
ప్రియదర్శి మొన్నటి వరకు కమెడీ తరహా పాత్రలతో ఆకట్టుకున్నారు. `బలగం` నుంచి ఆయనకు హీరోగా సినిమాలు క్యూ కడుతున్నాయి. కామెడీ నేపథ్యంలో చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన సినిమాలు ఆశించిన ఫలితాన్ని సాధించడం లేదు. ఇటీవల కాలంలో ఆయన హీరోగా నటించిన `డార్లింగ్`, `సారంగపాణి జాతకం`, `మిత్రమండలి` వంటి చిత్రాలు ఎంటర్‌టైన్ చేయడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు `ప్రేమంటే` అనే చిత్రంలో నటించారు. ఇందులో ఆయనకు జోడీగా ఆనంది హీరోయిన్‌గా నటించింది. సుమ కనకాల కీలక పాత్ర పోషించడం విశేషం. అలాగే వెన్నెల కిశోర్, హైపర్ ఆది, రాంప్రసాద్ వంటి వారు నటించిన సినిమాకి నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. నేడు శుక్రవారం(నవంబర్ 21)న విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని అలరించేలా ఉందా? ప్రియదర్శికి హిట్ పడిందా? సుమ కనకాల నవ్వించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
మది(ప్రియదర్శి) ఒక దొంగ. తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక కంపెనీని నడిపిస్తున్నట్టుగా బిల్డప్ కొడుతుంటాడు. మరోవైపు రమ్య(ఆనంది) బిర్యానీ అంటే ఇష్టం, నీట్‌నెస్‌కి ప్రయారిటీ ఇస్తుంది. ఇళ్లు ఏమాత్రం నీట్‌గా లేకపోయినా సహంచదు, అది వాళ్ల ఇళ్లైనా, పరాయి ఇళ్లైనా. మది నైట్ డ్యూటీ చేస్తుండటంతో తనకు పెళ్లి సంబంధాలు సెట్ కావు. పైగా చాలా అప్పులు. వాటిని తీర్చాలి, లైఫ్‌లో బాగా సెటిల్ కావాలనుకుంటాడు. ఓ పెళ్లిలో అనుకోకుండా మది, రమ్య కలుసుకుంటారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి ఆలోచనలు కలుస్తాయి. ఆ పెళ్లిలోనే వీరిద్దరి పేరెంట్స్ కలుసుకుంటారు, పెళ్లి సంబంధం కూడా మాట్లాడుకుంటారు. అది వీరికి తెలియకుండా. పైగా ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలోనే ఒకరి ఫోటోలు మరొకరి వస్తాయి. దీంతో అక్కడే కమిట్ అవుతారు. పెళ్లి చేసుకుంటారు. నెలరోజులు లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. ఆఫీసులకు వెళ్లినప్పట్నుంచి ఒకరినొకరు మిస్ అవుతారు. ఇరుగుపొరుగు ఆంటీలు లేనిపోని విషయాలు చెప్పడంతో మదిపై రమ్యకి అనుమానం పెరుగుతుంది. ఆరా తీయగా తాను దొంగ అని అసలు విషయం చెబుతాడు మది. దీంతో రమ్య షాక్ అవుతుంది. ఆమె ఒత్తిడి మేరకు దొంగతనాలు మానేస్తాడు. కానీ అప్పులు కట్టకపోతే తన ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. అది దక్కించుకోవాలంటే బ్యాంక్ దొంగతనం చేయాలని ఫిక్స్ అవుతారు. ఈ విషయం తెలిసి రమ్య అడ్డుకుంటుంది. బలవంతంగా ఆమెని కూడా ఈ దొంగతనంలో ఇన్‌వాల్వ్ చేస్తాడు. ఆ దొంగతనం చేసే విధానానికి రమ్య ఫిదా అవుతుంది. అయితే ఆ బ్యాంక్ దొంగతనం ఫెయిల్ అవుతుంది. దీంతో ఎవరితో సంబంధం లేకుండా మది, రమ్య కలిసి ఇళ్లల్లో దొంగతనాలు స్టార్ట్ చేస్తారు. ఒక ఆంటీ వచ్చి తన ఇంట్లో దొంగతనం జరిగింది, పింక్ ఎలిమెంట్ బొమ్మని ఎత్తుకుపోయారని పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తారు. ఎస్‌ఐ(వెన్నెల కిశోర్) ఈ కేసుని హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ(సుమ కనకాల)కి అప్పగిస్తాడు. ఈ కేసుని ఆమె చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. మరి దొంగలను పట్టుకుందా? దొంగతనం జరిగిన ప్రతి ఇంట్లో ఇళ్లుని క్లీన్ చేయడం, బిర్యానీ పెట్టడం వెనుక కథేంటి? మది, రమ్య పోలీసులకు దొరికిపోయారా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
ఇటీవల సందర్భానుసారంగా జనరేట్ అయ్యే కామెడీని నమ్ముకొని చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ పేపర్‌పై అనుకున్న కామెడీ తెరపై వర్కౌట్ కావడం లేదు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఇలానే డిజప్పాయింట్ చేశాయి. ఆ జాబితాలో ఇప్పుడు ప్రియదర్శి నటించిన `ప్రేమంటే` కూడా చేరుతుందని చెప్పొచ్చు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందించారు. అయితే రొమాన్స్ కొంత వరకు ఫర్వాలేదు. కాకపోతే అది ఆడియెన్స్ ఫీలయ్యేలా లేదు. కొంత రొటీన్‌గానే అనిపిస్తుంది. ఇక కామెడీ మాత్రం ఇందులో అది వర్కౌట్ కాలేదు. వాళ్లు గోల గోల చేస్తుంటారు తప్పితే, ఆ ఫన్ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. దొంగతనం చేయడంలో హీరోయిన్ థ్రిల్ ఫీలవుతుంది, కానీ ఆ థ్రిల్ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. దీంతో సినిమా చాలా రెగ్యూలర్‌గా, రొటీన్‌గా సాగుతుంది. సీన్ బై సీన్ సాగిపోతున్నట్టుగానే ఉంటుంది. ఎక్కడా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించదు. కొన్ని చోట్ల ఫర్వాలేదు, కానీ ఆ డోస్ సరిపోదు. పైగా ఆ ఫన్ కంటిన్యూ అవదు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్‌లో వెన్నెల కిశోర్, సుమ కనకాల మధ్య కామెడీ సీన్లు పెట్టారు. సుమ పాత్ర చేసే ఓవరాక్షన్‌కి, వెన్నెల కిశోర్ ఎప్పటిలాగానే రియాక్షన్ ఉంటుంది. ఆయా సీన్లలోనూ కామెడీ పండలేదు. కామెడీ పరంగా ఈ ఇద్దరు పాత్రలనే ఎక్కువగా వాడుకున్నారు. దీనికితోడు రాంప్రసాద్, హైపర్ ఆదిలను కూడా పెట్టారు. వాళ్లు కూడా చేతులేత్తేసే పరిస్థితి నెలకొంది. ఓ వైపు మది, రమ్యల మధ్య చిన్న చిన్న గొడవలు, మరోవైపు పోలీస్ స్టేషన్‌లో సుమ, వెన్నెల కిశోర్ మధ్య వాదనలు ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. దొంగతనం సీన్లు కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఇలా ప్రతి సీన్, ప్రతి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది. కొన్ని చోట్ల ఫన్ ఫర్వాలేదనిపిస్తుంది. కానీ సరిపోయేలా లేదు. ఓవరాల్‌గా గోల తప్ప ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వడంలో `ప్రేమంటే` విఫలమయ్యిందని చెప్పొచ్చు.
మది పాత్రలో ప్రియదర్శి చాలా బాగా నటించార. తనవంతు బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ నవ్వులు పంచలేకపోయారు. ఇక రమ్య పాత్రలో ఆనంది చలాకీగా, యాక్టివ్‌గా కనిపించింది. ఆమె సందడి బాగుంది. కానీ ఆమె కూడా నవ్వించలేదు. రొమాంటిక్ సీన్లలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సుమ కనకాల పాత్ర కొన్ని చోట్లు ఫర్వాలేదు, కానీ చాలా చోట్ల సహనానికి టెస్టింగ్‌గా లా ఉంటుంది. ఆమె బాగానే నటించినా ఫన్ వర్కౌట్ కాలేదు. మరోవైపు వెన్నెల కిశోర్, హైపర్ ఆది, రాంప్రసాద్ నవ్వించేందుకు చాలా ప్రయత్నించారు. మిగిలిన పాత్రలు జస్ట్ ఓకే అని చెప్పొచ్చు.
టెక్నీకల్‌గా మూవీ బాగానే ఉంది. లియోన్స్ జేమ్స్ అందించిన సంగీతం బాగానే ఉంది. పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్ కూడా ఫర్వాలేదు. రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది. విశ్వనాథ్ రెడ్డి కెమెరా వర్క్ సైతం ఆకట్టుకునేలా కలర్‌ఫుల్‌గా ఉంది. రాఘవేంద్ర తిరున్ ఎడిటింగ్ ఫర్వాలేదు. ఇంకాస్త ట్రిమ్ చేయోచ్చు. పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా రిచ్‌గా ఉంది. ఇలాంటి సినిమాలకు కామెడీ వర్కౌట్ అయితేనే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు, వాళ్లు ఎంజాయ్ చేస్తారు. లేదంటే నిరాశ తప్పదు. అది రైటింగ్ స్టేజ్‌లో బాగున్నా, తెరకెక్కించే స్టేజ్‌లో మిస్ ఫైర్ అవుతుంది. చాలా వరకు కామెడీ సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది. `ప్రేమంటే` చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తీసుకున్న పాయింట్ ఫర్వాలేదు, కానీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో ఆయన తడబాటు కనిపిస్తుంది. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసేలా? ఎంగేజ్ చేసేలా ఈ మూవీని తెరకెక్కించలేకపోయారు.
ఫైనల్‌గా: నవ్వించలేకపోయిన `ప్రేమంటే`.
రేటింగ్ 1.75