
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హీరోగా సినిమాలు చేస్తున్నారు, కానీ ఆయనకు సరైన బ్రేక్ ఇచ్చే మూవీ పడటం లేదు. హిట్ పడి కూడా చాలా కాలం అవుతుంది. ఈ క్రమంలో తన రూట్ మార్చి ఇప్పుడు `శంబాల` అనే చిత్రంలో నటించారు. ఇందులో అర్చన్ అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, లక్ష్మణ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ పతాకంపై అన్నమోజు రాజశేఖర్, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంది. దీంతో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. క్రిస్మస్ కానుకగా గురువారం(డిసెంబర్ 25న) విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? ఆదికి బ్రేక్ ఇచ్చిందా? అనేది రివ్యూలో చూద్దాం.
శంబాల అనే ఊరిలో ఓ రోజు రాత్రి ఉల్క వచ్చిపడుతుంది. ఆ దెబ్బతో ఊరిలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాములు(రవి వర్మ) ఇంటిని ఏదో శక్తి ఆవహిస్తుంది. అతని ఆవు ఇచ్చే పాలు రక్తం మాదిరిగా ఉంటాయి. ఆ ఊరిలో అనేక అపశకునాలు చోటు చేసుకుంటాయి. అయితే సైంటిస్ట్ లకు ఈ విషయం తెలిస్తుంది. ఆ ఉల్క రాయి ఏంటి? దాని ప్రభావం ఎలా ఉందనేది తెలుసుకునేందుకు సైంటిస్ట్ విక్రమ్(ఆది సాయికుమార్) ఆ ఊరికి వస్తాడు. అదే సమయంలో రాములు ఆవుని దెయ్యం శక్తి పట్టిందని, దాన్ని చంపేయాలని చెబుతాడు స్వామిజీ. ఆయన ఆదేశాలు, సర్పంచ్‌లో ఆదేశాల మేరకు ఆవుని చంపేయాలని నిర్ణయంచుకుంటారు. కానీ రాములు తల్లి దాన్ని సేవ్ చేస్తుంది. అయినా వెంబడిస్తారు. అంతలోనే విక్రమ్ అది చూసి ఆవుని రక్షిస్తాడు. అనంతరం ఉల్కని టెస్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఊర్లో వింతలు జరుగుతుంటాయి. రాములు చాలా మందిని చంపేసి తాను చనిపోతాడు. ఆ తర్వాత కృష్ణ(లక్ష్మణ్)ని ఆ శక్తి ఆవహిస్తుంది. మెడలో ఒక పురుగులా అది తిరుగుతుంటుంది. తమ కోరికలు తీర్చుకున్నాక, ఆ మనిషి చనిపోయేలా చేస్తుంది. అది వేరే మనిషిలోకి వెళ్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఊరు మొత్తం వల్లకాడు అవుతుందని భావించి దాన్ని అంతం చేయాలని విక్రమ్‌తోపాటు ఊరు ప్రజలు అనుకుంటారు. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేశారు? దాన్ని విక్రమ్ ఎలా ఎదుర్కొన్నారు? ఇందులో అర్చన పాత్ర ఏంటి? ఈ అసుర శక్తివెనుక ఉన్న కథేంటి? శివుడికి ఈ కథకి ఉన్న లింకేంటి? అనేది మిగిలిన సినిమా.
