
యూత్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమాలు చాలా వరకు ఆదరణ పొందుతాయి. అయితే అందులో క్రేజీ కంటెంట్ ఉంటేనే అది ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అలాంటి యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో `బ్యూటీ` అనే చిత్రం రూపొందింది. ఇందులో యంగ్ హీరో అంకిత్ కొయ్య హీరోగా, నీలఖి హీరోయిన్ గా నటించారు. నీలఖి ఈచిత్రంతోనే టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. జే ఎస్‌ఎస్ వర్థన్ దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‌ప్లే ఆర్ వీ సుబ్రహ్మణ్యం అందించారు. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ పతాకాలపై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ శుక్రవారం(సెప్టెంబర్ 19న) విడుదలైంది. కుర్రాళ్లని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం వారిని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
వైజాగ్‌లో అలేఖ్య(నీలఖి) కాలేజీ చేస్తుంది. ఆమె నాన్న నారాయణ(వీకే నరేష్) క్యాబ్ డ్రైవర్. అమ్మ(వాసుకీ) హౌజ్ వైఫ్. వీరిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఫ్యామిలీని అలా నెట్టుకుంటూ వస్తుంటారు. నారాయణకి కూతురంటే ప్రాణం. ఆమెకి తన స్థోమతకి మించిన హామీలుస్తుంటాడు తండ్రి. ఈ క్రమంలో తన ఫ్రెండ్ స్కూటీ కొనుక్కుందని, తనకు కూడా పుట్టిన రోజుకి స్కూటీ కొనివ్వాలని అడుగుతుంది. కూతురు కోసం ఆయన కూడా కాదనలేకపోతాడు. నాన్న హామీ ఇవ్వడంతో స్కూటీ డ్రైవ్ నేర్చుకోవాలనుకుంటుంది. తన ఫ్రెండ్ స్కూటీపై ప్రయోగం చేయగా, కిందపడేస్తుంది. దీంతో ఆ స్కూటీ రిపెయిర్‌కి డబ్బులు తానే కట్టాల్సి వస్తుంది. నాన్నకి వద్ద అబద్దం చెప్పి తాను ఆటోకి కట్టాల్సిన డబ్బులు ఆ స్కూటీ రిపెయిర్ కి ఇస్తుంది. మరి కాలేజీకి ఎలా వెళ్లాలనేది పెద్ద ప్రశ్న. అనుకోకుండా కొత్త స్కూటీపై వెళ్తున్న కుర్రాడు అర్జున్ (అంకిత్ కొయ్య)ని పట్టుకుంటుంది. తెలియకుండానే అతని స్కూటీ ఎక్కుతుంది. యాదృశ్చికంగా అతనితో పరిచయం ఏర్పడుతుంది. అలేఖ్యకి స్కూటీ నేర్చుకోవడానికి అతను హెల్ప్ చేస్తాడు. లైసెన్స్ కూడా పొందుతుంది. కానీ తన పుట్టిన రోజు నాన్న హ్యాండిస్తాడు. స్కూటీ కోనివ్వడు. దీంతో అలిగి అర్జున్ వద్దకు వెళ్తుంది. ఆయన ఓదార్చుతాడు. ఇంటికెళ్లగా నాన్న స్కూటీతో సర్‌ప్రైజ్ చేస్తాడు. దీంతో ఆనందం పట్టలేకపోతుంది. మళ్లీ ఆ రాత్రినే అర్జున్‌తో కలిసి బీచ్‌కి వెళ్తుంది. సముద్రంతో ఆమెకి ఓ మంచి అనుబంధం ఉంటుంది. తన ఏ ఫీలింగ్ అయిన దానితోనే షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా తన నాన్న స్కూటీ కోనిచ్చిన విషయం సముద్రంతో పంచుకుంటుంది. అయితే ఆ సమయంలో మాత్రం అర్జున్‌తో పంచుకోవడమే అద్భుతమైన ఫీలింగ్‌గా భావిస్తుంది. ఆయనతో ఉంటే తనకు ఆనందంగా ఉంటుందని, జీవితమే కొత్తగా ఉంటుందని చెబుతుంది. ఓ రోజు అమ్మ, పక్కింటి ఆంటీ షాపింగ్‌కి వెళ్తారు. దీంతో అర్జున్ వారి ఇంటికి వస్తారు. తన పక్కింటి ఆంటీ ఇంట్లో వీరిద్దరు కలుస్తారు. రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఆ సమయంలోనే ఆ ఆంటీ వాళ్ల భర్త వస్తాడు. వీరిని అలా చూసి అసహ్యించుకుంటాడు. అప్పట్నుంచి అర్జున్‌ని దూరం పెడుతుంది అలేఖ్య. దీంతో అర్జున్ కూడా హర్ట్ అవుతాడు. మళ్లీ ఆయన్ని కూల్ చేసే ప్రయత్నంలో భాగంగా వీడియో కాల్‌లో తన అందం చూపించే ప్రయత్నం చేస్తూ అమ్మకి దొరికిపోతుంది. ఆ గొడవతో ఇంట్లో నుంచి పారిపోతుంది. అర్జున్‌తో కలిసి లేచిపోతారు. మరి వీరిద్దరు ఎక్కడికి వెళ్లారు? కూతురు కోసం నారాయణ పడే ఇబ్బందులేంటి? అలేఖ్యని చాలా రోజులుగా ఫాలో అవుతున్న కుర్రాడు ఎవరు? అర్జున్‌లోని మరో కోణం ఏంటి? అలేఖ్య చేసిన తప్పేంటి? దానికి వారి పేరెంట్స్ ఏం చేశారు? ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా మిగిలిన కథ.
