
ధృవ సర్జా యాక్షన్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. తన ఇమేజ్‌ని పెంచుకుంటున్నాడు. జయాపజయాలకు అతీతంగా మూవీస్ చేస్తూ రాణిస్తున్నాడు. తాజాగా ఆయన `కేడీ` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి ప్రేమ్ దర్శకత్వం వహించగా, ఇందులో సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్, వి రవిచంద్రన్, రేష్మ నన్నయ్య ముఖ్య పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ నిర్మించారు. ఈ చిత్రం కన్నడలో రెండు వారాల ముందే(ఏప్రిల్ 30)న విడుదలైంది. అక్కడ పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం తెలుగులో విడుదల చేశారు. మరి తెలుగు ఆడియెన్స్ ని అయినా ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కాళీ(ధృవ సర్జా) కిరోసిన్ వ్యాపారం చేస్తుంటాడు. అన్నయ్య ధర్మ(రమేష్ అరవింద్) అంటే ప్రాణం. కానీ తమ్ముడంటే అన్నయ్యకి పడదు. చదువుకోలేదనే కోపం ఎప్పుడూ ఉంటుంది. అందుకే తమ్ముడితో మాట్లాడడు. కాళీకి చిన్నప్పట్నుంచి టౌన్‌లో పెద్ద రౌడీ షీటర్ దేవా(సంజయ్ దత్) అంటే ఇష్టం. ఆయన్ని ఆరాధిస్తుంటాడు. కుస్తీ పోటీలకు సన్నదమయ్యే వారికి కాళీ పాలు కూడా పోస్తుంటాడు. కాళీ ఎక్కడ ఉంటే అక్కడ గోల గోల ఉండాల్సిందే. నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ, చిరాకు తెప్పిస్తాడు. ఆ టౌన్‌లోనే అగరత్తుల కంపెనీలో పనిచేసే మహాలక్ష్మి(రేష్మ నన్నయ్య) నోరు కూడా పెద్దదే, ప్రతిదాన్ని గట్టిగా అరిచి చెబుతుంది. మొదట గొడవతో ప్రారంభమైన వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఓ సారి మార్కెట్‌కి వచ్చిన దేవా మనిషి ఒకడు లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడతాడు. ఆ విషయం కాళీకి చెప్పినా గొడవ వద్దు వాళ్లతో పెట్టుకోవద్దు అని చెబుతాడు. మళ్లీ ఆ విలన్ మార్కెట్‌కి వచ్చినప్పుడు అతని తిడుతుంది లక్ష్మి. దీంతో అతను లక్ష్మి జుట్టు కత్తిరిస్తాడు. దీంతో రగిలిపోయిన కాళీ.. ఈ విషయాన్ని దేవాకి చెబుతాడు. అసలే కాళీపై దేవా కోపంతో ఉంటాడు. అంతకు ముందే కుస్తీ పోటీలో కాళీ చేతిలో ఓడిపోతాడు దేవా.ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. దేవా పరువుపోతుంది. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ పెద్దలు వెనకాడుతుంటారు. అలాంటి సమయంలో గొడవ కోసం ఆఫీస్‌కి కాళీ రావడంతో అతని బెదిరిస్తాడు దేవా. 24 గంటల్లో మీ ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తాడు. మరి తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం కాళీ ఏం చేశాడు? దేవాని ఎదుర్కొన్నాడా? పారిపోయాడా? ఇందులో సత్యవతి(శిల్పాశెట్టి) పాత్రేంటి? కాళీ అన్నలో వచ్చిన మార్పేంటి? ఇందులో ఫైనల్‌గా వచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది మిగిలిన కథ.
ధృవ సర్జా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన ఇప్పుడు `కేడీ`తో మరోసారి రెచ్చిపోయాడు. ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్స్ కి కూడా ప్రయారిటీ ఇచ్చారు. సినిమా ప్రధానంగా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అన్నా, తమ్ముడి మధ్య రిలేషన్ ని మెయిన్‌గా చేసుకుని రూపొందించారు. ఫ్యామిలీ జోలికి వస్తే, ఎవరైనా ఎలా తిరగబడతారు అనేది ఇందులో చూపించిన తీరు బాగుంది. సినిమాలో హైలైట్ పాయింట్‌గా చెప్పొచ్చు. సినిమా ప్రారంభంలో.. ఓ వేడుకలో అల్లకల్లోలం నెలకొంటుంది. పోలీస్ కమిషనర్‌కి సెక్యూరిటీ పెంచాలని పోలీసులు వస్తారు. ఒక కత్తిని హైలైట్ చేస్తూ, ఆ కత్తి గొప్పతనం చెబుతూ, ఈ కత్తి వల్లే అసలు గొడవ అనేది పోలీసుతో చెప్పించడంతో సినిమా కథ ప్రారంభమవుతుంది. ఆ పోలీసులకు అసలు కథ చెబుతాడు పోలీస్ ఆఫీసర్. ఈ క్రమంలో దేవా ఎంత పవర్‌ఫుల్ అనేది చెబుతూ, కాళీ స్టోరీని రివీల్ చేస్తారు. ప్రారంభంలో సినిమా ఓ కేజీఎఫ్‌ని తలపిస్తుంది. పోలీసుల హడావుడి వేరే లెవల్ లో ఉంటుంది. అది సినిమాపై ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. ఆ తర్వాత కాళీ ఎంట్రీ ఉంటుంది. కాళీ ఎంట్రీతోనే అసలు చిరాకు స్టార్ట్ అవుతుంది. ఆయన పాత్ర గోల గోలగా ఉంటుంది. తెరపై కనిపిస్తే చాలు గోల, అరుపులే ఉంటాయి. ధృవ పాత్ర ఎంట్రీ నుంచి అమ్మాయి బాధపడేంత వరకు ఈ గోల నడుస్తూనే ఉంటుంది. మధ్యలో అన్నయ్య విషయంలో ధృవ తగ్గి ఉండటం, భయపడుతున్నట్టుగా ఉండటం వంటి సీన్లు కొంత రిలీఫ్‌నిస్తాయి. ఆ తర్వాత మళ్లీ అదే గోల. ఇంటర్వెల్ ఒకేలా ఉంటుంది. సెకండాఫ్ అంతా యాక్షన్ చుట్టూ తిరుగుతుంది. మధ్యలో సంజయ్ దత్ పాత్రని పరిచయం చేసే సీన్లు, యాక్షన్ సీన్లు మాత్రం అదిరిపోయాయి. సినిమాలో హైలైట్స్ ఇవే. కానీ ధృవ పాత్రని ఆ స్థాయిలో డిజైన్ చేయలేదు. అందుకే చిరాకు తెప్పిస్తుంది. సెకండాఫ్‌లో తన ప్రియురాలు జుట్టు కత్తిరించాడని చెప్పి హీరో.. విలన్‌కి వార్నింగ్ ఇచ్చేందుకు వెళ్లే సన్నివేశాలు వేరే స్థాయిలో ఉంటాయి. కానీ అందుకు కారణం మాత్రం చాలా వీక్‌గా ఉంది. థియేటర్లో ఫైట్ సీన్లు బాగున్నాయి. స్టయిలీష్ యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. శిల్పాశెట్టి సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. చివర్లో ఫ్యామిలీని కాపాడుకునేందుకు హీరో పడే బాధ, ఆవేదన, అనంతరం వచ్చే యాక్షన్ అదిరిపోయింది. క్లైమాక్స్ యాక్షన్ కూడా బాగుంది. కానీ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు సినిమా అంతా గోల గోలగా ఉంటుంది. లాజిక్ లెస్‌గా ఉంటుంది. సీన్‌కి సీన్ కి సంబంధం లేకుండా ఉంటుంది. ఒక ఫ్లో వెళ్తున్న కథ, సడెన్‌గా టర్న్ తీసుకుంటుంది. సరైన కథ లేదు. చిన్న పాయింట్‌ని పట్టుకుని దాన్ని ఎక్కడెక్కడికో లాగారు. సినిమాలో ఒక క్లారిటీ లేదు. ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించిందని చెప్పొచ్చు.
కాళీ పాత్రలో ధృవ నటన బాగుంది. కానీ ఓవర్ బోర్డ్ వెళ్లినట్టుంది. ఆయన పాత్ర చిరాకు తెప్పిస్తుంది. డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ ఆయన పాత్రని నడిపించిన తీరుమాత్రం ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. దేవాగా సంజయ్ దత్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. హీరో రేంజ్‌లో ఉంటుంది. ఆయన సీన్లు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. మహాలక్ష్మిగా రేష్మ నన్నయ్య బాగా చేసింది. కాళీ అన్నగా రమేష్ అరవింద్ ఇరగదీశారు. అలాగే సత్యవతిగా శిల్పా శెట్టి మరో పవర్‌ఫుల్ రోల్‌లో నటించింది. ఆమె అదరగొట్టింది. పోలీస్ ఆఫీసర్‌గా రవిశంకర్ పాత్ర కూడా ఆకట్టుకుంది.
టెక్నీకల్‌గా మూవీ చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాలో హైలైట్ ఏదైనా ఉందంటే అదొక్కటే అని చెప్పొచ్చు. మ్యూజిక్ పరంగా బీజీఎం బాగుంది. పాటలు మాత్రం కాస్త చిరాకుగా ఉంటాయి. ఎడిటింగ్ పరంగా చాలా లోపాలు ఉన్నాయి. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు ప్రేమ్.. ఏం చెప్పాలనుకున్నారనేది క్లారిటీ లేదు. మేకింగ్ పరంగా క్వాలిటీ, యాక్షన్ సీన్లు తప్ప మిగిలినదంతా హడావుడిగానే ఉంటుంది. కథ, కథనంలో లోపాలున్నాయి. ఆ విషయంలో బాగా వర్క్ చేయాల్సింది.
ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే `కేడీ`.
రేటింగ్ : 2