ఇటీవల కాలంలో సూపర్ నేచురల్ అంశాలకు, హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్లని జోడించి అదిరిపోయే సినిమాలను రూపొందిస్తున్నారు మేకర్స్. అది ఇప్పుడు సక్సెస్ ఫార్మూలాగా మారింది. ఆ మధ్య `విరూపాక్ష` మూవీ కూడా ఇలాంటి కథాంశంతోనే రూపొంది విజయం సాధించింది. ఇప్పుడు `శంబాల` కూడా కాస్త ఆ జోనర్‌లోనే సాగడం విశేషం. దాన్ని మించిన కథ, కథనాలు ఇందులో ఉన్నాయి. ట్విస్ట్ లు, సస్పెన్స్ లు చాలా ఉన్నాయి. హర్రర్ ఎలిమెంట్లు వాహ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇలా అన్ని జోనర్స్ ని మేళవించారు. కాకపోతే హర్రర్, కామెడీ ఎలిమెంట్ల ప్రయారిటీ ఇచ్చారు. ట్విస్ట్ లతో పిచ్చెక్కించారు. ఫస్టాఫ్‌లో సినిమా కథ ఉల్క చుట్టూ తిరుగుతుంది. ఉల్కా పడ్డాక ఊర్లో భయాందోళనలు పెరిగిపోతాయి. ఆ బండ బూతం వల్లే ఇదంతా అని అంతా నమ్ముతుంటారు. రాములు ఆవు రక్తం పాలు ఇవ్వడంతో దానికి దెయ్యం పట్టిందని, దాన్ని చంపేయాలని స్వామిజీ చెబుతాడు. కానీ అవును చంపకుండా విక్రమ్ అడ్డుకుంటారు. దీంతో వారంతా విక్రమ్‌పై కోపం పెంచుకుంటారు. మరోవైపు ఈ బ్యాడ్ స్పిరిట్‌కి కారణం ఏంటి? ఉల్కాలో ఏముందనేది విక్రమ్ పరిశోధన చేస్తుంటాడు. ఇందులో పలు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అదే సమయంలో రాములు మెడలో పురుగు పుట్టి అది ఆయన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఆయన్ని హేళన చేసిన ఆరుగురుని చంపేస్తాడు. ఆ తర్వాత ఆయన చనిపోవడం అంతా ఆశ్చర్యంగా మారుతుంది. ఆయన్నుంచి కృష్ణకి ఆ పురుగు రావడం, అతను ఓ లేడీపై కన్నుపడటం ఆమెని అనుభవించాలని ఆయన తపించడం, అనంతరం ఆమెని చంపేసి ఆయన కూడా చనిపోవడం, ఈ క్రమంలో చోటు చేసుకునే సస్పెన్స్ అంశాలు వాహ్ అనిపిస్తాయి. అదే సమయంలో నవ్వులు పూయిస్తుంది. ఇక్కడ హర్రర్ కామెడీని యాడ్ చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. గూస్ బంమ్స్ తెప్పిస్తుంది. ఆ పురుగు ఒకరి తర్వాత మరొకరిని పట్టి ఊర్లో వరుస చావులకు కారణమవుతుంది. దాన్ని అడ్డుకునేందుకు విక్రమ్, అటు ఊరు ప్రజలు, స్వామిజీ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వరుసగా జరుగుతూనే ఉంటాయి. సెకండాఫ్‌లో క్లైమాక్స్ వరకు ఇదే నడుస్తోంది. అయితే ఆ పురుగు ఎవరిలోకి వచ్చిందనేది కనిపెట్టే క్రమంలో చోటు చేసుకునే అంశాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. క్షణక్షణం టెన్షన్‌లా సాగుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్లు మతిపోయేలా ఉన్నాయి. క్లైమాక్స్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. చిన్న పాపకి సంబంధించిన సీన్లతో అందరి హృదయాలను బరువెక్కించారు. అదే సమయంలో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. సెకండాఫ్ అన్ని ప్రశ్నలకు, అన్ని సస్పెన్స్ అంశాలకు సమాధానంగా ఉంటుంది. చివరి పదిహేను, ఇరవై నిమిషాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి.
సినిమాకి కథ పెద్ద ప్లస్. ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరపై అంతే బాగా ఆవిష్కరించారు. డైరెక్షన్ అదిరిపోయింది. బీజీఎం సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచింది. భయపెట్టించడంలో, పూనకాలు తెప్పించడంలో దాని పాత్ర ఎంతో ఉంది. నటీనటుల నటన, కామెడీ, హర్రర్ ఎలిమెంట్లు, ట్విస్ట్ లు, క్లైమాక్స్, సాయికుమార్ వాయిస్ ఓవర్ మరో బలం. ఆయన ఈ కథకి మూలం ఏంటనేది చెప్పిన తీరు, దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అదిరిపోయింది. ఆదికి చాలా రోజులుగా హిట్ లేదు. కానీ ఇది ఆయన కెరీర్‌లో మరో స్థాయికి తీసుకెళ్లే మూవీ అవుతుంది. బిగ్ బ్రేక్ ఇచ్చే చిత్రమవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
మైనస్‌ల విషయానికి వస్తే, కొన్ని లాజిక్‌కి అందని అంశాలున్నాయి. దేవత ఆది వెంటనే ఉంటుంది. కానీ ఆమె ఏం చేయకుండా ఎందుకు ఉందనేది క్లారిటీ లేదు. సెకండాఫ్‌లో సేమ్ సీన్లు రిపీట్ అవుతుంటాయి. ఏదైనా టర్న్ తిప్పాల్సింది. ఆది పరిశోధనకు సంబంధించిన కొన్ని సీన్లు అసహజంగా ఉన్నాయి.
సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో ఆది సాయికుమార్ నటించారు. ఆయన చాలా సెటిల్డ్ గా చేశాడు. నటుడిగా తన బెస్ట్ ఇచ్చాడు. యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టాడు. మాస్ హీరో రేంజ్‌లో రెచ్చిపోయి చేశాడు. ఆయన్ని ఈ సినిమా వేరే స్థాయికి తీసుకెళ్తుంది. అదే సమయంలో తనలోని కొత్త షేడ్‌ని ఆవిష్కరించిన మూవీ అవుతుంది. తనతోపాటు ఇతర బలమైన పాత్రలు ఉన్నా, వారిని డామినేట్ చేసేలా ఆది నటన ఉండటం విశేషం. ఇక రాములు పాత్రలో రవివర్మ అదరగొట్టాడు. అతనిలోనూ కొత్త షేడ్‌ని చూడొచ్చు. కృష్ణ పాత్రలో లక్ష్మణ్ మరోసారి రెచ్చిపోయాడు. కామెడీతో, హర్రర్ ఎలిమెంట్లతో అల్లాడించాడు. కానిస్టేబుల్‌గా మధునందన్ కి మరోసారి బలమైన పాత్ర పడింది. తను కూడా అంతే బాగా చేశాడు. దేవతగా అర్చన చాలా మెప్పించింది. లక్ష్మణ్ అల్లాడించాడు. నవ్వులు పంచాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం పెద్ద అసెట్. ఆయన బీజీఎంతో భయటపెట్టించారు. పూనకాలు తెప్పించారు. ప్రవీణ్ కె బంగారి కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. శ్రీవణ్ కటికనేని ఎడిటింగ్ ఫర్వాలేదు. నీట్‌గా కట్ చేశారు. నిర్మాతలు రాజశేఖర్, మహీధర్ రెడ్డి సినిమాని రాజీపడకుండా నిర్మించారు. వారి ప్యాషన్ కనిపిస్తుంది. ఇక దర్శకుడు యుగంధర్ ముని ఎంచుకున్న కథ అదిరిపోయింది. దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు కూడా అంతే బాగుంది. చాలా కొత్తగా ఉంది. ఇలాంటి సినిమాలు ఇటీవల కాలంలో చాలా వస్తున్నా, వాటికి భిన్నంగా ఉంది. చాలా మంది దీన్ని `విరూపాక్ష`తో పోల్చుతున్నా, దానికి చాలా బెటర్‌గా ఉంది. రైటింగ్ పరంగా చాలా హార్డ్ వర్క్ కనిపిస్తోంది. కొత్తదనం కనిపిస్తోంది. సాలిడ్ కంటెంట్‌ని ఆవిష్కరించారు. ముఖ్యంగా హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్లని మేళవిస్తూ తెరకెక్కించిన తీరు బాగుంది. డైరెక్షన్ ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్. దానికి నటీనటుల నటన, బీజీఎం తోడయ్యింది. ఈ క్రిస్మస్ మూవీస్‌లో ఇది ఓ మెట్టు పైనే ఉంటుందని చెప్పొచ్చు.
భయపెట్టిస్తూ, నవ్విస్తూ, భావోద్వేగానికి గురి చేస్తూ, థ్రిల్‌తో కట్టిపడేసే హర్రర్, థ్రిల్లర్ మూవీ `శంబాల`. ఆది సాయికుమార్ కెరీర్‌ని మలుపు తిప్పే మూవీ అవుతుంది.
రేటింగ్ : 3