
విలక్షణ నటుడిగా రాణిస్తున్నాడు సత్యదేవ్. తనలో టాలెంట్ ఉన్నా, తనకు సరైన సినిమాలు పడటం లేదు. దీంతో ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఇటీవల `కింగ్డమ్`లో విజయ్ దేవరకొండకి అన్నగా నటించి ఆకట్టుకున్నాడు. దీనితో తనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు `అరేబియా కడలి` అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఆనంది హీరోయిన్‌గా నటించిన ఈ సిరీస్‌కి చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా, క్రిష్ జాగర్లమూడి రైటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సూర్య కుమార్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై లి పతాకంపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించారు. జాలర్ల కథని తెలియజేసే ఈ సిరీస్ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
`అరేబియా కడలి` వెబ్ సిరీస్‌ని చూద్దామని అమెజాన్ ప్రైమ్‌లోకి వెళ్లాను.. ఈ సిరీస్ ప్రారంభం కాగానే పాకిస్థాన్ జైల్లో మన జాలర్లు చిక్కుకున్న సీన్ చూడగానే నాకు మరో సినిమా గుర్తుకు వచ్చింది. ఇటీవల నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన `తండేల్` సినిమాని ఫస్ట్ షాట్‌లోనే గుర్తు చేసింది. అది క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఆ సినిమా కథ, ఈ సిరీస్ కథ ఒకటేనా అనే అనుమానం వచ్చింది. దీంతో ఏం చూపించారనే ఆసక్తితో చూశాను. మరి ఏం చూపించారనేది కథలో తెలుసుకుందాం.
ఆంధ్రాలోని కోస్టల్ ఏరియాలో చేపలవాడ, మత్య్సవాడ అనే రెండు గ్రామాలకు ఎప్పుడూ పడదు. తరచూ గొడవలు అవుతుంటాయి. వీరంతా గుజరాత్‌కి చేపలవేటకు వెళ్తుంటారు. చేపలవాడ గ్రామానికి చెందిన బద్రి(సత్యదేవ్) కూడా చేపల వేటకు వెళ్తుంటాడు. ఆయన మత్య్సవాడ గ్రామానికి చెందిన గంగ(ఆనంది)ని ప్రేమిస్తుంటాడు. ఇద్దరు చిన్నప్పట్నుంచి గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరికి ఒకరు సర్వస్వంగా బతుకుతుంటారు. వీరు ప్రేమించుకోవడం చూసిన గంగ తండ్రి వీరిపై ఫైర్ అవుతాడు. గంగని బద్రికి ఇవ్వబోనని, స్థానికంగా లిక్కర్ షాపులు నడిపించే శేఖర్(వంశీ కృష్ణ)కి ఇచ్చి పెళ్ళి చేస్తానని తెగేసి చెబుతాడు. గుజరాత్ వరకు చేపలవేటకు వెళ్లడం బద్రకి నచ్చదు. దీంతో మన సముద్రంలోనే జెట్టి ఏర్పాటు చేయించాలని ప్లాన్ చేస్తుంటాడు. దానికి చాలా డబ్బు కావాలి. అదే సమయంలో దానికి టైమ్ పడుతుంది.
దీంతో ఎప్పటిలాగే చేపల వేటకు బయలు దేరతారు. ట్రైన్‌లో రెండు గ్రామాల వారి మధ్య గొడవలు కావడంతో పోలీసులు వీరిని మధ్యలోనే దింపేస్తారు. దీంతో లారీలో గుజరాత్‌కి చేరుకుంటారు. కానీ వీరు వెళ్లేసరికి బోట్‌లన్నీ సముద్రంలోకి వేటకు వెళ్తాయి. సేట్ కాళ్లా వేళ్లా పడి వేరే బోట్ ని సంపాదిస్తారు. కానీ ఆయన పాత బోట్ ఇస్తారు. బోట్ దొరికిందన్న ఆనందంలో సముద్రంలోకి వెళ్తారు. కానీ ఒకేబోట్‌లో రెండు ఊర్ల జాలర్లు ఉంటారు. దీంతో అక్కడ కూడా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. వీరిలో ఒకరు సముద్రంలో పడిపోతే బద్రి కాపాడతాడు. దీంతో అప్పట్నుంచి మార్పు వస్తుంది. అంతా కలిసిపోతారు. అయితే అనుకోకుండా ఒక ఉపద్రవం వీరిని ముంచెత్తుతుంది. దీంతో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కి దొరికిపోతారు. వారు అరెస్ట్ చేసి పాకిస్థాన్ జైల్లో పెడతారు. ఇంతకి సముద్రంలో ఏం జరిగింది? పాకిస్థాన్ జైల్లో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనేది మిగిలిన కథ.
ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే `తండేల్` గుర్తుకు రావడం పక్కా. ఇంకా చెప్పాలంటే అదే కథ. కానీ ఎంత ఆకట్టుకునేలా, ఎంత ఎమోషనల్‌గా చెప్పారనేది ఇక్కడ ముఖ్యం. ఆ విషయంలో టీమ్ సక్సెస్ అయ్యింది. వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు ఆ మూవీ గుర్తుకు వస్తుంది. కానీ ప్రతి సీన్ ఎంగేజ్ చేసేలా తీయడం ఇందులో గొప్పతనం. ఆ మూవీలో చాలా షార్ట్ గా చూపించారు. కానీ ఇందులో చాలా డెప్త్ గా, అసలు ఏం జరిగింది? జాలర్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది డిటెయిలింగ్‌గా చూపించారు. ప్రతి ఎమోషన్స్ ని క్యాప్చర్ చేశారు. క్లీయర్‌గా అసలేం జరిగిందనేది చూపించారు. ఇది రియల్ గా జరిగిన కథ. కాబట్టి ఆ విషయంలో చాలా రీసెర్చ్ చేసి రూపొందించినట్టు అనిపిస్తుంది. ప్రారంభంలో చేపలవాడ, మత్య్సవాడ గ్రామాల మధ్య గొడవలను, అదే సమయంలో వాళ్లు కలిసే వేటకు వెళ్లడం చూపించారు. మరోవైపు సత్యదేవ్, ఆనంది మధ్య లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేశారు. జాలర్ల కుటుంబాల బాధలను చూపిస్తూ ఎమోషనల్‌గా కనెక్ట్ చేశారు.
రెండు గ్రామాల వారు గొడవలు పడితే ట్రైన్ నుంచి దించేయడం, ఆ తర్వాత బోట్ల కోసం వీరు పడే బాధలు ఎమోషనల్‌గా అనిపిసాయి. వీటిలో నాటకీయత బాగా పండింది. ఇంత జరిగినా బోట్‌లో గొడవలు పడటమనేది మనుషుల వ్యక్తిత్వాలను అద్దం పడుతుంది. ఇలా రియాలిటీకి దగ్గరగా కథని చూపిస్తూ వెబ్ సిరీస్‌ని రన్ చేశారు. సముద్రంలోని సంఘటనలు క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ఉన్నాయి. అదే సమయంలో ఉత్కంఠకి గురి చేస్తాయి. వీరి మధ్య గొడవలు మనకు కోపానికి గురి చేసినా, ఆ తర్వాత అయ్యో అనిపిస్తాయి. సముద్రంలోని ఘటన ఉత్కంఠకి గురి చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయి అక్కడ ఇబ్బందులు పడుతున్న మనవారిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. అదే సమయంలో అక్కడ సర్వైవ్ కావడం, పాకిస్థాన్ పోలీలు సహకరించడం, తమ వారి కోసం గంగ చేసిన పోరాటం మనకు ఉత్తేజాన్నిస్తాయి. ఆ తర్వాత పరిణామాలు, నెక్ట్స్ ఏం జరుగుతుందనేది మనకు అర్థమైపోతుంది.
సినిమా వేరు, వెబ్ సిరీస్ వేరు. సినిమాల్లో ఎంత పెద్ద కథని అయినా రెండున్నర, మూడు గంటల్లోనే చెప్పాలి. అదే వెబ్ సిరీస్‌లో చాలా డిటెయిలింగ్‌గా చెబుతారు. సినిమా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటుంది. వెబ్ సిరీస్ కాస్త లెంన్తీగా ఉంటుంది. అది మనకు కొంత సాగదీసినట్టుగా ఉంటుంది. అదే కొత్త కథ అయితే ఏం చూపించబోతున్నారనే క్యూరియాసిటీ ఉంటుంది. ఇది తెలిసిన కథే కావడంతో ఆ కిక్ కొంత మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో మనకు అర్థమయిపోతుంది. ఉన్న సీన్లని ఎంగేజింగ్‌గా చెప్పడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే పరమైన ట్రిక్స్ ప్లే చేశారు. ఎమోషనల్‌గా కనెక్ట్ చేశారు. అటు లవ్ స్టోరీ, ఇటు జాలర్లు బాధలను ఆకట్టుకునేలా రూపొందించారు. వారి మధ్య సంఘర్షణ, ఘర్షణ ఆకట్టుకునేలా ఉంటాయి. అదే ఈ సిరీస్‌కి ముఖ్య బలం.
ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తే ఏ సినిమా అయినా ఆకట్టుకుంటుంది. ఎంగేజ్ చేస్తుంది. ఈ సిరీస్ విషయంలో మేకర్స్ చేసిన గొప్ప పని అదే అని చెప్పొచ్చు. అయితే ఎంత చేసినా తెలిసిన కథ కావడంతో మధ్య మధ్యలో మనం డీవియేట్ అవుతుంటాం. మధ్యలో బద్రి తండ్రి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, గంగ తమ్ముడి సీన్లు కొంత ఆసక్తిగా అనిపిస్తాయి. ఓవరాల్‌గా డీసెంట్ చేసే సిరీస్‌గా `అరేబియా కడలి` అని చెప్పొచ్చు. `తండేల్` సినిమా వచ్చినా, కొన్ని కొత్త విషయాలను ఇందులో చూపించారు. స్క్రీన్ ప్లే పరమైన మ్యాజిక్ చేశారు. చాలా వరకు ఎంగేజ్ చేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఆర్టిస్ట్ ల విషయానికి వస్తే.. బద్రి పాత్రలో సత్యదేవ్ అదరగొట్టాడు. పాత్రలో జీవించాడు. మనకు ఎక్కడా సత్యదేవ్ కనిపించడు. ఎమోషనల్ సీన్లు, లవ్ స్టోరీ సీన్లు, పాకిస్థాన్‌లో స్ట్రగుల్ అయ్యే సీన్లు, సముద్రంలో తన గొప్పమనసుని, హుందాతనాన్ని చాటే సీన్లు ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్‌కి ఆయన మెయిన్ పిల్లర్‌గా చెప్పొచ్చు. అలాగే గంగ పాత్రలో ఆనంది సైతం పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. ఆద్యంతం మెప్పించింది. ఓ సమయంలో తన భుజాలపై సినిమాని తీసుకెళ్లింది. వంశీకృష్ణతోపాటు రోషన్, ఇతర పాత్రధారులు సైతం సహజంగా నటించి మెప్పించారు. ఇందులో పూనమ్ బజ్వా డాక్టర్‌గా మెరవడం విశేషం.
టెక్నీకల్‌గా వెబ్ సిరీస్ చాలా బాగుంది. నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం బాగుంది. బిజీఎం ఇంకా బాగుంది. ఆయన బిజీఎంతోనే ఎంగేజ్ చేశారని చెప్పొచ్చు. సమీర్ రెడ్డి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. విజువల్స్ అదిరిపోయాయి. చాణక్యరెడ్డి తురుపు ఎడిటర్ చాలా షార్ప్ గా ఉంది. కథనం ఫ్లో ఎక్కడ మిస్ లీడ్ లేకుండా సాగింది. వీవీ సూర్య కుమార్ దర్శకత్వం కూడా ఆకట్టుకునేలా ఉంది. తెలిసిన కథే కావడంతో ఎలా తీస్తారనేది ఒక ప్రశ్నగా ఉంటుంది. అది పెద్ద సవాల్‌తో కూడిన పని. కానీ దర్శకుడిగా ఆయన తన ప్రతిభని చాటుకున్నారు. చాలా వరకు ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. తన మార్క్ ని చూపించారు. ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. తెలిసిన కథే కావడం, ఇటీవలే `తండేల్` మూవీ రావడమే పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. సినిమాకి మించిన క్వాలిటీతో తెరకెక్కించారు.
ఫైనల్‌గాః తెలిసిన కథే అయినా ఎంగేజ్ చేసే జాలర్ల కథ `అరేబియా కడలి`.
రేటింగ్‌ః 2.75
గమనికః ఇది రివ్యూ రాసే జర్నలిస్ట్ దృష్టికోణం మాత్రమే. రిజల్ట్ తో సంబంధం లేదు.