సింహాసనం రివ్యూ.. చిరంజీవికి చెక్ పెట్టడానికి, కృష్ణ చేసిన అతి పెద్ద సాహసం.. 144 సెక్షన్ కు దారితీసిన సూపర్ స్టార్ మూవీ రిలీజ్

Published : Oct 12, 2025, 12:30 PM IST

Simhasanam Movie Review : సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో రికార్డులు ఉన్నా.. ఆయన జీవితంలో మర్చిపోలేని  సినిమాగా సింహాసనం నిలిచిపోయింది. ఈసినిమా కోసం కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీకావు. 

PREV
18
చిరంజీవికి చెక్ పెట్టిన కృష్ణ

సీనియర్ హీరోల ప్రభావం తగ్గుతున్న సమయంలో.. ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఇండస్ట్రీలో దూసుకుపోయాడు చిరంజీవి. ఎన్టీఆర్ రాజకీయాలవైపు వెళ్లారు, శోభాన్ బాబు తన మార్క్ సినిమాలు మాత్రమే చేసుకుంటున్నారు. కృష్ణ మాత్రం వరుసగా మూడు ప్లాప్ సినిమాలతో డేంజర్ లో పడ్డారు. సరిగ్గా ఈ సమయంలోనే చాలా తెలివిగా ఆలోచించారు సూపర్ స్టార్ కృష్ణ. చిరంజీవి దూకుడు తట్టుకునేలా పెద్ద ప్లాన్ వేశారు. తన మనసులో వచ్చిన చిన్న ఆలోచనను రచయిత మహారథిని పిలిచి చెప్పారు. ఆయన కొన్ని రోజుల తరువాత అద్భుతమైన కథతో కృష్ణముందుకు వచ్చారు, ఆ సినిమానే సింహాసనం. ఈసినిమాతో చిరంజీవికి దూకుడుకి చెక్ పెట్టి, మరో పదేళ్ళు తన పేరు మారుమోగేలా చేశారు కృష్ణ. సింహాసనం సినిమా కోసం సాహసాలెన్నో చేశారు సూపర్ స్టార్.

28
సింహాసనం కథ విషయానికి వస్తే

దశార్ణ రాజ్యంలో విక్రమ సింహా (కృష్ణ) అనే సేనాధిపతి ఉన్నాడు. అతను ఎంతో ధైర్యవంతుడు, సమర్థుడు. ఆ రాజ్యపు యువరాణి అలకనందా దేవి (జయప్రద) విక్రమ సింహాను ప్రేమిస్తుంది. రాజును తొలగించి, తన కొడుకును సింహాసంపై కూర్చోబెట్టాలని మహామంత్రి( ప్రభాకర్ రెడ్డి) ప్రయత్నిస్తాడు. కానీ విక్రమ సింహ ఆ రాజ్యాన్నికాపాడుకుంటూ వస్తుంటాడు. ఈక్రమంలో యువరాణిని చంపబోయాడు అనే నిందతో.. తప్పుడు సాక్ష్యం పుట్టించి, విక్రమ సింహను రాజ్యం నుండి బహిష్కరిస్తారు. ఇక పొరుగు రాజ్యంలో విక్రమసింహను పోలిన యువరాజు ఉంటాడు. అతను అవంతిక యువరాజు ఆదిత్య వర్ధన (కృష్ణ). అతను లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. తన రాజ్యంలో నృత్యం చేసే జస్వంతి (రాధ) ని అతను ఇష్టపడతాడు. అతని ప్రవర్తన ఆ దేశపు రాణికి ఇష్టం ఉండదు. అతను చేసే పనులు ఆమె సహించలేకపోతోంది. ఆమె అతని ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆదిత్య వర్ధన అలకానంద దేవిని పెళ్ళి చేసుకోవాలని ఆమె కోరుకుంది. కానీ ఆదిత్య వర్ధన అడవిలో వేటాడేందుకు వెళ్ళినప్పుడు, అతను చందన అనే విషకన్య (మండకిని) ను చూసి ప్రేమలో పడతాడు. చందన కూడా అతన్ని ప్రేమిస్తుంది. కొన్ని సంఘటనల తరువాత, చందన తాను విషకన్య నని తెలుసుకుంని, ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది, కాని విక్రమా సింహఆమెను రక్షిస్తాడు. ఇలా ఉండగా అనుకోకుండా కలిసిన ఇద్దరు హీరోలు తమ సమస్యల గురించి చర్చించుకుంటారు. రాజ్యంలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే వరకు తన రాజ్యాన్ని పరిపాలించాలని విక్రమ సింహను ఆదిత్య వర్ధన ఒప్పిస్తాడు. ఆతరువాత జరిగే పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మహామంత్రి కుతంత్రాలను ఈ ఇద్దరు ఎలా ఫేస్ చేశారు. తమ రాజ్యాలను ఎలా రక్షించుకున్నారు. చివరకు ఏం జరిగింది అనేది ఆడియన్స్ కు ఎంతో ఉత్కంఠను కలిగించే క్లైమాక్స్.

38
కృష్ణ చేసిన అతి పెద్ద సాహసం

ఫస్ట్ జేమ్స్‌బాండ్‌ మూవీ, ఫస్ట్ కౌబాయ్ మూవీ, తొలి తెలుగు సినిమా స్కోప్‌ చిత్రం, ఫస్ట్ కలర్ సినిమా, ఇలా కృష్ణ టాలీవుడ్ కు అందించిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు. ఇక సిహాసనం సినిమాతో టాలీవుడ్ లో తొలి తెలుగు 70 ఎం.ఎం 6 ట్రాక్‌ స్టీరియో ఫోనిక్‌ సౌండ్‌ ను పరిచయం చేశారు స్టార్ హీరో. అంతే కాదు కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తొలిసినిమా కూడా ఇదే. సింహాసనం సినిమా 1986 మార్చి 21న భారీ ఎత్తున విడుదలై ఘనవిజయం సాధించింది. ఈసినిమా కోసం కృష్ణ చాలా కష్టపడ్డారు డ్యూయల్ రోల్ చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, ఈసినిమాను నిర్మించారు. ఈమూవీలో రెండు పాత్రల్లో కృష్ణ నటన అద్బుతం అని చెప్పాలి. ఒకేసారి మల్టిపుల్ రోల్స్ చేయడం అంటే అంత సులువైన పని కాదు. కానీ కృష్ణ ఆ ఒత్తిడిని జయించి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. అప్పటికి జానపద కథలకు మంచి ఆదరణ ఉంది. కాకపోతే కమర్షియాలిటీ రాజ్యం ఏలుతున్న టైమ్ లో, ఇటువంటి కథను తీసుకోవడం కూడా కృష్ణ సాహసాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈసినిమా చేయవద్దు అని సూపర్ స్టార్ కు చాలామంది చెప్పారు, కానీ ఆ మాటలుపట్టించుకోకుండా తను నమ్మిన పనికోసం కష్టపడ్డాడు కృష్ణ. అనుకున్నదానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించాడు. సింహాసనం సినిమాను తెలుగు భాషలో నిర్మిస్తూనే హిందీలో కూడా స్టార్ట్ చేశాడు. తెలుగులో 'సింహాసనం', హిందీలో 'సింఘాసన్‌' పేర్లతో రెండు భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా 60 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయబడింది.

48
నటీనటులు ఎలా చేశారంటే

ఈసినిమాలో ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువా అని లేదు. అందరు నటులు అద్భుతంగా పెర్పామెన్స్ అందించారు. కృష్ణ సరసన జయప్రద , రాధ, మందాకిని హీరోయిన్స్‌గా నటించగా వహీదా రెహమాన్‌, గుమ్మడి, ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు, గిరిబాబు, సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విక్రమసింహగా, ఆదిత్య వర్దనుడుగా సూపర్‌స్టార్‌ ద్విపాత్రాభినయం ఆయన అభిమానులను ఎంతగానో అలరించింది. అంతే కాదు బాలీవుడ్ నటుడు అంజాద్‌ ఖాన్‌ నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే. జయప్రద , రాధ, మందాకిని అప్పట్లోనే వయ్యారాలతో మురిపించే ప్రయత్నంచేశారు.ఇందులో కృష్ణ గెటప్స్, మేకప్ కూడా ప్రత్యేక ఆకర్షణగానిలిచింది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

58
టెక్నికల్ టీమ్

పద్మాలయా స్టూడియోస్‌ బేనర్‌పై కృష్ణ కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహిస్తూ సింహాసనం సినిమాను నిర్మించారు కృష్ణ. డైరెక్షన్ తొలిసారి అయినా సీనియర్ డైరెక్టర్ల మాదిరి మూవీని తీర్చిదిద్దారు కృష్ణ. ఈసినిమా వేరే దర్శకుడు ఎవరైనా చేసి ఉంటేఇలా వచ్చేదో లేదో తెలియదు. కానీ సింహాసనంలో కృష్ణ మార్క్ పక్కాగా కనిపించింది. ఇక ఈసినిమాకు బప్పీలహరి సంగీతం చాలా ప్లాస్ అయ్యింది . మూవీలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సింహాసనం సాంగ్స్‌ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని సినిమాల్లో ఈ పాటలు రీమేక్ కూడాచేశారు. 'ఆకాశంలో ఒకతార నా కోస మొచ్చింది ఈవేళ', 'వాహ్వా నీ యవ్వనం', 'లాంటి పాటలు ఈ తరం ఆడియన్స్ కూడా చాలా ఇష్టంగా వింటుంటారు. అంతే కాదు మహారథి రాసిన మాటలు, వి.ఎస్‌.ఆర్‌.స్వామి ఛాయా గ్రహణం, భాస్కరరాజు కళా దర్శకత్వం, సి.మాధవరావు మేకప్‌, శీను నృత్య దర్శకత్వం, అజయ్ దేవగణ్ తండ్రి వీరు దేవగన్‌ ఫైట్స్‌ 'సింహాసనం' సినిమాను టెక్నికల్‌గా ఓ రేంజ్‌కి తీసుకెళ్ళాయి.

68
సింహాసనం సినిమా ప్రత్యేకతలెన్నో

ఇలాంటి ప్రయోగాలు చేయద్దు అని ఇండస్ట్రీ పెద్దలు కృష్ణకు నచ్చజెప్పారు. కానీ కృష్ణ ఏమాత్రం తగ్గలేదు. రెండు మూడు సినిమాలు చేసే టైమ్ ను ఈ ఒక్క సినిమాకే కేటాయించాడు సూపర్ స్టార్. అంతే కాదు ఈసినిమా కోసం పనిచేసే టెక్నీషియన్స్ ను కూడా సొంత మనుషుల్లా చూసుకున్నారు కృష్ణ, యూనిట్ టీమ్ అందరికి షూటింగ్ అయిపోయే వరకూ నాన్ వెజ్ భోజనాలు ఏర్పాటు చేయించారు. సినిమా హిట్ అయిన తరువాత వారికి జీవితాంతం గుర్తుండేలా బహుమతులు కూడా అందించాడు కృష్ణ. సింహాసనం సినిమా కోసం ఆకాలంలోనే దాదాపు 50 లక్షలతో భారీ సెట్లు వేశారు. ఈ బడ్జెట్ తో రెండు మూడు చిన్న సినిమాలు నిర్మించవచ్చు. పద్మాలయ స్టూడియోస్ లో వేసిన ఆ సెట్ చూడటానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వారి కుటుంబాలతో కలిసి వచ్చేవారట. సింహాసనం సినిమాలో మరో విశేషం ఏంటంటే? కృష్ణ తెలుగు సంగీత దర్శకులను కాదని..మొదటిసారి బాలీవుడ్ నుంచి బప్పీలహరిని టాలీవుడ్ కు పట్టుకొచ్చారు. అప్పటి నుంచి బప్పీలహరి టాలీవుడ్ లో బిజీ అయిపోయాడు. అంతే కాదు ఈసినిమా కోసం బాలీవుడ్ నుంచి మందాకినిని కూడా టాలీవుడ్ కు పరిచయం చేశారు కృష్ణ. తెలుగులోనే ఈసినిమా పెద్ద సాహసం అంటే..మరో వైపు హిందీలో కూడా ఒకేసారి ఈమూవీని స్టార్ట్ చేశాడు కృష్ణ. రెండు భాషల్లో రిలీజ్ చేసి పంతం నెగ్గించుకున్నారు.

78
144 సెక్షన్ పెట్టిన ప్రభుత్వం

ఇంత సాహసం చేసిన రిలీజ్ చేసిన సింహాసనం సినిమా అనుకున్నదానికంటే ఎక్కువగానే రెస్పాన్స్ ను సాధించింది. కృష్ణ అభిమానులు తండోలపతండాలుగా వచ్చి సినిమాను చూడటం మొదలు పెట్టారు. ఈమూవీ రిలీజ్ టైమ్ కు రోడ్లన్నీ నిండిపోయాయి. మూసేసిన థియేటర్లు కూడా సింహాసనం సినిమా కోసం తెరుచుకున్నాయి.ఈ సినిమా రిలీజ్ టైమ్ ల్ థియేటర్స్‌ దగ్గర ఓపెనింగ్‌కి వచ్చిన భారీ క్రౌడ్స్‌కి ట్రాఫిక్‌ జామ్‌ అయి ట్రాఫిక్‌ని వేరే రోడ్లవైపు డైవర్ట్‌ చెయ్యాల్సి రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. విజయవాడలో అయితే సింహాసనం సినిమాకు వచ్చే క్రౌడ్ ను తట్టుకోలేక కొన్ని థియేటర్ల దగ్గర 144 సెక్షన్ కూడా పెట్టాల్సి వచ్చింది. టికెట్ ఉంటేనే ఆ వీధిలోకి అనుమతించే పరిస్థితి. టాలీవుడ్ చరిత్రలో ఒక సినిమా కోసం 144 సెక్షన్ పెట్టడం అదే మొదటి సారి. కృష్ణ కూడా ఈ విషయాలను చాలా ఇంటర్వ్యూలలో పంచుకుకున్నారు.

88
చెన్నైలో చరిత్ర సృష్టించిన కృష్ణ సినిమా

సింహాసనం సినిమా రిలీజ్ అయ్యి చరిత్ర సృష్టించింది. ఓపెనింగ్స్‌ పరంగా ఆ రోజుల్లోనే ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించడమే కాకుండా శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకుంది. హైదరాబాద్‌ దేవి థియేటర్‌లో రోజుకు 4 ఆటలతో 105 రోజులు ఆడిన ఈసినిమా దాదాపు 41 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు, హిందీలో కొన్నిరోజుల గ్యాప్ తో రిలీజ్ అయిన ఈసినిమా దాదాపు 2.5 కోట్ల వరకూ కలెక్షన్లు సాధించింది. తెలుగులో మాత్రమే 1 కోటీ 50 లక్షలకు పైగా వసూళ్లు సాధించింది సింహాసనం సినిమా. ఇక చెన్నైలో సింహాసనం సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మద్రాసులో శతదినోత్సవం జరుపుకున్న మొదటి సినిమా ఇదే. ఈసందర్భంగా విజిపి గార్డెన్స్‌లో 100 రోజుల వేడుక జరిగినప్పుడు, కృష్ణ అభిమానులు వేల సంఖ్యలో తరలిరావడం తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ఆశ్చర్య పరిచింది. దాదాపు 400 బస్సుల్లో ఫ్యాన్స్ చెన్నై రావడం తెలుగు,తమిళ ఇండస్ట్రీల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ సినిమా చూడాలని అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories