
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజాగా మూవీ `ఘాటి`. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్య రావు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మాతలు. ఈ చిత్రం నేడు శుక్రవారం(సెప్టెంబర్ 5న) విడుదలైంది. ఐమాక్స్ లో ఈ మూవీని వీక్షించాను. అనుష్క నటించిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
ఆంధ్రా-ఒరిస్సా బార్డర్(తూర్పు కనుమలు)లో గంజా మాఫియా బాగా నడుస్తుంది. కోట్లల్లో చేతులు మారుతుంటాయి. దీంతో రాజకీయ నాయకుల నుంచి కార్పొరేట్ల వరకు ఈ వ్యాపారం చేస్తుంటారు. అక్కడి ప్రజలందరు గంజా తరలిస్తుంటారు. వారిని ఘాటీలంటారు. అదే వారి జీవనాధారం. గంజా తరలించే క్రమంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందులో శీలావతి(అనుష్క శెట్టి), ఆమె బావ దేశీ రాజ్(విక్రమ్ ప్రభు) కూడా ఘాటీలుగా పనిచేస్తారు. కానీ దేశీ రాజు తండ్రి చనిపోయినప్పుడు అమ్మకి ఇచ్చిన మాట కోసం ఆ పని వదిలేసి వేరే వృత్తిలో ఉంటాడు. శీలావతి కూడా బస్ కండక్టర్‌గా పనిచేస్తుంది. అయితే కుందల నాయుడు(చైతన్య రావు), కాస్టాల నాయుడు(రవీంద్ర విజయ్) ఈ గంజాకి మెయిన్ డీలర్లుగా ఉంటారు. వీరి కంట్రోల్‌లోనే ఈ వ్యాపారం అంతా జరుగుతుంది. గంజాలో మూడు, నాలుగు రకాలుంటాయి. వాటిలో శీలావతి రకం చాలా అరుదు. ఉన్నతమైనది. దాన్ని లిక్విడ్ రూపంలో తరలిస్తుంటారు. ఇది నాయుడు బ్రదర్స్ కి తెలియకుండా జరుగుతుంది. అది తెలుసుకునేందుకు పోలీస్ ఆఫీసర్(జగపతిబాబు), నాయుడు బ్రదర్స్ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే దీన్ని దేశీరాజు, శీలావతి తయారు చేయిస్తున్నారని నాయుడు బ్రదర్స్ తెలుసుకుంటారు. దాన్ని నాశనం చేయాలని భావించగా, దేశీరాజు, శీలావతి ఎదురిస్తారు. నాయుడు బ్రదర్స్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు చెబుతారు. నాయుడు బ్రదర్స్ కూడా వారిని నమ్మిస్తారు. ఇక చిన్నప్పట్నుంచి ఎంతగానో ప్రేమించిన దేశీరాజుతో శీలావతి పెళ్ళికి రెడీ అవుతుంది. పెళ్లి జరిగే సమయంలోనే నాయుడు బ్రదర్స్ కుట్ర చేసి దేశీరాజుని చంపేస్తారు. శీలావతిని వివస్త్రని చేస్తారు. దీంతో తన బావ మరణాన్ని తట్టుకోలేని శీలావతి.. నాయుడు బ్రదర్స్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది. రహస్యంగా శీలావతి గంజా స్మగ్లింగ్ చేసి వీళ్లు చేసిన పనేంటి? తమ ప్రాంత ప్రజలను ఈ ఘాటి వృత్తిని మాన్పించేందుకు శీలావతి ఏం చేసింది? ఈ క్రమంలో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంది? అనేది మిగిలిన సినిమా.
ఆంధ్రా, ఒరిస్సా బార్డర్ తూర్పు కనుమల్లో గంజా స్మగ్లింగ్ అనేది చాలా పెద్ద వ్యాపారం. రియల్‌గా జరుగుతుంది. తరచూ వీటికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ అక్కడి ప్రజలు, వారి జీవనాధారం గురించి మనకు పెద్దగా తెలియదు. ఇప్పటి వరకు మన వద్ద సినిమాలు కూడా రాలేదు. దర్శకుడు క్రిష్ మొదటిసారి ఆ ప్రయత్నం చేశారు. ఘాటీల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించారు. `ఘాటి` సినిమాలో గంజా వ్యాపారం వల్ల జరిగే లాభాలు, నష్టాలకంటే ఈ గంజా తరలించే క్రమంలో అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది చూపించారు. ఎన్ని తరాలు మారినా ఇంకా వాళ్లు అదే వృత్తిలో కొనసాగుతున్నారు. వారికి సరైన స్కూల్స్ లేవు, ఆసుపత్రులు ఉండవు. స్మగ్లర్ల కింద బానిసలుగానే బతకాల్సి వస్తుంటుంది. ఈ అంశాలను బేస్ గా చేసుకుని వారి జీవితాలను కళ్లకి కట్టినట్టు చూపించాడు దర్శకుడు క్రిష్. అయితే ప్రారంభంలో గంజా తరలింపు, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లని, పోలీసులను దాటుకుని దాన్ని తరలించడం వంటివి చూపించారు. అది ఎంత కష్టమనేది చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అనుష్క, విక్రమ్ ప్రభుల మధ్య లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేశారు. బావని నమ్ముకుని ఉండటం, ఆయన్ని మనువాడాలని ఆమె తపించడం వంటి సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొంత రొమాంటిక్‌గా, మరికొంత ఎమోషనల్‌గా ఉంటాయి. ప్రారంభంలో చాలా వరకు అనుష్క, విక్రమ్ ప్రభుల మధ్య బాండింగ్ కి ప్రయారిటీ ఇచ్చారు. రహస్యంగా కాచే శీలావతి గంజా నాయుడు బ్రదర్స్ కంట్లో పడటం, దీంతో వారు వీరిని అంతం చేయాలనుకోవడం, దీనికి అనుష్క అడ్డం తిరగడంతో కథ సీరియస్‌గా మారుతుంది. లవ్ ట్రాక్ కాస్త యాక్షన్‌గా మారిపోతుంది.
ఇంటర్వెల్‌లో యాక్షన్ సీన్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత సెకండాఫ్‌లో అనుష్క, విక్రమ్ ప్రభుల మధ్య బాండింగ్‌ని, వాళ్లు చేసే పనిని మరింత బలంగా చూపించారు. ఆ తర్వాత అనుష్క ప్రతీకారం తీర్చుకోవడమే ప్రధానంగా సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా బస్‌లో యాక్షన్ సీన్లు, గెస్ట్ హౌజ్‌లో చర్చల కోసం వచ్చిన సందర్భంలో, మరోవైపు కొండపై ఇలా వరుసగా యాక్షన్ సీన్లు, ఇందులో అనుష్క కి ఇచ్చిన ఎలివేషన్లు వాహ్ అనేలా ఉంటాయి. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయి. క్లైమాక్స్ ఫైట్ అదిరిపోతుంది. ఆ సమయంలో బీజీఎం కూడా అదిరిపోయింది. అయితే సినిమా ప్రారంభం నుంచి కొంత రొటీన్‌గానే ఉంటుంది. ఘాటిల గురించి చెప్పడం, వారి జీవనాధారం గురించి చెప్పడం కొత్త పాయింట్. కానీ ఆ తర్వాత కథనం సాగే తీరు మొత్తం కొంత రొటీన్‌గానే అనిపిస్తుంది. మరికొంత స్లోగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో యాక్షన్ సీన్లు తప్ప మిగిలిన సీన్లు కూడా స్లోగా ఉంటాయి. తమ ప్రజల్లో మార్పు కోసం అనుష్క చేసే ప్రయత్నాలు కూడా రొటీన్‌గానే అనిపిస్తాయి. మరోవైపు సినిమాలో ఎమోషన్స్ బలంగా పండలేదు. అవి ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే సీన్లు మిస్ అయ్యాయి. యాక్షన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల, ఎమోషన్స్ మిస్ అయ్యాయనిపిస్తుంది. కాకపోతే అనుష్క విశ్వరూపానికి మాత్రం ఫిదా అవ్వాల్సిందే. నటీనటుల నటన, బీజీఎం, ఎలివేషన్లు, యాక్షన్ సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలిచాయి.
శీలావతిగా అనుష్క నటించింది. ఇందులో బొద్దుగా కనిపిస్తుంది. అదే సమయంలో వయసు కూడా తెలుస్తోంది. కానీ నటిగా మాత్రం రెచ్చిపోయింది. లవ్ సీన్లలో, సరదా సీన్లలో ఎంతో బాగా చేసింది. యాక్షన్ సీన్లలో మాత్రం విశ్వరూపం చూపించింది. పుష్పరాజ్‌ని తలపించింది. దేశీ రాజుగా విక్రమ్ ప్రభు సెటిల్డ్ గా చేశాడు. ఎమోషనల్‌గా ఆకట్టుకున్నారు. కాకపోతే ఆయన్ని సరిగా వాడుకోలేదనిపిస్తుంది. ఇక కాస్టాల నాయుడుగా రవీంద్ర విజయ్ అదరగొట్టాడు. విలనిజం బాగా చూపించారు. బాగా సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. మరోవైపు కుందల నాయుడుగా చైతన్య రావు మాత్రం రెచ్చిపోయాడు. కాకపోతే ఆయన పర్సనాలిటీని మించి అరుపులు, గాంభీర్యాన్ని ప్రదర్శించడంతో ఓవర్‌గా అనిపిస్తాయి. పోలీస్ ఆఫీసర్‌గా జగపతిబాబు సరదా పాత్రలో మెప్పించారు. ఉన్నంత సేపు ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో రాజు సుందరం మాస్టర్ అలరించే ప్రయత్నం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.
ఈ సినిమా విజువల్స్ పరంగా బాగుంది. లాంగ్ షాట్లు అదిరిపోయాయి. మనోజ్ కాటసాని సినిమాని చాలా బాగా చిత్రీకరించారు. ఫారెస్ట్ అందాలను బాగా చూపించారు. చాణక్య రెడ్డి ఎడిటింగ్ ఇంకా షార్ప్ చేయాల్సింది. చాలా సీన్లు కట్ కట్ అనేలా ఉన్నాయి. నాగవెళ్లి విద్యా సాగర్ మ్యూజిక్ బాగుంది. పాటలు ఉన్నంతలో ఓకే. కానీ బీజీఎం మాత్రం అదిరిపోయింది. అదే సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు క్రిష్ ఎంచుకున్న కథ కొత్తగా ఉంది. ఘాటిల వ్యథని చూపించిన తీరు బాగుంది. వారి కష్టాలను అద్దంపట్టేలా, బయటి ప్రపంచానికి తెలిసేలా తెరకెక్కించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టారు. డైలాగ్‌లు బాగున్నాయి. పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. కాకపోతే సినిమా హెవీ సీరియస్‌గా మారింది. యాక్షన్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంది. ఎమోషన్స్ ని బలంగా పండిస్తే సినిమా ఇంకా బాగుంది. అదే సమయంలో వారి కష్టాలను మరింత బలంగా చూపిస్తే బాగుండేది. విలన్లు కూడా బలంగా లేరనే ఫీలింగ్ కలుగుతుంది. ఇవి పక్కన పెడితే మంచి అదిరిపోయే యాక్షన్ మూవీగా `ఘాటి` నిలుస్తుందని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః అనుష్క విశ్వరూపం(యాక్షన్) కోసం `ఘాటి`.
రేటింగ్‌ః 2.75