#Masooda: సంగీత 'మసూద' రివ్యూ

First Published | Nov 18, 2022, 2:31 PM IST

'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తర్వాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన సినిమా 'మసూద' (Masooda Movie). ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు విడుదల చేశారు. 

Masooda

ఓ చిన్న సినిమా జనాల దృష్టిలో పడటం అంటే మామూలు విషయం కాదు. టీజర్,ట్రైలర్స్ తో ఈ సినిమా ఆ పనిచేయగలిగింది. విభిన్నమైన టైటిల్ తో, ఆకట్టుకునే విజువల్స్ తో ఈ సినిమా చూడాలనే ఆసక్తి కలిగించింది. ప్యూర్ హారర్ సినిమాగా ప్రచారం జరిగిన ఈ సినిమాలో పెద్దగా స్టార్ కాస్టింగ్ కూడా లేదు. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం హారర్ అభిమానులు ఎదురుచూసారు. వారి ఇంట్రస్ట్ ని ఈ సినిమా సస్టైన్ చేసిందా...సినిమా కథేంటి..ఈ టైటిల్ వెనక ఉన్న విషయం ఏమిటి...రెగ్యులర్ హారర్ సినిమాలకు ఈ సినిమాకు తేడా ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

Masooda


కథాంశం 

నీలం (సంగీత) తన భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్‌)కు దూరంగా ఉంటూ తన కూతురు నాజియా(బాంధవి శ్రీదర్)ను కళ్లల్లో పెట్టుకుని చదివించుకుంటూ ఉంటుంది. తను ఓ స్కూల్ లో సైన్స్ టీచర్ గా పనిచేస్తూ చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తూంటుంది.  నీలం పక్కింట్లోనే ఉండే గోపీ (తీరువీర్) కాస్త భయస్థుడు. అతనే ఈ కుటుంబానికి మోరల్ సపోర్ట్ గా ఉంటూంటాడు. చిన్న చిన్న విషయాలకు అతని సాయిం తీసుకుంటూంటుంది ఈ కుటుంబం.  మరో ప్రక్క గోపీ తన సహోద్యోగి మినీ (కావ్యా కళ్యాణ్‌ రామ్)ను ప్రేమిస్తుంటాడు.  ఈ క్రమంలో ఓ రోజు హఠాత్తుగా నాజియా వింతగా ప్రవర్తించటం మొదలెడుతుంది. డాక్టర్స్ కు చూపెడతారు ..ఫలితం ఉండదు. దాంతో దెయ్యం పట్టి ఉంటుందన్న అనుమానంతో ఆ దిసగా ప్రయత్నాలు చేస్తూంటారు. పీర్ బాబా (శుభలేఖ సుధాకర్), అల్లాఉద్దీన్ (సత్యం రాజేష్‌) సాయింతో దెయ్యాన్ని పాలద్రోలే కార్యక్రమం చేపడతారు. అయితే నాజియాకు పట్టిన దెయ్యం మామూలుది కాదు. ఆమెతో పోరాటం కష్టమవుతుంది. ప్రాణాలకి తెగించాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఏమి జరిగింది..ఇంతకీ మసూద ఎవరు...మసూదకు నజియాకు ఉన్న సంబంధం ఏంటి ? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  


Masooda

ఎనాలసిస్ ...
కామెడీ హారర్ లు వచ్చాక తెలుగులో ప్యూర్ హారర్ సినిమాలు తగ్గిపోయాయి. అప్పడప్పుడూ రామ్ గోపాల్ వర్మ దెయ్యం సినిమాలు వచ్చినా అవీ కాలం చెల్లిన దెయ్యాలు కావటంతో భయపెట్టేవి కాదు. ఈ క్రమంలో దెయ్యాలతో డబ్బులు రాలవని నిర్మాతలు సైడ్ అయ్యిపోయారు. కానీ  నిజంగా భయపెట్టే హర్రర్‌ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఆదరణ ఉంటుందని అప్పుడప్పుడూ హాలీవుడ్ సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ముస్లిం కుటుంబ నేపధ్యం తీసుకుని...దెయ్యం కథను చెప్పాలనుకోవటం ఆసక్తికరమైన విషయమే.అలా చేయకపోతే ఇది మామూలు రెగ్యులర్ రొటీన్ దెయ్యం కథ అయ్యేది.

