పొడుగైన, బలమైన, షైనీ జుట్టును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కానీ ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్, చుండ్రు సమస్యలను ఫేస్ చేస్తున్నారు. కాలుష్యం, విటమిన్లు, ప్రోటీన్ల లోపం , చుండ్రు వంటి సమస్యల వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే ప్రోటీన్ తో పాటుగా విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో విటమిన్ల లోపం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. మరి జుట్టు పెరిగేందుకు ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకుందాం..
ఆకు కూరలు
ఆకు కూరల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అలాగే జుట్టు పెరిగేందుకు సహాయపడతాయి. ఆకుకూరల్లో బచ్చలికూర చాలా మంచిది. బచ్చలికూర విటమిన్ల భాండాగారం. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. బచ్చలి కూరను రోజూ తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
క్యారెట్లు
క్యారెట్లు కూడా జుట్టును బలోపేతం చేస్తాయి. దీనిలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటి ఇతర పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని రోజూ తింటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
టమాటాలు
టమాటాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది. అందుకే మీ రోజు వారి ఆహారంలో టమాటాలు ఉండేట్టు చూసుకోండి.
beet root
బీట్ రూట్
బీట్ రూట్ లో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ ను తాగడం లేదా అలాగే తిన్నా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ దుంపల్లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్స్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అందుకే వీటిని కూడా మీ ఆహారంలో చేర్చండి.
చిలగడదుంపలు
చిలగడదుంపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే చిలగడదుంపలు పేరుకు తగ్గట్టుగానే తియ్యగా ఉంటాయి. దీనిలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ జుట్టు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తింటే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
గ్రీన్ బీన్స్
గ్రీన్ బీన్స్ లో విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గ్రీన్ బీన్స్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. దీనిలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ, జింక్ లు మీ జుట్టు పొడుగ్గా పెరిగేందుకు సహాయపడతాయి.