టీనేజ్ లవ్ స్టోరీతో, క్రేజీ రొమాంటిక్ లవ్ ట్రాక్‌లతో, నేటి ట్రెండ్‌ని ప్రతిబింబించేలా వచ్చిన `బేబీ` మూవీ ఎంతగానో ఆకట్టుకుంది. ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలోనే `బ్యూటీ` చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సినిమాలో ఫస్టాఫ్ `బేబీ`ని తలపిస్తే, సెకండాఫ్ ఆ మధ్య వచ్చిన `బుట్టబొమ్మ`ని తలపిస్తుంది. ఇందులో మొదట టీనేజ్ రొమాంటిక్ లవ్ ట్రాక్‌ని చూపించి, సెకండాఫ్‌లో వాటిలోని గ్రే షేడ్‌ని చూపించారు. అలా పై రెండు సినిమాలను ఫాలో అయ్యారు. ఫస్టాఫ్ అంతా బాగా ఆకట్టుకుంటుంది. ప్రారంభంలో అలేఖ్య కుటుంబానికి సంబంధించిన మధ్యతరగతి పరిస్థితిని ఎస్లాబ్లిష్ చేశారు. అదే సమయంలో కూతురుపై తండ్రికి ఉన్న ప్రేమ, వారి అనుబంధాన్ని చూపించారు. ఆ తర్వాత స్కూటీ ట్రాక్‌ని కాస్త ఫన్నీవేలో తీసుకెళ్లారు. అర్జున్‌తో పరిచయం, అలేఖ్య చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కి కామెడీగా అనిపిస్తాయి. అర్జున్ పరిచయం, నాన్న స్కూటీ కోనివ్వడంతో వీరి లవ్ ట్రాక్ బలపడటం, టీనేజ్ లవ్ కావడంతో ప్రియుడే సర్వస్వంగా భావించడమనేది ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆవిష్కరించారు. లవ్ ట్రాక్ రొటీన్‌గానే ఉన్నా, ఆకట్టుకునేలా ఉంది. అయితే వీరి ప్రేమ వ్యవహారం, ఇంట్లో కలిసిన విషయం పక్కింటి అంకుల్‌కి తెలయడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. అలేఖ్య బాగా టెన్షన్ పడటం, అటు ఫ్యామిలీని మ్యానేజ్ చేయలేక, మరోవైపు ప్రియుడిని మ్యానేజ్ చేయలేక ఇబ్బంది పడే సీన్లు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నేటి యువత ఎలా ఉన్నారనేది అద్దం పడుతుంది. హగ్‌లు, కిస్‌లు, రొమాంటిక్ సీన్లు యూత్‌ని టార్గెట్ చేసి మేళవించారు. అవి కుర్రాళ్లని ఆద్యంతం కట్టిపడేస్తాయి.
ఇక అలేఖ్య చేసిన పిచ్చి పని అమ్మకి తెలియడం, ఆమె కొట్టడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. నాన్నకి చెబితే నా పని అంతే, చంపేస్తారని భయపడి, అర్జున్ వద్దకు వెళ్లిపోతుంది. ఇద్దరం కలిసి పారిపోవడం, ఆ తర్వాత ఒక్కో మిస్టేక్స్ చేస్తూ లైఫ్‌ని ఇంకా కాంప్లికేటెడ్‌గా మార్చుకోవడం సీన్లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఓ వైపు వీళ్లు పడే స్ట్రగుల్స్, మరోవైపు కూతురు కోసం తండ్రి పడే ఆవేదన, స్ట్రగుల్స్ హార్ట్ టచ్చింగ్ గా ఉన్నాయి. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ డిఫరెంట్‌గా ఉంది. అందులో పేరెంట్స్ ఎమోషన్స్ ని ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. హృదయానికి హత్తుకుంటుంది. అయితే ఫస్టాఫ్‌లో ట్రెండీగా తీసుకెళ్లిన దర్శకుడు సెకండాఫ్‌లో ఏం చేయాలో అర్థం కాక కథని ఎటేటో తిప్పినట్టుగా ఉంటుంది. చివరికి క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్టే ఈ మూవీకి పెద్ద మైనస్. అది రొటీన్‌గా మార్చేసింది. అక్కడ దర్శకుడు పేరెంట్స్ విషయం పిల్లలు ఎలా ఉండాలనే దానిపై సందేశాత్మకంగా చూపించినా, అదే ఈ మూవీకి మైనస్‌గా మారిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఈ మూవీ `బుట్టబొమ్మ`కి మరో కాపీలాగా అయిపోయింది. సెకండాఫ్ మొత్తం స్లోగా సాగుతుంది. ఆయా సీన్లలో ఆసక్తి తగ్గుతుంది. ఏం చేయాలో తెలియక టైమ్ పాస్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరోవైపు క్లైమాక్స్ లో తండ్రి ఎమోషన్ కూడా బలంగా కనెక్ట్ కాలేదు. ఇంకోవైపు చిన్నప్పట్నుంచి మిడిల్ క్లాస్ బాధలు, స్ట్రగుల్స్ ప్రత్యక్షంగా చూసిన అమ్మాయికి తన కుటుంబ పరిస్థితి గురించి ఆమాత్రం అవగాహన లేదా? అనే డౌట్ వస్తుంది. ఇంకోవైపు అర్జున్‌తో లవ్ ట్రాక్ కూడా చాలా ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తుంది. రియాలిటీకి దూరంగా ఉంది. హీరో పాత్రలోని మరో కోణం కూడా అంతగా కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఇలాంటి విషయాలు ఈ మూవీకి మైనస్‌గా నిలిచాయి.
అర్జున్ పాత్రలో అంకిత్ కొయ్య చాలా బాగా నటించాడు. తనకు నప్పే పాత్రలో ఒదిగిపోయారు. ఆయన పాత్రలోని మరో కోణం కన్విన్సింగ్‌గా అనిపించలేదు. మరోవైపు అలేఖ్యగా నీలఖి పాత్ర అద్భుతంగా చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీని ఆమెనే మోసింది. అంతే నేచురల్‌గా చేసింది. పాత్రని, సీన్లని తన నటనతో పెంచేసింది. ఆమెకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు. తండ్రి పాత్రలో నరేష్ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో కట్టిపడేశాడు. తల్లిగా వాసుకీ అంతే సహజంగా చేసి ఆకట్టుకుంది. పక్కింటి ఆంటీ, అంకుల్‌గా సోనియా, నందగోపాల్ సైతం ఆకట్టుకున్నారు. మురళీధర్ గౌడ్ పాత్ర అలరించేలా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా నితిన్ ప్రసన్న మెప్పించారు. మిగిలిన పాత్రలో ఓకే అనిపించాయి.
సినిమాకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ బాగుంది. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగుంది. ఆకట్టుకుంది. ఓ రకంగా సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ఇక శ్రీ సాయికుమార్ దారా కెమెరా వర్క్ కూడా కలర్‌ఫుల్‌గా ఉంది. విజువల్స్ కొత్తగా అనిపించాయి. చాలా ఫ్రేములు కొత్తగా కనిపించాయి. మాంటేజ్ పాటల కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఎస్ బీ ఉద్దవ్ ఎడిటింగ్ బాగానే ఉంది. సెకండాఫ్‌లో కాస్త కేర్ తీసుకోవాల్సింది. ఇక దర్శకుడు జేఎస్ ఎస్ వర్థన్ డైరెక్టర్ ఓకే అని చెప్పొచ్చు. కథ విషయంలో `బేబీ`, `బుట్టబొమ్మ` చిత్రాల ప్రభావం కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే కూడా అలానే సాగింది. మాటలు ఆట్టుకున్నాయి. కొత్తగా ఉన్నాయి. దర్శకుడు లవ్ ట్రాక్‌ని బాగా తెరకెక్కించారు. కానీ సెకండాఫ్‌లో దాన్ని నడిపించే విషయంలో తడబాటు కనిపిస్తుంది. క్లైమాక్స్ ని లవ్ ట్రాక్ తరహాలోనే చూపించాల్సింది. అంతే క్రేజీగా చూపిస్తే సినిమా అదిరిపోయింది. అక్కడ మిస్ ఫైర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సినిమా బాగుండేది.
ఫైనల్‌గాః `బేబీ`+`బుట్టబొమ్మ`= బ్యూటీ.
రేటింగ్‌ః 2.5