
తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుత చిత్రాలు సందడి చేశాయి. వాటిలో పాటలు, సాహిత్యం, సంగీతానికి పెద్ద పీట వేసిన సినిమా గా మల్లీశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్, భానుమతి కాంబినేషన్ లో బీఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన సినిమా ఇది. వాహినీ వారి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం 1951 డిసెంబర్ 20న విడుదలై అద్భుత విజయం సాధించింది. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమాల ధోరణిని మార్చేసింది సినిమా. చరిత్రలో నిలిచిపోయింది. మహానటుడు ఎన్టీఆర్, మహానటి భానుమతి నటనావైభవానికి మచ్చుతునకగా మల్లీశ్వరి నిలిచింది
ఈసినిమా కథ శ్రీకృష్ణదేవరాయలు హంపిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలంలో స్టార్ట్ అవుతుంది. ఆయన రాజ్యంలో వీరాపురం అనే గ్రామంలో పద్మశాలీయులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దుస్తులు నేయడంలో, శిల్పాలు చెక్కడంలో, ఆటపాటల్లో ఆ గ్రామ ప్రజలకు తిరుగు ఉండదు. అలాంటి కుటుంబాల్లో జన్మించినవారే నాగరాజు(ఎన్టీరామారవు), మల్లీశ్వరి( భానుమతి). నాగరాజు మేమమామ కూతురు మల్లీశ్వరి. చిన్నతనం నుంచే వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరుగుతారు. ఊరి దేవాలయ ఆవరణలో ఆడుకుంటూ, పాడుకుంటూ.. బాల్యాన్ని గుడుపుతారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకుంటారు.
అయితే వీరి ప్రేమకు పేదరికం అడ్డొస్తుంది.. వీరి ప్రేమకథలో మెయిన్ విలన్ మల్లీశ్వరి తల్లి(ఋష్యేంద్రమణి). నాగరాజు లాంటి పేదవాడు తన కూతురికి సరిపోడన్న ఃఅభిప్రాయంలో ఉంటుంది. మల్లీశ్వరినికి రాజయోగం కల్పించాలని ఆశపడుతూ ఉంటుంది. అప్పటి సంప్రదాయం ప్రకారం కళల్లో నైపుణ్యం ఉన్న అందగత్తెలను రాజులు తమ వినోదం కోసం రాణివాసానికి పిలిపించేవారు. ఒకసారి రాణివాసంలోకి వెళ్లిన అమ్మాయిలకు బయట ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. నాగరాజు, మల్లీశ్వరి పెద్దయ్యాక కూడా తమ అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఓసారి ఇద్దరూ కలిసి ఎడ్లబండిపై సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం కారణంగా ఓ సత్రంలో తలదాచుకుంటారు. అదే సమయంలో మారువేషాల్లో వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు, కవి పెద్దన కూడా అక్కడే ఆశ్రయం పొందుతారు. మల్లీశ్వరి నాట్యం వీరిని ఆకట్టుకుంటుంది. సరదాగా నాగరాజును రాణివాసానికి పంపమని చెప్పి వారు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఈ సంఘటనల తరువాత మల్లీశ్వరి తల్లి ఆగ్రహంతో నాగరాజును దూరం చేస్తుంది. తనను తాను నిరూపించుకోవాలని నాగరాజు సంపాదన కోసం బయలుదేరుతాడు. ఈ లోగా మల్లీశ్వరి రాణివాసానికి వెళ్లాల్సి వస్తుంది. తిరిగి వచ్చిన నాగరాజు ఈ విషయం తెలుసుకుని విరహంతో దేశం విడిచి తిరుగుతాడు. శిల్పకళలో తన ప్రతిభతో పేరు సంపాదిస్తాడు.శ్రీకృష్ణదేవరాయలు వసంతమండపం నిర్మాణానికి ప్రధాన శిల్పిని నియమించాని రాయలు అనుకున్న సందర్భంలో నాగరాజు గురించి వారికి తెలుస్తుంది. అప్పుడు నాగారాజును పిలిచి ఆ పని అప్పగిస్తారు. అయితే అతను చెక్కిన ఆ శిల్పాల్లో మల్లీశ్వరి పోలికలు ఉన్నాయని తెలుసుకున్న మల్లీశ్వరి, నాగరాజును రహస్యంగా కలుస్తుంది. కానీ పరిస్థితుల వల్ల ఇద్దరూ రాజభటుల చేతిలో పడతారు. చివరకు రాణి తిరుమలాంబ మధ్యవర్తిత్వంతో నిజం తెలిసిన రాయలు, వీరిద్దరి ప్రేమ త్యాగాలను గుర్తించి క్షమిస్తారు. ఈ కథలో ఎన్నో మలుపులు, ఎమోషనల్ మూమెంట్స్ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి.
1939లోనే ఈసినిమాకు అంకురార్పణ జరిగింది. ఓ సినిమా షూటింగ్ కోసం హంపీకి వెళ్లారు బి.ఎన్. రెడ్డి . అక్కడి విరూపాక్ష స్వామి ఆలయంలో దర్శనం చేసుకుంటూ ఉండగా ఆయన మదిలో ఓ ఆలోచన మెదిలింది. అదే ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎప్పుడో ప్రార్థించి ఉంటారన్న భావన ఆయనను కదిలించింది. ఆ క్షణం నుంచే కృష్ణదేవరాయల పాలన నేపథ్యంలో ఓ సినిమా తీయాలన్న ఆలోచన బి.ఎన్. రెడ్డిలో పుట్టింది. మద్రాసు తిరిగొచ్చిన తర్వాత ఆయన తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. సరిగ్గా అప్పుడే ఓ వీక్లీలో బుచ్చిబాబు రచించిన రాయని కరుణకృత్యం కథ ఆయన కంట్లో పడింది. బాగా నచ్చింది కూడా. దానితో పాటు గే దేవన్ శబ్దార్ రాసిన ది స్లీప్ గర్ల్ అనే చిన్న కథ కూడా బీ.ఎన్. రెడ్డికి నచ్చింది. ఈ రెండు కథలలో సోల్ ను తీసుకుని.. మల్లీశ్వరి కథను రూపొందించారు స్టార్ డైరెక్టర్.
మనసులో లైన్ అయితే అనుకున్నారు కానీ.. దాన్ని సరిగ్గా పేపర్ మీద పెట్టేవారి కోసం చూశారు. అప్పుడే ఆయనకు దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి గుర్తుకు వచ్చారు. వెంటనే ఏం ఆలోచించకుండా.. ఈసినిమాకు రచయితగా ఆయనను తీసుకోవాలని బి.ఎన్. రెడ్డి నిర్ణయించారు. కానీ సినిమా రంగంలోకి రావడానికి దేవులపల్లి అంత ఆసక్తి చూపకపోయినా, మల్లీశ్వరి కథ విన్న తర్వాత మాత్రం ఈ సినిమాకు పనిచేయడానికి ఆయన ఒప్పుకున్నారు. దేవులపల్లి రచనలో ఈసినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. భాషను, భావోద్వేగాలను దేవులపల్లి తన కలంతో అద్భుతంగా ఆవిష్కరించారు. కథతో పాటు పాటలు కూడా ఆయనే రాశారు.
మల్లీశ్వరి సినిమాల్ 17 పాటలు ఉంటే.. వాటిలో 15 పాటలు దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి రాశారు. ఈసినిమాలో పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. కృష్ణశాస్త్రి సాహిత్యానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతం మరింత ప్రాణం పోసింది. ఈ సినిమాలో ‘నెలరాజు వెన్నెల రాజా’ ‘మనసున మల్లెల మాలలూగెనే’, , ‘అవునా నిజమేనా’ వంటి పాటలు సంగీతప్రియులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.
మల్లీశ్వరి పాత్రకు భానుమతిని ఎంపిక చేయడంలో బి.ఎన్. రెడ్డికి ఎలాంటి సందేహం లేదు. ఆమె నటన ఈ పాత్రకు ప్రాణం పోసింది. నాగరాజు పాత్రకు మొదటి నుంచే యన్టీఆర్‌ను మనసులో పెట్టుకున్నారట రెడ్డి. విజయా సంస్థతో ఉన్న ఒప్పందాల కారణంగా ఎలాంటి ఆటంకం లేకుండా యన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు. కీలక పాత్రల్లో టి.జి. కమలాదేవి, శ్రీవాత్సవ, న్యాపతి రాఘపరావు తదితరులు నటించారు. చిన్ననాటి నాగరాజు, మల్లీశ్వరి పాత్రల్లో మాస్టర్ వెంకటరమణ, బేబీ మల్లిక కనిపించారు. అందరు నటనలో ఆరితేరినవారు కావడంతో.. ఎవరు ఎక్కడా తగ్గలేదు. ఒకరిని మించి మరొకరు.. పోటీ పడి మరీ నటించి మెప్పించారు.
మల్లీశ్వరి సినిమా 1951 డిసెంబర్ 20న రిరీజ్ అయ్యింది. ఈమూవీ విడుదలై 74 ఏళ్లు పూర్తి అయ్యాయి. అప్పట్లో ఈసినిమా 13 కేంద్రాలలో 71 రోజులు ఏకధాటిగా ఆడేసింది. అంతే కాదు ది. చైనాలో సబ్‌టైటిల్స్‌తో రిలీజ్ అయ్యి.. అక్కడ కూడా వంద రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా మల్లీశ్వరి రికార్డు క్రియేట్ చేసింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ మల్లీశ్వరి ప్రదర్శితమై దేశవిదేశీయుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈసినిమా ఇప్పటి ప్రేక్షకులను కూడా అలరించగలదు. మల్లీశ్వరి సినిమాను చూడాలి అనుకుంటే యూబ్యూబ్ లో అందుబాటులో ఉంది.