‘పెదరాయుడు’ సినిమా వెనుక ఆసక్తికరమైన బ్యాగ్రౌండ్ ఉంది. తమిళంలో శరత్ కుమార్ హీరోగా, విజయ్ కుమార్ ప్రధాన పాత్రలో తమిళ న దర్శకుడు కే.ఎస్. రవికుమార్ తెరకెక్కించిన ‘నాట్టమై’ (Nattamai) చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఈసినిమాను చూసిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, వెంటనే తన ఆప్తమిత్రుడు మోహన్ బాబుకి ఫోన్ చేసి ఈ సినిమాను చూసి తెలుగులో రీమేక్ చేయాల్సిందిగా సూచించారు.
రజనీకాంత్ సలహాతో సినిమా చూసిన మోహన్ బాబు.. ఈ కథకు బాగా అట్రాక్ట్ అయ్యారు. వెంటనే రీమేక్ హక్కులు తీసుకున్నారు. దర్శకుడు రవిరాజా పినిశెట్టిని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు. తమిళంలో విజయ్ కాంత్ పోషించిన ఐకానిక్ తాత పాత్రను (పాపారాయుడు) తెలుగులో రజనీకాంత్ స్వయంగా వచ్చి ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించారు. రజనీకాంత్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ, సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడంలో ఆ పాత్ర కీలక పాత్ర పోషించింది.
1995లో విడుదలైన ఈ సినిమా కుటుంబ బంధాలు, గ్రామీణ నేపథ్యం, న్యాయం, ధర్మం, ఆత్మగౌరవం వంటి అంశాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పెదరాయుడిగా మోహన్ బాబు పలికించిన గంభీరమైన డైలాగులు, ఆయన పాత్రలో కనిపించిన క్రమశిక్షణ, క్లైమాక్స్ లో ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
పెదరాయుడు ఒక గ్రామంలో పెద్దమనిషిగా, న్యాయానికి ప్రతిరూపంగా జీవిస్తుంటాడు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరకే వస్తారు. కుటుంబ వివాదాలైనా, ఆస్తి తగాదాలైనా, తప్పు చేసినవారికి శిక్ష విధించడమైనా ఆయన మాటే తుది తీర్పు. తన కుటుంబ సభ్యులు తప్పు చేసినా ఉపేక్షించకపోవడం ఆయన వ్యక్తిత్వం, అంతే కాదు ఆ పీటంపై ఎవరు కూర్చున్నా అదే కట్టుబాటుతో ఉంటారు.
పెదరాయుడి భార్య లక్ష్మి (భానుప్రియ) ఆయనను ఎంతో గౌరవిస్తుంది. తమ్ముళ్లు రాజా, రవీంద్ర కూడా ఆయన మాటను గౌరవిస్తూ పెరుగుతారు. అయితే రాజా (మోహన్ బాబు ద్విపాత్రాభినయంలోని యంగ్ క్యారెక్టర్ ) భారతి (సౌందర్య)ను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబంలో కొన్ని విభేదాలు మొదలవుతాయి. పెదరాయుడి కఠినమైన పద్ధతులు, రాజా అన్నకు ఇచ్చే గౌరవం భారతి మొదట్లో అర్థం చేసుకోలేకపోతుంది. కానీ క్రమంగా పెదరాయుడి గొప్పతనం ఆమెకు తెలుస్తుంది.
అయితే పెదరాయుడి మేనత్త కొడుకు ఈసినిమాక అసలు విలన్ అయిన భూపతి (ఆనంద్ రాజ్) పెదరాయుడి కుటుంబంపై పగతో రగిలిపోతుంటాడు. పెదరాయుడి కట్టుబాట్లను, నిజాయితీని దెబ్బతీయడానికి భూపతి ఒక కుట్ర పన్నుతాడు. ఊరికి వచ్చిన ఉపాధ్యాయిని (సుభాషిణి) సాయంతో రాజాపై నింద వేస్తాడు. నిజం తెలియని పెదరాయుడు తన సొంత తమ్ముడని కూడా చూడకుండా 10 సంవత్సరాల పాటు ఊరి నుండి వెలివేస్తూ తీర్పునిస్తాడు. చివరికి భూపతి కుట్ర బయటపడటం, తాను ఇచ్చిన తీర్పు తప్పని తెలుసుకున్న పెదరాయుడు పశ్చాత్తాపంతో కుంగిపోవడం, ఆ క్రమంలో ఆయన తండ్రి పాపారాయుడు (రజనీకాంత్) గతంలో భూపతి తండ్రికి ఇచ్చిన మాట, పెదరాయుడి త్యాగం చుట్టూ కథ మలుపులు తిరుగుతుంది.
పెదరాయుడిగా గాంభీర్యం, క్రమశిక్షణ, న్యాయబద్ధత కలిగిన పాత్రలో మోహన్ బాబు జీవించారు. ఆయన డైలాగ్ డెలివరీ, హావభావాలు, పీఠంపై కూర్చుని చెప్పే తీర్పులు థియేటర్లలో ఈలలు వేయించాయి. రాజసం ఉన్న పాత్రకు మోహన్ బాబు తప్ప మరెవరు చేయలేరు అన్నట్టుగా పెదరాయుడు పాత్ర నిండుగా కనిపించింది. యంగ్ క్యారెక్టర్ లో కూడా మోహన్ బాబు అద్భుతం చేశాడు. రాజా పాత్రలో ఫైట్లు, డ్యాన్సులు, రొమాన్స్ తో మెప్పించారు.
ఇక దాదాపు 20 నిమిషాల పాటు కనిపించే పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. ఆయన ఎంట్రీతో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. రజనీకాంత్ నటన, బాడీ లాంగ్వేజ్‌కి తోడు సాయికుమార్ చెప్పిన డబ్బింగ్ ఆ పాత్రను వేరే లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్శణ ఇద్దరు హీరోయిన్లు. పెదరాయుడి భార్యగా భానుప్రియ తన సంప్రదాయబద్ధమైన నటనతో, గౌరవప్రదమైన లుక్‌తో ఆకట్టుకోగా, సౌందర్య తన గ్లామర్ , నటనతో మెప్పించింది.
విలన్‌గా భూపతి పాత్రలో ఆనంద్ రాజ్ క్రూరత్వాన్ని బాగా పండించారు. సెంటిమెంట్ పాత్రలో జయంతి అద్భుతంగా నటించగా.. ఇంత సీరియస్ గా సాగిపోయే సినిమాకు తమ కామెడీతో రిలాక్స్ కలిగేలా చేశారు. బ్రహ్మానందం, బాబు మోహన్, ఎం.ఎస్. నారాయణ, ముఖ్యంగా బ్రహ్మానందం, బాబు మోహన్ కాంబో సీన్స్ డియన్స్ ను ఎంతగానో నవ్వించాయి.
1995 జూన్ 15వ తేదీన తెలుగు సినీ చరిత్రలో ఒక పెద్ద బాక్సాఫీస్ సమరం జరిగింది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి విజయబావుటా ఎగురవేస్తున్న సమయంలో విజయ్ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘బిగ్ బాస్’, మరొకవైపు మోహన్ బాబు నటించిన ‘పెదరాయుడు’ ఒకే రోజున థియేటర్లలో విడుదలయ్యాయి. భారీ అంచనాలు - విపరీతమైన టాక్.. ‘ఘరానా మొగుడు’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి బ్లాక్బస్టర్ల తర్వాత చిరంజీవి ‘బిగ్ బాస్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
అయితే.. పెదరాయుడు సినిమా ముందు బిగ్ బాస్ సినిమా తేలిపోయింది. రొటీన్ కథాంశం, ఆకట్టుకోని కథనంతో మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. మరోవైపు, బిగ్ బాస్ నెగటివ్ టాక్ తెచ్చుకోగా, ‘పెదరాయుడు’ మొదటి ఆట నుంచే ఇండస్ట్రీ హిట్ టాక్‌తో దూసుకెళ్ళింది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ పెదరాయుడు వైపే మొగ్గు చూపారు.
బిగ్ బాస్ డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో, ఆ థియేటర్లను కూడా పెదరాయుడు సినిమా కలెక్షన్ల సునామీ ఆక్రమించింది. ‘ఘరానా మొగుడు’ పేరిట ఉన్న రికార్డులను తిరగరాస్తూ పెదరాయుడు రూ. 12 కోట్ల షేర్ వసూలు చేసి ఆనాటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 40కి పైగా కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది.
ప్లస్ పాయింట్లు (Pluses):
మోహన్ బాబు - రజనీకాంత్ కాంబినేషన్: ఇద్దరు దిగ్గజ నటుల నటన, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలం.
రవిరాజా పినిశెట్టి దర్శకత్వం & డైలాగ్స్: ఎమోషన్స్, సెంటిమెంట్, డ్రామాను సరైన నిష్పత్తిలో తెరకెక్కించిన తీరు.
జి.సత్యమూర్తి రాసిన సంభాషణలు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి.
సంగీతం: కోటి (కోటేశ్వరరావు) అందించిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.
సెంటిమెంట్ & కుటుంబ నేపథ్యం: గ్రామీణ వాతావరణం, అన్నదమ్ముల అనుబంధం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.
మైనస్ పాయింట్లు (Minuses):
రీమేక్ కావడంతో ఒరిజినల్ సినిమా చూసిన వారికి కొన్ని సీన్లు ఊహకందేలా ఉంటాయి.
సెకండ్ హాఫ్ సినిమాలో డ్రామా కొంచెం రొటీన్‌గా అనిపిస్తుంది.
పెదరాయుడు’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా చరిత్రలో.. కుటుంబ విలువల ఇంపార్టెన్స్ ను మరోసారి చాటిచెప్పిన మూవీ. న్యాయం, ధర్మం, కుటుంబ గౌరవం అనే అంశాలను మాస్ ఎలిమెంట్స్‌తో మేళవించి దర్శకుడు రవిరాజా పినిశెట్టి అద్భుతంగా మలిచారు. మోహన్ బాబు యాక్టింగ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఈ చిత్రం, దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ టీవీల్లో వస్తే ప్రేక్షకులు వదలకుండా చూసే క్లాసిక్ మాస్టర్‌పీస్. ఈమూవీ చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.