కామెడీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అభయ్ నవీన్. `పెళ్లి చూపులు` చిత్రంతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత `గీతగోవిందం`, `డిస్కోరాజా` చిత్రాలతో నటుడిగా మెప్పించాడు. ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాడు. `రామన్న యూత్` పేరుతో సినిమాని తెరకెక్కించాడు. ఇందులో తనే మెయిన్ లీడ్‌గా చేస్తున్నాడు. తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన సినిమా ఇది. నేడు శుక్రవారం(సెప్టెంబర్ 15న) సినిమా విడుదలైంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన మరో సినిమా ఇది, ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
రాజు(అభయ్ నవీన్) సిద్ధిపేట జిల్లా ఆంక్షాపూర్ గ్రామానికి చెందిన యువకుడు. రాజకీయాలంటే పిచ్చి. ఇద్దరు ముగ్గురు తన ఫ్రెండ్స్ తన వెంట తిప్పుకుంటూ బలాదూర్ తిరుగుతుంటాడు. ఎమ్మెల్యే రామన్న(శ్రీకాంత్ అయ్యంగార్) అంటే ఇష్టం. ఆయన దృష్టిలో పడాలి, ఎప్పుడైనా పెద్ద లీడర్ కావాలని కలలు కంటుంటాడు. ఎమ్మెల్యే మెప్పు పొందేందుకు, ఊర్లో తానేంటో తెలిసేందుకు దసరా పండక్కి ఫ్లెక్సీ కొట్టిస్తాడు. అందులో ఎమ్మెల్యేతోపాటు ఆయనకి క్లోజ్‌గా ఉండే అనిల్ (తాగుబోతు రమేష్) ఫోటో, అలాగే తనది, తన ఫ్రెండ్స్ ఫోటోలు ప్రింట్ చేయిస్తాడు. అందులో అనిల్ తమ్ముడు మహిపాల్(టాక్సీవాలా విష్ణు) ఫోటో వేయించరు. దీంతో అతని ఈగో దెబ్బతింటుంది. అందుకు చిచ్చుపెట్టే ప్లాన్ చేస్తాడు. అడక్కుండా ఫ్లెక్సీ కొట్టించినందుకు అనిల్ అన్న హర్ట్ అయ్యిండని అబద్దాలు చెప్పి రాజు అండ్ టీమ్ చందు, రమేష్, బాలులను రెచ్చగొడతాడు. దసర పండుగ రోజు పెద్ద గొడవ అవుతుంది. అనిల్ అన్న హెల్ప్ లేకుండానే రామన్నని కలుస్తాం, తామేంటో నిరూపించుకుంటామని వెళ్తారు? మరి రామన్నని కలిశారా? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? మహిపాల్ పెట్టిన చిచ్చు ఊరిని ఎంతటి గందరగోళానికి దారి తీసింది? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో గ్రామాల్లో చోటు చేసుకునే సంఘటనలతో పుట్టే కామెడీని ప్రధానంగా చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు నేటి మేకర్స్. తెలంగాణ యాస, నేపథ్యాలు బాగా వర్కౌట్ అవుతున్న నేపథ్యంలో అలాంటి కథలతోనే వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. చాలా వరకు ఆదరణ పొందుతున్నాయి. `జాతిరత్నాలు`, `బలగం`, `దసరా`, `మేమ్ ఫేమస్`, `పరేషాన్` చిత్రాలే అందుకు నిదర్శనం. ఇప్పుడు అభయ్ నవీన్ కూడా తెలంగాణ పల్లెటూరులోని కుర్రాళ్ల పోకడలను, రాజకీయాలను ఇతివృత్తంగా తీసుకుని `రామన్న యూత్` చిత్రాన్ని తెరకెక్కించాడు. ఊర్లో పోరగాళ్ల మధ్య జరిగే గొడవలు, ఈగోలు, పాలిటిక్స్, ఫన్నీ సంఘటలని హైలైట్‌గా చేస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.
`రామన్న యూత్` మూవీ కూడా కొంత `జాతిరత్నాలు`, `మేమ్ ఫేమస్` ఫ్లేవర్‌లో సాగుతుంది. ఆయా సినిమాల తరహాలోనే ఊర్లో పొరగాళ్ల మధ్య స్నేహాన్ని, తాగుడు, తినే సమయంలో మాట్లాడుకునే మాటలు, వాళ్లు చేసుకునే ఛాలెంజ్‌లు ఫన్నీవేలో రాసుకున్నాడు. అయితే ఆ సినిమాల రేంజ్‌లో మాత్రం ఆ ఫన్ వర్కౌట్ కాలేదు. కాకపోతే ఈ సినిమాలోని సంఘటనలు కొంత డిఫరెంట్‌గా ఉంటాయి. సినిమా మొత్తం ఫ్లెక్సీ చుట్టే తిరుగుతుంది. అందులో తన ఫోటో వేయలేదని ఒకడి ఈగో దెబ్బతింటే వాడు సృష్టించిన గొడవలు, రెచ్చగొట్టిన తీరు ముగ్గురు పోరగాళ్ల జీవితాన్ని ఆగం పట్టించడం, ఈ క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాలు ఆసక్తికరంగా, కొంత ఫన్నీగా సాగుతాయి. మొదటి భాగం మొత్తం ఊర్లో అల్లరి చిల్లరి సన్నివేశాలు, తెలంగాణ పల్లెల్లో దసరా పండుగ రోజు ఏం చేస్తారు, ఎలా సెలబ్రేట్ చేస్తారనేది ఫోకస్ పెట్టాడు. అక్కడ నెటివిటీ అంశాలను హైలైట్ చేశారు. అవి ఇక్కడి ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.
సెకండాఫ్‌లో మహిపాల్ పాత్రతో రాజు పాత్ర చేసే ఛాలెంజ్‌లు, రామన్నని కలిసేందుకు వీళ్లు సుమోలో వెళ్లడం,ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు, ఫేస్ చేసే అడ్డంకులు కొంత ఫన్నీగా, మరికొంత సీరియస్‌గా మారుతాయి. సెకండాఫ్ సీరియస్ జోన్‌లోకి వెళ్లడంతో ఫన్ తగ్గిపోతుంది. అది కాస్త బోర్ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. కానీ క్లైమాక్స్ సీరియస్‌గా మార్చి, కథలో అసలు పాయింట్‌ని, రాజకీయ నాయకుల అసలు రూపాలను, వాస్తవంగా ఊర్లో జరిగే సంఘటనలను అంతే యదార్థంగా చూపించడం ఆకట్టుకుంటుంది. అందరిని ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప చేస్తుంది. చివరగా రాజకీయ నాయకులు కార్యకర్తలను, ప్రజలను ఎలా ఆడుకుంటారో, వాడుకుంటారో చూపించిన తీరు బాగుంది. ఓ ఫన్నీ వేలో రాజకీయ నాయకుల అసలు రూపాలను బయటపెట్టడంతోపాటు వారితో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి నాయకుడితో మనం తిరుగుతున్నామో ముఖ్యమని చెప్పిన తీరు ఆలోచింప చేసేలా ఉంది.
ఆర్టిస్టులు..
సినిమా మొత్తం అభయ్ నవీన్, అతని ఫ్రెండ్స్ గా చేసిన జగన్ యోగిబాబు, బన్నీ అభిరామ్, అనిల్ గీలా, టాక్సీవాలా విష్ణుల చుట్టూ తిరుగుతుంది. సినిమాలో చాలా వరకు కొత్త ఆర్టిస్టులే ఉన్నారు. అయినా చాలా సహజంగా చేశారు. ఎక్కడ ఆర్టిస్టులు అనేలా కాకుండా రియల్ గ్రామస్తులు అనేలా నటించి మెప్పించారు. సినిమాకి రియాలిటీని తీసుకొచ్చారు. అభయ్‌నవీన్..రాజు పాత్రలో అదరగొట్టాడు. ఊర్లో ఒక ఈగోయిస్ట్ ఇలానే ఉంటాడని, అలాగే మహిపాల్ పాత్రలో విష్ణుల పాత్రలను చూపించిన తీరు బాగుంది. రియలిస్టిక్‌గా ఉంది. అనిల్ పాత్రలో నాయకుడిగా తాగుబోతు రమేష్ మెప్పించాడు. కొత్త తరహా పాత్రలో ఆకట్టుకున్నాడు. రామన్న పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ కాసేపే అయినా ఆదరగొట్టాడు. `జబర్దస్త్` రోహిణి పాత్ర నవ్విస్తుంది. యాదమ్మ రాజు కూడా కాసేపు అలరించాడు. హీరోయిన్‌గా అముల్యరెడ్డి ఓకే అనిపించింది. మిగిలిన పాత్రలన్నీ ఫర్వాలేదనిపిస్తాయి.
టెక్నీకల్‌గాః
కమ్రాన్ బీజీఎం, మ్యూజిక్ బాగుంది. బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. సినిమా నేపథ్యానికి పర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యింది. దసరా రోజు వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ సైతం ఆకట్టుకుంటుంది. పహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. విజువల్ చాలా నీట్‌గా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా కొంత కట్ చేయాల్సింది. సినిమాకి తగ్గట్టుగా నిర్మాణ విలువలున్నాయి. ఇక దర్శకుడిగా అభయ్ నవీన్ మొదటి ప్రయత్నం బాగుంది. అభినందనీయం. అయితే కామెడీ మీద, ఊర్లో సంఘర్షణకి సంబంధించిన అంశాలపై మరింత ఫోకస్ పెట్టాల్సింది. మరింత బలంగా రాసుకోవాల్సింది. ఫన్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉన్నా, సీరియస్‌గా మార్చేసి ఫన్ ఫీల్‌ని డామినేట్ చేసేలా చేసింది. అలాగే చాలా లాజిక్స్ వదిలేశారు. వాటిపై కూడా ఫోకస్ పెడితే ఫలితం బాగుండేది.
ఫైనల్‌గాః `రామన్న యూత్` విలేజ్ పాలిటిక్స్ పై మంచి సందేశం..
రేటింగ్‌ః 2.5
నటీనటులు:అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు.
రచన, దర్శకత్వం: అభయ్ నవీన్.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ ఎంఎస్ కే
సంగీతం: కమ్రాన్,
ఎడిటర్: రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్ ,
సినిమాటోగ్రఫీ: ఫహాద్ అబ్దుల్ మజీద్,