
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత, శ్రీష, కమల్ కామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `సీక్రెట్ సోల్జర్`. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మూన్ లైట్ డ్రీమ్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై తెరకెక్కింది. ఈ సినిమా నేడు శుక్రవారం(సెప్టెంబర్ 18)న విడుదలైంది. స్పై ఏజెంట్, దేశ భక్తి ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ఆకట్టుకుందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
మీరా వలి(నిహాల్ కోదాటి), పృథ్వీ(సూర్య శ్రీనివాస్) నెల్లూరుకి చెందిన కుర్రాళ్లు. చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. మీరావలికి దేశభక్తి ఎక్కువ. కానీ ముస్లిం కావడంతో పలు అవమానాలు ఫేస్ చేస్తాడు. తన దేశభక్తిని నిరూపించుకోవాలనుకొని ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటాడు. కానీ అనూహ్యంగా తన ఫ్యామిలీపై వదిన కేసు పెట్టడంతో ఆ కోరిక నెరవేరదు. కానీ మరో దారి ఎంచుకుంటాడు. ఆ దారిలో ఉగ్రవాదులకు దగ్గరవుతాడు. తాను దేశ ద్రోహిగా ముద్ర వేసుకుంటాడు. కానీ ఇవన్నీ స్నేహితుడు పృథ్వీకి తెలియదు. మరి మీరావలి ఎందుకు ఉగ్రవాదులకు దగ్గరయ్యాడు? అతని అసలు గోల్ ఏంటి? అతని వెనుక ఉన్నది ఎవరు? దేశభద్రతకి, మన సైనికులకు సంబంధించిన సీక్రెట్ మిషన్ లీక్‌కి తాను ఎలా కారణమయ్యాడు? ఈ మిషన్‌లో ఉన్న ద్రోహులెవరు? దీన్ని మన సీక్రెట్ సోల్జర్స్ ఎలా ఎదుర్కొన్నారు, మీరా వలి గురించి ఫ్రెండ్‌కి తెలిసిన నిజం ఏంటి? అనేది సినిమా.
దేశభక్తి, స్నేహాన్ని మేళవిస్తూ రూపొందించిన చిత్రమిది. నిజానికిది చాలా పెద్ద రేంజ్ స్టోరీ. కానీ కొత్త నటీనటులు, అప్‌కమింగ్ యాక్టర్స్ తో ఈ రేంజ్ సినిమా తీయడం విశేషమని చెప్పాలి. ఆ విషయంలో దర్శక, నిర్మాతల డేర్‌ని అభినందించాల్సిందే. డిఫెన్స్ కి సంబంధించిన సీక్రెట్ మిషన్ లీక్‌కి, స్నేహాన్ని ముడిపెడుతూ రూపొందించిన తీరు బాగుంది. రెండింటిని చాలా బ్యాలెన్స్ చేశారు. అదే ఇందులో హైలైట్‌గా చెప్పాలి. సినిమాలోని ట్విస్ట్ లు, టర్న్ లు మరో హైలైట్‌గా నిలిచాయి. సినిమా మీరావలి చుట్టూ తిరుగుతుంది. అతను ఉగ్రవాదులతో తిరుగుతున్న ఫోటోలు బయటపడటంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అది ఫ్రెండ్‌కి షాకిస్తుంది. ఇది కట్టు కథగా భావిస్తాడు. కానీ ఒక్కో ట్విస్ట్, అసలు కథ రివీల్ అవుతున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇందులో ఒక్కో పాత్ర ఎంట్రీ ఇవ్వడం, కథ మరో మలుపు తీసుకోవడం ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎంగేజ్ చేస్తుంటాయి. ఓ వైపు దేశానికి సంబంధించిన స్పై ఏజెన్సీ చేసే కార్యక్రమాలు, వారు చేసే మిషన్ లీక్ కావడం వంటి అంశాలను, మరోవైపు స్నేహానికి సంబంధించిన జర్నీని, మీరావలి ఫేస్ చేసే అవమానాలు, ఆయన జర్నీని పారలల్‌గా ఆవిష్కరించిన తీరు బాగుంది. స్క్రీన్ ప్లే చాలా నీట్‌గా సాగుతుంది. ఫస్టాఫ్ కొంత స్లోగా వెళ్తుంది. కానీ సెకండాఫ్ అనేక మలుపులు ఉండటం, ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా చాలా చోట్ల కథనంలో లింక్‌లు మిస్ అయ్యాయి. ఒక వైపు వెళ్లే కథ, మరోవైపు టర్న్ తీసుకున్నట్టుగా ఉంటుంది. చాలా చోట్ల లాజిక్ లు మిస్ అయ్యాయి. స్పై ఏజెన్సీలోనే వారికే కమ్యూనికేషన్ లేకపోవడమనేది కొంత అసహజంగా అనిపిస్తుంది. పాత్రల్లోని ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలలేదు. నోటెడ్ ఆర్టిస్ట్ లు లేకపోవడంతో ఆ ట్విస్ట్ లు అంతగా వర్కౌట్ కాలేదు. కాకపోతే చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. కొత్త వారైనా చాలా బాగా చేశారు. ఇదొక స్పై యాక్షన్ ఫిల్మ్ లా కాకుండా, స్నేహం చుట్టూ కథని నడిపించడం విశేషంగా చెప్పొచ్చు. అది కొత్తగా ఉంది.
మీరావలి పాత్రలో నిహాల్ కోదాటి అదరగొట్టాడు. అతని పాత్రలోని షేడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. నిహాల్ చాలా వరకు సెటిల్డ్ గా చేసి మెప్పించింది. పెయిన్‌లో లోపల మోస్తూ, బయటకు యాక్టింగ్‌ని కనిబరిచిన తీరు బాగుంది. అతని పాత్రనే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. చివర్లో ఎమోషనల్‌కి గురి చేస్తుంది. ఇక ఫ్రెండ్ పృథ్వీ పాత్రలో సూర్య శ్రీనివాస్ అదరగొట్టాడు. అతని పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా తనకు మంచి పేరుని, గుర్తింపుని తీసుకొస్తుందని చెప్పొచ్చు. వీరితోపాటు కమల్ కామరాజు తన మార్క్ నటనతో మెప్పించాడు. అలాగే హర్షిత, శ్రీష పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మిగిలిన వారు ఓకే అనిపించారు.
కార్తిక్ సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బీజీఎం హైలైట్‌గా నిలిచింది. సురేష్ రఘుతు కెమెరా వర్క్ కనువిందు చేస్తుంది. సినిమా రేంజ్‌ని మార్చేసింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఫర్వాలేదు. ఇంకా కాస్త జాగ్రత్త వహించాల్సింది. దర్శకుడు అక్కి విశ్వనాథ్.. ఎంచుకున్న కథ, దాన్ని తీసుకెళ్లిన తీరు బాగుంది. అయితే లాజిక్స్ పరంగా, కథ పరంగా మరింత డెప్త్ గా చెప్పాల్సింది. కొన్ని సీన్లు కన్విన్సింగ్‌గా లేవు. సీరియస్ కథని నార్మల్‌గా చెప్పడం నప్పేలా లేదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. కానీ నిర్మాణం పరంగా, మేకింగ్ పరంగా రాజీపడలేదు. ఒక పెద్ద రేంజ్ సినిమాని రూపొందించినట్టు ఉంది. అదే సమయంలో కథని చెప్పిన తీరు కూడా కొత్తగా ఉంది. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే.
ఫైనల్‌గా:
దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఒక కొత్త తరహా చిత్రమిది. స్పై మూవీస్, దేశభక్తి మూవీస్‌ని ఇష్టపడే వారికి నచ్చే సినిమా అవుతుంది.
రేటింగ్: 2.5