
తెలుగు చిత్రసీమ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను తిరగరాసి, ఆయనకు సరికొత్త ఇమేజ్‌ను అందించిన సినిమాల్లో ‘హిట్లర్’ ఒకటి. 1997 జనవరి 4న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడమే కాకుండా, చిరంజీవి మాస్ ఇమేజ్‌కి బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్‌ను జోడించి బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీగా నిలిచింది.
చిత్రం పేరు: హిట్లర్ (Hitler)
విడుదల తేదీ: 4 జనవరి 1997
నటీనటులు: చిరంజీవి, రంభ, రాజేంద్రప్రసాద్, దాసరి నారాయణరావు, ప్రకాష్ రాజ్, శారద, పి.ఎల్. నారాయణ, బ్రహ్మానందం, పొన్నంబళం, సుధాకర్, అల్లు రామలింగయ్య తదితరులు
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాణ సంస్థ: ఎమ్.ఎల్. మూవీ ఆర్ట్స్ (సమర్పణ: ఎడిటర్ మోహన్, నిర్మాత: ఎమ్.వి. లక్ష్మి)
సంగీతం: కోటి
రచన / సంభాషణలు: ఎల్.బి. శ్రీరామ్
నిడివి: సుమారు 160 నిమిషాలు
మాధవరావు (చిరంజీవి) ఒక క్రమశిక్షణ కలిగిన నిరాడంబరుడైన వ్యక్తి. ఐదుగురు చెల్లెళ్లకు తండ్రి లేని లోటు తెలియకుండా, బాధ్యతగల అన్నగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. తన చెల్లెళ్లపై ఆయన చూపించే ప్రేమ, విపరీతమైన ఆంక్షలు, కోపం వల్ల ఊరిలో ప్రతి ఒక్కరూ ఆయనను భయంతో "హిట్లర్" అని పిలుస్తుంటారు.
తండ్రి (దాసరి నారాయణరావు) వల్ల చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయామన్న కారణంతో.. తండ్రిపై తీవ్ర ద్వేషంతో చెల్లెళ్లను పెంచుతాడు మాధవరావు. జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తండ్రితో మాట్లాడడు, అతనేమో పిల్లల కోసం పరితపిస్తుంటాడు. అయితే, చెల్లెళ్ల పెళ్లిళ్లు, వారి వ్యక్తిగత జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు, విలన్ల కుట్రల వల్ల మాధవరావు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటాడు. చెల్లెళ్లు కూడా ఒకానొక దశలో అన్నను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ అన్ని సవాళ్లను దాటుకుని, చెల్లెళ్లకు ఎదురైన ముప్పును తొలగించి, తండ్రి నిర్దోషి అని నిరూపించి, కుటుంబాన్ని ఎలా ఏకం చేశాడు అన్నదే ‘హిట్లర్’ చిత్ర ప్రధాన కథ.
‘హిట్లర్’ సినిమాకు ప్రధాన బలం చిరంజీవి నటన. అంతకుముందు మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ లా ఉన్న చిరంజీవి, ఈ సినిమాలో తీవ్రమైన ఎమోషనల్ పాత్ర చేయడం, అది కూడా ఏమాత్రం కమర్షియల్ ఎలిమెంట్ లేని.. నిగ్రహం, బాధ్యత, అనురాగం నిండిన అన్నయ్యగా అద్భుతంగా జీవించారు. చెల్లెళ్ల పట్ల చూపే కఠినత్వం వెనుక ఉండే ఆవేదనను, ఎమోషనల్ సీన్లలో ఆయన పండించిన హావభావాలు ప్రేక్షకుల కళ్లను చెమ్మగిల్లేలా చేస్తాయి.
ఇక హీరోయిన్‌గా రంభ గ్లామర్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో.. రంభ తన బెస్ట్ యాక్టింగ్‌తో మెప్పించింది.
ఈ సినిమాలో చిరంజీవి తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర రాజేంద్రప్రసాద్‌ది. చిరంజీవికి బావగా, మిత్రుడిగా తన మార్క్ నటన, కామెడీతో అద్భుతం చేశాడు నటకిరీటి. ఇక చిరంజీవి తండ్రి పాత్రలో దర్శకరత్న దాసరి నారాయణరావు జీవించారని చెప్పవచ్చు. సరిసమానమైన ఎమోషన్స్, నటనతో ఆకట్టుకున్నారు. ఇంత ఎమోషనల్ కథతో కొనసాగుతున్న కథ మధ్యలో బ్రహ్మానందం, సుధాకర్, కల్పనారాయ్ లాంటి కమెడియన్స్ తమ కామెడీ నటనతో అలరించారు. వీరితో పాటు ఐదుగురు చెల్లెళ్లు, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు.
