
`కోర్ట్` సినిమాతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది శ్రీదేవి అప్పాల. ఆ తర్వాత నటించిన `బ్యాండ్ మేళం` మెప్పించలేదు. ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. `హైకూ` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇందులో ఏగన్ హీరో. ఫెమినా జార్జ్ మరో హీరోయిన్. యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విజన్ సినిమా హౌజ్ పతాకంపై డా డి అరుళానందు, మ్యాథ్యూ అరుళానందు నిర్మించారు. ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోనూ నేడు శుక్రవారం(అక్టోబర్ 23)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? శ్రీదేవి తమిళంలో సక్సెస్ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
మనోహర్(ఏగన్), తన ఫ్రెండ్స్ చేసిన ఎదవ పనికి కాలేజీ నుంచి సస్పెండ్ అవుతారు. దీంతో ఎవరూ సీట్ ఇవ్వరు. చివరికి కోయంబత్తూరులోని అరుళ్ బోధి ఉమెన్స్ కాలేజీ కో-ఎడ్యుకేషన్‌గా మారిన నేపథ్యంలో అందులో మనోహర్‌కి సీట్ ఇస్తారు. అయితే ఆ కాలేజీలో మనోహర్ ఒక్కడే అబ్బాయి, మిగిలినవారంతా అమ్మాయిలే. కాలేజీలో కోడి (శ్రీదేవి)ని చూసిన మనోహర్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ జాబ్, క్యాస్ట్ సమస్య అవుతుంది. దీంతోపాటు పలు కారణాలతో వీరిద్దరు విడిపోతారు.
మూడేళ్లు గడిచిన తర్వాత మనోహర్ ఒక ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తుంటాడు. అదే కంపెనీలో ఇంటర్న్‌గా నివేత (ఫెమినా జార్జ్) చేరుతుంది. ఆమె అప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. కానీ అతను రకరకాలుగా టార్చర్ చేస్తుంటాడు. ఆమెని ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు హెల్ప్ చేస్తాడు మనోహర్.
ఈ క్రమంలో తన గతం గురించి చెప్పాల్సి వస్తుంది? మరి కోడితో విడిపోవడానికి అసలు కారణం ఏంటి? తన గతం తెలిసీ కూడా నివేత మనోహర్‌ని ఎందుకు ప్రేమించింది? తన పాత ప్రియురాలికి సంబంధించి మనోహర్ గురించి నివేతకు తెలిసిన నిజం ఏంటి? ఆ తర్వాత ఆమె రియాక్షన్ ఏంటి? ఈ రెండు ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? ఎలాంటి ముగింపుకి చేరాయి అనేది మిగిలిన కథ.
తొలి ప్రేమ, కాలేజీ జ్ఞాపకాలు, విడిపోయిన బంధాలు, కొత్తగా జీవితంలోకి వచ్చే వ్యక్తుల మధ్య భావోద్వేగాలు.. ఇవన్నీ ప్రేమకథలకు ఎప్పుడూ ఆసక్తికరమైన అంశాలే. అయితే, ఇలాంటి కథను ప్రేక్షకులకు కొత్తగా చెప్పడంలోనే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. అలాంటి ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే `హైకూ`. ఈ సినిమా కథలో ప్రధానంగా కనిపించే అంశం ప్రేమలో ఎదురయ్యే మార్పులు, గత అనుభవాలు మనిషి నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది.
మొదటి ప్రేమలో కలిగే అనుభూతులు, విడిపోయిన తర్వాత మిగిలే జ్ఞాపకాలు, మరో వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు కలిగే సందిగ్ధతను కథలో చూపించే ప్రయత్నం చేశారు. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. అయితే, ఆ భావాలను ప్రేక్షకులకు బలంగా చేరవేయడంలోనే సినిమా కొంత వెనుకబడింది.
ప్రారంభంలో లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి చేరడం, ఈ క్రమంలో వాళ్లు ఈ హీరోని ఆడుకోవడం, ఆటపట్టించడం వంటి సన్నివేశాలు సరదాగా ఉంటాయి. ఫన్నీగా సాగుతాయి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత రెగ్యూలర్‌గా మారుతుంది. కానీ రాఖీ కట్టే సీన్ తర్వాత మరింత ఆసక్తికరంగా టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, హీరోయిన్‌ని, రూల్ చేయడం వంటి సీన్లు అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కథ ఏటో వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ కొంత వరకు ఆసక్తికరంగా ఉంటుంది.
సెకండాఫ్ నుంచి మరో ప్రేమ కథ స్టార్ట్ అవుతుంది. అది ఓ దశకి వెళ్లాక రొటీన్‌లోకి వెళ్తుంది. మళ్లీ మొదటి లవర్ ప్రస్తావన వచ్చాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. పాత్రల మధ్య, ప్రేమ మధ్య అసలైన సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. అది ఎమోషనల్ సైడ్ టర్న్ తీసుకుంటుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే డ్రామా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సినిమాకదే బలంగా చెప్పొచ్చు. కొంత ఉత్కంఠ, మరికొంత సంఘర్షణ, అదే సమయంలో కన్‌ఫ్యూజన్, ఎవరి ప్రేమ నిజం, ఏది అబద్దం, ఏది డ్రామా అనే సందిగ్దంతో సాగిన తీరు బాగుంది.
క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. ముగింపు మాత్రం ఊహించినట్టుగానే ఉంటుంది. అయితే కథని ఎత్తుకున్న తీరు బాగుంది, కొత్తగా ఉంది. ఆ తర్వాత రొటీన్‌లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో లవ్ లో డెప్త్, ఫీల్ ఎమోషన్స్ ఇంకా బాగా పండితే సినిమా అదిరిపోయేది.
మనోహర్ పాత్రలో ఏగన్ కనిపించారు. కథ మొత్తం అతని పాత్ర చుట్టూనే తిరుగుతుంది. గత ప్రేమను మరిచిపోలేని వ్యక్తిగా, కొత్త బంధం విషయంలో సందిగ్ధతకు గురయ్యే యువకుడిగా బాగానే నటించాడు. కాకపోతే మరింత పరిణతి అవసరం. ఎక్స్ ప్రెషన్స్ మీద మరింతగా వర్కౌట్ చేయాలి. ఓవరాల్‌గా మాత్రం అదరగొట్టాడు. అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. సెటిల్డ్ గా చేసి మెప్పించాడు.
కోడి పాత్రలో శ్రీదేవి అప్పాల తన పాత్రకు న్యాయం చేశారు. ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. నటిగానూ మెప్పించింది. ఫస్టాఫ్‌లో ఆమె డామినేషన్ కనిపిస్తుంది. చాలా మెచ్యూర్డ్ గా నటించడం విశేషం. ఆమెకి మంచి భవిష్యత్ ఉందని చెప్పొచ్చు.
నివేత పాత్రలో ఫెమినా జార్జ్ హావభావాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. అయితే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో సహజత్వం తగ్గినట్లు అనిపిస్తుంది. అదిర్చి అరుణ్ కామెడీ సన్నివేశాల్లో కొంత ఉపశమనం కలిగిస్తారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ప్రియేష్ గురుస్వామి కెమెరా పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. కాలేజీ, ఆఫీస్ నేపథ్యాలను తెరపై చూపించిన తీరు బాగున్నాయి. ఫ్రేమ్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. సంగీత దర్శకుడు సిద్ధు కుమార్ అందించిన సంగీతం బాగుంది. నిజానికి ఆయన మ్యూజిక్కే సినిమాకి హైలైట్. నార్మల్ సన్నివేశాలను కూడా మరో స్థాయికి తీసుకెళ్లాడు. పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.
శక్తి ప్రాణేష్ ఎడిటింగ్ రెండో భాగంలో మరింత పదునుగా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలను కుదించి, కథనంలో వేగం పెంచి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా సాగేది. రచయిత, దర్శకుడు యువరాజ్ చిన్నసామి ఎంచుకున్న కథా నేపథ్యం కొత్తగా ఉంది. సినిమాని కూడా అదే స్థాయిలో తెరపై ఆవిష్కరించారు. కాకపోతే మరింత బాగా, ఎఫెక్టివ్‌గా, ఎమోషనల్‌గా, ఫీల్‌గుడ్ మూవీగా ఆవిష్కరిస్తే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలకు కొదవలేదు. రాజీలేకుండా నిర్మించారు. అది ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది.
ప్రేమలోని కొత్త కథలను ఆవిష్కరించే `హైకూ`. ఫీల్‌గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకునే చిత్రమవుతుంది.
రేటింగ్ : 2.75