
సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట సింహ, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన, వీటివి గణేష్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `త్రిబాణధారి బార్బరిక్`. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. దర్శకుడు మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ పతాకంపై విజయ్ పాల్ రెడ్డి అడిదల ఈ మూవీని నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ నేడు శుక్రవారం(ఆగస్ట్ 29న) విడుదలైంది. ఈ మూవీని మీడియాకి ప్రత్యేకంగా వేసిన షోలో ప్రసాద్ ల్యాబ్‌లో వీక్షించాను. మరి సినిమా ఎలా అనిపించిందనేది రివ్యూలో తెలుసుకుందాం.
సైకియాట్రిస్ట్ శ్యామ్(సత్యరాజ్) తన మనవరాలు నిధి(మేఘన)నే సర్వస్వంగా జీవిస్తుంటాడు. ఓ ప్రమాదంలో కొడుకు, కోడలు చనిపోవడంతో మనవరాలిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఆమెకి మహాభారతంలోని యుద్ధ వీరుడు బార్బరిక్ కథ చెబుతూ పెంచుతాడు. కష్టసమయంలో ఆయా పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో బార్బరిక్ పాత్ర ద్వారా నేర్చుకోవాలని గైడ్ చేస్తుంటాడు. ఓ రోజు స్కూల్‌కి వెళ్లిన నిధి రాత్రి అయినా ఇంటికి రాదు. ఫ్రెండ్స్ వద్ద లేదు, స్కూల్ బస్ డ్రైవర్ ఇంటి వద్దనే దించినట్టు చెబుతాడు. కానీ నిధి మిస్ అవుతుంది. పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా, పోలీస్ కానిస్టేబుల్ చందు(సత్యం రాజేష్)ని శ్యామ్‌కి ఇచ్చి విచారించేందుకు పంపిస్తాడు ఎస్‌ఐ(వీటీవీ గణేష్). చందుతో కలిసి శ్యామ్ చేసే ఇన్వెస్టిగేషన్‌లో ఒక్కో నిజం బయటపడుతుంది. ఒక్కో చిక్కుముడి ఓపెన్ అవుతుంది. ఈ క్రమంలో రామ్(వశిష్ట సింహా), దేవ్(క్రాంతి కిరణ్) కథ బయటకు వస్తుంది. ఈ ఇద్దరు చిన్నప్పట్నుంచి స్నేహితులు. రామ్ పేదరికం నుంచి బయటపడేందుకు విదేశాలకు జాబ్ కోసం వెళ్లాలని కలలు కంటుంటాడు. అందుకు 30 లక్షల డబ్బు అవసరం అవుతుంది. అలాగే దేవ్‌కి జూదం అలవాటు ఉంటుంది. ఇల్లీగల్‌గా సంపాదించిన డబ్బు మొత్తం దానికే పెడతాడు. దీంతో దాసన్న(రాజేంద్రన్) వద్ద అప్పు చేయాల్సి వస్తుంది. అదే సమయంలో తన మేనత్త వాకిలి పద్మ(ఉదయభాను) కూతురుని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి నిధి మిస్సింగ్ కేసుకి, రామ్, దేవ్‌లకు సంబంధం ఏంటి? శ్యామ్‌కి మనవరాలు నిధి దొరికిందా? చివరికి శ్యామ్.. బార్బరిక్‌గా ఎలా మారాడు అనేది మిగిలిన సినిమా.
మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు బార్బరిక్. కురుక్షేత్ర సంగ్రామంలో ఈ యోధుడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు. అయితే బార్బరికుడి గొప్పతనం ఏంటంటే నిమిషంలోనే యుద్ధాన్ని ముగించడం. తన వద్ద మూడు బాణాలుంటాయి. తన మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది. ఈ కథకి, ఈ సినిమాలోని పాప మిస్సింగ్ స్టోరీకి ముడిపెడుతూ తన మనవరాలి కోసం సైకియాట్రిస్ట్ ఎలా బార్బరికుడిగా మారాడు? అనేదే ఈ మూవీ కథాంశం. సినిమా ఆద్యంతం మిస్టరీ థ్రిల్లర్‌గా సాగుతుంది. ప్రారంభంలో శ్యామ్, అతని మనవరాలి మధ్య బాండింగ్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. తన మనవరాలునే ప్రాణంగా శ్యామ్ ఉండటం వంటి సీన్లతో ఆడియెన్స్ ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేశాడు దర్శకుడు. ఆ తర్వాత సడెన్‌గా పాప మిస్ కావడంతో సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారుతుంది. మనవరాలి కోసం పోలీస్‌తో కలిసి ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ ఇన్వెస్టిగేషన్‌లోని కొన్ని చిక్కుముడులు, ట్విస్ట్ లు, టర్న్ లు కొంత ఆడియెన్స్ దృష్టిని మరల్చేలా ఉంటాయి. ఆద్యంతం సస్పెన్స్ అంశాలు నెక్ట్స్ ఏం జరగబోతుందనే ఉత్కంఠకి గురి చేస్తుంటాయి. అదే సమయంలో రామ్, దేవ్ పాత్రల బాండింగ్‌ని చూపిస్తూ వాళ్ల లవ్ స్టోరీస్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకోవైపు డబ్బు కోసం వాళ్లు చెడు దార్లు తొక్కడం వంటివి చూపిస్తూ చివరికి ఈ రెండు కథలను కలిపిన తీరు బాగుంది. ప్రియురాలితో రామ్ లవ్ ట్రాక్ రొమాంటిక్‌గా ఉంటుంది. మరోవైపు దాసన్నతో వచ్చే సీన్లు కాస్త కామెడీగా ఉంటాయి. ఇంకోవైపు వాకిలి పద్మగా ఉదయభాను క్యాబ్ కంపెనీ నడిపించడం, ఆమె చేసే హడావుడి కాస్త అలరించేలా, ఫన్నీగా ఉంటుంది. చివర్లో బ్యాక్ టూ బ్యాక్ ట్విస్ట్ లు, టర్న్ లో సాగుతూ, కథని ముగించిన తీరు బాగుంది.
అయితే సినిమా ప్రారంభమైన కాసేపట్లోనే అసలు కథలోకి వెళ్తుంది. అమ్మాయి మిస్ కావడంతో సినిమా థ్రిల్లర్ వైపు టర్న్ తీసుకుంటుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంటుంది. ఈ క్రమంలో పాపని వెతికే సీన్లు ఎంగేజ్ చేసేలా ఉంటాయి. మరోవైపు రామ్, దేవ్ ల స్టోరీస్ చూపిస్తూ నడిపించిన తీరు ఈ థ్రిల్లర్ నుంచి కాస్త రిలీఫ్‌నిస్తాయి. కాకపోతే కథని డైవర్ట్ చేసేలా ఉంటాయి. సినిమా స్క్రీన్‌ప్లే పడుతూ లేస్తూ సాగుతుంది. పాప కోసం విచారణ కూడా స్లోగా సాగుతుంది. దీనికితోడు మధ్యలో రామ్, దేవ్‌ల స్టోరీస్ చెప్పడం కథకి సంబంధం ఉన్నా? కొంత డైవర్ట్ చేసేలా ఉంటాయి. కొన్ని చోట్ల ఫన్నీ సీన్లు ఉన్నా, అవి ఆశించిన స్థాయిలో పండలేదు. ఇంకోవైపు బార్బరిక్ కథని, ఈ పాప మిస్టరీకి మేళవించిన తీరు హంగామాలా ఉంది, పెద్దగా సింక్ కాలేదు. రెగ్యూలర్ మిస్టరీథ్రిల్లర్‌కి జస్ట్ ఈ బార్బరిక్ స్టోరీ యాడ్ చేసి హడావుడి చేసినట్టుగానే ఉంది. కొంత ఆడియెన్స్ ని డైవర్ట్ చేసేలా ఉంది. ఫస్టాఫ్‌లో ప్రారంభంలో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ తర్వాత స్క్రీన్‌ప్లే పడుతూ లేస్తూ సాగుతుంది. సెకండాఫ్ కాస్త ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. అదే సమయంలో కొంత కన్‌ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. మరోవైపు ఎమోషనల్ థ్రిల్లర్‌గానూ స్కోప్ ఉన్నా, ఎమోషన్స్ అంతగా పండలేదు. ఇలాంటి కొన్ని మైనస్‌లు పక్కన పెడితే టైమ్ పాస్‌కి చూసే మిస్టరీ థ్రిల్లర్‌గా చెప్పొచ్చు.