హిట్లర్ సినిమాను నిలబెట్టిన వాటిలో సంగీతం కూడా ఒకటి. కథకు తగ్గట్టుగా కోటి అందించిన స్వరాలు సినిమా విజయంలో సగభాగం వహించాయి. "నడక కలిసిన నవ రాత్రి", "మిస మిస మెరుపుల" వంటి మాస్/మెలోడీ పాటలతో పాటు "ఓ కాలమా ఇది నీ జాలమా", "కన్నీళ్లకే కన్నీరొచ్చే" వంటి పాటలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేశాయి. ఈ పాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నవారు కూడా ఉన్నారు. అంతేకాదు సీన్‌కు తగ్గట్టుగా ఇచ్చిన రీ-రికార్డింగ్ (BGM) ప్రతి ఎమోషనల్ సీన్‌ను నిలబెట్టింది.
ఇక దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సెంటిమెంట్ సినిమాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఈ చిత్రంలో మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి సరిపోయేలా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేశారు. సుబ్బయ్య కథకు తగ్గట్టుగా ఎల్.బి. శ్రీరామ్ అందించిన ఎమోషనల్ డైలాగ్స్ గుండెకు హత్తుకునేలా ఉండటంతో పాటు సినిమా స్థాయిని పెంచాయి.
హిట్లర్ సినిమా కథ మనది కాదు. ఈ చిత్రం 1996లో మమ్ముట్టి హీరోగా వచ్చిన మలయాళ సూపర్ హిట్ 'హిట్లర్' చిత్రానికి రీమేక్.
అసలు ఈ కథను ముందుగా చిరంజీవి కోసం అనుకోలేదు. నిర్మాత ఎడిటర్ మోహన్ ఈ కథ హక్కులు కొనుగోలు చేసినప్పుడు మొదట మోహన్ బాబు హీరోగా, ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించారు. కానీ కాల్షీట్లు కుదరకపోవడంతో ఆ అవకాశం చిరంజీవి వద్దకు వచ్చింది. ఇ.వి.వి. ప్లేస్‌లో సుబ్బయ్య వచ్చారు.
బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్: హిట్లర్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోయింది. 1997 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, 42 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఒంగోలులో ఎంతో వైభవంగా 100 రోజుల వేడుకను నిర్వహించారు.
1995 డిసెంబర్‌లో వచ్చిన ‘రిక్షావోడు’ ఫ్లాప్ అయిన తర్వాత చిరంజీవి దాదాపు ఒక సంవత్సరం పాటు ఏ సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్నారు. సరైన కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో 'హిట్లర్' ఆయన వద్దకు వచ్చి బ్లాక్‌బస్టర్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి కెరీర్ మరో మలుపు తిరిగింది.
అప్పట్లో వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో, దర్శకుడు ముత్యాల సుబ్బయ్యకు చిరంజీవి అభిమానుల నుంచి ఉత్తరాలు వచ్చాయట. సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఒత్తిడి ఉన్నప్పటికీ, దర్శకుడు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథనంలో మార్పులు చేసి విజయం సాధించారు.
చిరంజీవి పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ నటన.
బలమైన ఎమోషన్స్, కుటుంబ బాంధవ్యాల నేపథ్యం.
కోటి అందించిన అద్భుతమైన పాటలు - నేపథ్య సంగీతం.
సుధాకర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కామెడీ కాంబినేషన్.
కొన్ని చోట్ల మరీ ఎక్కువ డ్రామా, సెంటిమెంట్ అనిపించడం.
క్లైమాక్స్ సన్నివేశాలు కొంత రొటీన్‌గా అనిపించడం.
ఫైనల్ గా..
‘హిట్లర్’ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, చిరంజీవి కెరీర్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఘట్టం. మాస్ యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సెంటిమెంట్ హీరోగా చిరంజీవి రీ-ఎంట్రీ ఘనంగా జరిగింది. నేటికీ బుల్లితెరపై వస్తే ప్రేక్షకులు ఆదరించే ఆల్‌టైమ్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది.