తమిళ సూపర్ స్టార్ విజయ్ కు ఇప్పుడిప్పుడే తెలుగు మార్కెట్ లో గ్రిప్ దొరుకుతోంది. “కో కో కోకిల, డాక్టర్” చిత్రాలతో దర్శకుడిగా తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేసిన చిత్రం “బీస్ట్”. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ & ట్రైలర్ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ నెలకొల్పాయి. విజయ్ ఈ సినిమాతో తెలుగులో మార్కెట్ ని విస్తరించుకుంటాడా..శివకార్తికేయన్ 'డాక్టర్' స్దాయిలో ఈ సినిమా ఫన్, యాక్షన్ పండించగలిగిందా..అసలు ఈ చిత్రం కథేంటి...సింగిల్ లొకేషన్ లో నడిపిన ఈ కథ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లేతో నడపగలగారా...పూజ హెగ్డే కు తమిళ రీ ఎంట్రీ కలిసి వచ్చిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Thalapathy Vijay
కథ
రా ఏజెంట్ వీర రాఘవన్ (విజయ్) మామూలోడు కాదు. ఏ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినా సక్సెస్ చేస్తూంటాడు. అలాంటిది లేటెస్ట్ గా అతను జోధాపూర్ లో ఉమర్ ఫరూఖ్ అనే టెర్రరిస్ట్ ని పట్టుకునే ఆపరేషన్ చేపడతాడు. అంతా సవ్యంగా జరుగుతుంది కానీ ఆ సీక్రెట్ ఆపరేషన్ లో ఊహించని విధంగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఓ చిన్నారి చనిపోతుంది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వృత్తి జీవితానికి దూరంగా ఉంటాడు వీర రాఘవన్. అంతేకాదు ఆ డిప్రెషన్ నుండి బయటపడడానికి తీసుకునే ట్రీట్మెంట్ లో భాగంగా ప్రీతి (పూజా హెగ్డే)ను కలుస్తాడు. ఆమె కూడా లవ్ ప్రపోజ్ చేస్తుంది ప్రీతి.
ఇదిలా సాగుతూండగా ...కొన్ని నెలల తర్వాత ఈస్ట్ కోస్ట్ మాల్ ని టెర్రరిస్ట్ లు తమ అండర్ లోకి తీసుకుంటారు. అక్కడికి వచ్చిన 150 మంది జనాలను హోస్టేజీలుగా పట్టుకుంటారు. తమ లీడర్ ఉమర్ పరూఖ్ ని విడుదల చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అయితే వాళ్ల బ్యాడ్ ఏమిటంటే...ఉమర్ ని పట్టుకున్న వీర రాఘవన్ అక్కడే ఆ మాల్ లోనే ఉన్నాడు. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. తన గర్ల్ ప్రెండ్ ప్రీతి కూడా హోస్టేజీలలో ఒకరు కావటం జరుగుతుంది. ఇక వీర రాఘవన్ తనలోని వీరత్వాన్ని మేల్కొపి ఆ మాల్ లోని పరిస్థితులను ఎలా కంట్రోల్ చేశాడు? సింగిల్ హ్యాండ్ తో టెర్రరిస్టుల ఆట ఎలా కట్టించాడు? అనేది “బీస్ట్” కథాంశం.
ఎలా ఉంది?
విజయ్ లాంటి హీరో, అన్ని కోట్ల బడ్డెట్, నెంబర్ వన్ టెక్నీషియన్స్ తో ఇలాంటి తల,తోకా లేని కథ చెప్పాలనుకోవటం మాత్రం విచిత్రమే. విజయ్ తో కేవలం యాక్షన్ సీన్స్ చేయిస్తే చాలు అనుకున్నట్లు అనుకున్నారు. అలాగే ఇంకో కామెడీ ఏమిటంటే...హీరో చాలా స్ట్రాంగ్,బీస్ట్ అని బీబత్సమైన ఎలివేషన్స్. మరో ప్రక్క హీరో ఎదుర్కొనే ...టెర్రరిస్ట్ లు చూస్తే చాలా నెమ్మిదస్తులు, ఎవరినైనా చంపటానికి కూడా ఆలోచించి అడుగేసే రకం. చివరకు తాము బంధించిన బందీలలో కూడా భయం క్రియేట్ చేయలేని వారు. అఖరికి పర్శనాలిటీ వైజ్ కూడా హీరో ముందు తేలిపోయేవారే. వీళ్లను,వీళ్ల చేష్టలనూ చూస్తే వీళ్లు కమిడియన్స్ ఏమో ...తర్వాత మెయిన్ విలన్ వస్తాడేమో అని చివరి దాకా ఎదురుచూస్తాం. కానీ సీక్వెల్ లో చూపెడుతారేమో కానీ ప్రస్తుత సినిమాలో అయితే వీళ్లనే ఎడ్జెస్ట్ అయ్యిపోమన్నాడు డైరక్టర్.
అసలు వాళ్లకు ఎవరు టెర్రిరిస్ట్ లుగా ట్రైనింగ్ ఇచ్చారో...ఇలాంటి టెర్రిరిస్ట్ లను వాళ్ల ఆర్గనైజేషన్ ఏం సాధిస్తుంది...తమ లీడర్ ని జైలు నుంచి విడిపించుకునేటంత సీన్ ఉన్న వాళ్ళు కాదు. అసలు ఈ టెర్రిరిస్ట్ లు బీస్ట్ లాంటి రా ఏజెంట్ ని ఎదిరించి తన నాయకుడుని ఎలా విడిపించుకున్నరో చూపెడితే టెర్రిరిస్ట్ లు అయినా స్పెషల్ షోలు వేసుకుని చూసుకుని వారేమో. అంత దారుణంగా ఉంది. విలన్ వెర్శస్ హీరో వ్యవహారం. విలన్స్ అంత వీక్ గా ఉంటే ఇంక హీరోకు బీస్ట్ అని పేరు పెట్టి బరిలోకి వదిలినా ఫలితం ఏముంది..టెర్రిరిస్ట్ లు మీద మనకు సానుభూతి కలగటం తప్ప ఈ కథ సాథించేది ఏముంది..ప్రేక్షకుల మీద కక్ష తీర్చుకోవటం తప్పించి. ఓవరాల్ గా గ్రిప్పింగ్ గానీ థిల్లింగ్ కానీ ఎమోషన్స్ లేని యాక్షన్ హోస్టేజీ డ్రామా ఇది.
హాలీవుడ్ లో రెగ్యులర్ గా హోస్టేజీ డ్రామాలు తెరకెక్కేవి. ఇప్పుడు అక్కడా తగ్గిపోయాయి. మనకు ఎప్పుడో కానీ హోస్టేజీ డ్రామాలు రావు. అందుకు కారణం అవి కమర్షియల్ ఫార్మెట్ లో ఇమడకపోవటమే. ఈ హోస్టేజీ డ్రామాలలో కాస్ట్యూమ్స్ ఛేంజ్ ఉండదు. వేరే ఎమోషన్ ఛేంజ్ కు అవకాసం ఉండదు. యాక్షన్..రియాక్షన్ అన్నట్లు కథ,కథనం సాగిపోతూంటాయి. దాదాపు స్టోరీ లైన్ కూడా ఒకటే ఉంటుంది. అలాంటి రిస్క్ ఉన్న కాంప్లెక్స్ టాస్క్ తీసుకున్నాడు డైరక్టర్ నెల్సన్. స్టోరీ లాజికల్ గా బలంగా లేకపోయినా తన ఫన్ తో హీరో విజయ్ ఇమేజ్ తో, పూజ గ్లామర్ తో లాగేయచ్చు అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు వీటిల్లో ఏవీ వర్కవుట్ కాలేదు.
ఫన్ అనుకున్న సీక్వెన్స్ లు అన్ని విసుగెత్తించాయి. ఓ ప్రక్కన చాలా సీరియస్ గా అక్కడ మాల్ లో టెర్రరిస్ట్ ల మధ్య ఇరుకున్న జనం అంతా దేవుడా..రాముడా అన్నట్లు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తూంటే వాళ్లను కామెడీ చేయాలని చూడటం డైరక్టర్ కు ఎలా ఉందో కానీ మనకు మాత్రం చాలా విసుగ్గా ఉంటుంది. డైరక్టర్ గత చిత్రాలు “కో కో కోకిల, డాక్టర్”లలో డార్క్ హ్యూమర్ పండినట్లుగా ఇక్కడ సీన్స్ ఏమీ వర్కవుట్ కాలేదు. దానికి తగినట్లు విజయ్ వంటి మాస్ హీరో సినిమా అంటే కొన్ని ఎలిమెంట్స్ అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఆశిస్తారు. అవేమీ ఇందులో కనపడవు. లీనియర్ స్క్రీన్ ప్లే లో ఈ కథనాన్ని నడపాలనుకోవటం ఒకటే డైరక్టర్ తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం.
Image: Still from the trailer
టెక్నికల్ గా ...
మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకి మెయిన్ హైలైట్స్ గా చెప్పాలి. అనిరుధ్ ఇచ్చిన రెండు పాటలు, సౌండ్ డిజైనింగ్ సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయ్యింది. అవి కూడా లేకపోతే ఇంకెలాగ ఉండేదో. ఏమైనా కంటెంట్ తో సంబంధం లేకుండా సినిమాకి తమ 100% శాతం ఇచ్చిన టెక్నీషియన్స్ వీరు ముగ్గురూ. రైటింగ్ పార్ట్ డిజాస్టర్, డైరక్షన్ ఓకే. ఆర్. నిర్మల ఎడిటింగ్ నడిచిపోతుంది. తెలుగు డైలాగులు సోసోగా ఉన్నాయి. డాన్స్ లు రెండు పాటలు ఆల్రెడీ మనం చూసినవే..తెరపై బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Image: Still from the trailer
నటీనటుల్లో ...
విజయ్ ... వీర రాఘవన్ గా రా ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయాడు విజయ్. పూజా హెగ్డే గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. మూడు సీన్లు, రెండు పాటలకు పరిమితం. అవి కూడా కథకు అడ్డం పడేవే. కాబట్టి పెద్దగా కలిసి రాలేదు. ఇక సినిమాలో చెప్పుకోదగ్గ ఆర్టిస్ట్ .. విటివి గణేష్ బేస్ వాయిస్ లో చెప్పే అతడి పంచ్ లు. యోగిబాబు కామెడీ పేలలేదు. సెల్వ రాఘవన్ నటుడిగా ఓకే అనిపించారు.
Image: Still from the trailer
నచ్చినవి
ఉన్నంతలో అక్కడక్కడ నవ్వించే కామెడీ
విజయ్ స్టైల్
నచ్చనవి
విజయ్ నుంచి ఇంత దారుణమైన సినిమా రావటం
సెకండాఫ్
బోర్ కే క్లైమాక్స్ లాంటి క్లైమాక్స్
Image: Still from the trailer
ఫైనల్ థాట్
ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఏమో కానీ... మిగతావాళ్లకు మాత్రం 'రోస్టే'
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:1.5
Pooja Hegde
ఎవరెవరు...
నిర్మాణ సంస్థలు :సన్ పిక్చర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, యోగి బాబు తదితరులు
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
ఎడిటర్ :ఆర్. నిర్మల్
సంగీతం :అనిరుధ్ రవిచందర్
దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
నిర్మాత: కళానిధి మారన్, దిల్ రాజు
విడుదల తేదీ : ఏప్రిల్ 13, 2022