శ్యామ్‌గా సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించారు. తాతగా, సైకియాట్రిస్ట్ గా, మనవరాలి కోసం మదనపడే పాత్రలో ఆద్యంతం ఆకట్టుకున్నారు. అదే సమయంలో బార్బరిక్‌గా మారిన వైనం కూడా బాగుంది. ఆకట్టుకునేలా ఉంది. సినిమాకి ఆయనే హీరో. నిధిగా మేఘన బాగా నటించింది. కనిపించిన కాసేపు ఆకట్టుకుంది. ఇక రామ్ పాత్రలో వశిష్ట అదరగొట్టాడు. మంచోడిగా కనిపిస్తూ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో బాగా చేశాడు. ఆయన నుంచి ఇలాంటివి ఊహించొచ్చు. ఆయన పాత్రలోని ట్విస్ట్ కూడా ఎంగేజ్ చేస్తుంది. ఇంకోవైపు దేవ్ పాత్రలో కిరణ్ క్రాంతి బాగా చేశాడు. మంచి ప్రామిసింగ్ రోల్ దక్కింది. ఆయన పాత్రలోని విభిన్నమైన షేడ్స్ కూడా ఆకట్టుకుంటాయి. వాలికి పద్మగా ఉదయభాను కనిపించినంత సేపు బాగా చేసింది. కానీ ఆమె పాత్ర హడావుడి తప్ప సినిమాలో అంత ప్రయారిటీ లేదు. దాసన్నగా రాజేంద్రన్ తనదైన స్టయిల్‌లో ఆకట్టుకున్నాడు. ఇక కానిస్టేబుల్ చందుగా సత్యం రాజేష్‌కి మరో బలమైన పాత్ర పడింది. బాగా చేశాడు. ఎస్‌ఐగా వీటీవీ గణేష్ కూడా అలరించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
కుషేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. వర్షంలోనూ సీన్లని బాగా చిత్రీకరించారు. బాగా చూపించారు. మరోవైపు ఇన్‌ఫ్యూషన్ బ్యాండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకి అదే పెద్ద అసెట్. ఎలివేషన్లు అదిరిపోయాయి. కథని ఎలివేట్ చేయడంలో బీజీఎం పాత్ర ఎంతో ఉంది. సినిమాని ఎంగేజ్ చేయడంలో దాని పాత్ర బలంగా ఉందని చెప్పొచ్చు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఫర్వాలేదు. కొంత ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా ఖర్చు చేశారని ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. సినిమా చాలా రిచ్‌గా ఉంది. ఇక దర్శకుడు మోహన్ శ్రీవత్స ఎంచుకున్న కథ రొటీన్‌గానే ఉన్నా, బార్బరిక్ కథని యాడ్ చేసి కొత్తగా మార్చారు. దర్శకుడిగా తన ప్రతిభని చూపించారు. ఎంగేజింగ్‌గా కథని తెరకెక్కించడంలో సక్సెస్ అయినా, చాలా వరకు రొటీన్ అంశాలకు ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది. మరోవైపు కథ ఊహించేలా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు. కొంత ఫన్, మరికొంత ఎమోషనల్ అంశాలకు ప్రయారిటీ ఇవ్వాల్సింది. డ్రామా రక్తికట్టించేలా చేస్తే బాగుండేది.
ఫైనల్ నోట్‌ః ఎంగేజ్ చేసే మిస్టరీ థ్రిల్లర్ `త్రిబాణధారి బార్బరిక్`. టైమ్‌పాస్‌కి చూడదగ్గ మూవీ.
రేటింగ్‌ః 2.75