Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?

Published : Jun 04, 2026, 01:58 AM IST

Peddi Movie Review: రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన చిత్రం `పెద్ది`. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైంది. మరి ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
పెద్ది మూవీ రివ్యూ

రామ్‌ చరణ్‌ ప్రస్టీజియస్‌గా భావించి చేసిన మూవీ `పెద్ది`. `ఉప్పెన` తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. శివ రాజ్‌ కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ, తారక్‌ పొన్నప్ప, రవికిషన్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మించారు. ఈ మూవీ నేడు గురువారం(జూన్‌ 4)న విడుదల చేశారు. ముందుగా బుధవారం రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శించారు. స్పోర్ట్స్ ప్రధానంగా విలేజ్‌ ఎమోషనల్‌ డ్రామా ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఆకట్టుకుందా? రామ్‌ చరణ్‌ మెప్పించాడా? ఆయన నటనకు జాతీయ అవార్డు వస్తుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
పెద్ది మూవీ కథ ఇదే

విజయనగరం అటవి ప్రాంతంలో కొండకింద వూరులో పెద్ది(రామ్‌ చరణ్‌) చాలా ఫేమస్‌. ఏ ఆట పేరు చెప్పినా, పెద్ది పేరే వినిపిస్తుంది. ఒలంపిక్స్ లో ఇండియా కేవలం రెండు పతకాలు మాత్రమే సాధించడంతో కేంద్ర మంత్రి.. అధికారులు, సెలక్టర్లపై ఫైర్‌ అవుతాడు. మంచి ఆటగాళ్లని తయారు చేయాలని వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో స్పోర్ట్స్ సెలక్టర్‌(బొమ్మన్‌) ఇరానీ ఊరూరా తిరిగి ఆటగాళ్లని వెతికే పనిలో పడతాడు.  విజయనగరం సమీపంలో ఎవరిని అడిగినా పెద్ది పేరే చెబుతారు. దీంతో ఆ పెద్ది గురించి తెలుసుకోవాలనుకుంటాడు. పెద్ది క్రికెట్‌లో ఆటకూలోడు. ఏ జట్టువాళ్లు ఎక్కువ పాడి కొనుక్కుంటే ఆ జట్టుకి ఆడతాడు. స్థానికంగా బొబ్బిలి, విజయనగరం టీమ్‌లు క్రికెట్‌ ఆడుతుంటాయి. పెద్దిని ఎక్కువ రేట్‌కి కొనుక్కుంటారు. పెద్ది ఏ జట్టువైపు ఉంటే దానిదే గెలుపు. కానీ ఒక సారి పెద్దిని క్రికెట్‌లో అవమానిస్తారు. కూలోడివి అని రెండు టీమ్‌లవాళ్లు హేళన చేస్తారు. క్రికెట్‌ గ్రౌండ్‌లో పెద్ది ఆట చూసి మురిసిపోయిన గౌర్నాయుడు(శివరాజ్‌ కుమార్‌) తమ కుస్తీ పోటీలకు ఆహ్వానిస్తాడు. ఆయన ఒకప్పుడు కుస్తీలో ఛాంపియన్‌. దీంతో కులం పేరుతో, ప్రాంతం పేరుతో తనకు జరిగిన అవమానం తట్టుకోలేక కుస్తీ పోటీలకు రెడీ అంటాడు పెద్ది. దానికి మరో కారణం కూడా ఉంటుంది. తమది కొండకింద వూరు. రోడ్డు లేదు, రవాణా సౌకర్యం లేక వాళ్లు ఇబ్బందులు పడుతుంటారు. తమ ఊరికి గుర్తింపు కోసం, రైల్వే స్టేషన్‌ కోసం గత ముప్పై ఏళ్లుగా అప్పిరాజు(జగపతిబాబు) తిరగని ఆఫీస్‌ లేదు, నాయకుడు లేడు. ఎర్రజెండా పట్టుకొని రోజూ రైల్‌ని ఆపే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అక్కడ ట్రైన్‌ ఆపరు.  ఒక ఎమ్మెల్యే వద్ద తనకి కూడా దారుణమైన అవమానం జరుగుతుంది. దీంతో అది తట్టుకోలేక ట్రైన్‌ పట్టాలపై అడ్డంగా ఎర్ర క్లాత్‌ ఊపినా ప్రయోజనం లేదు. ఈ యాక్సిడెంట్‌లో తన ప్రాణాలనే పోగొట్టుకుంటాడు. దీంతో అప్పిరాజు కోసం, తమ గుర్తింపు కోసం, తమ ఊరు గుర్తింపు కోసం, తమ ఊరుకి ట్రైన్‌ని తీసుకురావడం కోసం పెద్ది ఏం చేశాడు? కుస్తీలో నేషనల్‌ ఛాంపియన్‌గా ఎదిగాడా? కుస్తీ నుంచి రన్నింగ్‌ వైపు ఎందుకు వెళ్లాడు? తనపై జరిగిన కుట్రలేంటి? తమ వారి గుర్తింపు కోసం ఆయన చేసిన పోరాటం ఏంటనేది మిగిలిన సినిమా.

36
పెద్ది మూవీ విశ్లేషణ

పెద్ది.. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఎమోషనల్‌ డ్రామా. తమ ఊరు గుర్తింపు కోసం, తమ గుర్తింపు కోసం ఒక క్రీడాకారుడు తన ఆటతో చేసే పోరాటమే ఈ సినిమా. ఇది ప్రధానంగా 1990-20 మధ్య కాలంలో సాగుతుంది. ఒలంపిక్స్ లో భారత్‌ వెనకబడటం, ఆ తర్వాత స్థానిక ఆటగాళ్లని ఎంపిక చేసే ప్రక్రియ స్టార్ట్ కావడం, అందులో భాగంగా పెద్ది పేరునే చాలా మంది చెప్పడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే హీరో ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైమ్‌ తీసుకున్నారు. మెయిన్‌గా కథని ఎస్టాబ్లిష్‌ చేయడానికి, ఎమోషన్స్ ని క్యారీ చేయడానికి ఎక్కువగా టైమ్‌ తీసుకున్నారు. క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకొని క్రికెట్‌ గ్రౌండ్‌లోకి పెద్ది దిగిన సన్నివేశంతో రామ్‌ చరణ్‌ ఎంట్రీ ఉంటుంది. దాన్ని సాలిడ్‌గా ప్లాన్‌ చేశారు బుచ్చిబాబు. ఎలివేషన్‌ అదిరిపోయింది. ఆ తర్వాత క్రికెట్‌ ఆడే సమయంలోనూ అదే ఎలివేషన్‌ ఉంటుంది. మరోవైపు స్థానికంగా ఎన్నికలతో జాన్వీ కపూర్‌ ఎంట్రీ ఉంటుంది. అయితే ఆమెకి సంబంధించిన సన్నివేశాలు, పెద్ది జర్నీకి సెట్‌ కాలేదు, బలవంతంగానే జోడించినట్టు ఉంటుంది. కాకపోతే గ్లామర్‌ ట్రీట్‌ అదిరిపోయింది.  ఆమె విషయంలోనే ఇతర క్రికెట్‌ టీమ్‌లతో పెద్దికి గొడవ అవుతుంది.  వాళ్ళు పెద్దిని వాళ్లు అవమానిస్తారు. ఈ సన్నివేశాలు రసవత్తరంగా ఉంటాయి. ఈ క్రమంలో నైట్‌ వచ్చే ఫైట్‌ అదిరిపోయింది. ఆ తర్వాత కొంత ట్రాక్‌ తప్పినట్టు అనిపిస్తుంది. జగపతిబాబు పాత్ర చేసే పోరాటం, ఆయన పాత్ర మరణంతో కథ సీరియస్‌గా మారుతుంది. పెద్ది తన ఆటని సీరియస్‌గా తీసుకుంటాడు. అక్కడి నుంచి కథ నాటకీయంగా, ఎమోషనల్‌గా మారుతుంది. మెయిన్‌ ఎమోషనల్‌ సైడ్‌ వెళ్తుంది. హీరో పాత్రలోని పెయిన్‌ ప్రధానంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ ఎలివేషన్‌ కూడా అదిరిపోయింది. సెకండాఫ్‌ ఇక తన గుర్తింపు కోసం కుస్తీ పోటీల్లో పాల్గొనడం, తనపై కుట్ర జరగడం, ఆ తర్వాత రన్నింగ్‌ వైపు వెళ్లడం చకచకా జరిగిపోతాయి. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్‌గా ఉంది. ఎంగేజ్‌ చేస్తుంది. చివరి అర్థగంట ఉత్కంఠభరితంగా సాగుతుంది. అంతిమంగా రెగ్యూలర్‌గానే ముగింపు తీసుకుంటుంది. 

అయితే హీరో పాత్రలోని ఎమోషన్‌ని, పెయిన్‌ని ఆవిష్కరించడానికి ఎక్కువ టైమ్‌ తీసుకున్నారు బుచ్చిబాబు. దీంతో కథ డ్రైగా మారుతుంది. సాగదీసినట్టుగా ఉంటుంది.  పైగా హీరో లక్ష్యం ఏంటనేది ముందే అర్థమైపోతుంది. కథ ఎండింగ్‌ కూడా తెలియడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందనేది అర్థమవుతుంది. దీంతో నెక్ట్స్ వచ్చే సన్నివేశాలు పెద్దగా కిక్‌ ఇవ్వలేదు. చాలా సింపుల్‌గా సాగిపోతున్నట్టుగానే ఉంటుంది. హై మూమెంట్స్ లేవు, లో మూమెంట్సే చాలా ఉన్నాయి. ఎలివేషన్లు ఆశించే రామ్‌ చరణ్‌ అభిమానులు కొంత నిరాశ చెందుతారు. పైగా సన్నివేశాలకు మధ్య సింక్‌ కుదరలేదు. చాలా సీన్లు కట్‌ కట్‌ అనేలా ఉన్నాయి. దీంతో ఎమోషన్స్ సరిగ్గా క్యారీ కాలేదు. కానీ రామ్‌ చరణ్‌ తన నటనతో ఇరగదీశాడు. వాహ్‌ అనిపించాడు. ఆయన నటనతోనే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. స్ట్రగుల్స్ ని బాగా చూపించారు. ఆ విషయంలో ఇటు రామ్‌ చరణ్‌ని, అటు దర్శకుడిని అభినందించాల్సిందే. ఓవరాల్‌గా ఇది మంచి ఇన్‌స్పైర్‌ చేసే మూవీ అవుతుందని చెప్పొచ్చు.

