Kishkindapuri Movie Review: కిష్కింధపురి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బెల్లంకొండ, అనుపమ భయపెట్టించారా?

Published : Sep 12, 2025, 06:43 AM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన మూవీ `కిష్కింధపురి`. హర్రర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. మరి మూవీ ఆడియెన్స్ ని భయపెట్టడంలో సక్సెస్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
17
కిష్కింధపురి`మూవీ రివ్యూ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చివరగా `భైరవం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అది బాగానే మెప్పించింది. ఇప్పుడు `కిష్కింధపురి` అనే చిత్రంతో భయపెట్టేందుకు వచ్చారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీని షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మించారు. అర్చన సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 12న) విడుదలైంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది, సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
`కిష్కింధపురి`మూవీ కథః

రాఘవ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌), మైథిలి(అనుపమ పరమేశ్వరన్‌) సహజీవనం చేస్తుంటారు. వీరిద్దరు జనాలకు హర్రర్ ఎక్స్ పీరియెన్స్ ని అందించే సంస్థలో పనిచేస్తుంటారు. వీరు ప్లాన్‌ చేస్తే దానికి తిరుగుండదు. చాలా సార్లు థ్రిల్‌ని ఇష్టపడే వారికి పాత భవనాలకు తీసుకెళ్లి అక్కడ దెయ్యం ఉందని చెప్పి ఆ థ్రిల్‌ని అందిస్తుంటారు. అయితే ఈ సారి రూట్‌ మార్చారు. లాటరీని ఫాలో అయ్యారు. ఆ లాటరీ ప్రకారం ఈ సారి సువర్ణ రేడియో స్టేషన్‌ వస్తుంది. అందులోకి రాఘవ, మైథిలి కూడా ఎప్పుడూ వెళ్లలేదు. విహారి, లోకో పైలట్స్ (భద్రం, శ్రీకాంత్‌ అయ్యంగార్‌)తోపాటు పాప, ఓ జంట, మరో వ్యక్తి వస్తారు. సువర్ణ రేడియో స్టేషన్‌ కి తాళం వేసి ఉంటే దాన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్తారు. అందులోకి వెళ్లాక నిజంగానే అందులో శబ్దాలు వినిపిస్తుంటాయి. రేడియో స్టేషన్‌ ఆన్‌ అవుతుంది. రేడియోలో ఓ లేడీ వాయిస్‌ వినిపిస్తుంది. దెయ్యం ఆ రేడియో స్టేషన్‌లోకి వస్తుంది. వారిని బయటకు పంపిస్తుంది. తనకు విముక్తి కలిగిందని, ఇక అందరు చనిపోతారంటూ వార్నింగ్‌ ఇస్తుంది. ఆ తర్వాత రేడియోలో ప్రకటిస్తూ ఒక్కొక్కరిని చంపుతుంది. అందులోకి వెళ్లిన ప్రతి ఒక్కరు చనిపోతారని స్థానికంగా ఉన్న ఓ కుర్రాడు చెబుతాడు. వాళ్లమ్మ అదే చెబుతుంది. వేదవతినే ఇలా అందరిని వెంటాడి చంపుతుందని ఆమె చెప్పడంతో రాఘవ, మైథిలిలో భయం స్టార్ట్ అవుతుంది. అన్నట్టుగానే లోకో పైలట్స్ చనిపోతారు. మొదట ఇది నమ్మని రాఘవ ఈ చావులు చూశాక నిజమే అని నమ్ముతాడు. ఆ తర్వాతి వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు, కానీ అతన్ని చంపేస్తుంది ఆ దెయ్యం. అనంతరం తన పక్కింటి చిన్నారిని టార్గెట్ చేస్తుంది. మరి ఆ చిన్నారితోపాటు మిగిలిన వారిని కాపాడేందుకు రాఘవ, మైథిలి ఏం చేశారు? ఆ వేదవతి ఎవరు, ఆమె కథేంటి? ఇంతకి ఆ సువర్ణ రేడియోస్టేషన్‌లో ఏం జరిగిందనేది? దీనికి స్వస్తిక్‌ అనే వికలాంగుడికి ఉన్న లింకేంటి? అతని కథేంటి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.