Masooda

 'మసూద' అంతా ముస్లిం నేపథ్యంలో సాగడంతో... ఆ తేడా కనిపించింది. పీర్ బాబాలు ఆత్మలను వదిలించడానికి ఇస్లాం పద్దతిలో చేసే  పూజలు , మసీదులో మంత్రించిన కత్తితో దెయ్యాన్ని అంతం చేసే ప్రయత్నం వంటివి కొత్తగా అనిపిస్తాయి. అలాగే సంగీత పాత్రకు ప్లాష్ బ్యాక్ పెట్టకపోవటం, దెయ్యం కు బ్రతికున్నప్పుడు అన్యాయం జరిగిందని, పగ ప్రతీకారం ఉందని చెప్పకుండా..అది ఓ దెయ్యం..బతికున్నప్పుడు , చచ్చినప్పుడు కూడా అని తేల్చేయటం కొత్తగా బాగుంది. అయితే కథలోకి రావటానికి చాలా సమయం తీసుకున్నారు. ఫస్టాఫ్ మొత్తం సెటప్ కే సరిపోయింది. ఇంటర్వెల్ నుంచి కథ కదులుతుంది. చివరి అరగంట లాగినట్లు అనిపించినా, థ్రిల్లింగ్ గా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కలిగిస్తుంది.  'మసూద'తో హారర్ ఎలిమెంట్స్ కూడా రొటీన్ గా భయపెట్టేవి తీసుకోకపోవటం మరో ప్లస్ పాయింట్ . 

Masooda

టెక్నికల్ గా...

ఇలాంటి సినిమాలకు అవసరమైన సౌండ్ డిజైనింగ్, నేపధ్య సంగీతం ఫెరఫెక్ట్ గా వర్కవుట్ చేసారు. అలాగే, నగేష్ బనెల్ సినిమాటోగ్రఫీతో కొన్ని సీన్స్  భయపెట్టాయి. సెకండాఫ్ లో లెంగ్త్ కొంచెం ఎక్కువైంది. ఎడిటింగ్ క్రిస్పీగా చేస్తే బావుండేది.  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు సాయికిరణ్  కష్టం ప్రతీ షాట్ లోనూ కనపడుతోంది.

Masooda

నటీనటుల్లో...

ప్రధాన పాత్రలు సంగీత, తిరువీర్‌, కావ్య, భాందవి సినిమాకు పిల్లర్స్ గా నిలిచారు. శుభలేఖ సుధాకర్‌, సత్యం రాజేష్‌, సత్య ప్రకాశ్‌, అఖిలా రామ్‌ వీరంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.ముఖ్యంగా తన కూతురని బాగు పర్చడానికి కష్టాలు పడే పాత్రల్లో సంగీత చాలా బాగా చేసింది.దెయ్యం పట్టిన అమ్మాయిగా భాందవి నటన మెప్పించింది.

Masooda

ప్లస్ లు 
ముస్లి నేపధ్యం ఎంచుకోవటం
బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌
సినిమాటోగ్రఫీ
తిరువీర్ నటన

మైనస్ లు
లెంగ్తీ గా, ఇంకా సినిమా అవ్వదేంటి అనిపించటం
 విపరీతమైన వయిలెన్స్
స్లో నరేషన్‌

Masooda


ఫైనల్ థాట్:
నేపధ్యం మార్చితే పాత దెయ్యం  కూడా కొత్తగా భయపెడుతుంది. భయపడటం కూడా ఓ ఎమోషన్. అది ఈ సినిమా బాగానే అందిస్తుంది. 
రేటింగ్‌ : 2.75/5


---సూర్య ప్రకాష్ జోశ్యుల

Masooda

నటీనటులు : సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు
ఛాయాగ్రహణం : నగేష్ బనెల్
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం : సాయికిరణ్ 
విడుదల తేదీ: నవంబర్ 18, 2022
 

Latest Videos

click me!