Ghani
క్రీడా స్పూర్తితో వచ్చే సినిమాలు ఎట్రాక్టివ్ గా,ఎమోషన్ ల్ గా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా రన్ చేయాలి. తొలి సినిమానే కిరణ్ కొర్రపాటి ఇటువంటి కఠినమైన సబ్జెక్టు ను ఎంచుకోవడం సాహసమే. అయితే ప్రపంచ సినిమాని చూసి వస్తున్న కొత్తతరం దర్శకులకు ఇదేమీ పెద్ద విషయమూ కాదు. చేతిలో స్టార్, కావాల్సినంత బడ్జెట్ ఉన్నప్పుడు థియోటర్ దద్దరిల్లాలి. భాక్సింగ్ పంచ్ లు స్క్రిప్టులో కూడా ఉండాలి. అంత నమ్మకంతోనే ఈ సినిమా చేసారన్నట్లు ట్రైలర్,టీజర్ అనిపించాయి. సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉందా...వరుణ్ తేజ తెరవెనక పడిన కష్టం...తెరపై ప్రతిఫలించిందా...ఏ మేరకు ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందో రివ్యూలో చూద్దాం.
కథ
గని (వరుణ్ తేజ్) కు గొప్ప భాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలని జీవితాశయం. అందుకు తగ్గట్లే నిరంతరం శ్రమిస్తూంటాడు. అయితే అందుకు కారణం ఉంటుంది. అతని తండ్రి కూడా ఒకప్పుడు భాక్సింగ్ ఛాంపియన్. అయితే స్టెరాయిడ్స్ తీసుకున్నాడని అతనిపై ఆరోపణలు.దాంతో అతన్ని ఆట నుంచి వెలేస్తారు. దాంతో గని తల్లి మాధురి(నదియా)కి కూడా ఆ బాధ మనస్సులో ఉండిపోతుంది. ఓ టైమ్ లో ఇక బాక్సింగ్ జోలికి వెళ్లను అని మాట కూడా ఇస్తాడు. అయితే.. ఆ మాటను దాటి కోట లాంటి భాక్సింగ్ రింగ్ లోకి ప్రవేశించి , తన తండ్రిని భాక్సింగ్ కు దూరం చేసిన వారిపై పగ తీర్చుకుని, తమ కుటుంబం పరువు ఎలా నిలబెడతాడు ...ఈ క్రమంలో అతనికి ఎదురైన ఛాలెంజ్ లు ఏమిటి..వాటిని ఎలా అథిగమించాడు అనేది మిగతా కథ.
ఎలా ఉంది
జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనల ప్రభావంతో.. ఎంచుకున్న లక్ష్యం... ఒక బలమైన ఆశయంగా మారితే మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు. అలాంటి వ్యక్తి బాక్సింగ్ రింగ్ లో దిగితే ఆ ఆట ఎలా ఉంటుందనే పాయింట్ కాగితంపైనా, చెప్పుకునేందుకు ఖచ్చితంగా అద్బుతంగా ఉంటుంది. చాలా ప్రేరణగా ఉంటుంది. అయితే అదే సమయంలో అలాంటి పాయింట్ కు తగ్గ ట్రీట్మెంట్,స్క్రీన్ ప్లే కలిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఏదీ జరగలేదు. అంతర్గతంగా ఉన్న స్టోరీ లైన్ ...తెరపైకి వచ్చేసరికి పరమ రొటీన్ మ్యాటర్ గా మారిపోయింది. దాంతో సినిమా బోర్ కొట్టించేసింది. కొత్తదనం లేక పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. చూసేవాడు బాక్సింగ్ రింగ్ లో దెబ్బలు తిన్నట్లు అయ్యిపోయింది.
స్పోర్ట్స్ కథ రాయటం అంటే మొదటే అనుకున్నట్లు ఓ పెద్ద టాస్క్. దాదాపు సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. clichés రాకుండా చూసుకోవాలి. రొమాంటిక్ కామెడీల్లో వచ్చే సమస్యే ఈ తరహా సినిమాల్లో నూ వస్తూంటుంది. క్లైమాక్స్,ఇంటర్వెల్, ప్రారంభం అన్ని ముందే ప్రేక్షకుడుకి అర్దమైపోతూంటాయి. అలాగని పరిధి దాటటానికి ఉండదు. ఆ గ్రౌండ్ లోనే దొరక్కుండా గేమ్ ఆడాలి. ఈ సమస్యలన్నీ దాటుతూ గొప్ప స్పోర్ట్స్ డ్రామా రాయటంలోనే దర్శకుడు లేదా రచయిత ప్రతిభ ఆధారపడి ఉంటుంది..ఆ సినిమా ప్రతీభా ఉంటుంది. అయితే ఇక్కడే ఈ రొటీన్ ట్రాప్ లోనే పడ్డాడు ఈ చిత్ర దర్శకుడు. స్ట్రక్చర్ కు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో రొటీన్ అంశాలకు తావిచ్చాడు. ఫస్టాఫ్ రొటీన్ కు బ్రాండ్ అంబాసిడర్ లా సీన్స్ వస్తూంటాయి.
సెకండాఫ్ కొంచెం అటూ ఇటూలో అలాగే ఉన్నా..గుడ్డిలో మెల్ల మేలు.underdog హీరో తన అడ్డంకులను,కుటుంబ సమస్యలను దాటుకుని సక్సెస్ సాధించటం వీటిలో ఉంటుంది. ఇందులో హీరో గని బాక్సింగ్ ఆడుతూ డ్రగ్స్ తో పట్టుబడిన తండ్రికి కొడుకుగా కనిపిస్తారు. బాక్సింగ్ టోర్నమెంట్లో గెలవాలనే తన తండ్రి లక్ష్యాన్ని., కలను నెరవేర్చడానికి గని చేసే ప్రయత్నమే సినిమా. స్టోరీ లైన్ చూడగానే ఎన్నో సార్లు వినేసిన లేదా చూసేసిన కథ లేదా సినిమా అనిపిస్తుంది. అదే సినిమాగా విస్తరించినప్పుడూ కూడా జరిగింది. పాత కథను కొత్త స్క్రీన్ ప్లే టెక్నిక్స్ తో చెప్పాలంటారు. అదీ చేయలేదు. పాత కథని అంతే పాత కథా టెక్నిక్ తో తెరకెక్కించారు.
దానికి తోడు అసలు కథలోకి సెకండాఫ్ దాకా రారు. దాంతో ఫస్టాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు. పోనీ తండ్రి ఉపేంద్ర ప్లాష్ బ్యాక్ అయినా ఇంట్రస్టింగ్ గా ఉంటుందా అంటే అదీ సోసోగా నడుస్తుంది. స్పోర్ట్స్ లో మనం నిత్యం వినే రాజకీయాలే. ఇవన్ని ఓకే అనుకున్నా...హీరో వరుణ్‌కి కోచ్‌గా…సీనియర్ నటుడు నరేష్ ని చూపెట్టడం ఏమిటో ఓ పట్టాన అర్దం కాదు. నరేష్ భాక్సింగ్ కోచ్ అంటే ఏదో తేడా కొడుతున్నట్లు కామెడీగా అనిపిస్తుంది. లవ్ సీన్స్ పండలేదు. దాంతో ఏం యాంగిల్ లో టిక్కెట్ కొనుకున్నవాడు సాటిస్ ఫై అవ్వాలో అర్దం కాదు.
టెక్నికల్ గా ...
దర్శకుడు ఇలాంటి కథలు చేయటానికి తగినంత సామధ్యం లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ సీన్స్ బాగున్నా..మిగతా డ్రామా సీన్స్ పండలేదు. సినిమాకు కీలకంగా నిలిచే చాలా సీన్స్ ని స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు. దానికి తోడు అవసరానికి మించి బిల్డప్ సీన్స్ . అప్పటికీ జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. బాక్సింగ్ సీన్స్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో విజువల్స్ ఓ రేంజిలో ఉన్నాయి. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా… పాటలు మాత్రం అసలు బాగోలేదు. ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది అనిపించింది. నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద అయితే ఎక్కడా రాజీపడకుండా ఖర్చు పెట్టారు.
నటీనటుల్లో ...
వరుణ్ తేజ్ నటనపరంగా చాలా మెచ్యూరిటీ చూపారు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ బాగా పండించారు. కథ,సీన్స్ అతనికి సపోర్ట్ ఇవ్వలేదు కానీ అతను మాత్రం సినిమాకు వంద శాతం సపోర్ట్ ఇచ్చారు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ బాగుంది కానీ తెరపై ఆమె పాత్ర స్ట్రాంగ్ లేక తేలిపోయింది అసలు ఈ సినిమాలో హీరోయిన్ లేకపోయినా నడిచేస్తుంది. నదియా, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి… వీళ్లంతా మార్కెట్ కోసం ఎంచుకున్నారని అర్దమవుతుంది. అయితే వీళ్లు కూడా లేకపోతే చివరి దాకా భరించటం కష్టం.
నచ్చినవి
టైటిల్ సాంగ్
ఉన్నంతలో క్లైమాక్స్
తెరపై పెట్టిన ఖర్చు
నచ్చనవి
రొటీన్ కథా,కథనం
రైటింగ్,డైరక్షన్
ఎక్కడా గగుర్పాటు,ఉలికిపాటు లేకుండా కునికిపాట్లు వచ్చేలే చేయటం
Ghani
ఫైనల్ థాట్
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
హీరోలు మాత్రం సిక్స్ ప్యాక్ లు , ఎయిట్ ప్యాక్ ల కోసం కష్టపడుతున్నారు. కానీ వాళ్లు చేసే కథలు మాత్రం ఫ్యామిలి ప్యాక్ లతో పెద్ద బొజ్జలతో ఉంటున్నాయి.
ఎవరెవరు...
నటీనటులు: వరుణ్‌తేజ్, సయీ మంజ్రేకర్, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్‌శెట్టి, నవీన్‌చంద్ర, నదియా, నరేష్, తనికెళ్ల భరణి, తమన్నా (ప్రత్యేకగీతంలో) తదితరులు;
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్;
ప్రొడక్షన్ డిజైన్: రవీందర్;
కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్;
సంగీతం: తమన్,
సమర్పణ: అల్లు అరవింద్;
నిర్మాణం: సిద్ధు ముద్ద, అల్లు బాబీ;
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి;
సంస్థలు: అల్లు బాబీ కంపెనీ, రినైస్సెన్స్ పిక్చర్స్
విడుదల: 8-04-2022