
AC temperature : వేసవి కాలంలో లేదా ఉక్కపోతగా ఉన్నప్పుడు ఏసీ (Air Conditioner) నుండి వచ్చే చల్లనిగాలి మనకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. అయితే చాలామంది ఏసీ ఆన్ చేయగానే రూమ్ త్వరగా చల్లబడాలని 16°C లేదా 18°C కి పెట్టేస్తుంటారు. కొన్నిసార్లు కూలింగ్ ఎక్కువయ్యిందని 28°C లేదా 30°C పెడుతుంటారు. ఇలా ఏసీని సరైన టెంపరేచర్ వద్ద ఉంచకపోతే ఆరోగ్యం దెబ్బతినడమే కాదు జేబుకి కూడా చిల్లు పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలి? అది తగ్గినా, పెరిగినా ఎలాంటి నష్టాలు ఉంటాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
భారత ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం... మానవ శరీరానికి 24°C (24 డిగ్రీల సెల్సియస్) అనేది అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన,ఆరోగ్యకరమైన టెంపరేచర్. మన దేశ వాతావరణ పరిస్థితులకు 24°C నుండి 26°C మధ్య ఏసీని నిర్వహించడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఏసిని ఈ టెంపరేచర్స్ వద్ద స్థిరంగా ఉంచడం కరెంట్ బిల్లును కూడా తగ్గిస్తుంది... కాబట్టి ఆర్థికంగా కూడా లాభమే.
చాలామంది ఏసి ఉందికదా అని రూమ్ లో హిమాలయా పర్వతాల్లో మాదిరి ఉష్ణోగ్రతను కోరుకుంటారు... అందుకే టెంపరేచర్స్ బాగా తగ్గించి ఐస్ లా మారుస్తారు. ఇలా చేయడంవల్ల ఈ కింది సమస్యలు తప్పవు.
భారీగా విద్యుత్ బిల్లు
ఏసీ టెంపరేచర్‌ను ప్రతి ఒక్క డిగ్రీ తగ్గించినప్పుడల్లా దాదాపు 6% అదనపు విద్యుత్ ఖర్చవుతుంది. మీరు 16°C వద్ద ఉంచితే కంప్రెసర్ నిరంతరం హై-పవర్‌తో పనిచేస్తూనే ఉంటుంది, దీనివల్ల కరెంట్ బిల్లు ఊహించని రేంజ్‌లో వస్తుంది.
ఆరోగ్య సమస్యలు
విపరీతమైన చల్లదనంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల చర్మం పొడిబారడం (Dry skin), కళ్లలో మంటలు, గొంతు ఎండిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు (Joint pains), సైనస్ ఉన్నవారికి శ్వాసకోస ఇబ్బందులు ఎక్కువవుతాయి.
థర్మల్ షాక్ (Thermal Shock)
16°C ఉన్న గదిలో నుండి ఒక్కసారిగా బయట ఉన్న 40°C ఎండలోకి వచ్చినప్పుడు శరీరం ఆ ఉష్ణోగ్రత మార్పును తట్టుకోలేదు. దీనివల్ల తలనొప్పి, మైకం రావడం జరుగుతుంది.
ఏసీ కంప్రెసర్‌పై ఒత్తిడి
గదిని 16 డిగ్రీలకు తీసుకురావడం ఏసీకి చాలా కష్టమైన పని. దీనివల్ల కంప్రెసర్ ఓవర్‌లోడ్ అయి, ఏసీ జీవితకాలం తగ్గిపోతుంది. అంటే ఏసి తరచూ రిపేర్ కు వస్తుందనమాట.. దీనివల్ల అదనపు ఖర్చులు తప్పవు.
కొంతమంది ఏసీ వాడతారు... కానీ ఎక్కడ కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందోనని భయపడి హైటెంపరేచర్స్ మెయింటేనే చేస్తారు. సాధారణంగా 24-26 డిగ్రీలు ఉంచాల్సింది 28-30 డిగ్రీలు పెడుతుంటారు. దీనివల్ల కలిగే సమస్యలేంటో చూద్దాం.
ఉక్కపోత, అసౌకర్యం:
టెంపరేచర్ 27°C లేదా 28°C కన్నా ఎక్కువ పెంచితే గదిలో చల్లదనం సరిగ్గా అందదు. ముఖ్యంగా హ్యుమిడిటీ (తేమ) ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉక్కపోతగా అనిపిస్తుంది. దీంతో ఏసి వాడిన పీలింగ్ ఉండదు.
చెమటలు పట్టడం:
ఏసీ రన్ అవుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కంఫర్ట్ ఉండదు.. దీనివల్ల రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపట్టకపోవచ్చు. నిద్రలేమి అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.
ఏసీ, ఫ్యాన్ కలిపి వాడండి :
ఏసీని 24°C వద్ద ఉంచి దాంతో పాటు స్లోగా తిరిగేలా సీలింగ్ ఫ్యాన్ (1 లేదా 2 స్పీడ్ లో) ఆన్ చేయండి. దీనివల్ల చల్లటి గాలి గది అంతా సమానంగా త్వరగా విస్తరిస్తుంది. ఏసీని 18°C లో పెట్టిన ఫీలింగ్ 24°C లోనే వస్తుంది.
టైమర్ ఉపయోగించండి :
రాత్రి పడుకునేటప్పుడు 2 లేదా 3 గంటల తర్వాత ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా టైమర్ సెట్ చేసుకోండి.
రెగ్యులర్ సర్వీసింగ్ :
ఏసీ ఫిల్టర్లను నెలకు ఒకసారి శుభ్రం చేయడం వల్ల గాలి బాగా వస్తుంది, కంప్రెసర్‌పై లోడ్ తగ్గుతుంది.
రూమ్ సీలింగ్ :
ఏసీ ఆన్ చేసినప్పుడు కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చూసుకోండి. చిన్న గ్యాప్స్ ఉన్నా చల్లదనం బయటకు పోయి ఏసీ ఎక్కువ సేపు తిరగాల్సి వస్తుంది.
ఏసీని 24°C వద్ద రన్ చేయడం అనేది అటు మీ ఆరోగ్యానికి, ఇటు మీ ఏసీ లైఫ్‌కు మంచిది. అంతేకాదు మీ విద్యుత్ బిల్లును కూడా తగ్గించి ఖర్చు తగ్గిస్తుంది. ఏసిని ఎవ్వరైనా కొనవచ్చు... కానీ సరిగ్గా వాడితేనే దానివల్ల లాభం... లేదంటే శారీరక, ఆర్థిక నష్టాలు తప్పవు.