Sasivadane Movie Review: శశివదనే మూవీ రివ్యూ, రేటింగ్‌.. రక్షిత్‌ అట్లూరి, కోమలి నటించిన సినిమా ఎలా ఉందంటే

Published : Oct 10, 2025, 07:03 PM IST

`పలాస 1978` చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన రక్షిత్‌ అట్లూరి ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు అందుకోలేకపోయాడు. ఇప్పుడు `శశివదనే` అనే లవ్‌ స్టోరీతో వస్తున్నారు. ఈ మూవీతో అయినా హిట్‌ కొట్టాడా? అనేది చూద్దాం. 

PREV
15
`శశివదనే` మూవీ రివ్యూ

యంగ్‌ హీరో రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన మూవీ `శశివదనే`. ఈ చిత్రానికి సాయి మోహన్‌ అబ్బన దర్శకత్వం వహించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్‌ స్టూడియోస్‌ పతాకంపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోదాల సంయుక్తంగా నిర్మించారు. గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో సాగే చిత్రమిది. విలేజ్‌ నేపథ్యంలో మంచి వింటేజ్‌ లవ్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ మూవీ నేడు శుక్రవారం(అక్టోబర్‌ 10)న విడుదలైంది. ఐమాక్స్ లో సినిమాని వీక్షించాను. మరి సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్ ని అలరించిందా? గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన చిత్రాల్లో ది బెస్ట్ అనిపించుకుందా? రక్షిత్‌ అట్లూరికి హిట్‌ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

25
`శశివదనే` మూవీ స్టోరీ ఏంటంటే?

రాఘవ(రక్షిత్‌ అట్లూరి) గోడావరి లంక గ్రామంలో తండ్రి(శ్రీ మాన్‌)తో కలిసి జీవిస్తుంటాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రిలోనే తల్లిని చూసుకుంటాడు. డిగ్రీ పాస్‌ కావడంతో సంతోషానికి అవదుల్లేవ్‌. ఆ ఆనందంలో ఉండగా శశి(కోమలి ప్రసాద్‌)ని చూసి ఫిదా అవుతాడు. తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. రోజూ ఆమెని ఫాలో అవుతుంటాడు. శశి తన బావ కారణంగా పై చదువులు చదువుకోలేక ఇంటికి, ఆ ఊర్లో ఉండే అంగన్‌వాడి స్కూల్‌కే పరిమితమవుతుంది. అదే ప్రపంచంగా బతుకుతుంది. రాఘవ ఆమెని ప్రేమలో పడేసేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు థియేటర్‌ వద్ద శశి బావని కాలర్‌ పడతాడు. అంతకు ముందు శశి బావ రాఘవపై కొబ్బరి బోండా ఇసిరేసి రెచ్చగొడతాడు. ఇప్పుడు థియేటర్‌ దగ్గర దొరకడంతో అతని సంగతేంటో తెల్చాలని నిర్ణయించుకుని గొడవకి దిగుతాడు. అదే థియేటర్లో రాఘవ తండ్రి పనిచేస్తుంటారు. ఈ గొడవని కంట్రోల్‌ చేస్తాడు. ఆ గొడవలో రాఘవ ధైర్యానికి ఫిదా అవుతుంది శశి. బావ అంటే శశి కూడా ఇష్టం లేదు. దీంతో రాఘవపై ప్రేమ పెరుగుతుంది. ఎట్టకేలకు తమ ప్రేమని వ్యక్తం చేసుకుంటారు. ఈ విషయం కాస్త శశి బావకి తెలుస్తుంది. దీంతో అతను కక్ష్యా సాధింపు చర్యలకు పాల్పడతాడు. వీరి ప్రేమని బ్రేక్‌ చేయాలని చూస్తాడు. మరి శశి బావ రాఘవని ఏం చేశాడు? ప్రేమ కోసం రాఘవ ఏం చేశాడు? ఈ క్రమంలో రాఘవ ఏం కోల్పోయాడు? శశి ఏం కోల్పోయింది? చివరికి సినిమా ఎలాంటి ముగింపు తీసుకుందనేది మిగిలిన కథ.

35
`శశివదనే` మూవీ విశ్లేషణః

గోదావరి బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాలు వచ్చి చాలా కాలమే అవుతుంది. అక్కడి నేపథ్యంలో, ఆ యాస విని చాలా కాలం అవుతుంది. `శశివదనే`తో మళ్లీ అక్కడికి తీసుకెళ్లారు. దీంతో ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌ తెప్పించింది. అయితే ఇలాంటి కథలు వచ్చి చాలా కాలమే అవుతుంది. ఓ ఇరవై ఏళ్లనాటి లవ్‌ స్టోరీని తలపిస్తుంది. ఈ జనరేషన్‌కిది కొత్తగా అనిపించొచ్చు. కానీ 30 ప్లస్‌ ఉన్నవారికి మాత్రం ఇది ఓల్డ్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. ఒక ఊర్లో అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడటం, దాన్ని అమ్మాయి ఇంట్లో ఎవరో ఒకరు అడ్డుకోవడం, ఈ క్రమంలో గొడవలు జరగడం, అబ్బాయి వైపుగానీ, అమ్మాయి వైపుగా ఎవరో ఒకరిని కోల్పోవడం, చివరికి తమ ప్రేమ కోసం పోరాడి సక్సెస్‌ అవడం అనేది ఓల్డ్ కాన్సెప్ట్. ఇలాంటి సినిమాలకు కథనం కొత్తగా ఉండాలి. ఎప్పుడూ చూడలేదనేలా ఉండాలి. రియాలిటీకి దగ్గరగా అయినా ఉండాలి. అప్పుడే ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవుతుంది. ఇంటెన్సిటీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. కానీ ఈ మూవీలో అదే లోపించింది. కొత్తదనం ఏమాత్రం లేదు. చాలా రొటీన్‌గా రెగ్యూలర్‌గా ఉంటుంది. లవ్‌ స్టోరీలోనూ వాహ్‌ ఫ్యాక్టర్స్ మిస్‌ అయ్యింది. ఆ ఫీల్‌ ఏమాత్రం వర్కౌట్‌ కాలేదు. అయితే ప్రేమ కోసం, అమ్మాయిని కలిసేందుకు హీరో పడే తాపత్రయం, హీరో ఫ్రెండ్‌ డైలాగులు, కామెడీ ఆకట్టుకుంటాయి. నవ్వులు పూయిస్తాయి. ప్రేమ కోసం చేసే పోరాటం, యాక్షన్‌ సీన్లు కూడా అలరించేలా ఉన్నాయి. ఉన్నంతలో బాగున్నాయి. కాకపోతే రివేంజ్‌ డ్రామాలోనూ బలం లేదు. చాలా పేలవంగా అనిపిస్తాయి. ఇంట్రెన్సిటీ, సీరియస్‌ నెస్‌ మిస్‌ అయ్యింది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ బాగానే వర్కౌట్‌ అయ్యింది. ప్రారంభం నుంచి ఆ బాండింగ్‌ని బిల్డ్ చేయడం వల్ల అంతో ఇంతో వర్కౌట్‌ అయ్యిందంటే ఆ ఎమోషన్స్ ఒక్కటే అని చెప్పొచ్చు. కాకపోతే ఆ స్థాయిలో లవ్‌ కి సంబంధించిన ఎమోషన్స్ పండలేదు. ఇదే ఇందులో పెద్ద మైనస్‌. దీనికితోడు కథనాన్ని నడిపించిన తీరు కూడా పేలవంగా ఉంది. ఏమాత్రం ఆసక్తిని క్రియేట్‌ చేయలేకపోయింది. ఎంగేజ్‌ చేయలేకపోయింది. ఈ మూవీ నాలుగైదేళ్ల క్రితమే రూపొందించారు. ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తోంది. కథ మాత్రమే కాదు, డైరెక్షన్‌ కూడా పేలవంగా ఉంది. దీంతో ఇదొక బోరింగ్‌ మూవీలా మారిపోయింది.

45
`శశివదనే` నటీనటుల ప్రదర్శన

రాఘవ పాత్రలో రక్షిత్‌ అట్లూరి చాలా బాగా నటించారు. పాత్రలో ఒదిగిపోయారు. నటుడిగా, లవర్‌బాయ్‌గా తన బెస్ట్ ఇచ్చారు. ఎమోషనల్‌ సీన్లలోనూ మెప్పించారు. ఇక శశి పాత్రలో కోమలి ప్రసాద్‌ బాగానే చేసింది. ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. లవ్‌ ట్రాక్‌కి సంబంధించిన సీన్లలో ఆమె ఇంకా బాగా చేయాల్సింది. పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. రాఘవ తండ్రిగా శ్రీమాన్‌ అదరగొట్టారు. తండ్రి ఎమోషన్స్ ని పండించడంలో సక్సెస్‌ అయ్యారు. హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేసిన కుర్రాడు బాగా చేశాడు. కోసాంధ్ర యాసలో అదరగొట్టారు. విలన్‌ పాత్రలో నటించిన దీపక్‌ ప్రిన్స్ ఫర్వాలేదనిపించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

55
`శశివదనే` మూవీ టెక్నీషియన్ల పనితీరుః

శరవణ వాసుదేవన్‌ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అనుదీప్‌ దేవ్‌ నేపథ్య సంగీతం కూడా అలరించేలా ఉంది. కానీ కథలో, కథనంలో బలం లేకపోవడంతో మ్యూజిక్‌ సినిమాకి హెల్ప్ కాలేకపోయింది. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ సినిమాని ఇంకాస్త ట్రిమ్‌ చేయాల్సింది. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు సాయిమోహన్‌ ఉబ్బన బలమైన కథని ఎంచుకోవడం, దాన్ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయారు. సినిమాని అలరించేలా, ఫీల్‌గుడ్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించలేకపోయారు. నిర్మాణ విలువలకు మాత్రం కొదవ లేదు.

ఫైనల్‌ నోట్‌ః ఓల్డ్ స్టోరీ, బోరింగ్‌ స్క్రీన్‌ప్లే.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన `శశివదనే`

రేటింగ్‌ః 2

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories