Killer Movie Review: కిల్లర్‌ మూవీ రివ్యూ.. సైఫై థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

Published : Oct 30, 2026, 07:32 AM IST

పూర్వాజ్‌ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `కిల్లర్`. సైఫై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ఆకట్టుకుందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

PREV
17
కిల్లర్‌ మూవీ రివ్యూ

విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలు తీసే దర్శకుడు పూర్వాజ్‌ ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రం `కిల్లర్‌`తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో జ్యోతి పూర్వాజ్‌ హీరోయిన్‌గా నటించింది. ఇంకా చెప్పాలంటే తనే మెయిన్‌ లీడ్‌. పూర్వాజ్‌ సినిమాకి దర్శకత్వం వహించడంతోపాటు ప్రధాన పాత్రలో నటించి నిర్మించాడు. థింక్‌ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్‌ పతాకాలపై పూర్వాజ్‌, పద్మనాభరెడ్డి. ఏ నిర్మించారు. ఉర్వీశ్‌ పూర్వాజ్‌ సమర్పకులు. ఇందులో మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. సినిమా చూసి సెకండాఫ్‌లోని ట్విస్ట్ ని ఇంటర్వెల్‌లో గెస్ చేసి చెబితే కోటీ రూపాయలు ఇస్తామని దర్శకుడు మొన్న ప్రకటించారు. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. గురువారం రాత్రినే ఈ సినిమాని ప్రదర్శించారు. నేడు శుక్రవారం(అక్టోబర్ 30) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? దర్శకుడు సక్సెస్‌ అయ్యాడా? జ్యోతి పూర్వాజ్‌ మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
కిల్లర్‌ మూవీ కథ

రానియా (జ్యోతి పూర్వజ్) సాధారణమైన జీవితాన్ని గడిపే మహిళ. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె కోమాలోకి వెళ్తుంది. మెడికల్‌గా ఏం చేసినా ప్రయోజనం లేదు. జీవచ్చవంలా ఉండిపోతుంది. ఆమెని బాగు చేసుకునేందుకు తమ్ముడు కార్తీక్‌(చంద్రకాంత్‌) చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రయోజనం లేదు. ఈ క్రమంలో సైంటిస్ట్ పూర్వాజ్‌(పూర్వాజ్‌) ఆమెకి మళ్లీ లైఫ్‌ ఇస్తానంటాడు, తాను చేసే ప్రయోగం సక్సెస్‌ అయితే ఆమె ఓ దేవతలా మారిపోతుందని చెబుతాడు. పూర్వాజ్‌ ఏఐ ద్వారా క్రియేట్‌ చేసిన రూట్‌ అనే చిప్‌ ని మనిషి మెదడులో అమర్చి మనిషిని అసాధారణమైన వ్యక్తిగా మార్చే ప్రయత్నం చేస్తుంటాడు. దీనికి సంబంధించి ఒక ఫారెస్ట్ లో సీక్రెట్‌గా ల్యాబ్‌ని నిర్మించి అందులో ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే ఆయన ప్రయోగాలను ప్రభుత్వం అంగీకరించదు. మొదట ల్యాబ్‌ని మూసేస్తుంది. కానీ రహస్యంగా దాన్ని పూర్వాజ్‌ నిర్వహిస్తుంటాడు. అందులో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే ఆ సమయంలోనే ఆకాశం నుంచి ఒక ఏలియన్‌ ఉల్కా ఫారెస్ట్ లో పడిపోతుంది. అందులో నుంచి ఒక పదార్థాన్ని పూర్వాజ్‌ తీసుకొని ప్రయోగశాలలో భద్రపరిచి దానిపై కూడా ప్రయోగాలు చేస్తుంటాడు. దానికి, రానియాని, ఏఐని మిక్స్ చేసి అద్భుతం చేయాలనుకుంటాడు. ఇది ఓ వైపు అయితే మరోవైపు పోలీస్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌(సుక్కు పూర్వాజ్‌) రానియాకి సంబంధించిన కేసుని విచారిస్తుంటాడు. ఆమెని చూసిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతుంటారు. ఆమె ఒక టెర్రరిస్ట్ అని, రక్తపిశాచి అని, ఒక రొమాంటిక్‌ లేడీ అని, స్పై అని, సాధారణ రైటర్‌ అని ఇలా రకరకాలుగా చెబుతుంటారు? ఒక్కో కథ ట్విస్ట్ టర్న్ లతో సాగుతుంది. మరి ఇంతకి రానియా ఎవరు? ఆమెలో ఇన్ని కోణాలు ఎందుకున్నాయి? సైంటిస్ట్ పూర్వాజ్‌ చేసిన ప్రయోగం ఫలించిందా? విఫలమయ్యిందా? సినిమాలో అసలు ట్విస్ట్‌ ఏంటి? అనేది మిగిలిన సినిమా.

