
దృశ్యం సినిమాలకు ఇండియా వైజ్‌గా మంచి క్రేజ్ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. దేశంలోని పలు భాషల్లో రీమేక్ అన్ని చోట్ల విజయం సాధించాయి. తెలుగులోనూ వెంకటేష్ హీరోగా వచ్చిన విషయం తెలిసిందే. దీనికి మూలం మలయాళం. అక్కడ మోహన్‌లాల్, మీనా నటిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మలయాళంలో మూడో సీక్వెల్ వచ్చింది. దీనికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నేడు గురువారం(మే 21)న విడుదలైంది. తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ గత చిత్రాల మాదిరిగానే మెప్పించిందా? తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
దృశ్యం సినిమా కథ అందరికి తెలిసిందే. తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడబోయిన కుర్రాడు వరుణ్‌ని జార్జ్ కుట్టి(మోహన్ లాల్) కూతురు అంజు(అన్సిబా హాసన్) కొట్టడంతో అతను చనిపోతాడు. ఈ కేసులో తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నం, ఎత్తులకుపై ఎత్తులే ఈ మూవీ అనేది తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌లో దానికి కొనసాగింపుని చూపించారు. రెండో పార్ట్ లో కేసు క్లోజ్ అవుతుంది. కానీ ఆ నీడ, దాని అనుమానాలు, వాటి ప్రభావం జార్జ్ కుట్టీ ఫ్యామిలీని వెంటాడుతూనే ఉంటాయి. తను టెన్షన్ పడుతుంటాడు. ఇందులో ఆయన హీరో హరి(బీజూ మీనన్)తో సినిమా చేస్తాడు. అది పెద్ద హిట్ అవుతుంది. ఆ ఆనందంలో తన పెద్ద కూతురు మ్యారేజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. కానీ వరుసగా రిజెక్ట్స్ అవుతుంటారు. ఎవరో వీరి గురించి, కేసు గురించి చెప్పి పెళ్లి సంబంధాలను చెడగొడుతుంటారు. దీని వెనకాల ఎవరున్నారనేది తెలుసుకునే పనిలో ఉంటాడు జార్జ్ కుట్టి. మరోవైపు ఎట్టకేలకు కూతురుకి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒక ఎన్‌ఆర్‌ఐ సంబంధం ఓకే అవుతుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇంతలో ఈ కేసుని మళ్లీ ఓపెన్ చేస్తారు. కొన్ని ఆధారాలు దొరకడంతో మళ్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ సారి ఇందులో ఐజీ ఇన్‌వాల్వ్ అవుతారు. అలాగే చనిపోయిన వరుణ్ ఫాదర్ ప్రభాకర్(సిద్ధిఖీ) కూడా వస్తాడు. తన భార్య మానసిక పరిస్థితి చూడలేక ఎలాగైనా జార్జ్ కుట్టీ ఫ్యామిలీకి శిక్ష పడాలని ప్రయత్నిస్తుంటాడు. పెళ్లిని ఆపే ప్రయత్నం చేస్తారు. మరి అది సాధ్యమైందా? జార్జ్ కుట్టీ ఫ్యామిలీకి శిక్ష పడిందా? జార్జ్ కుట్టి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు ఏం చేశాడు? ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ.
దృశ్యం సినిమా తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు హీరో చేసే పోరాటమే ఈ చిత్రం. తన తెలివితో, ఎత్తులకు పై ఎత్తులు వేయడమే సినిమా. గత రెండు చిత్రాల మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో పార్ట్ కూడా అదే తరహాలో ఎంగేజ్ చేసిందా? ట్విస్ట్ లు, టర్న్ లతో సాగిందా? అవి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయా? అంటే ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఒక తరహా కథతో మొదటి రెండు భాగాలు చూడటంతో మూడో పార్ట్ పై మరింత అంచనాలున్నాయి. దాన్ని మించిన ట్విస్ట్ లు, టర్న్ లు ఉంటాయని అంతా భావించారు. కానీ ఆ స్థాయిలో `దృశ్యం 2` లేదని చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచి చాలా స్లోగా సాగుతుంది. కథ ముందే తెలియడంతో ఇందులో కథనం ఊహించినట్టుగానే ఉంటుంది. దీనికితోడు కథలో ఇంటెన్సిటీ మూడ్‌ని క్రియేట్ చేయడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నారు. దీంతో స్లోగా సాగుతుంది. బోరింగ్‌గా ఉంటుంది. మధ్య మధ్యలో థ్రిల్ ఎలిమెంట్లు ఒకటి రెండు యాడ్ చేశారు. కానీ అవి పెద్దగా కిక్ ఇవ్వవు. మొదటి భాగం వరకు టైమ్ పాస్‌లాగానే తీసుకెళ్లారు. ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అంశాలు కనిపించవు. కాకపోతే ఆ కేసుకి సంబంధించిన చర్చ మాత్రం నడుస్తూనే ఉంది. దాన్ని కవర్ చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగబోతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సెకండాఫ్‌లో వేగం పెరిగింది. పెళ్లి ఆగిపోతుందా? లేదా అనే ఉత్కంఠ ఆకట్టుకుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావడంతో కథనం పలు మలుపులు తీసుకుంటుంది. కొత్త ట్విస్ట్ లు యాడ్ అవుతుంటాయి. అయితే అవి పెద్దగా కిక్ ఇవ్వవు. ఊహించినట్టుగానే అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలో అవి కామనే అని ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాహ్ ఫ్యాక్టర్స్ మాత్రం లేవు. క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంది. పోలీసులకు, హంతకుడి తండ్రికి హీరో ఇచ్చే ట్విస్ట్, షాక్ మాత్రం అదిరిపోతుంది. ఈ కేసుకి ముగింపు పలికేలా ఈ మూవీ ముగింపు ఇచ్చారు. కానీ హంతకుడి తల్లి ద్వారా సీక్వెల్‌కి హింట్ ఇచ్చారు. అదే ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సినిమా స్లోగా సాగడంతో ఎంగేజ్ చేసే అంశాలు మిస్ అయ్యాయి. చాలా వరకు డ్రై ఫీలింగ్ తెప్పిస్తుంది. సినిమాలో క్లైమాక్స్ మినహా ఏదీ ఆకట్టుకోలేకపోయింది. గత రెండు చిత్రాలతో పోల్చితే ఇది తేలిపోయిందని చెప్పొచ్చు.
జార్జ్ కుట్టీ పాత్రలో మోహన్ లాల్ మరోసారి అదరగొట్టారు. తన నటనతోనే మాయ చేశారు. నిజానికి కథ, కథనంలో విషయం లేదు, కానీ మోహన్ లాల్ నటన ఆకట్టుకుంటుంది. ఆయన భార్య రాణి పాత్రలో మీనా ఎప్పటిలాగే చేసుకుంటూ వెళ్లింది. మెప్పించింది. మధ్య మధ్యలో నవ్వించే ప్రయత్నం చేసింది. అంజు పాత్రలో అన్సిబా హస్సన్ సెటిల్డ్ గా బాగా చేసింది. చిన్నమ్మాయిగా ఎస్తేర్ అనిల్ ఆకట్టుకుంది. అలరించింది. వరుణ్ తండ్రి ప్రభాకర్ పాత్రలో సిద్ధిఖీ మెప్పించారు. ఆయన పాత్ర ఎంట్రీతో కథ సరికొత్త మలుపులు తీసుకుంటుంది. జర్నలిస్ట్ గా వీణా నందకుమారి పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే మిగిలిన పాత్రధారులు ఆయా పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
ఈ మూవీ టెక్నీకల్‌గా బాగుంది. విజువల్‌గా కనువిందు చేస్తుంది. అలాగే ఆర్‌ఆర్ ఆకట్టుకుంది. వీఎస్ వినాయక్ ఎడిటింగ్ స్పీడ్ పెంచాల్సింది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యారు. ట్విస్ట్ లను సరిగా రాసుకోలేకపోయారు. మన ఆడియెన్స్ కి పెద్దగా థ్రిల్ ఇవ్వలేకపోయాయి. కథ లేకపోవడంతో టైమ్ పాస్ ఎలిమెంట్లకు ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది సినిమాని బోరింగ్‌గా మార్చింది. దీనికితోడు డబ్బింగ్ పెద్ద మైనస్.
స్లోగా, బోరింగ్‌గా సాగే దృశ్యం 3. మధ్య మధ్యలో చిన్న మెరుపులు, క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. గత రెండు సినిమాలతో పోల్చితే డిజప్పాయింట్ చేస్తుంది.