిలిన పాత్రదారులు ఓకే అనిపించారు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌ బాగా చేసింది. సుమన్‌ శెట్టి వాయిస్‌తో వచ్చే కుర్రాడు ఇరగదీశాడు. 

67
యూత్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమాకి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం బాగుంది. పాటలు అలరించాయి. తెలుగు రీమిక్స్ పాటలు ఉర్రూతలూగించాయి. వీకీ కెమెరా వర్క్ కూడా ఆకట్టుకునేలా ఉంది. నాష్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. లవ్‌ ట్రాక్‌లకు సంబంధించిన సీన్లు కట్‌ చేయోచ్చు. నిర్మాత విలువలకు కొదవలేదు. తెలుగు డబ్బింగ్‌ అదిరిపోయింది. తెలుగు సినిమా చూసినట్టుగానే ఉంది. కెన్‌ కరునాస్‌ అండ్‌ గ్యాంగ్‌ దర్శకత్వం పరంగా చాలా బాగా కష్టపడ్డారు. బాగా  తెరకెక్కించారు. కథ పరంగా కొత్తగా లేకపోయినా,మూవీని ఎంగేజింగ్‌గా, యూత్‌ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని లాజిక్స్ మిస్‌ అయ్యారు. 

77
ఫైనల్‌గా

తెలుగులో ఇలాంటి సినిమాలు రెగ్యూలర్‌గా వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ  కుర్రాళ్లకి మాత్రం టైమ్‌ పాస్‌ మూవీ అవుతుంది. 

రేటింగ్‌ 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories