బైసన్‌ మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్‌.. విక్రమ్‌ కొడుకు మూవీ ఎలా ఉందంటే?

Published : Oct 24, 2025, 08:04 AM ISTUpdated : Oct 24, 2025, 08:19 AM IST

హీరో విక్రమ్‌ ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కొడుకు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా అలరించేందుకు వస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన `బైసన్‌` మూవీ తెలుగులో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందంటే? 

PREV
16
`బైసన్‌` మూవీ రివ్యూ

`అపరిచితుడు` సినిమా మన తెలుగు ఆడియెన్స్ ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అందులో విక్రమ్‌ నటనకు అంతా ఫిదా అవుతారు. ఆ తర్వాత కూడా అనేక చిత్రాలతో విక్రమ్‌ మన తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కొడుకు ధృవ్‌ విక్రమ్‌ కూడా నాన్న దారిలోనే వస్తున్నాడు. అతని సినిమాలు కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా `బైసన్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు ధృవ్‌. ఇది తమిళంలో గత వారమే(అక్టోబర్‌ 17న) విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. దాదాపు నలభై కోట్లు అక్కడ వసూలు చేసింది. ఈ శుక్రవారం తెలుగులో విడుదల చేశారు. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. లాల్‌, పశుపతి, అమీర్‌, రాజిషా విజయన్‌, అళగం పెరుమాల్‌, అరువి మధన్‌, అనురాగ్‌ అరోరా వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. సమీర్‌ నాయర్‌, దీపక్‌ సెగల్‌, పా రంజిత్‌, అదితి ఆనంద్‌ నిర్మాతలు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యిందా? విక్రమ్‌ కొడుకు అదరగొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
`బైసన్‌` మూవీ స్టోరీ ఇదే

వనతి కిట్టయ్య(ధృవ్‌ విక్రమ్‌)కి కబడ్డీ అంటే పిచ్చి. అదే ప్రాణంగా బతుకుతుంటాడు. ఈ విషయంలో తండ్రి వేలుస్వామి(పశుపతి)ని కూడా ఎదురిస్తుంటాడు. మనం తక్కువ కులం అని, మనల్ని ఎదగనివ్వరు, మన తలరాత ఇంతే అని తండ్రి పదే పదే కొడుకుని అదుపు చేస్తుంటాడు. కానీ స్థానిక పీఈటీ టీచర్‌ సహాయంతో కబడ్డీలో బాగా రాణిస్తుంటాడు కిట్టయ్య. అదే సమయంలో ఊర్లో పాండిరాజ్‌(అమీర్‌ సుల్తాన్‌), కందసామి(లాల్‌) మధ్య వర్గపోరు నడుస్తుంది. వీరి కులాల గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఏ చిన్న గొడవ జరిగినా అది చంపుకునే వరకు వెళ్తుంది. దీంతో ఆ గొడవల మధ్య తాను కబడ్డీ ప్లేయర్‌గా సర్వైవ్‌ కావడం కిట్టయ్యకి కత్తిమీద సాములా మారుతుంది. నిత్యం గొడవలు, కొట్టుకోవడం, చంపుకోవడం మధ్య తన డ్రీమ్‌ ఆయోమయంలో పడిపోతున్న నేపథ్యంలో పీఈటీ టీచర్‌ ఎంతో ప్రోత్సహిస్తాడు. ఆ తర్వాత తండ్రి వేలు స్వామి కూడా ఓకే చెబుతాడు. ఊర్లో గెలుస్తాడు, ఆ తర్వాత ఇతర ఊర్లోనూ గెలుస్తాడు. కిట్టయ్య ఆటని చూసి ఫిదా అయిన కందసామి తన వాడు కాకపోయినా తన టీమ్‌లో చేర్పించుకుంటాడు. ఆ తర్వాత కులం అనేది సమస్యగా మారుతుంది. అక్కడ కూడా గొడవలు కిట్టయ్యని వెంటాడుతుంటాయి. దీంతో కిట్టయ్యని మరో ఊరి టీమ్‌లో చేర్పిస్తాడు కందసామి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నేషనల్‌ స్థాయికి చేరుకుంటాడు. అయితే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ప్రతి దశలోనూ పోరాడుతూ నేషనల్‌ కి వెళ్లిన కిట్టయ్యకి నేషనల్‌ టీమ్‌కి ఎంపిక ఈజీగానే జరిగిందా? అక్కడ ఎలాంటి అవమానాలు ఫేస్‌ చేశాడు? నేషనల్‌ జట్టులో తన పేరు చేర్చడానికి ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్‌ చేయాల్సి వచ్చింది? అక్కడ ఎలాంటి డ్రామా చోటు చేసుకుంది? జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ కి కిట్టయ్య ఎంపికకి సంబంధించిన ఎలాంటి కుట్ర జరిగింది? చివరికి ఇండియాకి మెడల్ తేవడంలో తన పాత్ర ఎలాంటిది? రాణి(అనుపమా పరమేశ్వరన్‌)తో లవ్‌ ట్రాక్‌ ఎలా సాగిందనేది మిగిలిన సినిమా.

36
బైసన్‌ మూవీ విశ్లేషణః

స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే చిత్రాలు చాలా వరకు ఆదరణ పొందుతాయి. అందులో స్ట్రగుల్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎంతో తొక్కివేయబడి, ఎన్నో అవమానాలను ఫేస్‌ చేసి, వాటిని తట్టుకుని నిలబడి, తనని తాను నిరూపించుకుని గొప్ప ప్లేయర్‌గా, దేశం గర్వించదగ్గ ఆటగాడిగా రాణించడం వెనుక ఎంతో డ్రామా, ఎమోషన్స్ ఉంటాయి. అవి సరిగ్గా కుదిరితే ఆడియెన్స్ ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. తెలుగులో ఇప్పటికే `భీమిలి కబడ్డీ జట్టు`, `ఒక్కడు`, `సిటీమార్‌` వంటి చిత్రాలు ఇలాంటి కబడ్డీ నేపథ్యంలోనే తెరకెక్కాయి. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తమిళంలోనూ అడపాదడపా వస్తూనే ఉన్నాయి. తాజాగా `బైసన్‌` మూవీ పూర్తి కబడ్డీ నేపథ్యంలోనే తెరకెక్కిన సినిమా. ఊర్లలోని కులం గొడవలు, వర్గపోరు బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కించడం విశేషం.  మనతి గణేషన్‌ అనే కబడ్డీ ప్లేయర్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని  రూపొందించారు దర్శకుడు.  గణేషన్‌ కులవివక్షత దాటుకుని దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. ఆయన పాత్రలో ధృవ్‌ విక్రమ్‌ నటించారు. ఈ మూవీ ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఒకే ఇంటెన్సిటీతో సాగుతుంది. జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ కి ఇండియా టీమ్‌ సెలెక్ట్ కావడం, అందులో హీరోని ఆడనివ్వకపోవడంతో తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు హీరో. చిన్నప్పట్నుంచి తన కబడ్డీ కోసం ఎలాంటి పరిస్థితులను ఫేస్‌ చేయాల్సి వచ్చిందో గుర్తు చేసుకుంటాడు. సినిమా ఫస్టాఫ్‌లో ఊర్లో గొడవలు, పీఈటీ టీచర్‌ ప్రోత్సాహంతో కిట్టయ్య కబడ్డీ ఆడటం, ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలను చూపించారు. ఊరి గొడవల్లోకి కిట్టయ్యని లాగడం, దీంతో వాళ్లు, వీళ్లు కొట్టుకోవడం, కబడ్డీలో మంచి ప్లేయర్‌గా రాణిస్తున్న క్రమంలో ప్రత్యర్థులు చేయి విరిచేయడంతో తన డ్రీమ్‌ ఒక్కసారిగా చెదిరిపోతున్న నేపథ్యంలో అతను పడే బాధని ఆవిష్కరించారు.సెకండాఫ్‌ ఆద్యంతం సీరియస్‌గా, ఎమోషనల్‌గా సాగుతుంది. చివరి వరకు అదే ఇంటెన్సిటీతో ఉంటుంది. క్లైమాక్స్ ఆద్యంతం రక్తికట్టేలా, ఎమోషనల్‌గా సాగుతుంది. ఆయా సీన్లు పీక్‌లోకి తీసుకెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది.

46
`బైసన్‌` మూవీలోని హైలైట్స్, మైనస్‌లు

అయితే ఫస్టాఫ్‌లో ఎక్కువగా పదే పదే అవే గొడవలు చూపించడం కొంత రొటీన్‌ అనిపిస్తుంది. ఓవర్‌గా అనిపిస్తుంది. ఊర్లో లాజిక్‌ లేని గొడవలు కొంత విసుగు పుట్టిస్తాయి. మరోవైపు కొంత సాగదీతగానూ అనిపిస్తాయి. కాకపోతే రా, రస్టిక్‌ గా సీన్లు బాగున్నాయి. నేచురల్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్‌ సీన్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. గుండెని బరువెక్కిస్తుంది. సెకండాఫ్‌ని మాత్రం బాగా డీల్‌ చేశారు. చాలా ఇంటెన్సిటీతో రన్‌ అవుతుంది. ఆద్యంతం ఎమోషనల్‌గా ఉంటుంది. కబడ్డీ ప్లేయర్‌గా తన పడే స్ట్రగుల్స్ కట్టిపడేస్తాయి. అదే సమయంలో ఊర్లో గొడవలు, వాటిని దాటుకుని వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోవడం, ఈ క్రమంలో వచ్చే సీన్లు గుండెని బరువెక్కిస్తాయి. ఇక క్లైమాక్స్ లో సెలెక్షన్‌ ప్రాసెస్‌లో అణచివేత, వివక్ష వంటివి ఆద్యంతం నాటకీయంగా సాగుతాయి. అవి ప్రతి సినిమాలోనూ ఉండేవి. కానీ ఇందులోనూ రక్తికట్టించేలా, ఎంగేజింగ్‌గా దర్శకుడు తెరకెక్కించిన తీరు బాగుంది. ఇందులో అనుపమాతో లవ్‌ ట్రాక్‌ని పెద్దగా చూపించలేదు. సీరియస్‌ ఫిల్మ్ కావడంతో ఆయా అంశాలు ఎక్కువ చూపించినా సెట్‌ కావు. చివరికి ఇన్‌స్పైర్‌ చేసేలా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమాని నడిపించి ముగించిన తీరు బాగుంది.

56
బైసన్‌ మూవీ నటీనటుల ప్రదర్శన

వనతి కిట్టయ్య పాత్రలో ధృవ్‌ విక్రమ్‌ అదరగొట్టాడు. సెటిల్డ్ గా యాక్ట్ చేసి మెప్పించాడు. తన బెస్ట్ ఇచ్చాడు. అయితే ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఇంకా బెటర్‌ కావాలి. ఆయన తండ్రి పాత్రలో పశుపతి అదరగొట్టాడు. చాలా సీన్లలో ధృవ్‌ని డామినేట్‌ చేశారు. ఫస్టాఫ్‌లో మొత్తం అతని డామినేషనే కనిపిస్తుంది. మరోవైపు కందసామిగా లాల్‌ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాగా చేశాడు. ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. పాండిరాజ్‌గా అమీర్‌ సుల్తాన్‌ సైతం మెప్పించాడు. రాణిగా అనుపమా పరమేశ్వరన్‌ కనిపించేది కొన్ని సీన్లే, కానీ కనిపించినంత సేపు అదరగొట్టింది. రాజీగా రాజిషా సైతం బాగా చేసింది. వీరిద్దరూ డీ గ్లామర్‌ లుక్‌లోనూ ఒదిగిపోయారు. ఇండియా కబడ్డీ టీమ్ కెప్టెన్‌గా రియల్ కబడ్డీ ప్లేయర్ కే ప్రపంజన్‌ నటించడం విశేషం. ఆయన చాలా సహజంగా నటించాడు. పీఈటీ టీచర్‌గా మదన్‌ కుమార్‌ సైతం తన మార్క్ ని చూపించాడు. కోచ్‌గా లెనిన్‌ భారతి ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో ఒదిగిపోయి మెప్పించారు. సహజంగా నటించి ఆకట్టుకున్నారు.

66
బైసన్‌ మూవీ టెక్నీషియన్ల పనితీరుః

ఎళిల్‌ అరసు కే కెమెరావర్క్ బాగుంది. పీరియడ్‌ లుక్‌ని బాగా ఆవిష్కరించారు. ఆర్ట్ వర్క్ స్పెషల్‌గా ఉంది. నివాస్‌ కే ప్రసన్న సంగీతం సినిమాకి మరో ప్లస్‌. సినిమాకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ఎడిటర్‌ శక్తి తిరు బాగా చూపించారు. ఫస్టాఫ్‌లో మరింత జాగ్రతపడాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు మారి సెల్వరాజ్‌ `కర్ణన్‌`, `మామన్నన్‌` చిత్రాలతో తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు `బైసన్‌` మూవీతో తన పీక్‌ని చూపించారు. సినిమా కథని కాదు రియాలిటీని చూపించాడు. అప్పట్లో కులవివక్షత, వర్గపోరు ఎలా ఉండేవి, దాని వల్ల మనుషులు ఎలా సఫర్‌ అయ్యేవారు? ఎంత మూర్ఖంగా ప్రవర్తించేవారనేది కళ్లకి కట్టినట్టు చూపించారు. సినిమాలో ఇంటెన్సిటినీ, ఎమోషన్స్ ని ప్రారంభం నుంచి ఎస్లాబ్లిష్‌ చేశారు. దాన్ని చివరికి వరకు కంటిన్యూ చేశారు. అక్కడే డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. కొన్ని చోట్ల రొటీన్‌ ఫీలింగ్‌ తెప్పించినా, వాటిని ఎంగేజింగ్‌గా తీయడం విశేషం. అయితే ఇప్పుడు జెంజీ ట్రెండ్‌ నడుస్తోన్న నేపథ్యంలో, డివోషనల్‌, థ్రిల్లర్స్, యాక్షన్‌ సినిమాలు జోరు నడుస్తోన్న నేపథ్యంలో ఈ సినిమా ఎంత వరకు సర్వైవ్‌ అవుతుందనేది ప్రశ్న. కానీ ఇన్‌స్పైర్‌ చేసే మూవీ అవుతుందని చెప్పొచ్చు.

ఫైనల్‌గాః ఇన్‌ స్పైర్‌ చేసే స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా `బైసన్‌`

రేటింగ్‌ః 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories