
అనసూయ చివరగా `పుష్ప 2`లో నటించి పెద్ద హిట్ అందుకుంది. ఆ మధ్య `హరి హర వీరమల్లు`లో కేవలం పాటలోనే మెరిసింది. ఇప్పుడు ఆమె `అరి` మూవీతో వచ్చింది. చాలా రోజుల వాయిదా అనంతరం ఈ చిత్రం ఎట్టకేలకు నేడు శుక్రవారం(అక్టోబర్ 10)న విడుదలైంది. ఇందులో అనసూయతోపాటు వినోద్ వర్మ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రలు పోషించారు. `పేపర్ బాయ్` దర్శకుడు జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీ కోసం ఆయన ఎంతో శ్రమించారు. హిమాలయాలకు కూడా వెళ్లారు. మరి ఇందులో తన అనుభవాలను ఏం జోడించారనేది ఆసక్తికరం. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనసూయకి, దర్శకుడు జయశంకర్ కి హిట్ ఇచ్చిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమాని ప్రసాద్ ఐమాక్స్ లో తిలకించాను. చిన్న సినిమా కావడంతో పెద్దగా సందడి కనిపించలేదు. మరి సినిమా చూశాక ఎలా అనిపించిందనేది చూస్తే.
`మీ కోరికలు తీర్చబడను` అనే యాడ్ ఆరుగురు విభిన్న నేపథ్యాలకు చెందిన మనుషులను ఆకర్షిస్తుంది. అందులో హోటల్‌లో పనిచేసే అముల్(వైవా హర్ష)కి సన్నీలియోన్ అంటే పిచ్చి. ఒక రాత్రి ఆమెతో గడపాలనుకుంటాడు. అందుకోసం యాడ్ చూసి ఓయూ లైబ్రరీలో ఉన్న మిస్టరీ బిగ్ బాస్(వినోద్ వర్మ) వద్దకు వస్తాడు. తన కోరిక చెప్పగా, ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే నీ కోరిక తీరుతుందని చెబుతాడు. ఆ పనిలో అముల్ ఉంటాడు. అలా సీఐ చైతన్య(శ్రీకాంత్ అయ్యంగార్) నిధి కోసం వస్తాడు. అతనికి ఒక టాస్క్ ఇస్తాడు. ఆ తర్వాత వ్యాపారి గుంజన్(శుభలేఖ సుధాకర్) తన ఫ్యామిలీకి చెందిన ఆస్తి మొత్తం తనకే దక్కాలనే కోరికతో వస్తాడు. ఆయనకు ఓ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత అత్యంత సంపన్నుడిగా ఫోర్బ్స్ లో వరుసగా పది సార్లు స్థానం సంపాదించిన విప్ర నారాయణ పాశ్వాన్(సాయికుమార్) తనలాగే తన వారసులు కూడా సంపన్నులుగా ఉండాలి, వారికి ఎలాంటి కష్టం రాకూడదనే కోరికతో వస్తాడు. ఆయనకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తాడు. ఎయిర్ హోస్టెస్‌గా చేసే ఆత్రేయి(అనసూయ) తన కొలిగ్ తనకంటే అందంగా ఉందని, ఆమె కంటే తనే అందంగా కనిపించాలనే కోరికతో వస్తుంది. ఆమెకి మరో టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఇక తనని ఎంతో ప్రేమించిన భర్త చనిపోవడంతో ఒంటరైన లక్ష్మి(సురభి ప్రభావతి) తన భర్తని తిరిగి బతికించమనే కోరికతో వస్తుంది. ఆమెకి షాకిచ్చే టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. మరి వీరికి బిగ్ బాస్ ఇచ్చిన కఠినమైన టాస్క్ లేంటి? వాటిని వాళ్లు పూర్తి చేశారా? వారు కోరుకున్న కోరికలు తీరాయా? ఇంతకి బిగ్ బాస్ ఎవరు? ఆయన ఎందుకు టాస్క్ లు ఇస్తున్నాడు? చివరికి ఈ ఆరుగురిలో వచ్చిన మార్పేంటి? అనేది మిగిలిన కథ.
మనుషుల్లోని క్రోధం, అహం, మోహం, లోభం, అసూయ ( క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యం) అనే ఆరు కోరికలను(అరిషడ్వర్గాలు) ప్రధానంగా చేసుకుని, అవి మనిషిని ఎలా ముర్ఖులుగా తయారు చేస్తాయి? మనిషిని దిగజార్చి పతనానికి కారణమవుతాయనేది ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు జయశంకర్. భగవద్గీతని, హిందూ శాస్త్రాలను అనుసరించి ఈ కథని తయారు చేశారు. తెలుగు సినిమాల్లోనే ఇదొక కొత్త తరహా ప్రయత్నమని చెప్పొచ్చు. కాన్సెప్ట్ ప్రకారం దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. దాన్ని రియాలిటీకి దగ్గరగా చెప్పిన తీరు బాగుంది. విభిన్న నేపథ్యాలకు చెందిన ఆరుగురు వ్యక్తులను తీసుకుని, వారి కోరికలను అనుసరించి, వారి ప్రయాణాన్ని ప్రధానంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు. దీంతో ప్రారంభం నుంచి ఆసక్తిని క్రియేట్ చేశారు. ఆరుగురు వ్యక్తులు, ఆరు కోరికలతో బిగ్ బాస్ వద్దకు రావడం ఆయన ఊహించని టాస్క్ లు ఇవ్వడం అనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక్కో మనిషిలోని అసాధారణమైన కోరికలను వెల్లడించిన తీరు బాగుంది. అంతేకాదు ఈ ఆరు కథలకు అంతర్జీనంగా ఒకరికి తెలియకుండా మరొకరి కథకి లింక్ చేస్తూ నడిపించిన తీరు కూడా అదిరిపోయింది. ఆద్యంతం ట్విస్ట్ లతో ఈ సినిమాని నడిపించే ప్రయత్నం చేశారు. మొదటి భాగం మొత్తం ఆరుగురు వ్యక్తుల సమస్యలను, కోరికలను వినడం, వారికి టాస్క్ లు ఇవ్వడం, అందుకోసం వాళ్లు ప్రయత్నాలు చేయడం, కొందరు తిరస్కరించడం, ఆ తర్వాత మళ్లీ చేసేందుకు సిద్ధపడటంతో సాగుతుంది. ఇక రెండో భాగంలోనూ వాళ్లు తమ ప్రయత్నాలు చేయడం, ఈక్రమంలో వాళ్ల అనుభవాలను చూపించారు. క్లైమాక్స్ లో వాళ్లు తెలుసుకున్న విషయాలను, వారిలోని రియలైజేషన్‌ని ఆవిష్కరించారు.