46
పెద్దిలో నటీనటుల పర్‌ఫెర్మెన్స్

పెద్ది పాత్రలో రామ్‌ చరణ్‌ పరకాయ ప్రవేశం చేశారు. ఎక్కడా రామ్‌ చరణ్‌ కనిపించలేదు. పెద్దినే కనిపించాడు. `రంగస్థలం` తర్వాత ఆయన్నుంచి మరో బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ అని చెప్పొచ్చు.  పాత్ర కోసం ఆయన పడ్డ కష్టం ప్రతి సీన్లోనూ కనిపిస్తుంది. కుస్తీ సీన్లు, క్రికెట్‌ సీన్లు, ఎమోషనల్‌ సీన్లలో వాహ్‌ అనిపించాడు. ది బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చాడు. అందరు అన్నట్టు అవార్డు పర్ఫెర్మెన్స్ అని చెప్పొచ్చు. ఆయన ఈ కథకి ఒప్పుకోవడమే గొప్పవిషయం. ఇక అప్పిరాజుగా జగపతిబాబుకి మరో గుర్తిండిపోయే, నిలిచిపోయే పాత్ర పడింది. నిడివి తక్కువే అయినా, ఉన్నంత సేపు రామ్‌ చరణ్‌ని డామినేట్‌ చేసేలా ఆయన పాత్ర ఉంటుంది. జాన్వీ కపూర్‌ పాత్ర గ్లామరస్‌గా ఉంది. కానీ కథకి సెట్‌ కాలేదు. గౌర్నాయుడుగా శివరాజ్‌ కుమార్‌ అత్యంత పవర్‌ఫుల్‌ రోల్‌లో నటించి మెప్పించాడు. ఆయన పాత్ర సినిమాకి మరో ప్లస్‌ అవుతుంది. దివ్యేందు శర్మ కూడా ఉన్నంత సేపు బాగా చేశాడు. రవికిషన్‌ కాసేపు కనిపించి మెప్పించాడు. బొమ్మన్‌ ఇరానీ పాత్ర ఫర్వాలేదు. నవ్వించేలా ఉంటుంది. రావు రమేష్‌, జాన్‌ విజయన్‌ వంటి వారు అలా కాసేపు మెరిసి ఓకే అనిపించారు.  శ్రుతి హాసన్‌ స్పెషల్‌ సాంగ్‌ అలరిస్తుంది.

56
పెద్ది టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమాకి మ్యూజిక్‌ యావరేజ్‌గా నిలిచింది. పాటలు ఫర్వాలేదు. కానీ గొప్పగా అనిపించలేదు. బీజీఎం కూడా రెగ్యూలర్‌గానే ఉంది. క్లైమాక్స్ లో ఫర్వాలేదనిపించింది. కానీ ఏఆర్‌ రెహ్మాన్‌ స్థాయి మ్యూజిక్‌ అయితే కాదు. ఈ మ్యూజిక్‌ కోసం ఆయన అవసరం లేదు. రత్నవేలు కెమెరా వర్క్ బాగుంది. పీరియడ్‌ లుక్‌ని దించేశారు. రామ్‌ చరణ్‌లోని ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. ఎడిటింగ్‌ పరంగా లోపాలున్నాయి. చాలా సీన్లకి సంబంధం లేనట్టుగా ఉన్నాయి. డైలాగ్‌లు బాగున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా మంచి కథని రాసుకున్నాడు, కానీ ట్రెండ్‌కి తగ్గట్టుగా ప్రజెంట్‌ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కాకపోతే ఆయన సక్సెస్‌ అయిన అంశం ఏంటంటే రామ్‌ చరణ్‌తో బాగా చేయించగలిగాడు. నటీనటుల నుంచి తన బెస్ట్ తీసుకున్నాడు. నిర్మాతలు రాజీ లేకుండా నిర్మించారు. మూవీ గ్రాండియర్‌గా ఉంది.

66
ఫైనల్‌గా

 కథగా ఊహించేలా ఉన్నా, ఎమోషనల్‌ డ్రామా కట్టిపడేస్తుంది. రామ్‌ చరణ్‌ పర్‌ఫెర్మెన్స్ కోసం అయినా చూడగలిగే మూవీ.

రేటింగ్‌: 3.25

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories