#LoveToday:క్రేజీ కాన్సెప్టు 'లవ్ టుడే' రివ్యూ

First Published | Nov 25, 2022, 7:12 AM IST

 త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి ఘ‌న విజ‌యాన్ని అందుకుంది.  రోమ్ కామ్ మూవీగా రూపొందిన ల‌వ్ టుడే సినిమాను దిల్ రాజు తెలుగులో విడుద‌ల చేయ‌నుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 

Love Today Movie Review


కొన్ని ట్రైలర్స్ ..సినిమా ఏంటో..దాని కథాంశం ఏమిటో...కాంప్లిక్ట్ ఏమిటో చెప్పేస్తాయి. అది మనకు కనెక్ట్ అయ్యిందా లేదా అన్నదాన్ని బట్టి ఆ సినిమా మనం చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటాం. అలాగే ఓ భాషలో సూపర్ హిట్టైన డబ్బింగ్ సినిమా అనగానే తెలియకుండానే దానిపై మనస్సు పోతుంది. అది అంత పెద్ద హిట్ కు కారణం ఏమిటా..ఏముంది అందులో అనే సహజమైన ఆసక్తి సినిమా వైపు మనని డ్రైవ్ చేస్తుంది. ఈ రెండు అంశాలు ఈ సినిమాకు కుదిరాయి. సినిమాని వెంటనే చూడాలనే ఆసక్తిని కలిగించాయి. అయితే ప్రతీ డబ్బింగ్ సినిమా మన దగ్గర ఆడాలని రూల్ లేదు. అలాగే ట్రైలర్ అద్బుతంగా ఉండి సినిమా చీదేసినవి ఉన్నాయి. ఈ సినిమా ఏ కోవకు చెందినది...ఈ సినిమా కథ ఏమిటి...తెలుగు వారికి నచ్చే కంటెంట్ ఉన్న సినిమాయేనా వంటి వివరాలు రివ్యూలో చూద్దాం.


కథాంశం:

ఇదో సింపుల్ స్టోరీ లైన్. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నికిత (ఇవాన)కు ఇంట్లో వాళ్లకు చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది . ఎందుకంటే... నికిత కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దాంతో  వెంటనే త‌న తండ్రితో మాట్లాడ‌మ‌ని ప్ర‌దీప్‌ని పోరుతుంది. అయితే ఈ లోగా నికిత తండ్రి వేణు శాస్త్రి (స‌త్య‌రాజ్‌) వీరి ప్రేమ రివీల్ అయ్యిపోతుంది. దాంతో వేణుని ఇంటికి పిలిచి..తను ఏమీ వీరి ప్రేమకు అడ్డమేమీ కానని..కాకపోతే ఓ చిన్న కండీషన్ అని చెప్తాడు. అదేమిటంటే...ఓ రోజు ఇద్ద‌రూ త‌మ ఫోన్స్‌ను మార్చుకోవాల‌ని అంటాడు. దాంతో ఇద్ద‌రూ భ‌య‌ప‌డ‌తారు. కానీ వేరే ఆప్షన్ లేక వేణు శాస్త్రి చెప్పిన కండీషన్ కు ఓకే చేసి ఫోన్స్ మార్చుకుంటారు. అలా ఫోన్స్ మారిన క్ష‌ణం నుంచి ఆ ప్రేమికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు జ‌రిగాయి? ఒక‌రి గురించి మ‌రొక‌రికి ఎలాంటి డార్క్ సీక్రెట్స్  తెలిసాయి? చివరకు వారి ప్రేమ కథ  ఎలా ఓ కొలిక్కి వచ్చిందా ? వంటి  విష‌యాలు  తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 



విశ్లేషణ:

పైన చెప్పినట్లు ట్రైలర్ లోనే కథలో కీలక విషయం ఏమిటో చెప్పేసారు. ఇవి ట్రీట్మంట్ కథలు. పాయింట్ గా చాలా చిన్నగా ఉన్న లవర్స్ ..ఒకరి ఫోన్ లు మరొకరికి మార్చటం అనే సెంట్రల్ ఐడియాని డవలప్ చేయటం అంత ఈజీ కాదు. ఒక సీన్ తర్వాత మరొకటి దండలా అల్లుకుంటూ పోయారు. స్క్రీన్ ప్లే అయితే సెగ్మింట్ లుగా డిజైన్ చేసారు. ఫస్టాఫ్ లో అంతా హీరోయిన్ ఫోన్ లోని సీక్రెట్స్ కు కేటాయిస్తే..సెకండాఫ్ హీరో సీక్రెట్స్ బయిటపడటం కు కేటాయించారు.  మన ప్రస్తుత పాప్ కల్చర్ కు సంభందించిన విషయాలతో సీన్స్ చేసారు.  అంతకు ముందు 2017లో ‘అప్పా లాక్’ అనే నాలుగు నిమిషాల షార్ట్ ఫిల్మ్  ని తీసాడు. ఇప్పుడు దాన్ని విస్తరించి సినిమా చేసాడు. చాలా మంది ఈ విస్తరణ కార్యక్రమంలోనే క్లీన్ బౌల్డ్ అయ్యిపోతూంటారు.  ఎంత బోర్ కొట్టేస్తారంటే...మళ్లీ ఇదే డైరక్టర్ సినిమా తీస్తే చూడకూడదు అని ఆ డైరక్టర్ పేరు గుర్తు పెట్టుకునేటంత. కానీ ప్రదీప్ రంగనాథన్...ఎక్కడికి అక్కడ ఎంగేజింగ్ ఈవెంట్స్ తో క్విక్ గా సాగిపోయే స్క్రీన్ ప్లే తో దాన్ని దాటాడు. అలాగే హీరో పాత్ర అనగానే ...తోపు, కేక అనకుండా ఓ సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడులాగా అనిపిస్తాడు. నార్మల్ జీవిత సంఘటనలును తెరపైకి తెస్తాడు.
 


ప్రధాన పాత్రలు రెండు కూడా  తమను తాము పత్తిత్తులు..పరం జ్యోతిలు  కావని ఒప్పుకుంటాయి. దాంతో తెరపై కనిపించే ఆ ఇద్దరూ మనకు మనలాగే అనిపిస్తాయి. సినిమా చూస్తూంటే మన  స్మార్ట్ ఫోన్ లో ఉన్న సీక్రెట్స్ కూడా గుర్తు వస్తాయి. అవి బయిటపడితే అమ్మో అనిపిస్తుంది. కాన్సెప్టు పరంగా అదో ప్లస్. అన్నిటికన్నా ముఖ్యంగా మోడ్రన్ డే లవ్ ని ఫన్ తో ఫిల్ చేయటం కలసివచ్చింది. అదే కథను హీరో వైపు నుంచి మాత్రమే నడిపి, అతని సీక్రెట్స్ మాత్రమే ఆమెకు తెలిసి గొడవ అయితే పెద్దగా కిక్ ఉండకపోను. హీరోయిన్ కు డార్క్ సీక్రెట్స్ ఉండటం, ఆమె గురించి కూడా హీరో తెలుసుకోవటం దగ్గరే సినిమా కథ పరంగా సక్సెస్ అయ్యిపోయింది. ఫైనల్ గా ఏ రిలేషన్ షిప్ నిలబడాలన్నా  నమ్మకం కావాలని ముగిస్తాడు. అవును..నిజమే కదా అనిపిస్తాడు.  గతంలో మారుతి మన దగ్గర ఇలాంటి ఫన్ తో కలిసి యూత్ లవ్ స్టోరీ లు గతంలో ట్రై చేసాడు. అయితే ఇప్పటి కాలానికి తగిన కథ ఇది. 

love today

స్క్రీన్ ప్లే పరంగా చూస్తే ...మెయిన్ క్యారక్టర్స్ రెండింటి గురించి పూర్తిగా రివీల్ అయ్యిపోయాక ప్లాట్ గా మారిపోతుంది. అయితే సబ్ ప్లాట్ గా ఉన్న యోగిబాబు స్టోరి  ఆ ప్రమాదం నుంచి కొద్దిగా తప్పించింది. అలాగే ఫన్ కు ఎమోషన్ తోడు అయితేనే వర్కవుట్ అవుతుందని డైరక్టర్ కు స్పష్టంగా తెలుసు. అందుకే..ప్రీ క్లైమాక్స్ నుంచి ఎమోషనల్ గా లాక్ చేయటం మొదలెడతాడు. క్లైమాక్స్ లో వచ్చే బీచ్ సీన్ ...బెస్ట్ గా అనిపిస్తుంది. అక్కడ ఫన్ చేయకపోవటం డైరక్టర్ తీసుకున్న జాగ్రత్త. ఆ సీన్స్ సినిమాకు ARC ఇచ్చాయి. అయితే ఇదంతా ఫస్టాఫ్ స్లోగా స్టార్ట్ అవటం, క్లైమాక్స్ ని ఇంత కన్వీన్సింగ్ గా ముగించాడు అనకోకుండా చూస్తేనే. 

love today


టెక్నికల్ గా ...
చాలా సార్లు చెప్పుకున్నట్లు రొమాంటిక్ కామెడీలకు మంచి ఫన్ ఎంత అవసరమో..మంచి సంగీతం, కళ్లకు ఇంపైన విజువల్స్  ప్రాణ వాయువు లాంటివి. ఈ విషయంలో ఈ సినిమా సక్సెస్ సాధించింది.  సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం బాగా ప్లస్ అయ్యింది. . ‘పిల్లా పడేశావే’, ‘ప్రాణం పోతున్నా’ పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్  చాలా సీన్స్  ఇంకా బాగా పండేందుకు ఊతమిచ్చింది.  ప్రదీప్ ఈ.రాఘవ్ ఎడిటింగ్ కొంత స్పీడప్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది.   దినేష్ పురుషోత్తమన్ విజువల్స్‌ ..చిన్న సినిమాకు రిచ్ లుక్ తెచ్చాయి. డైరక్టర్ గా ప్రదీప్ నీట్ గా వర్క్ చేసాడు. 
 

love today


నటీనటుల్లో 

ధనుష్ ని అనుకరిస్తూ చేసిన నటన కొన్ని సార్లు అతి అనిపించినా  ...చాలా సార్లు బాగా చేసాడనిపిస్తుంది. ఫన్ ని ప్రతిభావంతంగా మోసుకెళ్లినా.. ఎమోషన్ సీక్వెన్స్ లు  చేయటంలోనే వెనక బడ్డాడు. అయినా డైరక్టర్ గా  తెర వెనక చేస్తూ నటుడుగా తెరపై చేయటం మామూలు విషయం కాదు. హీరోయిన్ ఇవానాకు బాగా చేసింది అనేదాని కన్నా ఆమెకు అలాంటి పాత్ర దొరికిందనాలి.  యోగి బాబు ఎప్పటిలాగే బాగా చేసారు. నవ్వించారు.  సత్యరాజ్, రాధిక వంటి సీనియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.

love today


బాగున్నవి
కాన్సెప్టు
క్లైమాక్స్ లో యవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
 యోగిబాబు పాత్ర, అతనితో చెప్పించే డైలాగ్స్

బాగోలేనివి

ప్రెడిక్టబుల్ ఎండింగ్
క్లైమాక్స్ కు వచ్చేసరికి కనువిప్పు కథలా మారటం
 డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం
 


ఫైనల్ థాట్

నువ్వేంటో చెప్పాలంటే గతంలో నీ ప్రెండ్స్ ఎవరో చెప్పమనేవారు. ఇప్పుడు నువ్వేంటో నీ సెల్ ఫోన్ , నీ బ్రౌజింగ్ హిస్టరీ చూస్తే చాలు. నీ జీవిత చరిత్ర మొత్తం పంచరంగల్లో వెండితెరపై కనపడుతుంది.

యూత్  పల్స్ పట్టడం అంటే బూతు ని తెరకెక్కించటం కాదు అని ఈ సినిమా నొక్కి చెప్తుంది. చిన్న స్టోరీ లైన్ ఎంత ఇంప్రెసివ్ గా విస్తరించి చెప్పచ్చో వివరిస్తుంది.


----సూర్య ప్రకాష్ జోశ్యుల

రేటింగ్ : 2.75


బ్యాన‌ర్‌: ఎ.జి.ఎస్‌.ఎంట‌ర్‌టైన్మెంట్ 
నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, ఇవానా, యోగిబాబు, సత్యరాజ్, రాధిక తదితరులు
ఛాయాగ్రహణం : దినేష్ పురుషోత్తమన్
సంగీతం: యువన్ శంకర్ రాజా
 తెలుగులో రిలీజ్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్
విడుదల తేదీ: నవంబర్ 25, 2022

Latest Videos

click me!