వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ రివ్యూ

First Published Oct 8, 2021, 1:46 PM IST

అడుగడుక్కీ పాఠకులను అబ్బురపరుస్తూ సాగుతుంది. ఈ రచన అదే స్దాయిలో ప్రేక్షకుడుకు అనుభూతిని అందించగలిగేలా సినిమా రూపొందిందా..అసలు ఈ చిత్రం కథేంటి, వైష్ణవ్ తేజ్ కెరీర్ కు ఈ సినిమా ఏ మేరకు కలిసొస్తుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఉత్తమ పుస్తకాల్లో ఒకటిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. తనదికాని అనుభవాన్ని, ఇతరుల ద్వారా విన్నదాన్ని, తాను కళ్లారా చూసిన గొర్రెలకాపరుల జీవితాన్ని రచయిత అత్యంత అద్భుతంగా అక్షరీకరించారు.  ‘తానా’ నవలల పోటీలో ప్రథమ బహుమతికి ఎంపికైన ఈ రచనని తెరపైకి ఎక్కించటమంటే మాటుల కాదు.  నవలలో చూపించిన భౌగోళిక నైసర్గిక ఆవరణాన్ని పట్టుకుని తెరపై విజువలైజ్ చేయగలగాలి. నవలలో వాగుల్నీ, వంకల్నీ, కొండలను రచయిత దృశ్యమానం చేసిన తీరు మామూలుగా ఉండదు. అడుగడుక్కీ పాఠకులను అబ్బురపరుస్తూ సాగుతుంది. ఈ రచన అదే స్దాయిలో ప్రేక్షకుడుకు అనుభూతిని అందించగలిగేలా సినిమా రూపొందిందా..అసలు ఈ చిత్రం కథేంటి, వైష్ణవ్ తేజ్ కెరీర్ కు ఈ సినిమా ఏ మేరకు కలిసొస్తుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
  

Kondapolam

కథ..
  కఠారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) అనే కుర్రాడు కడప నివాసి. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో జాబ్ ట్రైల్స్ వేస్తాడు. అతనిలో ధైర్యం తక్కువ ఉండటం వల్ల ఇంటర్వూలు ఫేస్ చేయలేక ఫెయిలవుతూంటాడు. అలా సిటీలో బ్రతకలేక తన పల్లెకు చేరిన అతన్ని తాత రోశయ్య (కోట శ్రీనివాసరావు) అర్దం చేసుకుని, ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొందరు ‘కొండపొలం’ చేస్తున్నారని, తమ గొర్రెలనూ తీసుకుని వారితో కలిసి నల్లమల అడవికి వెళ్లమని చెబుతాడు.దాంతో తన తండ్రి గురప్ప(సాయిచంద్) తో కలిసి, వాళ్ల గొర్రెలను తీసుకొని రవీంద్ర అడవికి వెళ్తాడు. అయితే అక్కడ జీవితం అనుకున్న ఈజీ కాదు. 

Kondapolam

ఓ ప్రక్కన అక్కడ తిరుగుతున్న పెద్ద పులి, మరో ప్రక్క ఎర్ర చందనం స్మగ్లర్లు, గొర్రెలను ఎత్తుకెళ్లేవాళ్లు, పాములు వంటి విష జంతువులు..కొండ జ్వరాలు ఇలా బోలెడు కష్టాలు, ఇబ్బందులు. అసలే రవీంద్ర భయస్ధుడు. ఇప్పుడిప్పుడే జీవితంలో ప్రవేశిస్తున్నవాడు. అడవితో అనుబంధం లేనివాడు. అలాంటివాడు నలభైరోజులు పాటు అడవితో ఆ గొర్రెల మందతో సహవాసం చేశాక, అక్కడ సమస్యలతో పోరాడాక ఓ రకమైన తెగింపు వస్తుంది. అతనికి అడవి అనేక పాఠాలు నేర్పుతుంది. అవేంటి..,  ఓబులమ్మ(రకుల్ ప్రీత్ సింగ్) ఎవరు..ఆమె అతని జీవితంలోకి ఎలా ప్రవేశించింది.. అనేదే మిగితా కథ. చివరకు రవీంద్ర ఉద్యోగం సంపాదించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Kondapolam

ఎనాలసిస్ ..

ఒకప్పుడు నవలా చిత్రాలు తెలుగులో తెగ వస్తూండేవి. అయితే నవలలు బాగా తగ్గాయి. వాటిని చదివి,సినిమాకు  పనికొస్తుందేమో అని ఆలోచించే నిర్మాతలు, దర్శకులు లేరు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఆ గత వైభవం గుర్తు చేస్తూ ..ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను అదే టైటిల్ తో వెండితెరకెక్కించటం గొప్ప విషయం. ఈ విషయంలో క్రిష్ ని అభినందించాలి.  ‘కొండపొలం’లో ఒకే అంశం మననను కట్టిపారేస్తుంది. ప్రకృతికు దూరం వెళ్లిన కొలిదీ మనం మనకి దూరం అయ్యిపోతాం. ప్రకృతిలో కలుస్తూ తోటి జీవులతో మనిషి మమేకం అయ్యితేనే మనకు బ్రతుకుంది. నవలను సినీ స్క్రీన్ ప్లే నిమిత్తం మార్చినా,ఓబులమ్మ లాంటి పాత్రలు కలిపినా పెద్దగా కలిసిరాలేదు.

Kondapolam


నవల్లో లేని ఓబులమ్మ  పాత్ర, ఆమె తో హీరో ప్రేమ కథ సినిమాలో ఎక్కువైపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో లవ్ స్టోరీకు ప్రాధాన్యత ఇచ్చారు. పాటలతో నింపేసారు. దాంతో నవలలో ఉన్న  ఫీల్ మొత్తం పోయింది. అలాగే కథలో కాంప్లిక్ట్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకుండా పోయింది. హీరోలో అడవి,అక్కడ పరిస్దితులు తీసుకు వచ్చిన మార్పు కు సంభందించిన ఆర్క్ ని చూపెడదామనే ప్రయత్నం కూడా పెద్దగా ఎక్కదు. దాన్ని మొత్తం లవ్ స్టోరీ తన్నుకు పోయింది. అలాగే క్లైమాక్స్ బాగా తేలిపోయింది.

Kondapolam


 పులితో హీరో పోరాటం ఉంటుందేమో ఎక్సపెక్ట్ చేస్తే కొద్ది క్షణాల్లోనే తేల్చేసారు. పులి హీరోని చూసి తోక ముడిచేసింది అన్నట్లు ఒక్క షాట్ లో తేల్చేసారు. అలాగే కథలో మొదట నుంచి పెట్టుకుంటూ వస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్లుకు ముగింపు ఇవ్వలేదు. అలాంటప్పుడు వాళ్లమీద ఎక్కువ సేపు సీన్స్ నడపటం అనవసరం అనిపిస్తుంది. అలాగే రచ్చ రవి, అశోక్ వర్థన్ పై తీసిన ఫన్ ..  పండలేదు. ఏదైమైనా ఫస్టాఫ్  సాగినంత వేగంగా కథ సెకండాఫ్ లో  సాగలేదు.  ఇంట్రవెల్ నుంచీ మెల్లిమెల్లిగా గ్రాఫ్  కిందకు దిగుతూ నడిచింది.

Kondapolam


అయితే కొన్ని సీన్స్ మాత్రం అప్ టుది మార్క్ ఉన్నాయి. అడవిలో గొర్రలపై  పెద్ద పులి దాడిచేసినప్పుడు హీరో కాపాడే సీన్ చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. అలాంటి సీన్ అయినా క్లైమాక్స్ లో పెట్టలేకపోయారు. ఇక గొర్రెలను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ..వాటికి ఓ టైమ్ లో కనీసం దాహం తీర్చలేక సాయిచంద్ మధనపడతాడే సీన్ చాలా బాగుంది. మరికొన్ని సీన్స్ లో పశువులకు మనుషులకు మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. 

Kondapolam

టెక్నికల్ గా ...

ఈ సినిమాకు  డైలాగులు బాగా ప్లస్ అయ్యాయి. ‘ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’, ‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’, ‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’ వంటి మాటలు డైరక్ట్ గా మనని  తాకుతాయి, ఆలోచింప చేస్తాయి. దర్శకుడుగా క్రిష్ ఈ సినిమాని రకుల్ పాత్రకు ఎక్కువ ప్రయారిటీ ఇయ్యకుండా నవలను నవలలాగే తెరకెక్కిస్తే అది ప్రయోగం కావచ్చేమో కానీ ఖచ్చితంగా ఓ వర్గానికి అయినా నచ్చేది. కీరవాణి అందించిన పాటలు గొప్పగా లేకపోగా కథకు అడ్డం అనిపించాయి. ఉన్నంతలో ‘నీలో నాలో నీలో నాలో’ అనే పాట కాస్తంత రొమాంటిక్‌గా సాగింది.  ఎడిటర్ శ్రవణ్ కటికనేని సెకండాఫ్ ఇంకాస్త స్పీడు చేయాల్సింది.  జ్ఞానశేఖర్  కెమెరా వర్క్  బాగుంది. గ్రాఫిక్స్ అని కొన్ని చోట్ల తెలిసిపోయినా బాగున్నాయి. 

Kondapolam


 
 నటీనటుల విషయానికి వస్తే వైష్ణవ్ తేజ కళ్ళే పెద్ద ప్లస్ పాయింట్ .అదే ఈ సినిమాలో మరో సారి ఎస్టాబ్లిష్ అయ్యింది.  చాలా వరకూ భావాలను ఆ కళ్లే పలికించే ప్రయత్నం చేసారు.   ఓబులమ్మగా రకుల్ నప్పింది కానీ ఆమె ముందు వైష్ణవ్ చిన్నాడులా కనిపించాడు. చాలా చోట్ల రకుల్ ప్రీత్ అతన్ని డామినేట్ చేసేసింది.  ఎప్పటిలాగే కోట ఉన్నది కాసేపైనా తన ముద్ర వేసారు.  రవీంద్రకు దిశానిర్దేశం చేసే తాత పాత్రను కోట చేశారు.  ఇక ‘ఉప్పెన’లో వైష్ణవ్ కు తండ్రిగా నటించిన సాయిచంద్ ఇందులోనూ అతని తండ్రి గురప్పగా చాలా  బాగా చేసారు. చాలా కాలం గుర్తుండిపోయే పాత్ర. ఇక  వైష్ణవ్ తో పాటు అడవిలోకి వెళ్ళే మిగతా పాత్రలలో అంథోని, హేమ, రవిప్రకాశ్, మహేశ్ విట్ట, రచ్చ రవి, అశోక్ వర్థన్ నటించారు.  రెగ్యులర్ గా  పోలీస్ పాత్రలు చేసి మెప్పించే రవి ప్రకాశ్ ఇందులో అంకయ్య పాత్ర పోషించాడు. దర్శకుడు క్రిష్ అతిథి పాత్రల్లో మెరిశారు.

Kondapolam


ప్లస్ పాయింట్స్
నవలా చిత్రం కావటం
అడవి నేపథ్యం 
డైలాగులు


మైనెస్ పాయింట్స్
బాగా స్లో అయిన సెకండాఫ్ 
కీరవాణి సంగీతం
 పూర్ వి.ఎఫ్.ఎక్స్
కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ప్రాకులాట
క్లైమాక్స్

Kondapolam


ఫైనల్ ధాట్
  కొన్నిషాట్స్ లో గొర్రెలు బాగా నటించాయి. వాటి ఎక్సప్రెషన్స్ బాగున్నాయి. వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్:2.5 / 5

Kondapolam

ఎవరెవరు..

బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ 
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమ, ఆంథోని, రవి ప్రకాశ్, మహేశ్ విట్టా, రచ్చ రవి తదితరులు 
సినిమాటోగ్రఫి: జ్ఞానశేఖర్ వీఎస్
 మ్యూజిక్: ఎంఎం కీరవాణి 
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి 
రచన: సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి 
నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి 
రిలీజ్ డేట్: 2021-10-08

Also read కొండ పొలం ట్విట్టర్ రివ్యూ: అవార్డ్ విన్నింగ్ మూవీ అంటున్న మెగాస్టార్, నెటిజెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్

click me!