
కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరించే సుహాస్ ఇప్పుడు `ఓ భామ అయ్యో రామ` అనే చిత్రంలో హీరోగా నటించారు. రామ్ గోధల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక మనోజ్ హీరోయిన్‌గా నటించింది.
అనిత, పృథ్వీరాజ్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. గత వారమే `ఉప్పుకప్పురంబు` చిత్రంతో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చారు సుహాస్. ఇందులో కీర్తిసురేష్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
ఈ మూవీ ఓటీటీలో మెప్పిస్తోంది. ఇప్పుడు `ఓ భామ అయ్యో రామ`తో థియేటర్ ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చారు. మరి ఈ సినిమాతో సుహాస్ థియేట్రికల్‌గా హిట్ కొట్టాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
రామ్(సుహాస్) తన మామయ్య(అలీ)తో కలిసి ఉంటాడు. పెద్ద చదువుల కోసం ఫారెన్ వెళ్లాలనుకుంటాడు. సినిమాలకు దూరంగా ఉంటాడు. ఫ్రెండ్స్ మూవీకి తీసుకెళ్లినా థియేటర్ బయటే ఉండి సినిమా కథ విని అది ఆడుతుందా? లేదా చెప్పగలడు.
అయితే ఓ రోజు తన అమ్మ(అనిత) జయంతి సందర్భంగా వరంగల్ వెళ్లి వస్తుంటాడు. రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా సత్యభామ(మాళవిక మనోజ్) తాగి కారు నడిపి డివైడర్‌ని గుద్దేస్తుంది. ఆమెని సేఫ్‌గా వాళ్లింటికి తీసుకెళ్తాడు రామ్.
తనని సేవ్ చేసిన రామ్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటుంది సత్యభామ. కాలేజీకి వెళ్తుంది. ఆయన్ని రెగ్యూలర్‌గా ఫాలో అవుతూ ప్రేమలో పడేస్తుంది. ఓ రోజు కథ చెబుతా అని శ్మశానం తీసుకెళ్తుంది. అక్కడ స్టోరీ చెప్పి బయపెడుతుంది.
అంతేకాదు రామ్‌ని ఓ రోజు సడెన్‌గా తీసుకెళ్లి దర్శకుడు హరీష్ శంకర్ వద్ద అసిస్టెంట్‌గా జాయిన్ చేస్తుంది. అయితే ఫారెన్స్ లో ఉండే సత్యభామ నాన్న(బబ్లూ పృథ్వీరాజ్) ఆమెకి సంబంధం చూస్తాడు. అతన్ని పరిచయం చేయగా, బ్రో అంటూ అతన్ని అవాయిడ్ చేస్తుంది.
కానీ రామ్ గురించి తండ్రికి చెప్పదు. ఓ రోజు తన బర్త్ డే సందర్భంగా రామ్‌కి షాపింగ్ చేస్తుంది. ఆ సమయంలో రోడ్డుపై ఓ వ్యక్తిని చూసి రామ్ కళ్లు తిరిగి అయోమయానికి గురవుతాడు.
ఇది గమనించిన సత్యభామ రోడ్డుపై రామ్‌కి యాక్సిడెంట్ నుంచి కాపాడే ప్రయత్నం చేసి తాను యాక్సిడెంట్‌కి గురవుతుంది. ఆ తర్వాత క్రమంగా కోలుకుని తన ఇంట్లోవాళ్లకి రామ్‌ని పరిచయం చేస్తుంది.
తమప్రేమ వ్యవహారం సాఫీగా సాగుతుండగా, తన అమ్మ లేని లోటుని సత్యభామ తీరుస్తుందని రామ్ అనుకునే సమయంలోనే అనూహ్యంగా పెద్ద షాక్ ఇస్తుంది. మూడేళ్లు తనని మర్చిపోవాలని రామ్ వద్ద ప్రామిస్ తీసుకుంటుంది. ఈ మూడేళ్లలో నువ్వు గొప్ప డైరెక్టర్ కావాలని మాట తీసుకుంటుంది.
మరి సత్యభామ అలా ఎందుకు చేసింది? సినిమాలంటే ఇష్టం లేని రామ్‌ని హరీష్ శంకర్ వద్ద అసిస్టెంట్‌గా ఎందుకు జాయిన్ చేయించింది. రామ్ గతం ఏంటి? తన తల్లితో ఉన్న అనుబంధమేంటి? రోడ్డుపై చూసిన వ్యక్తి ఎవరు? అనంతరం ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది సినిమా.
సుహాస్ మంచి కాన్సెప్ట్ చిత్రాలతో వస్తూ ఆకట్టుకుంటున్నారు. `కలర్ ఫోటో` నుంచి తను అదే చేస్తున్నారు. మంచి నటనతో ఆకట్టుకుంటున్నారు. డీసెంట్ హిట్లతో రాణిస్తున్నారు. కాన్సెప్ట్ చిత్రాలే అతని బలం. కానీ ఇటీవల గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది.
ఆయన కమర్షియల్ సినిమాల వైపు టర్న్ తీసుకుంటున్నారు. కథలో దమ్ములేని సినిమాలు చేస్తున్నాడు. దీంతో ఆయా సినిమాల ఫలితాలు తేడా కొడుతున్నాయి. తాజాగా ఆయన `ఓ భామ అయ్యో రామ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు.
ఈ మూవీ కూడా కమర్షియల్ యాంగిల్‌లో చేసిందే. అయితే మదర్ సెంటిమెంట్‌ని జోడించి కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చారు. సినిమాని ఫన్‌తోపాటు ఎమోషనల్‌గా నడిపించారు. అక్కడ మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.
సరదాగా నడిపిస్తూ, ఎమోషనల్‌గా ముగించిన తీరు బాగుంది. కథగా చూసినప్పుడు ఫస్టాఫ్‌లో అమ్మాయిని యాక్సిడెంట్ నుంచి కాపాడటం, ఆమె హీరో వెంటపడటం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి రావడం, సరదాగా ఆయన్ని బయటకు తీసుకెళ్లడం, కథలు చెప్పి విసిగించడం ఇలా చాలా రొటీన్‌గా నడిపించారు.
ఆయా సీన్లు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, రొమాన్స్ కూడా జస్ట్ ఓకే అనేలా ఉంది. కానీ ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. అక్కడి నుంచి సినిమా సీరియస్‌గా సాగుతుంది.
అయితే మధ్య మధ్యలో అలీ పాత్రతో ఎమోషనల్ టచ్ ఇప్పించారు. హీరో తల్లి మరణించడం, తాను అతన్ని తీసుకొని రావడం, అల్లుడి కోసం పెళ్లి చేసుకోకపోవడం వంటి సీన్లు ఎమోషనల్‌గా, సెంటిమెంట్ పరంగా బాగున్నాయి.
ఇక సెకండాఫ్ తర్వాత సినిమా కాస్త బెటర్‌గా సాగుతుంది. లవ్ ట్రాక్‌లో సీరియస్‌నెస్‌ని చూపించడం, ఫ్రెండ్ పెళ్లిలో చేసే సందడి నవ్వులు పూయించేలా ఉంది. సుహాస్ మదర్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.
తాను తల్లిని ఎలా దురమయ్యాడు, తన తండ్రి ఎవరు? అతను హీరోని చిన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురి చేశాడు? అతని వల్ల సుహాస్ ఎలా నలిగిపోయాడు అనే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. గుండెని బరువెక్కిస్తాయి.
ఇక హీరోయిన్ సుహాస్‌కి హ్యాండివ్వడం, ఆయన పిచ్చోడిలా తిరగడం కాస్త రొటీన్‌గానే ఉంటుంది. కానీ చివర్లో ట్విస్ట్ ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ లో తప్పుదోవ పట్టించేలా సన్నివేశాలు రాసుకుని అసలు విషయాన్ని రివీల్ చేసిన తీరు బాగుంది.
రొటీన్ ముగింపులా కాకుండా కాస్త ట్విస్ట్ ఇచ్చి ముగించిన తీరు బాగుంది. కానీ అది లాజిక్ లెస్‌గా అనిపిస్తుంది. అయితే సినిమా పరంగా ఫస్టాఫ్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. ఏదో నడిపించినట్టుగా ఉంది తప్పితే, అందులో ఏమాత్రం స్టఫ్ లేదు.
సినిమాలో మెయిన్ ఎమోషన్ క్యారీ కాలేదు. కట్ కట్ అనేలా ఉన్నాయి. దీంతో ఆయా సీన్లు తేలిపోయాయి. కామెడీ ట్రాక్‌ని మరింత బాగా రాసుకోవాల్సింది. అవి కొంత లాజిక్ లెస్‌గా, కథకి సింక్ కాని విధంగా ఉన్నాయి.
కాకపోతే ఇంటర్వెల్ నుంచి తీసుకెళ్లిన తీరు బాగుంది. ఫన్, ఎమోషన్స్ ని మేళవిస్తూ నడిపించిన తీరు బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ పాత్రలోని ట్విస్ట్ కూడా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.
లవ్ స్టోరీని కూడా కాస్త ఫ్రెష్ ఫ్లేవర్ యాడ్ చేశారు. యూత్‌ని కనెక్ట్ అయ్యేలా తీసుకెళ్లాడు. కాకపోతే దానిపై ఇంకా బాగా వర్క్ చేయాల్సింది. సెకండాఫ్‌ని మరింత గ్రిప్పింగ్‌గా తీసుకెళితే సినిమా ఇంకా బాగుండేది.
రామ్ పాత్రలో సుహాస్ బాగా చేశాడు. నటుడిగా మంచి పేరుతెచ్చుకున్న సుహాస్ ఇందులో చాలా బెటర్‌గా చేశాడు. సెటిల్డ్ గా చేసి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో అదరగొట్టాడు.
సత్యభామ పాత్రలో మాళవిక మనోజ్ చాలా బాగా చేసింది. ఆమె చాలా సీన్లలో సుహాస్‌ని డామినేట్ చేసింది. అదరగొట్టిందని చెప్పాలి. మరోవైపు సుహాస్ తల్లిగా అనిత పాత్ర సర్‌ప్రైజ్ అని చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత కనిపించి ఆకట్టుకుంది.
మదర్‌గా ఎమోషనల్ సీన్లతో మెప్పించింది. కన్నీళ్లు పెట్టించింది. తండ్రి పాత్రలో రవీంద్ర విజయ్ కూడా ఓకే అనిపించాడు. హీరోయిన్ తండ్రి పాత్రలో బబ్లూ పృథ్వీ నటన బాగుంది. మరోవైపు అలీ మామయ్యగా కనిపించి నవ్వించమే కాదు, ఏడిపించాడు కూడా.
సుహాస్ ఫ్రెండ్స్ సాత్విక్ నవ్వించారు. నయని పావనికి మంచి పాత్ర పడింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు. దర్శకుడు హరీష్ శంకర్ గెస్ట్ రోల్ సర్‌ప్రైజ్ చేస్తుంది. అలాగే మారుతి కూడా ఓ మెరుపు మెరవడం విశేషం.
సినిమా టెక్నీకల్‌గా బాగా రిచ్‌గా ఉంది. చాలా క్వాలిటీగా ఉంది. మణికందన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. పాటలు మాత్రం వేరే రేంజ్‌లో ఉన్నాయి.
ఆర్ట్ వర్క్ కూడా స్పెషల్‌గా నిలిచిందని చెప్పొచ్చు. బ్రహ్మకడలి తన మార్క్ ని చూపించారు. ఇక రథన్ మ్యూజిక్ సినిమాకి మరో ప్లస్. పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్ కూడా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. కథని మించి, హీరోని మించి ఖర్చు చేశారు.
దర్శకుడు రామ్ గోధల కథ బాగానే ఉంది. కాస్త రొటీన్‌గానే ఉన్నా, ఫర్వాలేదు. కానీ టేకింగ్ విషయంలో ఆయన మరింత బాగా చేయాల్సింది. ఫస్టాఫ్‌ని ఇంకా బాగా డీల్ చేయాల్సింది.
కథకి ఎమోషన్స్, సోల్ ముఖ్యం. ఆ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఓవరాల్‌గా ఫర్వాలేదనిపించే చిత్రమిది.
ఫైనల్‌గాః తల్లి సెంటిమెంట్, ఎమోషన్స్ పరంగా ఆకట్టుకునే చిత్రం. ఫ్యామిలీతో చూడగలిగే క్లీన్ మూవీ.
రేటింగ్‌ః 2.75