మిస్సమ్మ మూవీ రివ్యూ.. భానుమతి తో పెద్ద గొడవ.. సావిత్రిని వరించిన అదృష్టం.. కమెడియన్ గా ఏఎన్నార్ నటించిన చిత్రం

Published : Nov 23, 2025, 09:30 AM IST

Missamma Movie Review : తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన అరుదైన అద్భుత చిత్రం మిస్సమ్మ. ఇద్దరు స్టార్ హీరోల, హీరోయిన్లు,  హంగులు ఆర్భాటాలు లేని.. హాయిగా సాగిపోయే కథలో.. ట్విస్ట్ లు మాత్రం ఉన్నాయి. 70 ఏళ్ల మిస్సమ్మ సినిమాపై ఓ చిన్న రివ్యూ చూద్దాం. 

PREV
18
జానపద, పౌరాణిక చిత్రాల జోరులో..

జానపద, పౌరాణిక చిత్రాల జోరు కొనసాగుతున్న కాలంలో.. సోషల్‌ కామెడీ డ్రామాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా `మిస్సమ్మ`. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన భారీ తారాగణం ఈసినిమాలో నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి, జమున, ఎస్వీఆర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈసినిమాలో... వీరితోపాటు రేలంగి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, రుష్వేంద్రమణి లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. ఎల్వీ ప్రసాద్‌ దర్శకత్వం వహించిన మిస్సమ్మ సినిమాను విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి సంయుక్తంగా నిర్మించారు. 1955 జనవరి 12 ఈ మూవీ విడుదలైన ఈసినిమా ఈ ఏడాదికి 70 ఏళ్లు పూర్తి చేసుకుంది.

28
మిస్సమ్మ కథ విషయానికి వస్తే..

యొతిష్‌ బెనర్జీ అనే బెంగాలీ రైటర్‌ రాసిన మన్మొయీ గర్ల్స్ స్కూల్‌ అనే రచన ఆధారంగా చక్రపాణి, పింగళి నాగేంద్రరావు సినిమా కథగా రచించగా, దర్శకుడు ఎస్వీ ప్రసాద్‌ మిస్సమ్మను మంచి రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా మలిచారు. ఇక కథలోకి వెళ్తే.. అప్పాపురం జమీందార్ అయిన గోపాలం( ఎస్వీ రంగారావు) తన పెద్ద కుమార్తె మహాలక్ష్మి( సావిత్రి) పేరు మీద ఒక స్కూల్ కట్టిస్తాడు. చిన్నతనంలో, ఆమె కాకినాడలో తీర్థయాత్రలో తప్పిపోయింది . గోపాలం మేనల్లుడు, అమెచ్యూర్ డిటెక్టివ్ అయిన ఎకె రాజు( అక్కినేనినాగేశ్వరరావు) ఈ స్కూల్ ను సరిగ్గా నడిపించలేకపోతుంటాడు. పాఠశాలలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఆ స్కూల్ మాస్టారు, ఆయుర్వేద వైద్యుడు పంతులు( అల్లు రామలింగయ్య) బడిపిల్లలతో పనులు చేయిస్తుంటాడు. ఇక ఇదంతా చూసిన గోపాలం వారి స్థానంలో ఇద్దరు టీచర్లను తీసుకోవాలి అనుకుంటాడు. అయితే వారు  పెళ్లైన జంట అయిఉండాలని రూల్ పెడతాడు. అదే ఈసినిమాను మలుపుతిప్పే విషయం అవుతుంది. వారు స్కూల్లో పాఠాలతో పాటు తన చిన్న కుమార్తె సీత( జమున)కు సాంప్రదాయ సంగీతం తోపాటు నృత్యంలో కూడా శిక్షణ ఇస్తారని అనుకుంటాడు. 

మరో వైపు మిస్ మేరీ( సావిత్రి) తమను వేదిస్తూ.. తనను బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న డెవిడ్ నుంచి తప్పించుకోవడం కోసం ఉద్యోగ ప్రయత్నంలో ఉంటుంది. జమీందార్ గోపాలం ప్రకటించిన ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నంలో అదే ఉద్యోగానికి వెళ్తున్న ఎన్టీ రావు( ఎన్టీఆర్)ను బురుడీ కొట్టించడంతో అసలు కధ స్టార్ట్ అవుతుంది. ఇక అసలు ఆ జాబ్ కు రూల్ ఏంట తెలుసుకుని..అప్పటికప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారు ఇద్దరు. తమ అవసరాల దృష్య.. భార్యా భర్తలుగా ఒకే ఉద్యోగానికి వెళ్ళడానికి ఇద్దరు ఒప్పందం చేసుకుంటారు.

38
జమీందారు ఇంట్లో అసలు కథ

అయితే యాత్రల్లో తప్పిపోయిన కూతురు మహాలక్ష్మీ.. మేరీ ఒక్కరే కావడంతో.. జమీందారు గోపాలానికి ఆమె అంటే ఎక్కడో తెలియని ప్రేమ ఉంటుంది. దాంతో ఆమెను కూతురుకంటే ఎక్కువగా చూసుకుంటుంటాడు. మరో వైపు తప్పిపోయిన మహాలక్ష్మే మేరీ యేమోననే అనుమానం ఆ ‘డిటెక్టివ్’ రాజుకు వస్తుంది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే జమీందారు, ఆయన భార్య వీళ్లిద్దరిని ‘కూతురూ-అల్లుడూ’ అని వరసలు కలిపేస్తారు. ఈ వరసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ, తన కోపాన్నంతా రావు మీద చూపిస్తూంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే. ఇంటిదగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగి పోయింది. అప్పిచ్చిన డేవిడ్ “బాకీ తీర్చొద్దు నన్ను పెళ్ళి చేసుకో” అని వేధిస్తున్నాడు. వాడి బాకీ వాడి మొహాన కొట్టి, అటు వాడితోనూ, ఇటు రావుతో కూడా.. ఒకేసారి తెగతెంపులు చేసుకునే ఉద్దేశంతో మేరీ ఉంటుంది.

జమీందారు చిన్న కూతురు సీత ఎన్టీ రావుతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంటుంది. ఇది ఆమెను చేసుకోబోయే రాజుకు నచ్చదు. ఒకసారి మేరీ చాలా చిరాకులో ఉండగా.. తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోతుంది. వెంటనే రావు కంగారు పడి ఆమెకు కిరస్తానీ దయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించడానికి అన్నట్టు గా నాయుడు “నువ్వు కాకపోతే మా అల్లుడికి పిల్లే దొరకదనుకున్నవా? మా పిల్లనే ఇచ్చి చేస్తాం.” అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారు పడతాడు. మేరీ దగ్గరకు వెళ్లి.. రావుకు బదులుగా మేరీని సీతకు పాఠాలు చెప్పాలని బ్రతిమలాడుతాడు.

ఈక్రమంలో రాజుకు ఒక అనుమానం వస్తుంది. తప్పిపోయిన మహాలక్ష్మి.. మిస్ మేరీ ఒకరే అని అనకుంటాడు.. ఆ అనుమానం తీర్చుకోవడానికి ఒక రాత్రి తన అసిస్టెంటుతో సహా మేరీ రూమ్ కు వెళ్లి.. ఆమె మీదికి టార్చ్ లైటు వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెలకువ రావడం, డిటెక్టివులు పారిపోవడంతో అంతా గందరగోళమవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలతనిద్రలో ఒక పీడకల.. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్ళి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడిగా రావు కనిపిస్తారు. మెల్లగా రామారావుపై అభిమానం పెరుగుతుంది. ఆతరువాత వారిద్దరు కాస్త క్లోజ్ గా మూవ్ అవుతారు. ఈ క్రమంలో మేరి మహాలక్ష్మీ అని గోపాలం దంపతులకు తెలుస్తుందా? చివరకు కథ క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.

48
మిస్సమ్మ మూవీ రివ్యూ

అసలు 70 ఏళ్ల క్రితం ఇలాంటి కాన్సెప్ట్ రావడమే చాలా గొప్పవిషయం. అప్పట్లో ఆడవారి కట్టుబాట్లు ఎలా ఉండేవో అందరికి తెలుసు. ఒక పెళ్ళి కాని అమ్మాయి .. పరిచయమైనా కాని ఒక పరాయి మగవాడికి భార్యగా నటించడానికి రెడీ అవ్వడం అంటే.. దర్శకుడు అప్పుడే ఎంత అడ్వాన్స్ గా ఆలోచించాడు అనేది తెలుస్తుంది. మిస్సమ్మ సినిమా అంతా సంప్రదాయం, అభ్యుదయం రెండు మిక్స్ కంటెంట్ తో కనిపిస్తుంది. ఎక్కడా ఏ సిద్దాంతాన్ని కించపరిచే విధంగా ఉండదు ఈసినిమా. ఇక ఐదుగురు స్టార్స్ తో.. అద్భుతమైన కథను అత్యద్భుతమై స్క్రీన్ ప్లే తో చక్కగా చూపించారు. ఓపెనింగ్ లోనే ఎన్టీఆర్, సావిత్రి మధ్య కాన్వర్జేషన్ చిలిపి గొడవ బాగుంటుంది. మధ్యలో రేలంగితో కామెడీ స్టంట్లు నవ్విస్తాయి. ఆయనకు ఈ సినిమాలో ఓ సాంగ్ కూడా ఉంటుంది. ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అంటూ.. చరిత్రలో నిలిచిపోయే పాటను ఈ సినిమా నుంచే అందించారు. ఇక మేరీ,రావు గోపాలం ఇంటికివెళ్లిన తరువాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. జమీందారు దంపతులలో అమాయకత్వం, సీత పాత్రలో అల్లరితనం, డిటెక్టీవ్ రాజు పాత్రలో తింగరి తనం, డేవిడ్ పాత్రలో విలనిజం.. ఇలా అన్ని నట రసాల మిళితంగా.. నవరసాలు కలిగిన సినిమాగా మిస్సమ్మను అద్భుతంగా తెరకెక్కించారు. మేరీ తమ కూతురన్న విషయం గోపాలం దంపతులకు ఎప్పుడు తెలుస్తుందా అన్న ఉత్కంఠ ఆడియన్స్ లో కలిగేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. మిస్సమ్మ పాత్ర ఎంత కఠినంగా ఉంటుందో.. అంత ఎమోషన్ ను కూడా అందులో కనిపిస్తుంది. ప్రతీ ప్రేక్షకుడి మనసును తాకేలా ఉంటుంది మిస్సమ్మ..

58
నటీనటులు విషయానికి వస్తే..

మిస్సమ్మ సినిమా కథకు తగ్గ పాత్రలు ఈసినిమాకు ప్లస్ అయ్యాయి. ఎన్టీ రావుగా రామారావు నటన అద్భుతం. ఈసినిమాకు మెయిన్ హీరోగా రామారావు కనిపిస్తాడు. అయితే ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే.. అంత ఇంపార్టెన్స్ ఉన్న రావు పాత్ర కాకుండా.. కామెడీ హీరో రాజా పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు నటించడం గొప్ప విషయం. తక్కువగా ఎక్కువా అనే భేదాలు లేుకుండా.. రాజా పాత్ర చేయడానికి అక్కినేని ముందుకు రావడంచాలా గొప్పవిషయం. నిజానికి ఆ పాత్ర ఆయన అడిగి మరీ తీసుకున్నారట. దాగుబోతు పాత్రల ఇమేజ్ నుంచి బయటపడటానికి అక్కినేని ఇలా చేశారట. ఇక సావిత్రి అంటే అమాయకపు పాత్రలే అందరికి గుర్తుకు వస్తాయి. కానీముక్కుమీద కోపం ఉన్న గడుసు పాత్రలో సావిత్రి నటించిన ఏకైక సినిమా మిస్సమ్మ. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి గొప్ప నటులు ఉన్నా.. ఈసినిమాకు మిస్సమ్మ అని సావిత్రి పాత్ర పేరే టైటిల్ గా పెట్టారంటే... ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటో అర్ధం అవుతుంది. ఈ పాత్రలో అద్భుతంగా నటించింది మహానటి. ఇక అల్లరి పిల్లగా జమున పాత్ర ఈసినిమాకు చాలా ప్లస్ అయ్యిందని చెప్పాలి. జమున పాత్రలో అమాయకత్వం ముచ్చటగా అనిపిస్తుంది. ఇక జమీందారు దంపతులుగా ఎన్వీ రంగారావు, రుష్వేంద్రమణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. ప్రతీ తెలుగువారింట ఇలాంటి దంపతులు ఉండాలి అన్నట్టుగా నటిస్తారు. రేలంగి, రమణారెడ్డి, అల్లు కామెడీ అలరించింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు అద్భుతంగా నటించి మెప్పించారు.

68
సాంకేతిక నిపుణుల పనితనం..

దర్శకుడిగా ఎల్వీ ప్రసాద్ ఆలోచన అద్భుతం.. సినిమాను ఆయన నడిపించిన తీరు కూడా దర్శకుడిగా ఆయన గొప్పతనం చాటి చెప్పింది. ఎక్కడా కొంచెం కూడా బోర్ కొట్టించకుండా ఎస్వీ ప్రసాద్ డైరెక్ట్ చేశారు. అయితే ఈసినిమాకు చక్రపాణి రాసిన స్క్రీన్ ప్లే మిస్సమ్మను ఓ రేంజ్ లో నిలబెట్టింది. ఇక ఈసినిమాకు సంగీతంతో ప్రాణం పోశారు సాలూరి వారు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే పాట, రావోయి చందమామ మా వింత గాధ వినుమా.. పాటలు ఎన్ని సినిమాల్లో రీమిక్స్ చేశారో లెక్కే లేదు. ఇప్పటికీ భర్యా భర్తల మధ్య విరహగీతంగా రావోయి చందమామ పాట వినిపిస్తూనే ఉంటుంది. వీటితో పాటు బృందావనమది అందరిది , తెలుసుకొనవే యువతి లాంటి పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఇక ఈసినిమాకు పింగళి పాటలు,చక్రపాణి మాటలు, నాగిరెడ్డి నిర్మాణ విలువలు.. అన్నీ అద్భుతాలే.. ఎందులోను ఎవరు తక్కువ చేసింది లేదు. అందుకే మిస్సమ్మ ఇంత క్వాలిటీ సినిమాగా రిలీజ్ అయ్యి.. 70 ఏళ్ల తరువాత కూడా సినిమా ప్రేమికుల మనస్సుల్లో నిలిచిపోయింది.

78
భానుమతితో గొడవ.. సావిత్రికి అవకాశం..

మిస్సమ్మలో మొదట అనుకున్న కాస్టింగ్‌ వేరు. ఎమ్టీ రావు పాత్రకి ఎన్టీఆర్‌ని అనుకున్నారు. సావిత్రి నటించిన మేరీ పాత్రకి మొదట భానుమతిని తీసుకున్నారు. కొంత కాలం షూటింగ్‌ కూడా చేశారు. ఒక సోమవారం రోజున భానుమతి షూటింగ్‌కి లేట్‌గా వచ్చారు. స్టార్స్ అంతా వెయిట్ చేస్తుంటే..ఇంత లేట్ గా వస్తారా అని ఆమెపై నిర్మాతలు ఫైర్‌ అయ్యారు. నాకు ఇంట్లో పూజ ఉందని మేనేజర్ కు ముందుగానే చెప్పాను.. అతను మీకు చెప్పకపోతే నాదా తప్పు అని.. భానుమతి నాగిరెడ్డితో వాదించారు. ఆ వాదన పెరిగి పెద్దది అయ్యింది. నిర్మాతలు భానుమతిపై ఫైర్‌ అవ్వడం.. భానుమతి కూడా ఎక్కడా తగ్గకుండా రెచ్చిపోయింది. ఇది కాస్తా ఈగో క్లాష్‌కి దారి తీసింది. దాంతో భానుమతి ఈసినిమా నుంచి తప్పుకున్నారు.. నిర్మాతలు కూడా తీసినంత వరకూ రీల్ ను తగలబెట్టేశారట. భానుమతి పాత్రలో వెంటనే సావిత్రిని తీసుకున్నారు నిర్మాత. నిజానికి ఈసినిమాలో జమున పాత్ర కోసం సావిత్రిని తీసుకున్నారట. కానీ భానుమతి తప్పుకోవడంతో.. సావిత్రి మెయిన్ హీరోయిన్ అయ్యింది.. జమునకు మంచి సినిమా దొరికింది. భానుమతి మాత్రం మంచి పాత్రను పోగొట్టుకోవాల్సి వచ్చింది. అలా భానుమతి వల్ల సావిత్రి, జమున జీవితాలు మారిపోయాయి.

88
మిస్సమ్మ విజయం, రీమేక్ లు

1955, జనవరి 12న రిలీజ్ అయిన మిస్సమ్మ ఘనవిజయం సాధించింది. 13సెంటర్లలో వంద రోజులు ఆడింది. అప్పుడు ఈసినిమాకు ఎదురొచ్చిన సినిమాలన్నీ బోల్తా పడ్డాయి. ఇక ఈసినిమాను తమిళంలో కూడా ఒకేసారి రిలీజ్ చేశారు.అయితే అందులో రామారావు పాత్రలో జెమినీ గణేషన్ నటించారు. తమిళ వెర్షన్‌ 'మిసియమ్మ' గా రిలీజ్ అయిన ఈసినిమాలో అక్కినేని పాత్రను తంగవేలు పోషించారు. ఈ సినిమాని మొత్తం మూడు భాషల్లో తెరకెక్కిస్తే మూడు భాషల్లో ( తెలుగు, హిందీ, తమిళ్ ) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో మిస్ మేరీగా ఈసినిమా రీమేక్ చేశారు. ఇక మిస్సమ్మ  మూవీ సావిత్రి జీవితాన్నే మార్చేసింది. ఆమె `దేవదాస్‌`తో పెద్ద విజయం అందుకున్నా, ఈ సినిమా కమర్షియల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా, ఇండస్ట్రీ హిట్‌ గా నిలవడంతో సావిత్రి కెరీర్‌ బిగ్‌ టర్న్ తీసుకుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి ఫుల్‌ బిజీ అయ్యింది. ఫైనల్‌గా.. తెలుగు సినిమా చరిత్రలో ఒక కల్ట్ క్లాసిక్‌ మూవీగా నిలిచిపోయింది. మిస్సమ్మ సినిమా చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories