విక్టరీ వెంకటేష్, అందాల భామ సిమ్రాన్ జంటగా నటించిన చిత్రం కలిసుందాం రా,. ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డులు సాధారణమైనవి కావు. నేటికి ఈ సినిమాలోని ఎమోషన్స్, కామెడీ, పాటలు ప్రతి ఒక్కరినీ అలరిస్తూనే ఉన్నాయి. ఈ ప్రత్యేక వ్యాసంలో 'కలిసుందాం రా' సినిమా విశేషాలు, అప్పట్లో నటసింహం నందమూరి బాలకృష్ణ 'వంశోద్ధారకుడు'తో ఎదురైన బాక్సాఫీస్ పోటీ గురించి చూద్దాం.
కథలో ప్రధానమైనవి రెండు కుటుంబాలు. రాఘవయ్య (కె. విశ్వనాథ్), రామ్మోహనరావు (రంగనాథ్) బంధువులైనా, గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఒకరిపై మరొకరు కోపంతో ఉంటారు. ఆ పంతాలు కాలక్రమంలో రెండు కుటుంబాల మధ్య అగాధాన్ని సృష్టిస్తాయి. ఒకప్పుడు ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండాల్సిన బంధువులు, చిన్నచిన్న అపార్థాలు, పాత గాయాల కారణంగా దూరమవుతారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాఘవయ్య కుటుంబంలో జరిగే షష్టిపూర్తి వేడుక కథకు కీలక మలుపుగా నిలుస్తుంది. కుటుంబానికి దూరంగా ఉంటున్న తన కొడుకు కుటుంబాన్ని, మనవళ్లను ఆహ్వానించడంతో రఘు (వెంకటేష్) తన స్వగ్రామానికి వస్తాడు. అక్కడ అతనికి ఎదురయ్యే పరిస్థితులు అంత సులభంగా ఉండవు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న పాత విభేదాలు, ఒకరిపై మరొకరికి ఉన్న అనుమానాలు అతడికి అర్థమవుతాయి.
ఈ క్రమంలోనే మంగ (సిమ్రాన్) పరిచయమవుతుంది. మొదట సరదాలు, ఆటపట్టింపులతో సాగిన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే వీరి ప్రేమకథకు కుటుంబాల మధ్య ఉన్న వైరం అడ్డంకిగా మారుతుంది. మరోవైపు రామ్మోహనరావు కుటుంబానికి చెందిన ఎర్రబాబు (శ్రీహరి) ఆగ్రహం కథలో సంఘర్షణను మరింత పెంచుతుంది.
తన సంతోషం కోసం మాత్రమే ఆలోచించకుండా, విడిపోయిన కుటుంబాలను మళ్లీ ఒక్కటి చేయాలని రఘు నిర్ణయించుకుంటాడు. అసలు రెండు కుటుంబాల మధ్య గొడవకు కారణమేంటి? పాత తప్పుల ప్రభావం కొత్త తరంపై ఎలా పడింది? ప్రేమను, కుటుంబ బంధాలను కాపాడుకోవడంలో రఘు ఎలాంటి త్యాగానికి సిద్ధమయ్యాడు? అన్నదే మిగతా కథ.
‘కలిసుందాం రా’ సినిమాకు ప్రధాన బలం వెంకటేష్ నటన. అప్పటివరకు ప్రేమకథలు, కుటుంబ కథాచిత్రాలు, వినోదాత్మక పాత్రల్లో తనమార్క్ చూపించిన వెంకటేష్.. ఈ సినిమాలో రఘు పాత్రలో మరోసారి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కుటుంబంలో అందరినీ కలుపుకుపోవాలని తపించే యువకుడిగా ఆయన నటన సహజంగా ఉంటుంది. రఘు పాత్రలో చలాకీతనం, కామెడీ, లవ్, ఎమోషన్. అన్నింటికి బ్యాలెన్స్ చేస్తూ.. పాత్రలో లీనమైన నటించాడు.
సిమ్రాన్‌తో ఆయన కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. అతిగా హీరోయిజం ప్రదర్శించకుండా కథలో భాగమైపోవడం. ఈ సినిమాలోనూ అదే కనిపిస్తుంది. అందుకే రఘు పాత్ర ఆయన ఫ్యామిలీ హీరో ఇమేజ్ను మరింత పెంచేసింది. ఇక మంగ పాత్రలో సిమ్రాన్ సినిమాకు మరో ఆకర్షణ. తన అందం, చలాకీతనం, అభినయంతో ఆమె ప్రేక్షకులను అలరిస్తారు.
కె. విశ్వనాథ్, శ్రీహరి ప్రత్యేక ఆకర్షణ
రాఘవయ్యగా కె. విశ్వనాథ్ నటన ఈ సినిమాకు ఎమోషనల్ స్ట్రెంత్ ను అందిస్తుంది. కుటుంబ పెద్దగా ఆయన చూపించే గంభీరత, ఆత్మగౌరవం, అంతర్లీనమైన బాధ ఈ సినిమాలో ఆ పాత్ర చాలా డెప్త్ గా ఉంటుంది. ఆయనతో పాటు రంగనాథ్ పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక వీరిద్దరే కాకుండా.. ఈసినిమాకు మరో బలం శ్రీహరి నటించిన ఎర్రబాబు పాత్ర.
శ్రీహరి ఎర్రబాబుగా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయన పాత్ర కథలో సంఘర్షణను పెంచడమే కాకుండా, కుటుంబ విభేదాల పరిణామాలను కూడా చూపిస్తుంది. వీరితో పాటు బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్. నారాయణ వంటి నటులు వినోదాన్ని అందిస్తూ కథలోని భారాన్ని కొంత తగ్గిస్తారు. ఇతర సహాయ నటులు కూడా కుటుంబ వాతావరణాన్ని సహజంగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషించారు.
దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నాయంటే?
డైరెక్టర్ విషయానికి వస్తే.. కె. ఉదయశంకర్ కుటుంబ అనుబంధాలను ప్రధాన కథగా తీసుకుని, వాటికి ప్రేమను జోడించారు. కథలోని ప్రధాన సంఘర్షణ పాత తరానికి చెందినదైనా, దాని పరిష్కారానికి కొత్త తరం ముందుకు రావడం ఆసక్తికరమైన అంశం. కుటుంబంలో ఏర్పడిన సమస్యలను మరో గొడవతో కాకుండా ప్రేమతో, ఓర్పుతో పరిష్కరించాలనే సందేశం సినిమాకు కేంద్రబిందువు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, కథనంలోని భావోద్వేగ అంశాలు సినిమాకు అనుకూలంగా నిలుస్తాయి.
పండుగ వాతావరణం, కుటుంబ సభ్యుల మధ్య సరదాలు, పెద్దల ఆత్మగౌరవం, పిల్లల ప్రేమ వంటి అంశాలను దర్శకుడు ఒకే కథలో కలిపి అద్భుతం చేశాడు. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. కుటుంబ విభేదాల వెనుక ఉన్న కారణాలను వివరించడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, కొన్ని సన్నివేశాలను పొడిగించడం వల్ల వేగం తగ్గుతుంది. ఈ సినిమాకు ఎస్.ఏ. రాజ్‌కుమార్ అందించిన సంగీతం చాలా బలంగా నిలిచింది. సినిమా సక్సెస్ లో సంగీతం మేజర్ క్రెడిట్ దక్కించుకుంది. వెంకటేష్, సిమ్రాన్లపై చిత్రీకరించిన పాటలు రొమాంటిక్ ట్రాక్‌కు అందాన్ని తీసుకొస్తాయి.
సంక్రాంతి తెలుగు సినిమా పరిశ్రమకు అతి పెద్ద సీజన్. సంక్రాంతి హీరోగా పేరున్న బాలయ్య 2000 సంక్రాంతి సీజన్ బరిలో ఉండగా.. వెంకటేష్ పోటీకి వచ్చాడు. ఒకవైపు వెంకటేష్ నటించిన ‘కలిసుందాం రా’, మరోవైపు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వంశోద్ధారకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు సినిమాలూ కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, వాటి కథాంశాలు, హీరోల ఇమేజ్‌లు వేర్వేరుగా ఉన్నాయి.
‘కలిసుందాం రా’ జనవరి 14న విడుదల కాగా, ‘వంశోద్ధారకుడు’ కూడా అదే సంక్రాంతి సీజన్లో విడుదలైంది. కలిసుందాం రా సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలకృష్ణ వంశోద్ధారకుడు మాత్రం యావరేజ్ గా నడిచింది. బాలయ్య రేంజ్ కు ఈ సినిమా సక్సెస్ సరిపోలేదనే చెప్పాలి.
అవార్డుల పంట పండించింది..
‘కలిసుందాం రా’ విజయం.. బాక్సాఫీస్ వరకే ఆగిపోలేదు. ఈ సినిమా 47వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డుల్లోనూ గుర్తింపు పొందింది. కుటుంబ విలువలను ప్రధానంగా తీసుకున్న ఒక కమర్షియల్ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం వెంకటేష్ ఇమేజ్ ను పెంచేసింది. ఈ సినిమాను హిందీలో ‘Kuch Tum Kaho Kuch Hum Kahein’ పేరుతో 2002లో, కన్నడలో ‘Ondagona Baa’ పేరుతో 2003లో రీమేక్ చేశారు.
ప్లస్ పాయింట్లు
- వెంకటేష్ నటన, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్.
- వెంకటేష్, సిమ్రాన్‌ల మధ్య కెమిస్ట్రీ.
- కె. విశ్వనాథ్, శ్రీహరి, రంగనాథ్‌ల నటన.
- ఎస్.ఏ. రాజ్‌కుమార్ సంగీతం
మైనస్ పాయింట్లు
- కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే కథనం.
- కొన్ని సన్నివేశాల్లో సాగతీత.
-ముందుగానే ఊహించగలిగేలా సన్నివేశాలు ఉండటం.
2000 సంక్రాంతి పోటీలో వెంకటేష్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించిన చిత్రాల్లో ‘కలిసుందాం రా’ ఒకటి. కుటుంబ కథలకు ఉండే బలాన్ని మరోసారి నిరూపించిన ఈ సినిమా, వెంకటేష్ ఫ్యామిలీ హీరో ఇమేజ్ను మరింత పెంచేసింది. ఈ సినిమా చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.