37
కిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?

దర్శకుడు పూర్వాజ్‌ విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తూ తానేంటో నిరూపించుకుంటున్నారు. కానీ ఆడియెన్స్ నుంచి ఆయన సినిమాలకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు `కిల్లర్‌` మూవీతో మరో ప్రయోగం చేశారు. సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం విశేషం. అయితే సినిమా అంతిమ లక్ష్యం ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ అయినా చేయాలి, ఎంగేజ్‌ అయినా చేయాలి, వాళ్లకి ఒక కొత్త అనుభూతిని అయినా ఇవ్వాలి, ఏదైనా సందేశం ఇవ్వాలి, మార్పుకి దోహదపడాలి, లార్జర్‌ దెన్‌ లైఫ్‌ ఎక్స్ పీరియెన్స్ ని అయినా ఇవ్వాలి, ఎడ్యూకేట్‌ అయినా చేయాలి, కనీసం భయపెట్టడమైనా చేయాలి, థ్రిల్‌ని అయినా, ఎమోషనల్‌గా పిండేయాలి, ఫీల్‌గుడ్‌ ఫీలింగ్‌ని అయినా ఇవ్వాలి. ఇందులో ఏదో ఒక్కటి కరెక్ట్ గా చేసినా సినిమా సక్సెస్‌ అనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు `కిల్లర్` ఇందులో ఏ ఒక్కటి చేయలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరంగా స్టార్ట్ అవుతుంది. మనిషి మెదడు, ఏఐ మేళవించి చేసే ప్రయోగాలకు సంబంధించి ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరోవైపు ఏలియన్‌ షిప్‌ క్రాష్‌ కావడం మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. కానీ ఆ తర్వాత ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. ఓ వైపు అమ్మాయి బెడ్‌పై కోమాలో ఉంది, ఆమెకి సంబంధించిన అనేక కోణాలు బయటకు వస్తుంటాయి. పోలీస్‌ ఆఫీసర్‌ ఆమె కేసుని విచారిస్తుంటాడు. ఆ విచారణ గందరగోళంగా ఉంటుంది. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేసే అతి విసుగు పుట్టిస్తుంది. దీనికితోడు ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పడం, అందులో సహజత్వం లేకపోవడంతో బోరింగ్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. దీనికితోడు సౌండింగ్‌ దారుణంగా ఉంది. అది మరింత ఇరిటేషన్‌ తెప్పిస్తుంది.

పాత్రలన్నీ చాలా అసహజంగా కనిపిస్తాయి, అలానే ప్రవర్తిస్తుంటాయి. ఎక్కడ కూడా సినిమాలో, సీన్‌లో ఎమోషన్‌ లేదు. ఇంటెన్సిటీ లేదు, ఫీల్‌ లేదు. ఇన్వెస్టిగేషన్‌లో ఒక్కో పాత్ర చెప్పే కథ ఒక్కోలా ఉంటుంది. ఆడియెన్స్ ని మరింత కన్‌ ఫ్యూజ్‌ చేస్తుంటుంది. ఏ కథలోనూ క్లారిటీ ఉండదు. అక్కడ ఆఫీసర్‌కి ఏం అర్థం కాదు, చూసే ఆడియెన్స్ కి ఏం అర్థం కాదు, అది సస్పెన్స్ గా మారితే బాగుంటుంది, కానీ ఇరిటేషన్‌గా మారితేనే సమస్య. ఈ మూవీ విషయంలో అదే జరిగింది.

47
వీఎఫ్‌ఎక్స్ హైలైట్‌, కానీ

ఇక ఏఐ ప్రయోగాల పేరుతో పూర్వాజ్‌ పాత్ర చేసే హడావుడి కూడా ఏమాత్రం కనెక్టింగ్‌గా లేదు. అర్థంకాని విధంగా ఉంది. ఫస్టాఫ్‌ గందరగోళంగా రన్‌ అవుతుంది. ట్విస్ట్ సెకండాఫ్‌లో రివీల్‌ అవుతుంది. అది మాత్రం బాగానే డిజైన్‌ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కథకి, ఆ అమ్మాయికి పాత్రకి కనెక్ట్‌ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. ఏదైతే ట్విస్ట్ ఉందో, ఆ ట్విస్ట్ కి సంబంధించిన మూల అంశంలోనే క్లారిటీ లేదు. ఆ అమ్మాయి ఎందుకు అలా పడిపోయింది? ఆమెని కొందరు వచ్చి ఎందుకు కొట్టారనేది క్లారిటీ లేదు. అంతేకాదు చాలా సీన్లకి లాజిక్‌ లేదు. దర్శకుడు ఇష్టం వచ్చినట్టుగా కథని రాసుకుని రూపొందించి జనం మీదకు వదిలినట్టుగా ఈ సినిమా ఉంది.

క్లైమాక్స్ లో హీరోయిన్‌ పాత్రలోని మార్పు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. కనెక్టింగ్‌ గా లేదు. యాక్షన్‌ ఎపిసోడ్‌ కూడా చాలా పేలవంగా ఉంది. సినిమాలో ఏదైనా బాగుందంటే అది వీఎఫ్‌ఎక్స్ మాత్రమే. పాత్రలు అసహజంగానే నటించారు, దర్శకుడు క్లారిటీ లేకుండా చేశాడు. కథనం కూడా కన్‌ఫ్యూజన్‌తో సాగింది. థ్రిల్‌ ఇవ్వలేకపోయింది. సైఫై అనుభూతిని కూడా ఇవ్వలేకపోయింది. దర్శకుడు చెబుతూ వచ్చిన మేజర్‌ ట్విస్ట్ కూడా పెద్దగా థ్రిల్‌ని ఇవ్వకపోవడం గమనార్హం.

57
కిల్లర్‌ మూవీ లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

జ్యోతి పూర్వాజ్‌ సినిమాకి ప్లస్‌ అని చెప్పొచ్చు. ఆమె విభిన్నమైన పాత్రల్లో మెప్పించింది. గ్లామర్‌తో కనువిందు చేసింది. ఆమె పాత్రలోని ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. యాక్షన్‌ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. ఇక సైంటిస్ట్ గా, పోలీస్‌ ఆఫీసర్‌గా పూర్వాజ్‌ విభిన్నమైన పాత్రల్లో మెప్పించాడు. పోలీస్‌ పాత్రలో మాత్రం చిరాకు తెప్పించాడు. సైంటిస్ట్ గా సెటిల్డ్ గా చేసే ప్రయత్నం చేశాడు. కానీ కళ్లజోడు చీటికి మాటికి తీయడం బాగాలేదు. ఇక కార్తీక్‌ పాత్రలో జ్యోతి పూర్వాజ్‌ తమ్ముడిగా చంద్రకాంత్ ఇరగదీశాడు. డబ్బింగ్‌ ఒరిజినల్‌ పెడితే బాగుండేది. అతనికి మంచి ఫ్యూచర్‌ ఉంది. అర్చన పాత్ర కూడా బాగుంది. ఆమె బాగా చేసింది. రాజేష్‌ కాసేపు కనిపించి ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించారు.

67
టెక్నీకల్‌గా కల్లిర్ మూవీ ఎలా ఉందంటే

జగదీశ్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఆశీర్వాద్, సుమన్ జీవ సంగీతం ఈ చిత్రానికి ఏమాత్రం ప్లస్‌ కాలేదు. సౌండ్‌ విషయంలో మాత్రం బిగ్‌ మైనస్‌. అదే సమయంలో డబ్బింగ్‌లోనూ లోపాలున్నాయి. పూర్వాజ్ ఎడిటింగ్ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన ఎడిటింగ్‌ పెద్ద మైనస్‌. చాలా బ్లండర్స్ ఉన్నాయి. రాజ్ కుమార్ గంగపుత్ర యాక్షన్ కొరియోగ్రఫీ ఫర్వాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. చాలా క్వాలిటీగా ఉన్నాయి. నిర్మాణ విలువలకు కొదవ లేదు. ఇక దర్శకుడు పూర్వాజ్‌.. చెప్పాలనుకున్న పాయింట్‌ కొత్తగా ఉంది. కానీ కథగా అది ఆకట్టుకునేలా లేదు. కథనం విషయంలోనూ ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు. తనకు నచ్చినట్టు తీసుకుంటూ వెళ్లారు తప్పితే, ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు.

77
ఫైనల్‌గా

తెలుగులో ఇదొక ప్రయోగాత్మక మూవీ. కానీ ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యారు. ఈ సినిమా అర్థం కావాలంటే మినిమమ్‌ రెండు మూడు పిహెచ్‌డీలు చేయాలి. ఫైనల్‌గా చెప్పాలంటే చూసినోడు `కిల్`.

రేటింగ్‌: 1.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories