
ప్రముఖ పాపులర్ నిర్మాత, దర్శకుడు మోహన్ వడ్లపట్ల రూపొందించిన చిత్రం `ఎం4ఎం`(మోటివ్ ఫర్ మర్డర్). జో శర్మ, సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, ఎంఆర్‌సీ వడ్లపట్ల, రాజేష్ మాత్రే, గీతా భాస్కర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో మోహన్ వడ్లపట్ల రూపొందించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(మే 8)న విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
సిటీలో స్టార్ హీరో రంజిత్(కృష్ణ తేజ) హత్యకు గురవుతాడు. అతను బట్టలు లేకుండా ఒక పెయింటింగ్ ఆకారంలో కూర్చుంటాడు. ఈ హత్యతో సిటీ ఒక్కసారిగా కలవరానికి గురవుతుంది. ఈ కేసుని ఏసీపీ కృష్ణ(సంబీత్ ఆచార్య) ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అతని భార్య రాధ(జో శర్మ) లెజిట్ న్యూస్ పేపర్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంటుంది. కృష్ణకి ఈ కేసు విషయంలో సపోర్ట్ చేస్తుంటుంది. వీరిద్దరు కలిసి విచారించే క్రమంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. పాపులర్ అయిన వ్యక్తులు వరుసగా హత్యకు గురవుతుంటారు. అందరిని విభిన్నమైన పెయింటింగ్ ఆకారాల్లో కూర్చోబెడుతుంటాడు హంతకుడు. ప్రారంభంలో చెప్పకుండా హత్య చేసిన హంతకుడు ఆ తర్వాత చెప్పి చేస్తుంటాడు. అయినా అతన్ని పట్టుకోలేకపోతారు పోలీసులు. ఈ క్రమంలో సిటీ కమిషనర్ ని కూడా చంపేస్తారు. దీంతో ఈ కేసుని మరింత సీరియస్‌గా తీసుకుంటారు. మరి ఇంతకి హంతకుడు ఎవరు? చంపేసి ఎందుకు పెయింటింగ్ రూపంలో బాడీని కూర్చోబెడుతున్నాడు? అతని మోటివ్ ఏంటి? పోలీసులు విచారణలో తెలిసి షాకింగ్ విషయాలేంటి? ఈ మిస్టరీ ఎలా వీడిందనేది మిగిలిన సినిమా.
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలన్నీ ఒకేలా ఉంటాయి. వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దాన్ని పోలీసులు విచారిస్తుంటారు. ఒక కేసు విచారించే క్రమంలో మరిన్ని హత్యలు జరుగుతుంటాయి. దీంతో అది పోలీసులకు తలనొప్పిగా మారుతంది. వరుసగా సస్పెన్స్ అంశాలు, ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారంగా సాగుతుంది. ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. అయితే తీసుకున్న పాయింట్ ఇందులో కొత్తగా ఉంది. పెయింటింగ్ తరహాలో ఒక వ్యక్తి ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతనికి ఉన్న సమస్య ఏంటి? సైకలాజికల్‌గా ఎలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు ఇలాంటి హత్యలకు పాల్పడుతుంటారనేది ఇందులో చూపించారు. అదే ఈ సినిమా స్పెషాలిటి. దర్శకుడు మోహన్ వడ్లపట్ల ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అదే సమయంలో హంతకులు ఎవరనే సస్పెన్స్ ఇందులో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే ఇప్పుడు సినిమాని ఆడియెన్స్ చూసే కోణం మారింది. వాళ్లు చాలా ఫాస్ట్ అయ్యారు. డిటెయిలింగ్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో దర్శకుడు వెనకబడినట్టు అనిపిస్తుంది. ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇస్తూ సినిమాని నడిపించిన తీరు బాగుంది. సెకండాఫ్‌లో వాటిని రివీల్ చేసి, ఫైనల్‌గా ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎలాంటి మనస్థత్వం ఉన్న వాళ్లు ఇలా తయారవుతారనేది చెప్పిన తీరు బాగుంది. ఆలోచింప చేసేలా ఉంటుంది. కాకపోతే సినిమా స్లోగా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ కూడా అలానే ఉంటుంది. చాలా సన్నివేశాలు ఊహించేలా ఉంటాయి. ఎంత సేపు అక్కడక్కడే కథ తిరిగినట్టుగా ఉంటుంది. కాకపోతే హంతకుడు ఎవరనే విషయంలో ఆడియెన్స్ దృష్టిని డైవర్ట్ చేసి ఎంగేజ్ చేసే విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
నటీనటులు
లేడీ జర్నలిస్ట్ గా జో శర్మ అదరగొట్టింది. ఆమెనే సినిమాకి మెయిన్ లీడ్ అనేలా చేసింది. లుక్ పరంగానూ ఆకట్టుకుంది. ఏసీపీ కృష్ణగా సంబీత్ ఆచార్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో రంజిత్‌గా కృష్ణ తేజకి మంచి పాత్ర పడింది. కాకపోతే నిడివి లేదు. శుభలేఖ సుధాకర్ ఫర్వాలేదనిపించారు. ధాస్యం గీతా భాస్కర్ పాత్ర సర్‌ప్రైజ్ చేస్తుంది. మిగిలిన ఆర్టిస్టు లు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.
టెక్నీకల్‌గా చూస్తే.. సంతోష్ షణ్మోని అందించిన విజువల్స్ బాగున్నాయి. వసంత్ అందించిన మ్యూజిక్ బాగుంది. బీజీఎం కొత్తగా, ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ పరంగా ఇంకా స్పీడ్ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు.
ఫైనల్‌గా: ట్విస్ట్ లు, సస్పెన్స్ తో కొంత వరకు ఎంగేజ్ చేసే ఎం4ఎం.
రేటింగ్: 2.5