
ప్రస్తుతం భారీ యాక్షన్ సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని కంటెంట్ బేస్డ్ గా, కామన్ ఆడియెన్స్ లైఫ్‌ని ఆవిష్కరించే మూవీస్ వస్తున్నాయి. వాటిలో కొన్ని మాతమే ఆకట్టుకుంటున్నాయి.
ఈ క్రమంలో తాజాగా వచ్చిన అలాంటి చిత్రమే `3బీహెచ్ కే(3BHK)`. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర జే అచర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు.
తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువాదం చేసి అదే పేరుతో నేడు శుక్రవారం(జులై 4)న విడుదల చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కల అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
వాసుదేవన్(శరత్ కుమార్) చిన్న ఉద్యోగం చేస్తూ మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తుంటాడు. భార్య శాంతి(దేవయాని) స్నాక్స్ చేస్తూ భర్తకి తోడుగా ఉంటుంది. కొడుకు ప్రభు(సిద్ధార్థ్) అంతంత మాత్రంగానే చదువుతాడు. తండ్రి కోరిక మేరకు ఐటీలో బిటెక్ చేస్తాడు.
కానీ సరైన ఉద్యోగాలు రావు. ప్రభుత్వ కొలవులకు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. కూతురు ఓ ప్రైవేట్ జాబ్ చేస్తుంటుంది. వీరిది చాలా మధ్యతరగతి కుటుంబం. సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటారు. చాలా అవమానాలు ఫేస్ చేస్తుంటారు.
సొంత ఇంటి కొనేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటారు. ప్రభుకి ప్రైవేట్ లో ఐటీ జాబ్ వస్తుంది. దానితో కొత్త ఇల్లు కొనాలనుకుంటారు. ఆ సమయంలోనే కూతురుకి పెళ్లి సంబంధం వస్తుంది.
మంచి సంబంధం అని చెప్పి గ్రాండ్‌గా పెళ్లి చేస్తారు. దానికే ఉన్నదంతా అయిపోతుంది. ఇక సెట్ అయి మళ్లీ ఇళ్లు కొనాలనుకున్నప్పుడు ప్రభుకి పెళ్లి సంబంధం వస్తోంది. రిచ్ ఫ్యామిలీ అని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు.
కానీ ఆ సమయంలోనే ప్రభుకి తన పాత ప్రియురాలు కలుస్తుంది. దీంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటారు. దీంతో అప్పుడు కూడా సొంతింటి కల చెదిరిపోతుంది. ఆ తర్వాత జాబ్ బాగానే ఉంది, లోన్ కూడా ఓకే అవుతుంది. కానీ ప్రభు ఆ లోన్ రిజెక్ట్ చేస్తాడు?
దీంతో మళ్లీ సొంతింటి కల చెదిరిపోతుంది. మరి ఇంతకి ప్రభు ఎందుకు లోన్ రిజెక్ట్ చేశాడు? తమ ఫ్యామిలీలో అసలు సమస్య ఏంటి? ప్రభు చెల్లి ఫ్యామిలీ లైఫ్ బ్రేక్ కావడానికి కారణం ఏంటి? ప్రభు నిర్ణయం వారి జీవితంలో తెచ్చిన మార్పేంటి.? ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీ కథ.
మిడిల్ క్లాస్ జీవితాలను ఆవిష్కరించే చిత్రమిది. సొంత ఇళ్లులేని వారు, సొంత ఇంటికోసం పడే తపన, అదే సమయంలో మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే పరిస్థితులు, వాళ్లు పడే బాధలను ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు.
సినిమా ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుంది. అడుగడుగునా వారి బాధలను, వారికి ఎదురయ్యే అడ్డంకులను చూపించారు. మిడిల్ క్లాస్‌కి కనెక్ట్ అయ్యేలా అంతే సహజంగా ఆయా అంశాలను రాసుకోవడం విశేషం.
ఒక స్థాయికి ఎదగలేకపోవడంతో, ఇంకా లైఫ్‌లో స్ట్రగుల్ పడుతూనే ఉంటే, పిల్లలు మంచి ఉద్యోగాలు రాక ఇంకా పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటే బయట సమాజం ఎలా చూస్తుందో, కనీసం మెయింటనెన్స్ లేకపోతే ఎంత చులకనగా చూస్తారో ఇందులో చూపించారు.
ఆయా అంశాలు బాగా ఆకట్టుకునేలా రియాలిస్టిక్‌గా ఉండటం విశేషం. ఫస్టాఫ్ అంతా వీటిచుట్టూనే సాగుతుంది. సొంత ఇంటికోసం తండ్రి పడే బాధ, తపన, అవమానాలను ఆద్యంతం బోల్డ్ గా ఆవిష్కరించారు.
దీన్ని ఎమోషనల్‌గా తీసుకెళ్లారు. ఒక దశ తర్వాత మరో దశలో వచ్చే ఖర్చులు, వాటిని దాటుకుని ముందుకు వెళ్తే మరో రూపంలో ఖర్చులు రావడంతో తన కలలను చంపేసుకుంటూ బతకడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
దీనికితోడు భవిష్యత్ బాగుంటుందని, ఇప్పుడు రాజీపడుతూ, వేరే వాళ్లకి తలొగ్గుతూ బతకడంలో ఉండే బాధ, అవమానం ఎంత దారుణంగా ఉంటుందో చూపించారు.
సినిమా ప్రారంభంలో కాస్త సరదాగా సాగినా, ఆ తర్వాత సొంతింటి కల అనేది ప్రారంభమయ్యేనాటికి, తండ్రి వాసుదేవన్ ఫేస్ చేసే అవమానాలతో, ప్రభు ఎగ్జామ్స్ లో ఫెయిల్ కావడం, ఎన్నో ఇంటర్వ్యూలు రిజెక్ట్ కావడంతో ఎమోషనల్ సైడ్ తీసుకుంటుంది.
ఆ తర్వాత నుంచి కంటిన్యూగా అదే నడుస్తుంది. బలమైన ఎమోషన్స్ ఉన్నా, అది మొత్తం అలానే సాగడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. కాస్త డ్రై ఫీలింగ్ కలుగుతుంది. ఎమోషనల్‌గా కనెక్ట్ అయినా, మరి డ్రైగా డీల్ చేయడంతో అవి ఆడియెన్స్ కి పరీక్షగా మారుతుంది.
ఒక స్టేజ్ దాటాక మరో స్టేజ్‌లో కూడా అలాంటి సంఘటనలే చోటు చేసుకోవడంతో రొటీన్ అనిపిస్తాయి. అయితే ఈ లైఫ్ కాదు, ఎవరికి నచ్చినట్టు కాదు, మనకు నచ్చినట్టు బతకాలి, మనకు నచ్చిన పని చేయాలనేది చెప్పిన విధానం బాగుంది.
కాకపోతే హైలీ ఎమోషనల్‌గా, బాధలు, కష్టాలు అనేలా ఉండటమే ఈ మూవీలో మైనస్. ఇలాంటి ఎమోషన్స్ ని, బాధలను కూడా ఫన్నీ వేలో చూపించొచ్చు, అటు ఆడియెన్స్ కి వినోదం దొరుకుతుంది.
మరోవైపు పాయింట్‌కి కనెక్ట్ అవుతారు. నిజాలు చూపించారనేది నమ్ముతారు. కానీ ఇందులో ఆ కోణం మిస్ అయ్యింది. ఆ జాగ్రత్తలు తీసుకుంటే సినిమా బాగుండేది.
`3BHK` సినిమాలో ప్రతి ఒక్క నటులు పాత్రలో ఒదిగిపోయారు. ప్రభు పాత్రలో నిరుద్యోగిగా, ఐటీ ఎంప్లాయ్‌గా, బాస్ చేత అణచివేయబడ్డ ఎంప్లాయ్, భవిష్యత్ కోసం తన కోరికలు, స్వేచ్ఛని కోల్పోయిన వ్యక్తిగా చాలా బాగా నటించాడు హీరో సిద్ధార్థ్. చాలా సెటిల్డ్ గా చేసి మెప్పించాడు.
ఇక వాసుదేవన్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తండ్రిగా శరత్ కుమార్ పాత్రలో జీవించాడు. అదరగొట్టాడు. సెటిల్డ్ గా చేసి వాహ్ అనిపించారు. తల్లి పాత్రలో దేవయాని సైతం రెచ్చిపోయి చేసింది. బాధలు, కష్టాలతో ఉండే తల్లి పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది.
చెల్లిగా మీతా రఘునాథ్, ప్రియురాలిగా, భార్యగా చైత్రలు సైతం పాత్రల్లో ఒదిగి పోయారు. యోగిబాబు కాసేపు కనిపించి నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన్ని సరిగ్గా వాడుకోలేదు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
ఈ మూవీ టెక్నీకల్‌గా బాగానే ఉంది. దినేష్ బీ క్రిష్ణన్, జితిన్ స్టానిస్లాస్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ చాలా సహజంగా ఉన్నాయి. విజువల్స్ లోనూ కథ దాగుందని చెప్పొచ్చు. అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ సైతం ఈ మూవీకి, కథకి యాప్ట్ గా నిలిచింది.
కథలో భాగంగా వచ్చే పాటలు ఫర్వాలేదనిపించాయి. కానీ పెద్దగా గుర్తుండవు. గణేష్ శివ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. దర్శకుడు సాయి గణేష్ ఎంచుకున్న కథ బాగుంది. కానీ స్క్రీన్ ప్లే పరంగా లూప్స్ ఉన్నాయి. కథ కట్ కట్‌గా ఉంది.
బ్లాక్ బ్లాక్‌లుగా డిజైన్ చేసుకున్నట్టు ఉంది. ఒక ఫ్లో లేదు. దీంతో ఆ కనెక్టివిటీ మిస్ అవుతాం. ఎమోషన్స్ పైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్టుంది. కాకపోతే మిడిల్ క్లాప్ బాధలు చెప్పిన తీరు, చూపించిన తీరు మాత్రం బాగుందని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః సొంతింటి కల కోసం మధ్యతరగతి కుటుంబం పడే బాధలే `3BHK`.
రేటింగ్‌ః 2.5