సినిమా స్లోగా సాగుతుంది. మొదటి భాగంలో ఒకే అంశం రిపీట్‌గా అనిపిస్తుంది. ఇది కొంత స్లో ఫీలింగ్ కలిగిస్తుంది. రొటీన్ అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదో ఉందని, ఇంకేదో చెప్పబోతున్నారనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. సెకండాఫ్ లో టాస్క్ ల రిఫ్లెక్షన్ చూపించారు. దీంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆయా అంశాలు ఎంగేజింగ్‌గా ఉంటాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా మారుతుంది. మనిషిలోని మార్పులు, చూసిన పరిస్థితుల కారణంగా వచ్చే అనుభవాలు, అందులోని మార్పులు, రియలైజేషన్‌ని చూపించిన తీరు బాగుంది. లాస్ట్ 20 నిమిషాలు ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుంది. రియలైజేషన్ హత్తుకునేలా ఉంటుంది. కళ్లు తెరిపించేలా ఉంటుంది. జీవితం అంటే ఏంటో చూపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎండింగ్‌లో గూస్ బంమ్స్ తెప్పించే సీన్లు బాగున్నాయి. బిగ్ బాస్ ఎవరో చెప్పే సీన్లు అదిరిపోతాయి. అదే సినిమాకి పెద్ద అసెట్‌గా చెప్పొచ్చు. కాకపోతే ప్రారంభం నుంచి ఎంగేజింగ్‌గా, ట్విస్ట్ లు, టర్న్ లతో సినిమాని నడిపిస్తే ఇంకా బాగుండేది. ఎమోషన్స్ ని బలంగా చూపించాల్సింది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. ఇది హీరో ఓరియెంటెడ్ మూవీ కాదు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. మైథాలజీ అంశాలకు, సైకాలజీ అంశాలు మేళవించిన చిత్రం. ఆ విషయంలో మంచి ప్రయోగాత్మక మూవీ అవుతుందని చెప్పొచ్చు.
బిగ్ బాస్ పాత్రలో వినోద్ వర్మ చాలా బాగా నటించాడు. సెటిల్డ్ గా నటించి ఆకట్టుకున్నారు. ఆ పాత్రకి ఆయన బాగా సెట్ అయ్యారు కూడా. ఇక ఆత్రేయి పాత్రలో అనసూయ కనిపించిన కాసేపు అలరించింది. పాత్రలో జీవించింది. మరోవైపు సినిమాలో ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ ఉందంటే అది వైవా హర్ష పాత్రనే. తన బెస్ట్ ఇచ్చాడు. సీరియస్‌గా సాగుతున్న సినిమాలో మధ్య మధ్యలో నవ్వులు పూయించారు. మరోవైపు బిలియనీర్‌గా సాయి కుమార్ పాత్ర సైతం ఆకట్టుకుంది. ఆయన పాత్రలోని రియలైజేషన్ ఆకట్టుకుంటుంది. ఆయన తన పాత్రలో ఒదిగిపోయారు. సీఐగా శ్రీకాంత్ అయ్యంగార్ జస్ట్ ఓకే అనిపించాడు. భర్త కోసం తపించే లక్ష్మీ పాత్రలో సురభి ప్రభావతి ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. అలాగే గుంజన్ పాత్రలో శుభలేఖ సుధాకర్ పాత్ర ఆలోచింప చేస్తుంది. ఎమోషనల్‌గానూ ఆకట్టుకుంటుంది. మిగిలిన ఆర్టిస్ట్ లు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఎంగేజ్ చేసింది. చాలా రోజుల తర్వాత అనూప్ మెప్పించారు. జి అవినాష్ ఎడిటింగ్ ఓకే అని చెప్పొచ్చు. కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్ కెమెరా వర్క్ రిచ్‌గా ఉంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలకు కొడవలేదు. ఇక దర్శకుడు జయశంకర్ మంచి కాన్సెప్్ట తో మూవీని తెరకెక్కించారు. ఆయన చెప్పాలనుకున్న విషయం చాలా బాగుంది. గొప్ప ప్రయత్నంగా చెప్పొచ్చు. అయితే దీన్ని సీరియస్‌గా కాకుండా ఇంకాస్త ఎంటర్‌టైనింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చెబితే బాగుండేది. ఎమోషన్స్ పై మరింత వర్క్ చేస్తే సినిమా అదిరిపోయేది.
ఫైనల్ నోట్‌ః సైకాలజీ, మైథాలజీ అంశాలు మేళవించిన మంచి ప్రయత్నం `అరి`. ఈ కళియుగంలో అందరు తెలుసుకోవాల్సిన మంచి కాన్సెప్ట్.
రేటింగ్‌ః 2.75