37
`కిష్కింధపురి`మూవీ విశ్లేషణః

కామెడీ హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. బాగా బయపెట్టి థ్రిల్‌కి గురిచేసిన చిత్రాలు మంచి ఆదరణ పొందుతాయి. `చంద్రముఖి` నుంచి ఈ మూవీస్‌ అడపాదడపా వస్తూనే ఉన్నాయి. బలమైన కంటెంట్‌, ట్విస్ట్ లు, థ్రిల్‌ఎలిమెంట్లు బాగా ఉన్న సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయి. ఆ కోవలోనే ఇప్పుడు `కిష్కింధపురి` మూవీ వచ్చింది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ కలిసి నటించడం విశేషం. గతంలో ఈ ఇద్దరు `రాక్షసుడు` అనే మూవీ చేశారు. అది హర్రర్‌ మేళవింపుతో ఉన్న క్రైమ్‌ థ్రిల్లర్‌. ఇప్పుడు మరోసారి హర్రర్‌ థ్రిల్లర్‌తో వచ్చారు. ఇటీవల కాలంలో వచ్చిన  కామెడీ హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీ `కిష్కింధపురి` అని చెప్పొచ్చు. కథ పరంగా పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు, కానీ భయపెట్టడంలో, థ్రిల్‌ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. హర్రర్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లని ఇందులో బలంగా డిజైన్‌ చేశారు, దానికి తగ్గట్టుగానే ఆర్‌ఆర్‌ని మేళవించారు. దీంతో సీన్లని ఆర్‌ఆర్‌ బాగా ఎలివేట్‌ చేసింది. ఈ మూవీకి సౌండే పెద్ద అసెట్‌. సౌండ్‌తోనే ఆకట్టుకున్నారు. థ్రిల్‌ ఫీల్‌ చేశారు. భయటపెట్టించారు. ఇక కథ పరంగా చూస్తే, సువర్ణ రేడియో స్టేషన్‌లో మొదట దాన్ని స్థాపించిన ఆరుగురు చనిపోతారు. ఒక ఈగ వారిని చంపేస్తుంది. వారి హత్యలను చూసి కిష్కింధపురి జనం అంతా భయపడతారు. వేద పండితుల సమక్షణంలో ఆ స్టేషన్‌ని మూసేస్తారు. కట్‌ చేస్తే కొన్నాళ్ల తర్వాత రాఘవ, మైథిలి ఈ హర్రర్ థ్రిల్‌ ని అందించే ఒక సంస్థలో పనిచేస్తుంటారు. ఇలాంటి థ్రిల్‌ని ఇష్టపడే జనాలను ట్రిపులుగా తీసుకెళ్లి ఆ థ్రిల్‌ని చూపిస్తుంటారు. కానీ అదంతా వీరు క్రియేట్‌ చేసింది. ఈ క్రమంలోనే లాటరీ పద్ధతిలో చీటి తీయగా సువర్ణ రేడియో స్టేషన్‌ వస్తుంది. అందులోకి వెళ్లాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. హీరో పరిచయం, హీరోయిన్‌ పరిచయం హడావుడిగానే సాగుతుంది. హీరో ఎంట్రీ రామాలయంలో భీకర పరిస్థితుల్లో జరుగుతుంది. ఆ ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది.

47
`కిష్కింధపురి` మూవీ హైలైట్స్, మైనస్‌లు

సువర్ణ రేడియో స్టేషన్‌కి రాఘవ, మైథిలి టీమ్ వెళ్లాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. దెయ్యం ఎంట్రీ ఇచ్చాక వరుసగా ఆ ట్రిప్‌కి వచ్చిన వారు ఒక్కొక్కరు చనిపోతుంటే ఉత్కంఠభరింతంగా సాగుతుంది. దెయ్యం ఎపిసోడ్లు కూడా భయపెట్టించేలా ఉన్నాయి. ఇక ఈ చావులను ఆపేందుకు రాఘవ ప్రయత్నించడం, ఈ క్రమంలో ఆ రేడియో స్టేషన్‌కి ఉన్న కథేంటి? అందులో ఆరుగురు ఎలా చనిపోయారు? చంపింది ఎవరు? అసలు ఆ స్టేషన్‌లో ఏం జరిగింది? వేదవతి, స్వస్తిక్‌ ల కథేంటి? అందులో ఉన్న దెయ్యం ఆడనా, మగనా? ఎందుకు వీరినే చంపుతుంది? ఇలాంటివన్నీ హీరో తన అన్వేషణ ద్వారా తెలుసుకుంటాడు. దీంతో ఒక్కోటి రివీల్‌ అవుతుంది. ఫస్టాఫ్‌ అంతా మరణాలను ఆపేందుకు చేసే ప్రయత్నంగా ఉంటుంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ మాత్రం గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉంటుంది. సెకండాఫ్‌ అంతా గతం రివీల్‌ అవుతుంటుంది.  రివీల్‌ అయ్యే అంశాలు కొంత ఇంట్రెస్టింగ్‌గా, సస్పెన్స్ తో కూడి ఉంటాయి. ఒక్కో విషయం తెలిసినా ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. సెకండాఫ్‌ మొత్తం సీరియస్‌గా, భయంతో సాగుతుంది. థ్రిల్‌ ఎలిమెంట్లు ఫుల్‌గా ఉంటాయి. క్లైమాక్స్  మరింత లౌడ్‌గా ఉంటుంది. అది కొంత రొటీన్‌గానే ఉన్నా, చూస్తున్నంతసేపు ఎంగేజింగ్‌గా ఉంటుంది. అయితే సినిమాలో బలమైన కథ లేదు. చాలా విషయాలకు సరైన లింక్‌ లేదు. అదే సమయంలో లాజికల్‌గా చాలా విషయాలు మిస్‌ అయ్యాయి. ప్రస్తుతానికి, 39ఏళ్ల క్రితానికి మధ్య గ్యాప్‌ని సరిగా చూపించలేదు. స్వస్తిక్‌ సింబల్‌కి జస్టిఫికేషన్‌ ఇవ్వలేదు. స్వస్తిక్‌ రేడియో వాయిస్‌ విషయంలోనూ క్లారిటీ మిస్‌ అయ్యింది. చాలా విషయాలు ఆడియెన్స్ ని మిస్‌ లీడ్‌ చేసేలా ఉన్నాయి. డైరెక్టర్‌ ఎక్కువగా హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లు, సౌండ్‌పై ఫోకస్‌ పెట్టాడు, కానీ కథపై, లాజికల్ విషయాలకు ప్రయారిటీ ఇవ్వలేదు. దీంతో కొంత ఆకట్టుకున్నా, మరికొంత సస్పెన్స్ ఆడియెన్స్ ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ విషయాలపై ఫోకస్‌ చేసి, లాజికల్ గా వర్కౌట్‌ చేస్తే ఇంకా బాగుండేది.

57
`కిష్కింధపురి` మూవీలో ఆర్టిస్ట్ ల నటన ఎలా ఉందంటే?

రాఘవ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బాగా నటించారు. నటుడిగా ఆయన సినిమా సినిమాకి ఇంప్రూవ్‌ అవుతున్నాడు. ఇందులో సెటిల్డ్ గా చేసే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్ లో మాత్రం రెచ్చిపోయాడు. మొత్తం అటెన్షన్‌ తనవైపు తిప్పుకున్నాడు. మొత్తంగా తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక మైథిలిగా అనుపమ పరమేశ్వరన్‌ సైతం అదరగొట్టింది. ఆమె ప్రీ క్లైమాక్స్ లో రచ్చ చేసింది. ఉన్నంతసేపు ఆకట్టుకుంది. అలరించింది. ఇక విహారి పాత్రలో హైపర్‌ ఆది కనిపించాడు. థ్రిల్ ని ఎంజాయ్‌ చేసేందుకు వచ్చిన వారిలో ఆయన కూడా ఒకరు. తనదైన పంచ్‌లతో నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన కామెడీ ఆశించిన స్థాయిలో లేదు. లోకో పైలట్స్ గా భద్రం, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కాసేపు మెప్పించారు. చిన్నారి కూడా ఆకట్టుకుంది. తనికెళ్ల భరణిది గెస్ట్ రోల్‌. కాసేపు అలా మెరిశారు. స్వస్తిక్‌గా నటించిన నటుడు అదరగొట్టాడు. వాహ్‌ అనిపించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు.

67
`కిష్కింధపురి`లో టెక్నీషియన్ల పనితీరుః

చైతన్య భరద్వాజ్‌ సంగీతం బాగుంది. ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. అదే సినిమాకి ప్రాణం. హైలైట్స్ కూడా. సౌండ్‌తోనే భయటపెట్టించాడని చెప్పొచ్చు. ఇక చిన్మయ్‌ సలస్కార్ కెమెరా వర్క్ బాగుంది. విజువల్ గా ఆకట్టుకుంది. నిరంజన్‌ దేవరమనే ఎడిటర్‌ షార్ప్ గానే ఉంది. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సాహుగారపాటి నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా రిచ్‌గా, క్వాలిటీగా నిర్మించారు. దర్శకుడు కౌశిక్‌ పెగళ్లపాటి మంచి ఎంగేజింగ్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ని అందించడంలో సక్సెస్‌ అయ్యాడు. కానీ బలమైన కథతో, లాజికల్‌గా వర్కౌట్‌ చేయడంలో కాస్త తడబడ్డాడు. కామెడీకి స్కోప్‌ ఉన్నా ఆ యాంగిల్‌ని సరిగా వాడుకోలేకపోయాడు. హైపర్‌ ఆది కామెడీ అంతగా వర్కౌట్‌ కాలేదు. ఇలాంటి కొన్ని అంశాలపై మరింతగా వర్క్ చేస్తే సినిమా బాగుండేది.

77
ఫైనల్‌ నోట్‌ః

సౌండ్‌తో భయపెట్టే హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీ. హర్రర్‌ సినిమాలను ఇష్టపడేవారి బాగా నచ్చుతుంది. 

రేటింగ్‌ః 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories